అవి కరోనా వ్యాధి విజృంభించిన రోజులు. మనుష్యులు అందరూ వాళ్ళ, వాళ్ళ ఇళ్లల్లో బందీలుగా ఉన్నారు. ఉదయం ఏడు గంటలకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. నేను ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ప్రతి రోజు ఉదయం తప్పనిసరిగా వాకింగ్ చేస్తాను.
నేను మా ఇంటి దగ్గరలోనున్న పార్కుకు వెళ్ళి, వాకింగ్ చేసి తిరిగి వస్తున్నాను. నాకు రోడ్డు మీద దూరంగా ఒక విచిత్రం కనపడింది.
అప్పుడే నడక నేర్చుకున్న చిన్నారి బాలుడు ఆ అందమైన ఉదయం తనదేనంటూ, ఆ రోడ్డు కూడా తనదే నన్నట్లుగా, బుల్లి బుల్లి అడుగులతో రోడ్డుకు అడ్డం పడి నడుస్తున్నాడు.
ఆ చిన్నారికి ముందూ, వెనుకా చుట్టుపక్కల ఎవరూ లేరు. ఆ రోడ్డు మీద జనసంచారమే లేదు. ఆ చిన్నారి దగ్గర కారు ఆపి ఆ చిన్ని బాబును ఎత్తుకున్నాను. ఆ వయసు పిల్లలు కొత్త వాళ్ళను చూస్తే ఏడుస్తారు. కానీ ఈ చిన్నోడు నన్ను చూసి నవ్వాడు.
ఆ చుట్టు పక్కల ఇళ్ల వైపు శ్రద్ధగా చూసాను. అన్ని ఇళ్ల తలుపులు మూసి ఉన్నాయి. ముద్దులొలికే ఈ చిన్ని బాబు ఎక్కడి నుండి వచ్చాడో తెలియడం లేదు.
మాకు పెళ్లయి ఐదు సంవత్సరాలయినా, పిల్లలు పుట్టలేదు. నా భార్య పిల్లలు కలగాలని మొక్కని దేవుడు లేడు. ఆ దేవుడే మాకు ఈ చిన్నిబాబును ప్రసాదించాడు అనుకుంటూ ఆ చిన్నారిని ముద్దులాడుతూ, వాడిని కారులో నాతో పాటు మా ఇంటికి తీసుకుని వచ్చాను.
నా భార్య సుధ ఈ చిన్ని బాబును చూసి మురిసిపోయి ముద్దులాడింది. ‘ఈ బాబు మీకు ఎక్కడ దొరికాడండీ?’ అని సుధ అడిగింది. నేను వివరాలు చెప్పాను. ఈ బాబును మనం పెంచుకుందాం అంది సుధ.
"ఈ బాబును మనం పెంచుకుంటూ ఉండగా, మనకు పిల్లలు పుడితే వీడిని ఏం చేద్దాం?” అన్నాను.
"మీరు భలేవారండీ! ఈ బాబు మన ఇంటికి వచ్చిన వేళా విశేషం వల్ల మనకు పిల్లలు పుడితే, వీడిని నా నెత్తిన పెట్టుకొని పెంచుతాను” అంది సుధ.
“ఏమండీ మీ పేరు రాము కదా! వీడి పేరు కృష్ణ అని పెట్టుకుందామండి” అన్నది సుధ.
అలాగే అన్నాను. కృష్ణా అంటూ మేము ఇద్దరం ఆ బాబును పిలిచాం. వాడు మా వంక చూసి మధురంగా నవ్వాడు.
గొడ్డు వచ్చిన వేళ, బిడ్డ వచ్చిన వేళ అంటారు గదా! అలా కృష్ణ అడుగు పెట్టిన వేళా విశేషం వల్ల సుధ గర్భం ధరించింది. సంవత్సరంలో మాకు పాప పుట్టింది. ఆ పాపకు రోజా అని పేరు పెట్టాము.
తనకంటే ఎంతో చిన్నగా ఉన్న రోజాను చూసి కృష్ణకు ఎంతో ఆశ్చర్యం. సుధ రోజాకు పాలు ఇస్తున్నా, స్నానం చేయిస్తున్నా కృష్ణ అమ్మ పక్కనే ఉండి గమనిస్తూ ఉంటాడు. పిల్లలిద్దరి ఆట పాటలు చూసి, నేను సుధ మురిసిపోతుంటాము.
*****
కరోనా వ్యాధి తగ్గు ముఖం చూపింది. స్కూళ్లు, కాలేజీలు తెరిచారు. యధావిధిగా రాకపోకలు సాగుతున్నాయి. నేను ఉద్యోగం చేసే కాలేజి తెరిచారు. క్లాసులు జరుగుతున్నాయి.
ఒక రోజున ప్రిన్సిపాల్ గారు స్టాఫ్ మీటింగ్ పెట్టారు.
"కరోనా వైరస్ వ్యాప్తి చెందిన కారణంగా ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులను, తల్లిదండ్రులేమో తమ బిడ్డలను కోల్పోయారు. కరోనా కాలంలో మీ అనుభవాలను చెప్పండి” అన్నారు.
కొందరు కరోనా కాలంలో చనిపోయిన తమ బంధు, మిత్రులను గురించి చెప్పి బాధ పడ్డారు. చివరగా కొందరు ప్రిన్సిపాల్ గారిని
"సార్! కరోనా వల్ల మీరు ఎదుర్కొన్న మీ అనుభవాలను మాతో పంచుకోవచ్చు గదా!” అన్నారు.
వెంటనే ప్రిన్సిపాల్ ఆనంద్ గారు "ఈ కరోనా వ్యాధి విజృంభించినందువల్ల నేను జీవితంలో చాలా నష్టపోయాను. నా భార్య లత మనస్సు చాలా సున్నితమైనది. మాకు పెళ్లయిన చాలా కాలం వరకు పిల్లలు పుట్టలేదు. పిల్లల కోసం డాక్టర్ల చుట్టూ తిరిగాము. డాక్టర్ల ప్రయత్నం ఫలించి, మాకు ఒక బాబు పుట్టాడు. వాడికి రాజా అని పేరు పెట్టి, అపురూపంగా పెంచుకున్నాం. రాజా నవ్వినా ఏడ్చినా ప్రతిదీ మాకు ఎంతో వింతగా, ఆనందంగా ఉండేది.
రాజా బోర్లా పడడం, పాకడం నేర్చుకున్నాడు. పాకుతూ ఉన్నవాడు, సోఫాలు పట్టుకుని నిలబడడానికి ప్రయత్నించేవాడు.
ఒక రోజున రాజా ఏదీ పట్టుకోకుండా స్వయంగా నించున్నాడు. రాజాను గమనిస్తున్న నా వైపు చూసి, నేను సాధించాను చూశావా? అన్నట్లుగా మధురంగా నవ్వాడు. తర్వాత మెల్లగా అడుగులు వేయడం మొదలు పెట్టాడు. అలా చిన్న చిన్న గా అడుగులు వేస్తూ, ఇల్లంతా తిరిగే వాడు. నేను, లత మా పనులు చేసుకుంటూ, ఒక కంట రాజాను కనిపెట్టుకుని ఉండేవాళ్ళం.
మా దురదృష్టవశాత్తూ లతకు కరోనా వ్యాధి సోకింది. లతను ఆస్పత్రిలో చేర్పించాను. కరోనా వ్యాధి ముమ్మరంగా ఉందని పనిమనిషిని మాన్పించాను. లత ఆస్పత్రి పాలవడంతో నేను ఇంటి పనీ, వంటపనీ చేస్తూ ఆన్లైన్లో విద్యార్థులకు పాఠాలు చెప్పేవాడిని.
ఒక రోజు ఉదయం రాజాకు పాలు తాగించి, వాడు ఇంటిలో ఆడుకుంటుంటే, నేను పనిలో మునిగిపోయాను. కొంత సేపు తర్వాత రాజా ఏం చేస్తున్నాడో అనుకుంటూ, రాజాకోసం అన్ని గదులు వెదికాను. ఎక్కడా లేడు. వీధి తలుపు ఓరగా వేసి ఉంది. ఉన్న కొంచెం ఖాళీ స్థలం లో దూరి రాజా బయటకు వెళ్లి పోయినట్లున్నాడు.
ఇంటి ముందుకు వచ్చి, చుట్టుపక్కల వెదికాను. ఎక్కడా రాజా కనిపించలేదు. నన్ను నిస్సత్తువ ఆవరించింది. ఏం చేయాలో పాలుపోక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామని వెళ్ళాను. అక్కడ ఎవరూ లేరు. సెక్యూరిటీని అడిగాను.
‘కరోనా కదా సార్ పోలీసులు అందరూ డ్యూటీల మీద ఆస్పత్రికి వెళ్ళారు’ అన్నాడు.
‘ఎప్పుడు వస్తారు?’ అన్నాను.
కరోనా విజృంభణ కారణంగా, అందరూ ఎక్కువగా బయటనే ఉంటున్నారు అన్నాడు.
టి.వి.లో, పత్రికలలో రాజా తప్పిపోయాడని, దొరికినవాళ్ళు మా రాజాను తీసుకువచ్చి నాకు అప్పగిస్తే బహుమతి ఇస్తానని ప్రకటించాను. మా రాజా దొరకలేదు. కరోనా వ్యాధి తగ్గి నా భార్య లత ఆస్పత్రి నుండి ఇంటికి వచ్చింది.
"రాజా కనపడడం లేదే? రాజాను చూపించండి!" అంది.
నేను జరిగిన విషయం చెప్పాను. అమ్మో! రాజా తప్పి పోయాడా? నా బాబు లేని బ్రతుకు నాకు ఎందుకు? అంటూ ఏడవడం మొదలు పెట్టింది. అంతే! లత రోజంతా రాజా! రాజా! అని కలవరిస్తూ డిప్రెషన్ లోకి వెళ్లి పోయింది.
లతను డాక్టర్లకు చూపించాను. వారు మందులు వాడారు. ఫలితం శూన్యం. తన బిడ్డ కనపడితే, ఆ బిడ్డను చూసిన ఆనందంతో లత మామూలు మనిషి కావచ్చు అన్నారు. లత అమ్మ నాన్నలు వచ్చి మా ఇంటిలోనే ఉంటూ లతను కనిపెట్టుకుని ఉన్నారు.
మీకు గాని, మీకు తెలిసిన వారికి ఎవరికైనా మా రాజా గురించి తెలిస్తే, మా రాజాను మాకు అప్పగించి పుణ్యం కట్టుకోండి. నా భార్య లతను కాపాడినవారవుతారు" అన్నారు ఆనంద్ సార్.
ఆ మాటలతో మా అందరి కళ్లు వర్షించ సాగాయి. ఆ మీటింగ్ ముగిసిన తర్వాత నేను ప్రిన్సిపాల్ సారు గదికి వెళ్ళాను. మీ రాజా ఎప్పుడు, ఏ ప్రాంతంలో తప్పిపోయాడు? అని అడిగాను. ఆయన వివరాలు చెప్పారు. చివరగా మీ రాజా ఫోటో చూపించమని అడిగాను. ఆయన తన సెల్ఫోన్ లో ఉన్న రాజా ఫోటోలు చూపించారు.
******
నా సందేహం తీరింది.
"సార్! ఆదివారం నాడు నా కుటుంబంతో సహా మీ ఇంటికి వస్తాను. ఏ సమయంలో రమ్మంటారు? అని అడిగాను."
“ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు రండి” అన్నారు ఆనంద్ గారు.
ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు, నా భార్యాబిడ్డలతో ఆనంద్ సార్ ఇంటికి వెళ్ళాను. నేను, సుధ ఆనంద్ గారికి నమస్కరించాము.
ఆయన సోఫా చూపించి మమ్మల్ని కూర్చోమన్నారు. నేను మా పిల్లలిద్దరినీ ఆయనకు చూపించాను.
ఆనంద్ గారు రాజాను చూస్తూ వీడు మా రాజా లాగా ఉన్నాడే అంటూ, బాబూ రాజా అంటూ వాడిని ఎత్తుకుని ముద్దులాడుతున్నారు. రాజా పరవశమై తండ్రి కళ్లల్లోకి చూస్తున్నాడు.
ఆ దృశ్యాన్ని కళ్లారా తిలకిస్తున్న నేను ఆనందంతో నా అర్ధాంగి వైపు చూసాను. ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. ఒక మంచి పని చేశామన్న తృప్తి కలిగింది.
ఆనంద్ గారు మమ్మల్ని తనతో పాటు రమ్మంటూ పక్క గదిలోకి దారి తీశారు.
“లతా! మన బాబు రాజా వచ్చాడు చూడు” అంటూ రాజాను ఆమె దగ్గరకు తీసుకుని వెళ్ళాడు.
ఆమె ఒక క్షణం రాజా వైపు కన్నార్పకుండా చూసింది. ‘బాబూ రాజా!’ అంటూ రాజాను ముద్దులతో ముంచెత్తింది. రాజా! మమ్మల్ని వదిలి ఇన్నాళ్లూ ఎక్కడికి వెళ్లిపోయావురా! అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది. తల్లి ఒడిలో కూర్చుని తల్లినే మైమరిచి చూస్తున్నాడు రాజా.
ఆనంద్ గారు, లత గారి తల్లి దండ్రుల ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి.
ఆనంద్ గారు నావైపు చూస్తూ... రామూ! "మా రాజాను ఇన్నాళ్లు పెంచారు. నిన్న కాలేజీలో నా బాధ వినిపించగానే, ఈ రోజు మా రాజాను తీసుకువచ్చి మాకు అప్పగించారు. మా ఇంటిని ఆనంద నిలయం చేశారు. మీ మేలు జన్మ జన్మలకు మరువలేను” అన్నారు.
లతగారి తల్లి, మా దంపతులను చూస్తూ "ఏ తల్లి కన్న బిడ్డలో, మానవత్వంతో మా రాజాను చేరదీసి పెంచారు. ఈ రోజున మా లతను డిప్రెషన్ నుండి బయటకు వచ్చేలా చేశారు. మా ఇంట్లో ఆనందాన్ని నింపారు. మిమ్మల్ని మనసారా దీవిస్తున్నాను” అంది.
నా భార్య చక్కగా తన మనసులో మాట చెప్పింది. నా అభిప్రాయం కూడా అదే. మీకు నా దీవెనలు. మీలాంటివాళ్లు చల్లగా ఉంటే, సమాజంలో పది మందికి మేలు చేస్తారు అన్నారు లత గారి తండ్రి.
లత గారి తల్లి లోపలికి వెళ్ళి ఒక ప్లేటు నిండా స్వీట్లు తీసుకుని వచ్చి, ప్రేమగా మాకు ఇచ్చింది.
"రామూ! మా రాజాను అప్పగించిన వాళ్లకు బహుమతి ఇస్తానని ప్రకటించాను కదా! ఇదిగో లక్ష రూపాయలకు చెక్కు వ్రాసి తెచ్చాను. ఇది స్వీకరించు అన్నారు” ఆనంద్ గారు.
మీ దగ్గర నేను డబ్బు తీసుకుంటానా? వద్దు సార్! అన్నాను.
మా అందరి మాటలు వింటున్న లత మేడం లేచి వచ్చి, "ఆనంద్ గారి చేతిలో నుండి చెక్కు తీసుకుని బలవంతాన నాచేతిలో పెట్టింది. తమ్ముడూ! ఈ అక్క ఆనందంగా నీకు ఇస్తున్న బహుమతి ఇది, కాదనకు. ఈ చెక్కును తీసుకు వెళ్ళి నీ కూతురు పేరున బ్యాంకులో వేయి. మీ పాప పై చదువులకు ఈ డబ్బు ఖర్చు పెట్టు” అని చెప్పింది.
నా నోట మాట రాలేదు. అలాగే అన్నట్లుగా తల ఆడించాను.