సీ: పోటీలువడి మీనములు నీటిపై దేలి
గుంపుగా పల్టీలు గొట్టు వేళ
బుడుబుంగ నేతల వోలె నాయెడ మున్గి
యిక్కడ తలయెత్తి నిక్కు వేళ
కార్తీక దీపంపు కళికలోయనగ తా
మర పూలు ధగ ధగ మెరియు వేళ
దొంగ తపస్సులో కొంగ బావను జేరి
మోక్షమ్ము మత్స్యముల్ పొందు వేళ
తే: చెరువు నెత్తిపై ప్రేమగా చేయి వేసి
సృకము వలపుటలలను సృష్టించు వేళ
చెరువు సౌందర్యమిది యని చెప్పరాదు
చిత్రమును గీచి చూపింప చేతగాదు
సీ: చెరువుటద్దము లోన మురిపెమ్ముగా మోము
చక్కదిద్దుకొనడె చందమామ
ఉదయాస్తమయముల నుయ్యాలలూగడె
అలలపై కేరింతలాడు సూరి
నీళ్లు దోసిల్లలో నింపి మొక్కడె మట్టి
నన్నమ్ముగా మార్చు హాలికుండు
గడ్డినోటను వచ్చి కౌగిలింపవె పశు
జాతులెల్లను కృతజ్ఞతలు చెప్పి
తే: చేపలను చేతికిచ్చి పోషించు కతన
బెస్తవారు గంగమ్మగా పిలుచుకొనరె?
గట్టుపై మానులంగరక్షకులు గాగ
రాచలోగిలి వలె మది దోచు చెరువు
సీ: పచ్చని పంటల వాగ్ధానమొసగెడు
చెరువు గల్గిన యూర కరువు గలదె?
కన్నబిడ్డల వోలె కాపాడు జనులను
చెరువుకు సాటి ఆదరువు గలదె?
పల్లెటూరికి వెండి వడ్డాణముగదోచు
చెరువుకన్నను వేరు మురువు గలదె?
పాటి గల్గిన ఊరి నీటి బొడ్రాయి యీ
చెరువును మించిన పరువు గలదె?
తే. ఊరి సంపద తెల్ల బంగారురాశి
పృథివిపై నీటి రూపంపు వేల్పుటావు
చెరువులే లేకపోయిన ధరణి మీద
ఘనత గల్గిన నాగరికతలు గలవె?
రచయిత పరిచయం
తోకల రాజేశం మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం ఆవడం గ్రామానికి చెందిన వారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. 9 వ తరగతి చదువుతున్నపటి నుంచే పద్యాలు రాస్తున్నారు. వీరి ఊరు ఆవడంలో చదివే పిల్లలు 20 మందితో శతకాలు రాయించారు. ఇప్పటివరకు వీరు తెలుగు బాల శతకం (2006), చెమట చుక్కలు (నానీలు-2010), పాతాళ గరిగె (సాహిత్య వ్యాసాలు-2013), అడవి దీపాలు (వచన కవిత్వం-2017), మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర (తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురణ-2020), కొబ్బరి నీరా! శతకం (పదిమందితో కలిసి-2023), మట్టి విజయం (పద్యకవిత్వం-2024) అనే పుస్తకాలు ముద్రించారు. తెలుగులో వెలువడుతున్న ప్రసిద్ధ దిన, వార, మాస పత్రికలన్నింటిలోనూ రాజేశం రాసిన కవితలు, వ్యాసాలూ వచ్చాయి. తెలుగునాట ప్రతిష్టాత్మక ఎక్స్ రే ప్రధాన పురస్కారం (2012), సహస్ర వసంతాల పద్య పురస్కారం(2012), సాహితీ శిరోమణి పురస్కారం(2015), సినారె పురస్కారం(2023), తో పాటు రాష్ట్రస్థాయిలో పలు పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రచయితల వేదికకు మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు.