Menu Close
Balluri Umadevi
శ్రీమద్భాగవతం ఆణిముత్యాలు (పద్యకవిత)
డా. బల్లూరి ఉమాదేవి
కాలస్వరూపం
1.ఆ.వె: మూడు లోకములను ముచ్చటగ తిరుగు
         నారదు డరుదెంచి నయముగాను
         కలవర పడుచున్న కౌంతేయులకు దెల్పె
         కాల గతిని గూర్చి ఘనము గాను
2.ఆ.వె: కాల రూపుడైన ఖగరాజ గమనుడే 
        నవతరించె నసురవరుల చంప 
        పనులు తీరినంత వైకుంఠమున కేగు
        నంత వరకు నుండు డవని యందు 
3: సీ: మీ పెద తండ్రియు మీరజాలక కాల
               గతిని నేగె సతితో కానలకును
       విధిని యనుసరించి, వికలము నందక
               జీవములను వీడ సిద్దు లైరి
       వారి యంతము గని వగచుచు విదురుండు
               తీర్థయాత్రల కేగు తీరుగాన
       టంచు నెరుక పర్చి యటనుండి సురమౌని
               వీణ మీటుచు చనె వేగ దివికి
4.ఆ.వె: కాలగమన మందు కలిగిన మార్పులు 
         కన్నులారగనుచు కలత చెంది
         భ్రాత తోడ నిట్లు పలికె నా ధర్మజు
         డాపుకొనగ లేని యార్తి తోడ.
5.ఆ.వె: కృష్ణమూర్తిని గన క్రీడియు తానేగి
         చాల కాల మయ్యె జాడలేదు 
         వారి యొక్క క్షేమ వార్త లెరుగ మైతి 
         మనుచు ధర్మజుండు మ్లాను డయ్యె
6.ఆ.వె: కరుణ తోడ మనను కాచిన కృష్ణుని
         జాడ తెలియలేదు జగతి యందు
         కాన వచ్చు చుండె కష్టకాల మికపై
         దుశ్శకునము లెల్ల తోచు చుండె
7.ఆ.వె: పావనమగు శౌరి పాద ముద్రలవియు
         కన్నులార మనము కాంచ గలమె
         వసుధ యందటంచు వగచు చుండగ వచ్చె
         నశ్రు నయనుడగుచు నర్జునుండు
8.ఆ.వె: అగ్రజునకు మొక్కి నవనత వదనుడై
         నిలువ ధర్మజుండు నెమ్మి తోడ
         వెన్నుని కుశలమ్ము వివరింప మనినంత
         తెలిపె నిట్లు క్రీడి దిగులు తోడ
9.ఆ.వె: రక్షకు డయి నట్టి రాజీవ నేత్రుండు
         జనియె మనను వీడి జగతి నుండి
         నతని కరుణ వల్ల నందితి గాండీవ
‌         మాది యాయుధముల నంతె గాక
10.ఆ.వె: ఆప్త బంధు వగుచు నన్ని వేళల యందు 
          కంటి రెప్ప లట్లు కాపు కాచె
          కౌరవాధముండు కాంత నపహసించ
          కోక లొసగె తాను కూర్మి తోడ.

రచయిత పరిచయం

Balluri Umadevi

నా పేరు డా. బల్లూరి ఉమాదేవి. కర్నూల్ జిల్లా లోని ఆదిని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా (తెలుగు) పనిచేసి 2012లో పదవీవిరమణ చేశాను. వివాహానంతరం బి ఏ, యం ఏ పూర్తి చేశాను. 2005 లో (నా 52 వ ఏట) తెలుగు కన్నడ సంప్రదాయపు స్త్రీల పాటలు పరిశోధన చేసి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి PhD పట్టా పొందాను. మా తాతగారు, తండ్రిగారు, పెదనాన్నలు తెలుగు పండితులే కావడం వల్ల తెలుగు భాష పట్ల చిన్నప్పటి నుంచి మక్కువ ఎక్కువగా వుండేది. అప్పుడప్పుడు పద్యాలు కవితలు రాసే నేను, పదవి విరమణ తర్వాత శంకరాభరణం గ్రూప్ వారి 'సమస్యా పూరణల'తో మరలా రచనకు శ్రీకారం చుట్టాను.

నా ముద్రిత గ్రంథములు (13)

1.శ్రీరామదూత శతకము 2.అక్షర వనం 3. మనో గీతికలు 4.తెలుగు బిడ్డ శతకము 5.శ్రీనివాస శతకం 6.దేవి శతకము 7.శ్రీ రామచంద్ర శతకం 8.శివపురాణ మహత్యము 9.శారదాంబ శతకం 10.హనుమత్ శతకము 11.హనుమోదాహరణము 12.కనకదుర్గ శతకము 13.శ్రీమద్భాగవతము- ఆణిముత్యాలు.

అముద్రిత గ్రంథములు: 1. హిమపవనాలు 2. ఖండకావ్య సమాహారం 3. 'ఆసరా' ఐదు ఆశ్వాసంలో సామాజిక పద్య ప్రబంధము 4. 'జీవన స్రవంతి' ఐదు అంకముల (పద్య నాటకం) 5. విష్ణు దేవ శతకము.

వాల్మీకి రామాయణంలోని అన్ని కాండలలోని కొన్నిసర్గలకు తేటగీతి ఛందస్సు 500 వరకు పద్యాలు రచించాను. వివిధ అంశములపై (సమస్యా పూరణాలు, దత్తపదులు) 5000 పద్యాలు రచించాను.

2000 వరకు కవితలను, 300 పాటలను రచించాను. కొత్త ఛందస్సులలో 100 పద్యములు రచించి ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో చోటు పొందాను. జాతీయ సదస్సులలోను ప్రముఖ పత్రికలలో నా వ్యాసములు ప్రచురితమైనవి. కర్నూలు రేడియో కేంద్రంలో వివిధ అంశములపై ప్రసంగములు చేశాను.

పొందిన బిరుదులు:

సహస్ర కవిరత్న, సహస్ర కవి మిత్ర, సహస్ర కవి చక్రవర్తిని, సహస్రపద్యశ్రీ, (10500 పద్యాలు చదివినందుకు సుద్దాల అశోక్ తేజ గారిని చేతుల మీదుగా సహస్రపద్యశ్రీ బిరుదము అందుకున్నాను) కవితా భూషణ, కవిత విభూషణ, మహతి సాహితీ చక్రవర్తి ,కవివరా మొదలగు బిరుదులతో పాటు నారీ శక్తి పురస్కారం, కీర్తిరత్న పురస్కారం అందుకున్నాను.

అనేక అష్టావధాన, శతావధాన కార్యక్రమాల్లో పలుమార్లు నిషిద్ధాక్షరికి పృచ్ఛకునిగా పాల్గొన్నాను.

Posted in August 2026, పద్యకవితలు, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *