శివయ్యా...
నువ్వు ఎంతగా ఏడిపిస్తున్నా...
ఆనందంగా ఉంది నాకు...
కన్నీటి అభిషేకం దక్కిందని....
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా
శివయ్యా...
నువ్వు ఎంతగా బాధ పెడుతున్నా...
సంతోషంగా ఉంది నాకు
గంగకు బదులు బాధను మోసే అవకాశం ఇచ్చావని...
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా
శివయ్యా..
నువ్వు ఎంతగా ఒంటరిని చేస్తున్నా...
తృప్తిగా ఉంది నాకు....
నీతో ఏకాంతంగా గడిపే అదృష్టం దక్కిందని...
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా
శివయ్యా...
నువ్వు ఎన్ని నిందలను వేస్తున్నా....
నెమ్మదిగా ఉంది నాకు....
నిందల పాలైన నన్ను కూడా నీ తలపై పెట్టుకుంటావని...
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా
శివయ్యా
నువ్వు నన్ను ఎంత దూరంగా ఉంచినా....
ధైర్యంగా ఉంది నాకు...
నన్ను పరీక్షించి ఫలితం ఇస్తావని తెలిసినందుకు
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా
శివయ్యా
నువ్వే కదా వేదం
నీ కథా శ్రవణమే నా హృదయ నాదం...
వేదం నాదం నీ ఆటలో భాగమా
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా
శివయ్యా
నువ్వే కదా పార్వతీదేవిలో సగం
అదే తీరుతో నా భార్యతో చేస్తున్నా సహవాసం
సగమైనా సహవాసమైనా నీ ఆటలో లాస్యమా
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా
శివయ్యా
నువ్వే కదా తనయుడు తలను తీసింది
ఆ చొరవతో నా తలలో అజ్ఞానం తీయవా...
జ్ఞాన విజ్ఞానాలు నీకే తెలిసినా రహస్యమా...
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా
శివయ్యా
నువ్వే కదా మౌన దక్షిణామూర్తివి...
నాలో కీర్తి అపకీర్తి ప్రగతి ప్రయాసాల పంతాలు తీయవా
దక్షిణమే కాదు అన్ని దిక్కుల దిగంబరుడవు కూడా నువ్వేనా...
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా
శివయ్యా
నువ్వే కదా సృష్టిని నడిపించే వాడివి
ఈ సృష్టిలో నా ముష్టి బ్రతుకుకు ఇన్ని దిష్టీలు ఏమిటయ్యా...
నీ దృష్టి ముందు దిష్టి రాలిపోయే దూళి కణమా...
నీ ఆటకు నీవేసాటీ భళా సదాశివా