Menu Close
Shabdavedhi pagetitle
- గౌరాబత్తిన కుమార్ బాబు -

హరిజన భాగవతార్ కమతం షణ్ముగం

Kamatham Shanmugham

మనుషులంతా ఒక్కటే అనే భావంతో అంటరానితనాన్ని నిర్మూలించాలనే ఆశయంతో మహాత్మాగాంధి దళితులను హరిజనులని సంభోదించారు. గాంధీజీ స్పూర్తితో దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ సనాతన ధర్మంపై దళితులకు ఉన్న హక్కును చాటుతూ దళితులకు సామూహిక గాయత్రి మంత్రోపదేశ కార్యక్రమాలను నిర్వహించిన కర్మయోగి హరిజన భాగవతార్ కమతం షణ్ముగం.

కమతం షణ్ముగం 15 జూలై 1897న వెంకటగిరి టౌన్ లోని కాంపాలెంలో ఓ బీద హరిజన కుటుంబంలో జన్మించారు. వారి అమ్మా నాన్న పేర్లు శ్రీమతి చిన్నమ్మ, శ్రీ శాంతయ్య. చదువు పూర్తయ్యాక బడి పంతులు ఉద్యోగంలో చేరారు. కటికనేని సోదరుల ధైర్య సాహసాలు, సహాయ నిరాకరణ ఉద్యమం షణ్ముగం గారిపై ప్రభావం చూపెట్టి ఆయనలో జాతీయోద్యమ స్ఫూర్తిని నింపాయి. అంటరానితనాన్ని నిర్మూలించాలని గాంధీజీ ఇచ్చిన పిలుపు షణ్ముగం గారి మనసును హత్తుకుంది. షణ్ముగం గారు వెంకటగిరి ఉన్నత పాఠశాలలో హరిజనులను చేర్చుకోవాలని ఉద్యమించారు. షణ్ముగం గారు కేవలం ఉద్యమకారుడే కాదు కవి, గాయకుడు కూడా. హార్మోనియం వాయించడం, హరికథలు చెప్పడం కూడా చేసేవారు. నందనార్ కథను యక్షగాన పద్ధతిలో హరికథగా రాసి అంటరానితనం నిర్మూలన ఉద్యమంలో విరివిగా వాడారు. షణ్ముగం గారు చెప్పిన నందనార్ హరికథను విన్న గాంధీజీ ఆయనకు "హరిజన భాగవతార్" అనే బిరుదును ఇచ్చారు."భక్త మణి" అనే బిరుదు కూడా వీరికి ఉన్నది.

1926లో నెల్లూరు జిల్లా ఆది ఆంధ్ర సంఘాన్ని ఏర్పాటు చేశారు. వెంకటగిరి పట్టణంలో హరిజన బాల బాలికలకు వేర్వేరుగా హాస్టళ్లు ఏర్పాటు చేశారు. 1933లో గాంధీజీని వెంకటగిరి తీసుకువచ్చి తమ హరిజన వాడలో గ్రంథాలయానికి మరియు రీడింగ్ రూమ్ కు పునాదిరాయి వేయించారు. 1936లో తమ బడి పంతులు వృత్తి వదిలిపెట్టి పూర్తి స్థాయి కాంగ్రెస్ కార్యకర్తగా మారారు. 1941లో వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొని వెల్లూరు జైలుకు వెళ్ళారు. వ్యవసాయ కూలీ అనే పత్రికకు ఎడిటర్ గా పని చేశారు. 1937,1946,1952 ఎన్నికల్లో పోటీ చేసి మద్రాస్ అసెంబ్లీకి వరుసగా ఎన్నికయ్యారు. 1955లో వెంకటగిరి ద్విసభ్య నియోజకవర్గం నుండి హరిజన సభ్యునిగా ఆంధ్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎన్నికల్లో పరాజయం ఎరుగని వ్యక్తి షణ్ముగం.

స్వాతంత్ర్య పోరాట యోధుడిగా దేశ సేవ చేసిన కమతం షణ్ముగం గారు ఫిబ్రవరి 16 1956లో కీర్తి శేషులయ్యారు. షణ్ముగం గారు 1955 నవంబర్ లో శాసనసభ సమావేశాలకు హాజరవ్వడానికి కర్నూలుకు వెళ్ళారు. అక్కడ పక్షవాతం భారిన పడ్డారు. వెంటనే వారిని వెంకటగిరికి తీసుకువచ్చారు. పరిస్థితి మెరుగవకపోవడంతో అప్పటి ఉపముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారి సలహాపై నెల్లూరు పెద్దాసుపత్రి లో చేర్చారు. అక్కడ కూడా జబ్బు నయం కాకపోవడంతో మద్రాసుకు తీసుకుపోవాలనే సన్నాహాల్లో ఉన్న సమయంలో ఫిబ్రవరి 16వ తేదీ రాత్రి కన్నుమూశారు. వారి భౌతిక కాయాన్ని 17వ తేదీన కారులో వెంకటగిరికి తీసుకునిపోయి అదే రోజు సాయంకాలం అంత్యక్రియలు జరిపించారు. వెంకటగిరిలో గాంధీజీ గ్రంథాలయానికి శంఖుస్థాపన చేసిన దగ్గరే షణ్ముగంగారి సమాధి ఉంది.

Kamatham-Shanmugham-Samadhi
వెంకటగిరిలో శిథిలావస్థలో ఉన్న షణ్ముగం గారి సమాధి

హిందూ సమాజంలో కులవ్యవస్థ నశించిపోయినపుడే కమతం షణ్ముగం వంటి కర్మయోగుల కృషి ఫలించినట్లవుతుంది. అదే వారికి అసలైన నివాళి. హరిజనులను ప్రధాన స్రవంతి హిందుత్వంలోకి తీసుకురావాలని చేసే ప్రతి ప్రయత్నం ఆహ్వానించదగ్గది. అయితే ఈ ఆశయం నెరవేరాలంటే హిందూ సమాజంలో ఘనీవభించిపోయిన కులవ్యవస్థ ఛట్రాన్ని బద్దలు కొట్టాలి. నిచ్చెనమెట్ల వ్యవస్థను నిరసించడంకాదు కూలదోయాలి.

*ఓం నమో నారాయణాయ*

Posted in May 2026, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *