Menu Close
Nagamanjari-Gumma
సీతాకోకచిలుకలు (ధారావాహిక)
నాగమంజరి గుమ్మా

“ఏటి సేత్తాంరా మహేశు… అంతే.” ఆరిందాలా చేతులు తిప్పుకుంటూ చెప్పాడు శీను. ఫక్కున నవ్వింది లష్మి.

ముగ్గురూ సుబ్బు ఇంటివైపు బయలుదేరారు. అక్కడ సీత ఒక్కతే ఉంది. జాగ్రత్తగా జేబులో పెట్టుకుని తెచ్చిన గుడ్డు చిన్న చిన్న ముక్కలు చేసి తినిపించసాగాడు మహేశు. ఇంతలో బుజ్జి, సుబ్బు రెండు కడవలతో నీళ్లు తెచ్చి గోలెంలో పోశారు.

“ఒరే మహేశు, సీతకి కూడా గుడ్డు తెచ్చినావా?” సంబరంగా అడిగాడు సుబ్బు.

“అది కూడా మనజట్టే కదేటి” అన్నాడు మహేశు.

“శీనూ రేపు అడివిలోకి పుల్లలకి ఎల్దాం ఒత్తావా?” అడిగాడు సుబ్బు.

“రేపు బడిలోకి ఎల్లకపోతే పంతులుగోరు సెవి మెలేత్తారు. పంతులుగోరికి సెప్పేసి ఎల్లుట ఎల్దాం.” చెప్పాడు శీను.

“అడివిలోకి నేను కూడా వత్తాను.” చెప్పాడు మహేశు.

“మానాన్నని అడిగి నేను కూడా వస్తాను” చెప్పింది లష్మి.

“ఒరే నన్ను మా నాన్న కాడ కూర్సోని పని నేర్సుకోమని మాయమ్మ సెప్పింది. బడికి రావాలి, పని నేర్సుకోవాలి, నీళ్లు మొయ్యాలి. సీ. ఎన్ని పనుల్రా. ఆడుకోడానికి కూడా కుదరడం లేదు” చెప్పాడు బుజ్జి.

“ఓసోస్ మా నాన్న కూడా తాపీ పనికి సాయం రమ్మంతన్నాడు నాను ఏలిపోయినానేటి?” చెప్పాడు శీను.

“పంతులుగోరేమో బడికి రమ్మంతారు. ఎల్లక పోతే సెవి మెలేత్తారు.” అన్నాడు మహేశు.

“అమ్మగారు మంచి వణ్ణం ఎడతాది. అప్పుడప్పుడు మరమరాలు, పప్పుండలు ఇత్తాది…” పెదాల చివర్లు తడిచేసుకుంటూ అన్నాడు బుజ్జి.

అన్నీ ఆసక్తిగా వింటున్నాడు సుబ్భు. మహేశు తినిపించిన గుడ్డు తినేసి అక్కడే నిద్రపోయింది సీత.

దుర్గమ్మ నులకమంచం వాల్చి, బొంత పరిచి సీతను పడుకోపెట్టి, వంట చెయ్యడానికి వెళ్ళింది.

“నా కోసం మా నాన్న ఎదురు చూస్తాడు నేను ఇంటికి వెళ్లి పోతాను” అంది లక్ష్మి.

“నాను కూడా ఎల్లిపోతాను” అన్నాడు శీను.

“ఒక్క సిటం ఆగండ్రా! అందరం కలిసి ఎల్లిపోదాం. ఒక్క కడవ నీళ్లు దించేసి వచ్చేస్తాను” అన్నాడు బుజ్జి.

“సర్లే అయితే ఉంటాం లే” అన్నాడు మహేశు.

బుజ్జి, సుబ్బు కడవలు తీసుకొని కాలువ వైపు వెళ్లారు.

“ఏట్రా శీను నువ్వు తాపీ పనికెళ్తావా? మా సుబ్బుని కూడా తీసుకెళ్లకూడదూ… నాలుగు డబ్బులు వత్తాయి. అంది దుర్గమ్మ.

“లేదత్తా! మేము పనిలోకి వెళ్తే డబ్బులు ఇయ్యరు. పని నేర్చుకోవాలి కదా! చేసి రావడమే! అంతే!” అన్నాడు శీను.

“నేను ఈళ్ళలా పనిలోకి ఎల్లను. సాము గరిడీలు నేర్చుకుంటాను. సైన్యంలోకి వెళ్తాను.” చెప్పాడు మహేశు.

“అమ్మో సైన్యంలోకే?” ఆవలించింది దుర్గమ్మ.

“మా తాత, ఆళ్ల నాన్న అందరూ సైన్యంలోనే పనిసేసారట. యుద్దమొత్తే సచ్చిపోతానని బయపడి మా నాన్న సైన్యంలో సేరనేదట. అయినా కూడా సచ్చిపోయాడు.” చెప్పాడు మహేశు.

“సైన్యంలో చేరితే దొంగల్ని చంపొచ్చు. దొంగల దగ్గర బోలెడు డబ్బులు, నగలు, బంగారం ఉంటాయట. అవన్నీ తెచ్చుకోవచ్చు.” మళ్ళీ చెప్పాడు మహేశు.

“నిజంగానా?” అడిగింది లష్మి. “నిజంగా దొంగల్ని చంపి, డబ్బులు, బంగారం తెచ్చుకోవచ్చా?” ఆశగా అడిగింది లష్మి.

“మామ్మ సెప్పిన కథ నువ్వు కూడా ఇన్నావు కదేటి. మల్లీ కొత్తగా అడుగుతావేటి?” చిరాగ్గా చెప్పాడు శీను.

“నువ్వుండేహే. ఆన్ని సెప్పనీ” కసురుకుంది లష్మి.

“నువ్వుండరా శీను. అవును లష్మి. కొన్ని నగలు ఎవులివి ఆలికిచ్చేత్తాం. మిగిలినయన్ని మనకే.” చెప్పాడు మహేశు.

“ఏట్రా నగలు అంటన్నారు?” నీళ్ల కుండ దించుకుంటూ అడిగాడు బుజ్జి.

“మహేశు సైన్యంలో చేరుతాడట. అప్పుడు దొంగలను పట్టుకుంటాడట. ఆ దొంగల దగ్గర దొరికిన డబ్బులు, బంగారం అన్నీ మనం తీసుకోవచ్చు, అని చెప్తున్నాడు” చెప్పింది లష్మి.

“ఓస్ అదా! ఆ పనికైతే సైన్యంలో చేరడం ఎందుకు? ఈడి మామ్మ సెప్పినట్లు మనమే ఆ దొంగల్ని ఎతుక్కుంటూ పోతే సరిపోద్ది కదా… నేను నీళ్లు మొయ్యక్కర్లేదు, శీనుగాడు ఆల్ల నాన్నతో తాపులు కాయక్కర్లేదు. సుబ్బుగాడి పిన్ని, మహేశు నాన్నమ్మ కష్టపడక్కర్లేదు. సుబ్బు, సీత, శీను, మహేశ్, నువ్వు, నేను అందరం కడుపు నిండా బువ్వ తినొచ్చు.” గుక్కతిప్పకుండా చెప్పాడు బుజ్జి.

సుబ్బు ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయాడు. అందరూ నవ్వుకున్నారు. దుర్గమ్మ అందరికి తలొక నువ్వులు, బెల్లం కలిపి దంచిన చిమ్మిరి ఉండ చేతిలో పెట్టింది.

“సుబ్బూ! ఎళ్తాం రా” చెప్పేసి మహేశు, లష్మి, శీను, బుజ్జి బయలుదేరారు.

“ఇవాళ లేచిన వేళ బాగుంది. బడికెళ్ళాను. మహేశు నాన్నమ్మ గుడ్డు ఇచ్చింది. పిన్ని తాయిలం ఇచ్చింది.” తృప్తిగా పెదవుల చివర్లు నాలుకతో నాక్కుంటూ అనుకున్నాడు సుబ్బు. నోట్లో ఎక్కడైనా నువ్వుపప్పు బద్ద ఉందేమో అని నాలుకని నోట్లో అన్నివైపులా తిప్పిచూసుకున్నాడు. చాలాసేపు వరకు నోట్లో ఆ మధుర రుచి అలాగే ఉండిపోయింది. పెద్ద షావుకారు కూతురు పెద్దమనిషైతే ఆడంగులందరికి చిమ్మిలి పంచేరు. అందుకున్న వారు, ఇంటికి తీసికెళ్లకుండా ఒక పక్కన ఆ చిమ్మిలి ఉండలు ఉంచేసి వెళ్లిపోయారు. వాళ్ళింట్లో పాచి పని పూర్తిచేసుకుని వచ్చిన దుర్గమ్మ ఆ ఉండలు చూసి, “తీసుకుపోనా” అని షావుకారు భార్యను అడిగింది. ఆవిడ మరో రెండు ఉండలు, అరటిపళ్ళు పెట్టి ఇచ్చింది. ఇంటికి రాగానే కూతురికి అరటిపళ్ళు తినిపించింది. ఉండలు పిల్లలకు ఇచ్చింది.

*****************

రోజూ కంటే గట్టి ఆహారం కడుపులో పడటంతో, గంజన్నం తినగానే నిద్రపట్టేసింది సుబ్బుగాడికి. బాగా ఎండ ఎక్కితే కానీ మెలకువ రాలేదు. అది కూడా బుజ్జిగాడు వచ్చి కుదిపి మరీ లేపాడు. దుర్గమ్మ, సీతను తీసుకొని పనిలోకి వెళ్లిపోయినట్లుంది. అలికిడి లేదు.

“ఏట్రా ఇంత మొద్దు నిద్ర?” అడిగాడు బుజ్జి.

“ఏమోరా! ఎప్ప్పుడూ ఇంత పొద్దెక్కే వరకు నిద్రపోయిందే లేదు” అన్నాడు సుబ్బు.

మహేశు, శీను, లష్మి కూడా వచ్చారు.

“ఏట్రొరే… పొద్దు పొద్దున్నే అందరూ మళ్ళీ ఒచ్చేసినారు. ఏటయినాదేటి?” అన్నాడు సుబ్బు.

“నిన్న రాత్రి ఊళ్ళోకి దొంగలొచ్చినారు. పెద్ద సావుకారు ఇంట్లో నిన్న కార్యం అయినాది. సుట్టాలు సానామంది వచ్చినారు. అందరూ బంగారం దిగేసుకున్నారు. రాత్రి దొంగలొచ్చి అయ్యన్ని దోచుకుపోయినారు.” చెప్పాడు మహేశు.

“ఇవాళ మనం ఆ దొంగల్ని నెలకడానికి ఎళదాం. ఊల్లోంచి పెద్దవాళ్ళు కొందరు పొద్దున్నే దొంగల్ని పట్టడానికి బయలెల్లిపోయారు. మనం కూడా ఎల్దాం. దొరికితే సరిసమానంగా పంచుకుందాం.” చెప్పాడు శీను.

“దొరికితే పెద్ద సావుకారు ఆడి నగలన్నీ తీసుకుంటాడు కదా” అనుమానం వ్యక్తం చేశాడు సుబ్బు.

“వందల మంది ఉన్నారు. ఎన్ని నగలు పోయాయో లెక్కేటి? కొన్ని ఇస్తాం, కొన్ని తీసుకుంటాం” చెప్పాడు బుజ్జి.

మొత్తానికి ఐదుగురూ కూడబలుక్కుని అడవిలోకి బయలుదేరారు. కనీసం తిండి కూడా తీసుకెళ్లలేదు. మధ్యాహ్నం వరకు తిరిగారు. ఎవరూ కనిపించలేదు. కొంతమంది ఊళ్లోని పెద్దవాళ్ళు కర్రలు పట్టుకొని జట్లు జట్లుగా వెతుకుతూ తిరుగుతూ ఉన్నారు. వారి కళ్ళ బడకుండా చెట్టు పుట్టలు చాటు చేసుకుంటూ దొంగల్ని వెతుకుతున్నారు పిల్లలు.

“ఒరే ఇక్కడ పైన ఉన్న కొమ్మలు కొంచెం ఒంగి ఉన్నాయి. కింద దారి మాత్రం నలగలేదు. దొంగలు గుర్రాల మీద వెళ్లారు కాబట్టి ఇటువైపు వెళ్లి ఉండవచ్చు” అంది లష్మి పరిశీలనగా చూస్తూ.

అవునన్నట్లు తలాడించాడు మహేశు. అందరూ అటువైపు బయలుదేరారు. ఎండ మండిపోతోంది. కడుపులో ఆకలి కరకరమంటోంది. “ఒరే… ఆకలేస్తాంది… తినడానికి ఏటైనా సూడండ్ర.” అన్నాడు సుబ్బు.

“అల్లదిగో… అక్కడ సెరువు కనబడుతోంది. అటెల్దాం. అక్కడ ఏదైనా జంతువు దొరికితే చంపి, కాల్చి తిందాం” చెప్పాడు మహేశు.

అప్పటికప్పుడు చెట్టు కొమ్మలు విరిచి, వంచి తీగలతో కట్టి విల్లు తయారు చేశారు. సన్నటి పుల్లలు ఒకవైపు అరగదీసి సూదిగా చేశారు. చెరువు పక్కనే మాటేశారు. ఒక అడవి మేకల గుంపు వచ్చింది. ఒక మేకని బాణంతో కొట్టి చంపారు. ఎండు ఆకులు, చిన్న కొమ్మలు, చితుకులు పోగేసారు. రాళ్ళని రాపాడించి నిప్పు ముట్టించారు. ఆ చితుకుల మంటపై మేకని కాల్చారు. కాస్త చల్లబడిన తర్వాత ఊదుకుంటూ కాలిన మాంసాన్ని తిన్నారు. ఉప్పు, కారాలు లేకపోయినా ఆకలితో ఉన్న కడుపుకి రుచి తెలియలేదు. తినేసి, చితుకులు శుభ్రంగా ఆర్పేసి, చెల్లాచెదురు చేసేసారు.

కడుపు నిండా నీళ్లు తాగేరు.

మళ్ళీ వెతుకులాటకు బయలుదేరారు. ఎంత దూరం నడిచినా ఎవరూ కనిపించలేదు. శిథిలమైన ఆలయం ఒకటి కనిపించింది. లోపలకు వెళ్లి దండం పెట్టుకుందామంది లష్మి. సుబ్బు ఒక్కడే లష్మితో లోపలకు వెళ్ళాడు. అక్కడ రంగు వెలిసిపోయి, చేతులు విరిగిపోయిన ఒక దేవీ బొమ్మ కనిపించింది. ఆ మసక వెలుతురులో బొమ్మ పక్కన మూటలు చూసాడు సుబ్బు. మహేశుని, బుజ్జిని, శీనుని కేకేసాడు. ఒక మూటను మెల్లిగా బయటకు తెచ్చారు. దాని నిండా నగలే. మరో రెండు మూటలు ఉన్నాయి. వాటిని కూడా బయటకు తెచ్చి, విప్పి చూసారు. ఒకదానిలో డబ్బులు, వేరొక దానిలో నగలు ఉన్నాయి. చప్పుడు చెయ్యకుండా ఐదుగురూ మూడు మూటలు వంతుల వారీగా మోసుకుంటూ సుబ్బు ఇంటికి వచ్చేసారు. ఒక అరమూట నగలు, డబ్బు బండ కింద గొయ్యి తీసి దాచారు. మిగతా మూటన్నర నగలు షావుకారు ఇంటికి తీసుకెళ్లారు. షావుకారు మూట విప్పి నగలను పోల్చుకున్నాడు. ఇంటిలో ఉన్న ఆడవాళ్లు పోయాయనుకున్న తమ నగలు దొరికేసరికి చాలా ఆనందించారు. అందరికి ఒకటో రెండో తప్ప మిగతా అన్ని నగలు ఉన్నాయి. షావుకారు పిల్లల సాహసానికి మెచ్చుకొని దోసెడేసి వరహాలు వారికి ఇచ్చాడు. ఆ వరహాలతో పాటు, తాము దాచిపెట్టిన డబ్బు, నగలు కూడా పంచుకున్నారు ఐదుగురూ. సుబ్బు కొంచెం డబ్బు తాను ఉంచుకొని మిగతావి దుర్గమ్మకి ఇచ్చేస్తానన్నాడు.

దుర్గమ్మ ఇంటికి రాగానే ఆ డబ్బులు, నగలు ఇచ్చి, తాము చేసిన పని చెప్పాడు సుబ్బు. దుర్గమ్మ సుబ్బుని ముద్దులాడి, జంతికలు, లడ్లు, సున్నుండలు చేసింది. మంచి బువ్వ వండి పెట్టింది.

సుబ్బుకి ఇంకా ఇంకా తీపి మిఠాయిలు తినాలనిపించింది. తన దగ్గర ఉన్న డబ్బుతో అంగట్లోని మిఠాయిలన్నీ కొనేసాడు. కుప్పలు కుప్పలు పోయించాడు. బూందీ, జాంగ్రీ, అప్పచ్చులు, పకోడీ, మైసూరుపాకు, కలకండ, కోవా బిళ్ళలు, పాల ఉండలు, చేగోడీలు, మురుకులు, కరకజ్జం, చంద్రకాంతలు, అరిసెలు, పూతరేకులు, కాజాలు, కొబ్బరి చెక్కలు, నువ్వుండలు, కొబ్బరి పాకం, బెల్లపచ్చులు, వేపిన అటుకులు, బూరెలు, కారం గారెలు, ఆవడలు ఒకటేమిటి ఎన్నో మిఠాయిలు, కారపు వస్తువులు అన్నీ కొనుక్కొచ్చుకున్నాడు. అవన్నీ ఎక్కడ పెట్టాలి? ఆలోచించాడు. “ఈ మిఠాయిలతోనే ఇల్లు కట్టేస్తే…” అనుకున్నాడు.

బెల్లం దిమ్మలు పునాది వేసాడు. మైసూరుపాకులు, కోవా బిళ్ళలు, కాజాలతో గోడలు కట్టాడు. పకోడీ, బూందీ గచ్చు చేసాడు. జాంగ్రీ, చంద్రకాంతలు, చేగోడీలు, జంతికలు తలుపులు, కిటికీలుగా అమర్చాడు. మిగిలిన మిఠాయిలు రకరకాల ఆకరాల్లో పేర్చాడు. గారెలు పైకప్పు వేసాడు. పూతరేకులు తెరలు కట్టాడు. ఒక్కడే ఆ ఇంట్లో కూర్చుని ఒక్కో మిఠాయి తినసాగాడు.

****సశేషం****

రచయిత్రి పరిచయం:

Nagamanjari-Gummaనాగమంజరి గుమ్మా గారు వృత్తి రీత్యా ఉపాధ్యాయిని. ప్రవృత్తి: సాహిత్య సేవ. భాషణం, పఠనం, లేఖనం మూడూనూ..

కవితలతో మొదలై పద్యాలు, ఖండికలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, సమీక్ష, గీతం, కథలు, నవల… ఇలా వీలైనన్ని, చేతనైనన్ని సాహితీరూపాల్లో రచనలు చేయడం వారికి నిత్యకృత్యమైనది. వారు వ్రాసిన శ్రీగణేశ చరిత్ర, విశ్వనాథ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి పుస్తకాలుగా ముద్రితమయ్యాయి. అనేక దిన, వార, పక్ష, మాస, ద్వైమాస పత్రికలలో వారి రచనలు ప్రచురితమయ్యాయి.

అవకాశం దొరికినప్పుడల్లా పురాణ ప్రవచనాలు చెప్పడం, పిల్లలకు శ్లోకాలు పద్య పఠనంలో శిక్షణ నివ్వడం. ముగ్గుల పోటీల్లో, మాస్టర్స్ అథ్లెటిక్స్ లో రాష్ట్రస్థాయిలో బహుమతులు, పతకాలు పొందడం జరిగింది.

Posted in May 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *