Menu Close
Ayyagari-Suryanarayana-Moorthy
తిరుమలయాత్ర
అయ్యగారి సూర్యనారాయణమూర్తి

తిరుమలయాత్ర

తే.గీ.
దారి పొడవునఁ దనయందె తవిలి యున్న
చిత్తపుష్పాలు వికసింపఁ జెట్ల వేద
వేద్యులుగ నెంచి యాశుకవిత్వఝరులు
పాఱ నరుదెంచితిమి హరివాసమునకు

పల్లకిపై ఉత్సవమూర్తుల దర్శనము – తిరుమల

ఉ.
అన్నులమిన్నలౌ సతుల యందము మీఱెడు కమ్రరూపుఁడై
పన్నగశైలనాథుఁ డదె భాసురభూషణకాంతిపుంజముల్
కన్నులఁ గ్రమ్మ నన్యమునుఁ గాంచ నశక్యము గాఁగ రాఁగ ము
న్నెన్నడుఁ జూడనట్టి శుభదృశ్యముఁ గాంచితి మెంతొ సన్నిధిన్

కల్యాణవేంకటేశ్వరస్వామి – నారాయణవనము, తిరుపతి

కం.
కల్యాణవేంకటేశ్వర!
కల్యాణముఁ(1) గూర్పుమయ్య! కను నందఱకున్
బాల్యమునుండి భజించితి
తుల్యము లేదయ్య నీకుఁ దోయరుహాక్షా!
…….(1) శుభము
తే.గీ.
నలుగుపిండిని విసరిన నాఁటి జక్కి(1)
నేఁటికిని జూడ ముచ్చటౌ, నీకు జ్ఞప్తి
కరుగుదెంచఁగ నీ పెండ్లి మురువు(2) లెన్నొ
యెలమిఁ(3) జూపింప కెట్లుండఁ గలవు స్వామి?
………(1) తిరుగలి (2) విలాసములు
………(3) ప్రేమ/సంతోషము/ఉత్సాహము

శ్రీసర్వమంగళాసమేత శ్రీపల్లికొండేశ్వరస్వామి – సురుటుపల్లి(తిరుపతి నుండి 70 కి.మీ.)
[1344 లో శ్రీహరిహరబుగ్గరాయులు కాలములో ఆలయము నిర్మితము]

ఉ.
సర్వజగాలఁ గావఁగ విషంబునుఁ దాలిచి విశ్రమింపఁగా
పర్వతపుత్రికాంకమున భద్రముగాఁ దన శీర్ష ముంచి దృ
క్పర్వము గాఁగ నీ ‘సురుటుపల్లిఁ’ బరుండెను మానవాకృతిన్(1)
శర్వుఁడు, విశ్వమం దెచట శక్యమె యిట్టి(2) మహేశుఁ గాంచఁగన్?
…….(1) 12 అడుగుల పొడవైన మనుష్యరూపము (2) పరుండిన

వేదనారాయణస్వామి – నాగలాపురము, తిరుపతి దగ్గఱ

తే.గీ.
వేదనారాయణాఖ్యను వెలసినట్టి
మీనరూపంబు దాల్చిన మేటిదేవ!
వేదవల్లీసమేత! మా విన్నపముల
విని కృపాదృష్టిఁ గన మిమ్మె వేడుకొందు

సాలగ్రామవేంకటేశ్వరాలయము – తిరుపతి

కం.
మూలమున శివుఁడు, వేంకట
శైలేశుఁడు మధ్య, మీఁదఁ సర్పఫణంబున్
జాల మనోహరముగ నొక
సాలగ్రామమున వెలసి సంస్తుతి కెక్కెన్
కం.
టెక్కెపుకంబము నీడగ
నక్కజముగఁ గానుపించు నస లెట లే కా
ప్రక్కనఁ గుడ్యము పై నిం
కెక్కడఁ గనలేని వేంకటేశ్వరలీలై
Posted in May 2026, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *