మధ్యప్రాచ్య సెగలు: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వెనుక వ్యూహాత్మక విశ్లేషణ
"యుద్ధం అనేది విధ్వంసం కోసం కాకుండా శాంతి స్థాపన కోసం జరగాలి" – ఇది మహాత్మాగాంధీ గారు పలికిన శాంతి వచనం. కానీ నేటి ప్రపంచ ముఖచిత్రం ఇందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. ఫిబ్రవరి 28, 2026న అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై భారీ వైమానిక దాడులను ప్రారంభించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ నివాస సముదాయం, కీలక సైనిక స్థావరాలు మరియు అణు కేంద్రాలే లక్ష్యంగా సాగిన ఈ దాడులు మధ్యప్రాచ్యాన్ని అస్థిర పరిచాయి. దీనికి ప్రతిచర్యగా, ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌తో పాటు అక్కడ ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ పరిణామాలు ఇరాన్–అమెరికా–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలను పరాకాష్టకు చేర్చాయి. యుద్ధం అనగానే మనకు వెంటనే స్ఫురించేది కురుక్షేత్ర సంగ్రామం. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ బోధించినట్లు, యుద్ధం కేవలం రక్తపాతం కాదు; అది ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే పోరాటం. అయితే, ప్రస్తుత ఇరాన్ యుద్ధ పరిణామాలను గమనిస్తే... అక్కడ ఎవరు ధర్మ పక్షాన ఉన్నారు, ఎవరు అధర్మ పక్షాన ఉన్నారో తేల్చడం ఎవరికైనా తలకు మించిన భారమే. ఎందుకంటే ఈ యుద్ధ మూలకారణాలు అంతటి సంక్లిష్టమైనవి. నేడు ఈ యుద్ధ ప్రభావం ప్రపంచంలోని ప్రతి దేశంపైనా, ప్రతి సామాన్యుడిపైనా పడుతోంది.
ఈ నెల రచ్చబండ చర్చాంశాలు:
ఈ యుద్ధ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ నెల మన 'రచ్చబండ' కార్యక్రమంలో ఈ క్రింది అంశాలపై విశ్లేషించుకుందాం:
- ఇజ్రాయెల్ చరిత్ర: ఆ దేశ ఆవిర్భావం మరియు అప్పట్లో ఎదుర్కొన్న సవాళ్లు.
- సంఘర్షణ మూలాలు: ప్రస్తుత ఘర్షణకు దారితీసిన రాజకీయ, భౌగోళిక కారణాలు.
- ప్రవాస భారతీయులపై ప్రభావం: ఈ అంతర్జాతీయ ఉద్రిక్తతలు విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రత, ఆర్థిక స్థితిగతులపై చూపుతున్న ప్రభావం.
హెబ్రూ ప్రజలు మరియు ప్రవాస జీవితం
హెబ్రూ ప్రజలు ప్రాచీన పశ్చిమ ఆసియాకు చెందిన సంచార తెగ; వీరు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల వంశస్థులుగా బైబిల్ చరిత్రలో కనిపిస్తారు. ఏసు క్రీస్తు సమయం పూర్వం హెబ్రూ ప్రజలుగా పిలువబడ్డ వీరు, బైబిలు కాలంలో వీరు ఇజ్రాయేలీయులుగా, ఆపై యూదులుగా పిలవబడ్డారు. ఏకేశ్వరోపాసన (ఒకే దేవుడిని నమ్మడం) మరియు 'తోరా' ధర్మగ్రంథం వీరి మత-సాంస్కృతిక జీవనానికి మూలాధారాలు. ప్రాచీన కాలంలో హెబ్రూ ప్రజలు లెవాంట్ ప్రాంతంలో 'ఉత్తర ఇజ్రాయెల్' మరియు 'దక్షిణ యూదా' అనే రెండు రాజ్యాలుగా నివసించారు. అయితే, క్రీస్తుపూర్వం 8వ శతాబ్దంలో అస్సీరియన్ల దాడులు, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో బాబిలోనియన్ల దాడుల కారణంగా ఈ రెండు రాజ్యాలు పతనమై, యూదుల వలస ప్రారంభమైంది. ఫలితంగా యూదులు మధ్యప్రాచ్యం, యూరప్, ఉత్తర ఆఫ్రికా వంటి ప్రాంతాలకు చెల్లాచెదురై, దాదాపు 2500 సంవత్సరాల పాటు సుదీర్ఘ ప్రవాస జీవితాన్ని గడిపారు.
భారతదేశంలో యూదుల ప్రవాసం: భారతదేశంలో యూదుల ప్రవాసం చారిత్రక ప్రాధాన్యత కలిగినది. కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ (గుంటూరు-చేబ్రోలు) వంటి ప్రాంతాల్లో శతాబ్దాలుగా యూదు సముదాయాలు స్థిరపడి ఉన్నాయి. చారిత్రక ఆధారాల ప్రకారం, క్రీ.శ. 1వ శతాబ్దం నుంచే యూదులు భారతదేశానికి చేరినట్లు భావిస్తారు. భారతీయ యూదులు తమ ధార్మిక ఆచారాలైన తోరా పఠనం, శబత్, పస్కా, యోమ్ కిప్పూర్ వంటి పండుగలను మరియు వివాహ సంప్రదాయాలను నిలబెట్టుకుంటూనే, స్థానిక తెలుగు సంస్కృతితో సమన్వయం సాధించారు. భారతీయ యూదు సముదాయాల ప్రత్యేకత ఏమిటంటే—బహుళ సంస్కృతులు ఉన్న చోట కూడా ధార్మిక సందర్భాల్లో హెబ్రూ భాషను ఉపయోగిస్తూ తమ గుర్తింపును కాపాడుకోవడం. భారత సమాజంలో యూదులపై ఎటువంటి హింస లేదా బలవంతపు మతమార్పిడులు జరగకపోవడం వారి సాంస్కృతిక నిలకడకు ప్రధాన కారణం. ఈ చారిత్రక అనుబంధమే నేటి భారత్-ఇజ్రాయెల్ సంబంధాలకు ఒక బలమైన పునాదిగా నిలిచింది.
యూదుల ప్రభావం, ప్రపంచ యుద్ధాలు మరియు ఇజ్రాయెల్ ఆవిర్భావం
19వ శతాబ్దం చివర నుంచి 20వ శతాబ్దం ప్రారంభం వరకు యూదులలో 'సియోనిజం' అనే రాజకీయ-జాతీయ ఉద్యమం వేగంగా పుంజుకుంది. తమ పూర్వీకుల భూమిగా భావించే పాలస్తీనా ప్రాంతంలో యూదుల కోసం తిరిగి ఒక స్వతంత్ర దేశాన్ని స్థాపించాలనే ఆలోచనే ఈ ఉద్యమానికి కేంద్రబిందువు. 1917లో బ్రిటన్ ప్రభుత్వం 'బాల్ఫోర్ ప్రకటన' ద్వారా పాలస్తీనాలో "యూదుల స్వదేశం" ఏర్పాటుకు మద్దతు తెలిపింది. ఇది ఒక అధికారిక ఒప్పందం కాకపోయినప్పటికీ, మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటన్ తీసుకున్న కీలక విధాన నిర్ణయం. ఈ ప్రకటనతో భౌగోళిక రాజకీయాల్లో మార్పులు రావడమే కాకుండా, యూదులలో స్వదేశం పట్ల ఆశలు పెరిగాయి. అదే సమయంలో, నేటి ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి పునాదులు కూడా ఇక్కడే పడ్డాయి.
రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో 'హోలోకాస్ట్' (యూదుల మారణహోమం) నాజీ జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ నాయకత్వంలో ప్రారంభమైంది. 1941 నుండి 1945 మధ్య కాలంలో హిట్లర్ ఆదేశాలతో సుమారు 60 లక్షల మంది యూదులను క్రమపద్ధతిలో సామూహిక హత్య చేశారు. పచ్చని చెట్టును వేళ్లతో సహా పీకి, సుదూర తీరాల్లో నాటినట్లుగా ఉంది యూదుల ప్రవాస జీవితం. నిజానికి ప్రవాసం అంటేనే.. మన మూలాలను వదిలి కొత్త మట్టిలో అతుక్కోవడానికి చేసే ఒక నిరంతర పోరాటం. అయితే, ఈ మనుగడ ప్రయాణంలో యూదులకు చేదు జ్ఞాపకాలు కలగలిసిన మిశ్రమ ఫలితాలే ఎదురయ్యాయి. దేశం కాని దేశం వెళితే.. దేవుడే దిక్కు లెక్కన తయారైంది ప్రవాస యూదుల పరిస్థితి. జర్మనీలో యూదుల సామూహిక హత్యాకాండ ఘోర కలివిడి అంతర్జాతీయ సమాజంలో యూదుల కోసం ఒక ప్రత్యేక రక్షణ కవచం (దేశం) ఉండాలనే భావనను బలంగా నాటింది.
రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, యూదు నాయకత్వం దేశ స్థాపన చర్యలను వేగవంతం చేసింది. చివరకు 1948 మే 14న ఇజ్రాయెల్ దేశం అధికారికంగా ప్రకటించబడింది; అదే రోజు అమెరికా దీనిని గుర్తించింది. అయితే, ఇజ్రాయెల్ ఆవిర్భావాన్ని పొరుగు అరబ్ దేశాలు అంగీకరించకపోవడంతో వెంటనే యుద్ధాలు ప్రారంభమయ్యాయి. 1948, 1956, 1967 (ఆరు రోజుల యుద్ధం), 1973 (యోమ్ కిప్పూర్ యుద్ధం) వంటి ఘర్షణలు ఈ ప్రాంతాన్ని అస్థిరపరిచాయి. ప్రస్తుత ఇజ్రాయెల్ భూభాగంలో కొంత భాగం గతంలో అరబ్బుల నుండి చట్టబద్ధంగా కొనుగోలు చేయబడినప్పటికీ, మరికొంత భాగం ఈ యుద్ధాల్లో సాధించిన విజయం ద్వారా ఇజ్రాయెల్ వశమైందని చారిత్రక విశ్లేషణలు సూచిస్తున్నాయి.
ప్రాచీన పర్షియన్ చరిత్ర మరియు భారత సంబంధాలు
పర్షియన్ నాగరికత ప్రపంచంలోని అత్యంత పురాతన, ప్రభావవంతమైన సంస్కృతులలో ఒకటి. ఆకెమెనిడ్ (Achaemenid) సామ్రాజ్యం (క్రీ.పూ. 550–330) నుండి ససానియన్ సామ్రాజ్యం (క్రీ.శ. 224–651) వరకు పర్షియా.. రాజకీయ పరిపాలన, వాణిజ్యం, కళలు మరియు భాషా రంగాల్లో విశేష ప్రభావం చూపింది. ఈ సామ్రాజ్యాలు భారత ఉపఖండంతో సుదీర్ఘ సంబంధాలు కలిగి ఉండేవి. సిల్క్ రూట్ (పట్టు మార్గం) మరియు సముద్ర మార్గాల ద్వారా మసాలా దినుసులు, వస్త్రాలు, రత్నాలు, లోహాలు వంటి వస్తువుల మార్పిడి జరిగేది. ఫలితంగా సంస్కృతి, అవెస్టన్-పహ్లవి భాషా ప్రభావాలు, కళా-వాస్తు రీతులు భారతీయ జీవన గమనంలో అంతర్భాగమయ్యాయి. ససానియన్ కాలం తర్వాత జొరాస్ట్రియన్ సముదాయాలు (తరువాత కాలంలో పార్సీలుగా పిలువబడ్డారు) పర్షియా నుండి భారతదేశానికి వలస వచ్చారు. వీరు ముఖ్యంగా గుజరాత్ తీర ప్రాంతాల్లో స్థిరపడి, తమ జొరాస్ట్రియన్ మత ఆచారాలను శతాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు. భారత దేశ అభివృద్ధిలో పార్సీ సముదాయం అద్వితీయమైన పాత్ర పోషించింది. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జెమ్షెడ్జీ టాటా, అణు విజ్ఞాన శాస్త్రవేత్త హోమీ జె. భాభా వంటి ప్రముఖులు ఈ సముదాయానికి చెందినవారే. మౌర్యులు, గుప్తులు, చాళుక్యులు వంటి భారత రాజవంశాలు పర్షియన్ సామ్రాజ్యాలతో నిరంతరం దౌత్య, వాణిజ్య సంబంధాలను కొనసాగించాయి. ఈ దీర్ఘకాలిక పరస్పర సంబంధాలు సాంస్కృతిక, భాషా మరియు మతపరమైన అంశాల్లో బలమైన పునాదిని ఏర్పరిచాయి. ఇవే నేటి ఆధునిక కాలంలో కూడా ఇరాన్-భారత్ సంబంధాలను ప్రభావితం చేస్తున్నాయి.
1979 ఇరాన్ విప్లవం మరియు ఇజ్రాయెల్-ఇరాన్ సంబంధాల మార్పు:
1979లో ఇరాన్‌లో సంభవించిన 'ఇస్లామిక్ విప్లవం'తో షా పహ్లావీ పాలన అంతమైంది. అయతుల్లా ఖొమేనీ నేతృత్వంలో ఇరాన్ ఒక 'ఇస్లామిక్ రిపబ్లిక్'గా ఆవిర్భవించింది. ఈ విప్లవానికి ముందు, రక్షణ మరియు భద్రతా రంగాల్లో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య అత్యంత రహస్యమైన, లోతైన సహకారం ఉండేది. అయితే విప్లవం తర్వాత ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఇజ్రాయెల్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, దానిని పాలస్తీనా భూభాగంపై "అక్రమ ఆక్రమణదారు"గా అభివర్ణించింది. ఈ రాజకీయ మార్పు ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష శత్రుత్వానికి దారితీసింది. ఇరాన్ తన ప్రాంతీయ ప్రయోజనాల కోసం పలు సాయుధ గ్రూపులకు రాజకీయ, ఆర్థిక మరియు సైనిక మద్దతు ఇవ్వడం ప్రారంభించింది. ఇంధన వనరుల విక్రయం ద్వారా లభించిన ఆదాయాన్ని ఇరాన్ ఇటువంటి కార్యకలాపాలకు మళ్లించిందని అనేక అంతర్జాతీయ అధ్యయనాలు వెల్లడించాయి. గత ఐదు దశాబ్దాలుగా ఇరాన్‌లో మానవ హక్కులు, మహిళల హక్కులు మరియు ప్రాథమిక మౌలిక సదుపాయాల పరిస్థితి క్రమంగా క్షీణించింది. దీనివల్ల దేశంలో అంతర్గత నిరసనలు, ఒత్తిడులు పెరిగాయి. అయినప్పటికీ, ఇరాన్ తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవడంపై మరియు పొరుగు దేశాల సరిహద్దుల్లో ఉగ్ర సమూహాలను ప్రోత్సహిస్తూ తన ప్రాంతీయ ప్రభావాన్ని విస్తరించడంపైనే ప్రధానంగా దృష్టి సారించింది.
ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC):
ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) 1979 విప్లవం తర్వాత ఏర్పడి, ఇరాన్‌లో అత్యంత ప్రభావవంతమైన సైనిక-రాజకీయ సంస్థగా ఎదిగింది. సాంప్రదాయ సైన్యంతో పోలిస్తే, IRGC సుప్రీం లీడర్‌కు నేరుగా జవాబుదారీగా ఉంటూ దేశీయ మరియు విదేశీ వ్యూహాత్మక చర్యల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సంస్థ క్షిపణి సాంకేతికత, డ్రోన్ల తయారీ, గూఢచారి కార్యకలాపాలు మరియు ప్రాక్సీ నెట్‌వర్క్‌లకు మద్దతు ఇచ్చే విభాగాల్లో నిమగ్నమై ఉంది. దీనిలోని 'ఖుద్స్ ఫోర్స్' (Quds Force) విభాగం ఇరాన్ వెలుపల రహస్య ఆపరేషన్లు నిర్వహిస్తూ, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పోరాడే వివిధ సాయుధ సమూహాలకు అండదండలు అందిస్తుంది. రాజకీయ, ఆర్థిక మరియు వ్యూహాత్మక రంగాల్లో IRGC కి ఉన్న అపరిమితమైన ప్రభావం ఈ సంస్థను మధ్యప్రాచ్య ఉద్రిక్తతలలో ఒక నిర్ణాయక శక్తిగా నిలబెట్టింది.
హమాస్, హిజ్బుల్లా, హౌతీలు మరియు ఇరాన్ పాత్ర:
ఇరాన్ మధ్యప్రాచ్యంలో తన ప్రభావాన్ని పెంచేందుకు “ఆక్షిస్ ఆఫ్ రెసిస్టెన్స్” (Axis of Resistance) పేరుతో లెబనాన్‌లోని హిజ్బుల్లా, పాలస్తీనాలోని హమాస్, మరియు యెమెన్‌లోని హౌతీల వంటి సాయుధ గ్రూపులతో బలమైన సంబంధాలను ఏర్పరచుకుంది. ఈ గ్రూపులకు ఇరాన్ ఆర్థిక సాయం, శిక్షణ మరియు అత్యాధునిక ఆయుధాలను అందిస్తున్నట్లు అనేక అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రాక్సీ నెట్‌వర్క్‌లు సమయం చూసి ఇజ్రాయెల్‌పై మరియు గల్ఫ్ ప్రాంతంలోని కీలక లక్ష్యాలపై క్షిపణి, డ్రోన్ దాడులు తరచుగా చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా, 2023 అక్టోబర్ 7న గాజా నుండి హమాస్ నేతృత్వంలో ఇజ్రాయెల్‌పై జరిగిన దాడి మరియు దానికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ చేపట్టిన చర్యలు ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను పరాకాష్టకు చేర్చాయి.
ఇరాన్ అణు కార్యక్రమం: యురేనియం శుద్ధీకరణ మరియు ఆయుధ నిర్మాణం:
ఇరాన్ తన అణు కార్యక్రమం కేవలం శాంతియుత అవసరాల కోసమేనని ప్రకటిస్తున్నప్పటికీ, దాని యురేనియం శుద్ధీకరణ స్థాయిలు అణ్వాయుధ తయారీ దిశగా సాగుతున్నాయనే అనుమానాలు ఉన్నాయి. సాధారణంగా:
- 5% శుద్ధీకరణ: అణు విద్యుత్ కేంద్రాల్లో ఇంధనంగా వాడతారు.
- 20% శుద్ధీకరణ: వైద్య మరియు పరిశోధన అవసరాల కోసం ఉపయోగిస్తారు.
- 90% శుద్ధీకరణ: అణ్వాయుధాల తయారీకి ఇది అత్యంత కీలకం.
ప్రస్తుతం ఇరాన్ వద్ద 60 శాతం వరకు శుద్ధీకరించిన యురేనియం సుమారు 450 కిలోల వరకు ఉందని అంచనా. దీనితో దాదాపు 11 అణు బాంబులను తయారు చేయవచ్చని కొన్ని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. దీనికి తోడు, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA)తో ఇరాన్ పారదర్శకంగా వ్యవహరించకపోవడం పాశ్చాత్య దేశాలలో మరియు ఇజ్రాయెల్‌లో తీవ్ర ఆందోళనలకు కారణమైంది. ఈ అనిశ్చితి ప్రాంతీయ భద్రతా వ్యూహాలను నిరంతరం ప్రభావితం చేస్తోంది.
ఇరాన్–అమెరికా–ఇజ్రాయెల్: దీర్ఘకాలిక ఉద్రిక్తతల నేపథ్యం:
1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్-అమెరికా దౌత్య సంబంధాలు విచ్ఛిన్నమయ్యాయి. తరువాతి దశాబ్దాల్లో ఇరాన్‌పై ఆంక్షలు, అణు ఒప్పందాలు, ఆపై సదరు ఒప్పందాల రద్దు మరియు పరస్పర ఆరోపణలు కొనసాగాయి. ఇరాన్ యొక్క అణు సామర్థ్యం, ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణులు మరియు శుద్ధి చేసిన యురేనియంతో తయారు చేసిన 'అణు వార్‌హెడ్ల' కలయిక తమ భద్రతకు ప్రత్యక్ష ముప్పు అని ఇజ్రాయెల్ భావించింది. 1979 నుండి ఇరాన్ చేసిన బెదిరింపులు మరియు ఇజ్రాయెల్ ప్రతిస్పందనలు ఒక దీర్ఘకాలిక ఉద్రిక్తతను సృష్టించాయి. దీని పర్యవసానంగానే ఫిబ్రవరి 28, 2026న అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసిన ఆకస్మిక దాడులు ఈ యుద్ధాన్ని ముదరబెట్టాయి.
ఇజ్రాయెల్ ‘మాస్టర్-ప్లాన్’ మరియు యుద్ధ వ్యూహాలు:
ఇజ్రాయెల్ వ్యూహం కేవలం సైనిక స్థావరాల ధ్వంసం మాత్రమే కాదు; ఇరాన్ నాయకత్వాన్ని నిర్వీర్యం చేయడం, అణు-క్షిపణి సామర్థ్యాన్ని దెబ్బతీయడం మరియు IRGC నెట్‌వర్క్‌ను కూల్చివేయడంపై దృష్టి పెట్టింది. అమెరికా సాంకేతిక సాయం మరియు 'బంకర్-బస్టర్' బాంబుల సామర్థ్యం ఈ ఆపరేషన్లను విజయవంతం చేశాయి.
తమ లక్ష్యాలు నెరవేరే వరకు ఈ ఆపరేషన్లు కొనసాగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సైనికంగా ఒత్తిడికి గురైన ఇరాన్, దీనికి ప్రతిగా 'హైబ్రిడ్ వ్యూహాలను' ఎంచుకుంది:
- హోర్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులు.
- అంతర్జాతీయ షిప్పింగ్ రూట్లలో అస్థిరత సృష్టించడం.
- ప్రాక్సీ గ్రూపుల ద్వారా ఇతర గల్ఫ్ దేశాలపై దాడులు.
- భారీ స్థాయిలో సైబర్ ఆపరేషన్లు నిర్వహించడం.
ఈ విధానాల ద్వారా గ్లోబల్ ఇంధన మార్కెట్లను దెబ్బతీసి, ప్రపంచ దేశాలపై ఆర్థిక ఒత్తిడి తీసుకురావాలని ఇరాన్ ప్రయత్నిస్తోంది. మరోవైపు హమాస్, హిజ్బుల్లా, హౌతీ వంటి గ్రూపులను ఏరివేయడం కంటే, వాటికి మూలమైన ఇరాన్‌ను నేరుగా దెబ్బతీయడమే సరైన మార్గమని ఇజ్రాయెల్ భావిస్తోంది.
యుద్ధ క్షేత్రంలో వాస్తవాలు: నాయకత్వ శూన్యత:
ఫిబ్రవరి 28 దాడుల తర్వాత ఇరాన్ నాయకత్వంలో గందరగోళం ఏర్పడింది. సుప్రీం లీడర్ వారసుడిగా ప్రకటించబడిన మొర్తాజా ఆ దాడుల తర్వాత బహిరంగంగా కనిపించలేదు. ఆయన తరపున వెలువడుతున్న వీడియో సందేశాలు కూడా కృత్రిమంగా ఉన్నాయని, బహుశా ఆయన తీవ్రంగా గాయపడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, ఇరాన్ దశాబ్దాలుగా నిర్మించుకున్న భూగర్భ సొరంగాలు అమెరికా బంకర్-బస్టర్ బాంబులకు కూడా చిక్కనంత లోతులో ఉండటం ఇజ్రాయెల్-అమెరికా దళాలకు పెద్ద సవాలుగా మారింది. ఇరాన్ క్షిపణి వ్యవస్థలు 90% నిర్వీర్యమైనట్లు అంచనా వేస్తున్నప్పటికీ, నిరంతరం కదిలే 'మొబైల్ లాంచర్లు' ఇప్పటికీ దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి. ఇరాన్ సులభంగా లొంగిపోయే అవకాశం తక్కువని, ఎందుకంటే వారు తమ ఆయుధ నిల్వలను మరియు పాలనా యంత్రాంగాన్ని ఇటువంటి విపత్కర పరిస్థితులను తట్టుకునేలా ముందే సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది.
గల్ఫ్ దేశాల ఆందోళనలు మరియు వ్యూహాత్మక మద్దతు:
ముఖ్యంగా ఇజ్రాయెల్ మరియు గల్ఫ్ దేశాలు—ఇరాన్ అణ్వాయుధ ప్రయోగం తమపైనే జరుగుతుందేమోనని తీవ్రంగా భయపడుతున్నాయి. ఈ యుద్ధం యొక్క ఆర్థిక భారాన్ని మోయడానికి సౌదీ అరేబియా, యూఏఈ (UAE) వంటి దేశాలు అమెరికాకు పూర్తిస్థాయిలో అండదండలు, అభయం ఇచ్చాయని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. యుద్ధం ఇంతవరకు వచ్చాక, ఇరాన్ నాయకత్వాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయకుండా వెనక్కి తగ్గితే.. రేపు ఇరాన్ తమనే లక్ష్యంగా చేసుకుంటుందనే భయాందోళనలు సౌదీ, యూఏఈలలో బలంగా ఉన్నాయి.
ఒక రకంగా చెప్పాలంటే, ఈ యుద్ధం గెలవాల్సిన అవసరం ఇజ్రాయెల్, అమెరికా కంటే ముందుగా సౌదీ అరేబియా, యూఏఈలకే ఉన్నట్లు కనిపిస్తోంది. సౌదీ అరేబియా మరియు యూఏఈ (UAE) దేశాలకు చెందిన దాదాపు 20 ట్రిలియన్ డాలర్ల నిధులు యూరప్ బ్యాంకుల్లో నిక్షిప్తమై ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, తమ ప్రాంతీయ ఉనికికి మరియు భద్రతకు ప్రధాన ముప్పుగా పరిణమించిన ఇరాన్‌ను అణచివేసేందుకు ఆ రెండు దేశాలు ఎంతటి భారీ వ్యయానికైనా సిద్ధంగా ఉన్నాయని, ఈ మేరకు అమెరికాపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయని కొందరు రాజకీయ విశ్లేషకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అందువల్ల ఏదో ఒక సాకుతో ఇరాన్ నాయకత్వాన్ని, వారి ఆయుధ సంపత్తిని పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేసేంత వరకు సౌదీ, యూఏఈ మరియు ఇజ్రాయెల్.. ఈ మూడు దేశాలు అమెరికాపై ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం పుష్కలంగా ఉంది.
సౌదీ-పాకిస్థాన్ సమీకరణాలు మరియు పాక్ దౌత్య వైఫల్యం:
సౌదీ-పాకిస్థాన్ రక్షణ ఒప్పందాల నేపథ్యంలో, ఇరాన్ విషయంలో పాకిస్థాన్‌పై సౌదీ ఒత్తిడి అధికంగా ఉందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఒకవైపు ఉత్తర సరిహద్దుల్లో తాలిబన్ల దాడులు కొనసాగుతుండగా, మరోవైపు పశ్చిమ దిశలో ఉన్న ఇరాన్‌తో ప్రత్యక్ష ఘర్షణకు దిగడం పాక్‌కు ఆత్మహత్యాసదృశమని ఆ దేశం భయపడుతోంది.
ఈ ఉద్రిక్తతల నడుమ, యుద్ధ శాంతి చర్చలకు తమ దేశం వేదికగా ఉంటుందని పాకిస్థాన్ ఘనంగా ప్రకటించుకుంది. అయితే అంతర్జాతీయ విశ్లేషకులు పాక్ పాత్రను పూర్తిగా కొట్టిపారేస్తున్నారు. "తగలబడుతున్న ఇంట్లో ఉన్నవాడు.. అయ్యా, దయచేసి నా ఇంట్లోని ఒక గదిలో మీరు సమావేశమై సంధి చేసుకోండి అని కోరితే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, పాక్ ప్రయత్నం కూడా అలాగే ఉంది" అని విశ్లేషకులు దెప్పిపొడుస్తున్నారు. తన సొంత దేశంలోని అంతర్గత భద్రతను, ఆర్థిక వ్యవస్థను కాపాడుకోలేని స్థితిలో ఉన్న పాకిస్థాన్, అంతర్జాతీయ స్థాయిలో మధ్యవర్తిత్వం వహించాలనుకోవడం ఆ దేశ అసహాయతకు నిదర్శనం. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరుగుతున్న ఇరాన్-అమెరికా చర్చలపై అంతర్జాతీయ మీడియాలో ఆసక్తికరమైన కథనాలు వస్తున్నాయి. ఈ చర్చల్లో కుర్చీలు, బల్లలు వేసి, చాయ్-సమోసాలు అందించడం మినహా... అగ్రరాజ్యాల మధ్య సయోధ్య కుదిర్చే విషయంలో పాకిస్థాన్ చేయగలిగేదేమీ లేదని సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పాకిస్థాన్ తన పాస్‌పోర్ట్ రెండవ పేజీలోనే 'ఈ పాస్‌పోర్ట్ ఇజ్రాయెల్ మినహా ప్రపంచంలోని అన్ని దేశాలకు చెల్లుతుంది' అని అధికారికంగా ఘనంగా ప్రకటించుకుంది. అంటే ఇజ్రాయెల్ ఉనికినే గుర్తించని అటువంటి కఠిన వైఖరి కలిగిన పాకిస్థాన్ గడ్డపై, శాంతి చర్చలకు ఇజ్రాయెల్ సుముఖత చూపకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఇస్లామాబాద్ వేదికగా జరిగే ఏ చర్చలైనా ఇజ్రాయెల్ దృష్టిలో కేవలం ఒక పక్షపాత ధోరణితో కూడినవిగానే కనిపిస్తాయి. పైగా పాకిస్థాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య అధికారిక రాయబార సంబంధాలు లేవు. అందుకే ఇజ్రాయెల్ తన భద్రత లేదా ప్రయోజనాల దృష్ట్యా పాక్ నిర్వహించే మధ్యవర్తిత్వానికి దూరంగా ఉంటుంది.
భారత దృక్పథం: వ్యూహాత్మక సమతుల్యత:
గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి మంది భారతీయులు నివసిస్తున్నారని అంచనా. వారు అక్కడి కీలక రంగాల్లో పనిచేస్తూ భారతీయ సాంస్కృతిక విలువలను ప్రతిబింబిస్తున్నారు. గల్ఫ్‌లోని ప్రవాస భారతీయుల ద్వారా వచ్చే 'రిమిటెన్స్' భారత ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన ఆదాయ వనరు. 2025లో ప్రవాస భారతీయుల నుండి భారత్‌కు వచ్చిన విదేశీ మారక ద్రవ్యం సుమారు $135 బిలియన్లుగా అంచనా వేయబడింది; అందులో దాదాపు $50 బిలియన్లు కేవలం గల్ఫ్ దేశాల నుండే రావడం గమనార్హం. భారత్ తన ఇంధన అవసరాల దృష్ట్యా ఇరాన్, సౌదీ అరేబియా, గల్ఫ్ వంటి దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తూనే, ఇజ్రాయెల్ మరియు అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకుంటోంది. ఈ "సమతుల్య వైఖరి"ని వాషింగ్టన్ కూడా నిశితంగా గమనిస్తోంది. నేడు సౌదీ సహా అనేక గల్ఫ్ దేశాలు భారతదేశాన్ని కేవలం ఒక ఆర్థిక భాగస్వామిగానే కాకుండా, 21వ శతాబ్దపు ఉధృతంగా ఎదుగుతున్న అగ్రశక్తిగా (Emerging Superpower) గుర్తిస్తున్నాయి.
యూఏఈ అధ్యక్షుడి భారత పర్యటన: ఒక 'క్రైసిస్ మేనేజ్‌మెంట్' విశ్లేషణ:
యూఏఈ (UAE) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఇటీవల భారతదేశానికి చేసిన అత్యవసర పర్యటనను పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో విశ్లేషకులు ఒక 'క్రైసిస్ మేనేజ్‌మెంట్' సందర్శనగా పేర్కొంటున్నారు. ఇది సాధారణ దౌత్య పర్యటన కాదు; ప్రాంతీయ అస్థిరత పెరుగుతున్న సమయంలో యూఏఈకి భారతదేశం ఒక స్థిరమైన, నమ్మదగిన మరియు వ్యూహాత్మక భాగస్వామిగా కనిపిస్తోంది.
మొత్తం క్యాబినెట్‌ను వెంటబెట్టుకుని యూఏఈ అధ్యక్షుడు జరిపిన ఈ పర్యటన, అత్యవసర నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను సూచిస్తుంది. దీనికి ప్రధాన కారణాలు:
- బహుముఖ చర్చలు: రక్షణ, ఇంధన భద్రత, వాణిజ్యం మరియు దౌత్యం వంటి కీలక అంశాలన్నింటినీ ఒకేసారి చర్చించాల్సిన అవసరం ఏర్పడటం.
- తక్షణ నిర్ణయాధికారం: ప్రతి శాఖా మంత్రి సమక్షంలో చర్చలు జరపడం వల్ల తక్షణమే నిర్ణయాలు తీసుకోవచ్చు; స్వదేశానికి తిరిగి వెళ్లి ఆమోదాల కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదు.
యూఏఈ-భారత్ వాణిజ్య సంబంధాలు ఇప్పటికే $100 బిలియన్ల స్థాయికి చేరుకున్నాయి. ఈ వేగాన్ని కొనసాగించడానికి ఇటువంటి ఉన్నత స్థాయి సమన్వయం తప్పనిసరి. ఇరాన్ యుద్ధాన్ని ముందస్తుగా ఊహించి, ఆహార భద్రత మరియు రక్షణ సహకారం కోసం యూఏఈ అధ్యక్షుడు ఈ ఆకస్మిక పర్యటన జరిపి ఉంటారని అంతర్జాతీయ విశ్లేషకులు ఇప్పుడు గట్టిగా భావిస్తున్నారు.
ప్రవాస భారతీయుల ఆందోళనలు
అమెరికా, యూరప్ మరియు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయులు ఇరాన్ యుద్ధ పరిణామాలను అత్యంత ఆందోళనతో గమనిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రత ఇప్పుడు ప్రధానాంశంగా మారింది. ముఖ్యంగా 'హోర్ముజ్ జలసంధి' (Strait of Hormuz) వద్ద నెలకొన్న అస్థిరత విమానయాన మరియు సముద్ర రవాణా మార్గాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని వారు భావిస్తున్నారు.
మరోవైపు, అమెరికాలోని ప్రవాస భారతీయులు ఈ యుద్ధాన్ని అక్కడి అంతర్గత రాజకీయాలతో ముడిపెట్టి చూస్తున్నారు. 2026 మధ్యంతర ఎన్నికల సంవత్సరం కావడంతో, విదేశాంగ నిర్ణయాలు రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకోబడుతున్నాయని కొందరి వాదన. యుద్ధం గనుక మరింత ముదిరితే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందని, ద్రవ్యోల్బణం మరియు ఇంధన ధరలు ఆకాశాన్నంటుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగాలు మరియు టెక్ రంగంపై ప్రభావం
అమెరికాలోని భారతీయులలో మెజారిటీ వర్గం టెక్ రంగంలోనే పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అస్థిరత పెరిగితే, కంపెనీలు కొత్త నియామకాలను నిలిపివేయడం లేదా నెమ్మదింపజేయడం సహజం. దీనివల్ల ఉద్యోగ కోతలు రావచ్చనే ఆందోళన ప్రవాసుల్లో నెలకొంది. ఇప్పటికే అనేక కంపెనీలు 'హైరింగ్ ఫ్రీజ్' ప్రకటించి, కేవలం అత్యవసర విభాగాల్లోనే నియామకాలు చేపడుతున్నాయి. అదనంగా, ఈ ఉద్రిక్తతల వల్ల హెచ్-1బీ మరియు గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ వంటి వీసా ప్రక్రియలు కూడా నెమ్మదించే అవకాశం ఉంది. మార్కెట్ అనిశ్చితి కారణంగా టెక్ సంస్థలు ఇప్పుడు కేవలం 'క్రిటికల్ రోల్స్'కే ప్రాధాన్యత ఇస్తున్నాయి.
ఇంధన ధరలు మరియు జీవన వ్యయం:
యుద్ధం మరింత ముదిరితే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం ఖాయం, ఇది సామాన్య కుటుంబాలపై అదనపు భారంగా మారుతుంది. గల్ఫ్ దేశాలు, అమెరికా, కెనడా మరియు యూరప్‌లో నివసించే ప్రవాస భారతీయుల రోజువారీ ఖర్చులపై పెట్రోల్-డీజిల్ ధరల పెరుగుదల నేరుగా ప్రభావం చూపుతోంది. ఉదాహరణకు, కాలిఫోర్నియాలో గతంలో గ్యాలన్‌కు సుమారు $4 ఉండే పెట్రోల్ ధర, యుద్ధ ప్రభావంతో ప్రస్తుతం సుమారు $5కు చేరింది. ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) ఉన్నవారికి ఇంధన ధరల ప్రభావం నేరుగా తక్కువగా ఉన్నప్పటికీ, సరుకు రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి మధ్యతరగతి కుటుంబాలకు జీవన వ్యయం భారంగా మారుతోంది.
అమెరికా విదేశాంగ విధానంపై ప్రవాస భారతీయుల అభిప్రాయాలు
ప్రస్తుత ఇరాన్ యుద్ధ పరిణామాలపై ప్రవాస భారతీయులలో ప్రధానంగా మూడు రకాల దృక్పథాలు కనిపిస్తున్నాయి:
- సమర్థకులు: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త చర్యలు మధ్యప్రాచ్యంలో దీర్ఘకాలిక స్థిరత్వానికి మరియు 47 ఏండ్లుగా ఇరాన్ అండతో చెలరేగిపోతున్న ఉగ్రవాద గుంపుల కుంభస్థలం నిర్మూలించడానికి ఇరాన్ పై యుద్ధం అవసరమని ఈ వర్గం భావిస్తోంది. భారత్ అనుసరిస్తున్న "సమతుల్య వైఖరి" ని వీరు సమర్థిస్తున్నారు. ప్రమాదాన్ని ముందుగానే ఊహించి చేసే ముందస్తు నిరోధక దాడులను (Pre-emptive Strikes) ఈ వర్గం బలంగా సమర్థిస్తుంది. ఈ వర్గంలోని అధిక శాతం మంది ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో రష్యా వైపు, అలాగే గాజాలో జరుగుతున్న హమాస్-ఇజ్రాయెల్ ఘర్షణలో ఇజ్రాయెల్ పక్షాన నిలుస్తున్నారు. వీరిలో సింహభాగం భారత నేపథ్యం ఉన్న అమెరికన్ రిపబ్లికన్లు అని చెప్పవచ్చు. భారతదేశ రక్షణ రంగంలో రష్యా మరియు ఇజ్రాయెల్ అందిస్తున్న వ్యూహాత్మక సహకారం వీరికి అత్యంత ప్రధానమైన అంశం. వీరు భారత ప్రభుత్వం అనుసరిస్తున్న "జాతీయ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం" అనే ధోరణిని పూర్తిస్థాయిలో సమర్థిస్తారు. ఉగ్ర దాడులకు పాల్పడేవారికి, వారి వెనుక ఉండి నడిపించే 'మాస్టర్ మైండ్లకు' మానవ హక్కులు మరియు అంతర్జాతీయ చట్టాల రక్షణలు వర్తించవనే విషయాన్ని వీరు తరచుగా నొక్కి చెబుతుంటారు.
- వ్యతిరేకులు: యుద్ధం అనవసరమని, ఇది కేవలం అమెరికాలోని అంతర్గత రాజకీయ నాయకత్వం ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయమని వీరి వాదన. దీనివల్ల ప్రపంచ శాంతికి విఘాతం కలుగుతుందని వీరు ఆందోళన చెందుతున్నారు. భారతదేశం అనుసరిస్తున్న సమతుల్య విదేశాంగ విధానం పట్ల ప్రవాస భారతీయులలోని ఒక వర్గం అసంతృప్తితో ఉంది. ముఖ్యంగా అమెరికా చర్యలను విమర్శిస్తూ భారత్ స్పష్టమైన ప్రకటనలు చేయాలని, ఇరాన్ లేదా పాలస్తీనా వంటి పక్షాల వైపు నిలబడాలని వీరు ఆశిస్తున్నారు. ఈ వర్గంలోని అధిక శాతం మంది ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఉక్రెయిన్ వైపు, అలాగే గాజాలో జరుగుతున్న హమాస్-ఇజ్రాయెల్ ఘర్షణలో హమాస్ లేదా పాలస్తీనా పక్షాన నిలుస్తున్నారు. వీరిలో సింహభాగం భారత నేపథ్యం ఉన్న అమెరికన్ డెమోక్రాట్లు అని చెప్పవచ్చు. భారతదేశ రక్షణ రంగంలో రష్యా మరియు ఇజ్రాయెల్ అందిస్తున్న వ్యూహాత్మక సహకారం వీరికి అప్రధానమైన అంశం. వీరు కేవలం మానవ హక్కులు మరియు అంతర్జాతీయ చట్టాల కోణంలోనే విదేశాంగ విధానాన్ని విశ్లేషిస్తూ, భారత ప్రభుత్వం అనుసరిస్తున్న "జాతీయ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం" అనే ధోరణిని తరచుగా విమర్శిస్తుంటారు.
- తటస్థులు: భారత్ అనుసరిస్తున్న "సమతుల్య వైఖరి" ని వీరు సమర్థిస్తున్నారు. అమెరికా కూడా కేవలం సైనిక చర్యలకే పరిమితం కాకుండా, దౌత్యపరమైన దూరదృష్టిని ప్రదర్శించాలని వీరు కోరుకుంటున్నారు.
అయితే, ఈ మూడు వర్గాలూ ఏకీభవిస్తున్న ఒక ప్రధాన అంశం ఏమిటంటే—ఇరాన్‌తో పెద్ద ఎత్తున ప్రత్యక్ష యుద్ధం చేయడం వల్ల అమెరికాకే ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. తక్షణ వ్యూహాత్మక ప్రయోజనం ఇజ్రాయెల్ మరియు సౌదీ -గల్ఫ్ దేశాలకు లభించినప్పటికీ, అమెరికాకు దీర్ఘకాలిక ఆర్థిక మరియు సైనిక భారాలు తప్పకపోవచ్చు. అదే సమయంలో, ఒకవేళ ఈ యుద్ధం వల్ల ఇరాన్ నాయకత్వంలో మార్పు వస్తే.. అక్కడ అంతర్గత సంస్కరణలు, మానవ హక్కుల పునరుద్ధరణ మరియు మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెరగడం వంటి సానుకూల పరిణామాలు సంభవించే అవకాశం ఉందని వీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రవాస భారత కుటుంబాలపై మానసిక ఒత్తిడి
ఇరాన్ క్షిపణులు మరియు డ్రోన్లు గల్ఫ్ ప్రాంతంలోని పౌర నివాస ప్రాంతాలపై పడటం వల్ల, అక్కడ పనిచేస్తున్న భారతీయుల భద్రతపై భారతదేశంలోని వారి కుటుంబాల్లో ఆందోళన పెరిగింది. స్వదేశంలో ఉన్న తల్లిదండ్రులు, బంధువులు.. గల్ఫ్, యూరప్ మరియు అమెరికాలో ఉన్న తమ వారి క్షేమం గురించి నిరంతరం ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ప్రవాస భారత కుటుంబాలను వేధిస్తున్న ప్రధాన ప్రశ్నలు ఇవే:
- యుద్ధం మరింత విస్తరిస్తే అంతర్జాతీయ ప్రయాణాలపై ప్రభావం ఉంటుందా?
- వీసా లేదా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలు నిలిచిపోతాయా?
- మధ్యప్రాచ్యంలో ఉన్న మా బంధువుల ప్రాణాలకు ముప్పు ఉందా?
- మా ఉద్యోగ భద్రతకు గ్యారంటీ ఉందా?
రోజుకో మలుపు తిరుగుతున్న ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో ఈ ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలు కనుగొనడం దాదాపు అసాధ్యంగా మారింది.
శాన్ డియాగో నేవీ బేస్ పుకార్లు: డియాగో గార్సియా ఉదంతం
అమెరికాలోని శాన్ డియాగో (San Diego) నేవీ బేస్‌పై ఇరాన్ దాడి చేయబోతోందన్న ఎఫ్‌బీఐ (FBI) హెచ్చరిక మార్చి 11 న మీడియాలో పెను సంచలనం సృష్టించింది. కాలిఫోర్నియా దక్షిణ భాగంలో ఉన్న శాన్ డియాగో నగరానికి సమీపంలోనే లాస్ ఏంజెల్స్, హాలీవుడ్ వంటి కీలక ప్రాంతాలు ఉన్నాయి. ఈ వార్తతో అక్కడ నివసించే ప్రవాస భారతీయులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ముఖ్యంగా అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ భార్య ఉషా చివుకుల కుటుంబానికి శాన్ డియాగోతో సంబంధం ఉండటంతో ఈ వార్తకు మరింత ప్రాధాన్యత లభించింది.
అయితే, తదుపరి విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇరాన్ లక్ష్యంగా చేసుకున్నది అమెరికాలోని 'శాన్ డియాగో' నగరాన్ని కాదు, హిందూ మహాసముద్రంలోని 'డియాగో గార్సియా' (Diego Garcia) దీవిలో ఉన్న అమెరికా-బ్రిటిష్ సైనిక స్థావరాన్ని. "డియాగో" అనే పేరులో ఉన్న సారూప్యత వల్ల శాన్ డియాగోతో ముడిపెట్టి పుకార్లు వ్యాపించాయి. పది రోజుల తరువాత 2026 మార్చి 21న ఇరాన్ 'డియాగో గార్సియా' ద్వీపం పై రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వాటిలో ఒకటి విఫలం కాగా, రెండో దానిని అమెరికా రక్షణ వ్యవస్థలు గాలిలోనే అడ్డుకున్నాయి. ఈ దాడి వల్ల ఎటువంటి నష్టం జరగనప్పటికీ, పుకార్ల వల్ల కలిగిన మానసిక ఒత్తిడి మాత్రం ప్రవాసులను వెంటాడింది.
ఈ నెల 'రచ్చబండ' చర్చను ఇక్కడితో ముగిద్దాం. 'మాట వెండి.. మౌనం బంగారం' అన్నారు మన పెద్దలు. బహుశా చర్చ ముగిసిన తర్వాత, విన్న విషయాలను నిశ్శబ్దంగా మననం చేసుకుంటూ అంతర్మథనం చెందాలన్నదే వారి ఉద్దేశ్యం కావచ్చు. ఈ సంచిక 'వెండి' లాంటి మాటలతో సాగింది, వచ్చే నెల 'బంగారం' లాంటి మౌనం నుండి పుట్టే మరిన్ని లోతైన విశ్లేషణలతో మీ ముందుకు వచ్చే కార్యక్రమం ఉంది. వచ్చే సంచికలో, ఎడతెగని యుద్ధ మేఘాలు, కాల్పుల విరమణపై నెలకొన్న అనిశ్చితి, ఇరాన్ యుద్ధ పరిణామాలు భారత్‌కు నేర్పిన పాఠాలేమిటి? అంతర్జాతీయ వేదికపై భారత్ అనుసరించాల్సిన వ్యూహం ఏమిటి? భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను మనం ఎలా అంచనా వేయాలి? వంటి కీలక అంశాలను సమగ్రంగా చర్చిద్దాం. ఈ సందర్భంగా 'సిరిమల్లె' పాఠకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ నెల రచ్చబండ అంశంపై మీ అభిప్రాయాలను తప్పకుండా క్రింద ఉన్న కామెంట్ బాక్స్‌లో పంచుకోండి. వచ్చే నెల ఈ చర్చా కొనసాగింపుతో మళ్లీ కలుద్దాం మిత్రులారా!
నమస్కారములతో, మీ వెంకట్ నాగం.