దక్షిణ ఆఫ్రికా నాటాల్ లో స్థిర నివాసం
నాటాల్ అసెంబ్లీలో 1894 మే నెలలో ప్రవేశపెట్టబడిన బిల్లు చట్టంగా మారుతుందని గాంధీజీతో పాటు నాటాల్ లో ఉన్న భారతీయులకు ముందే తెలుసు. వారు భావించినట్లే జులై లో చట్టంగా మారింది. కానీ మొదటి వారంలో బిల్లుకు అనుకూలంగా అధిక ఓట్లు వచ్చాయి కాబట్టి, అది గవర్నర్ సంతకంతో వెంటనే చట్టం అయి భారత ప్రజాసంఘానికి ఒక క్రొత్త ఉద్యమం తెరతీయటానికి జీవం పోసింది. ఫలితంగా అందరూ ఒక త్రాటిమీద నిలబడి తమకు జరిగిన దురన్యాయాన్ని ఎదిరించి రాజకీయ, ఓటు హక్కులను పొందటం అత్యవసరమని భావించారు.
ఈ సమయంలో ఇంగ్లండ్ లో లార్డ్ రిపన్ (Lord Ripon) బ్రిటన్ కాలనీలకు Secretary of State పదవిలో ఉన్నాడు. ఈయన 1880-1884 మధ్య భారత దేశంలో ఇంగ్లండ్ వైస్రాయి గా ఉన్నాడు. తరవాత కాలంలో ఈయన పేరు మీద చెన్నై కార్పొరేషన్ భవంతి నిర్మించబడింది (1909-1913). ఈ రిపన్ కు విజ్ఞాపనపత్రం సమర్పించాలని గాంధీజీ నాయకత్వంలో భారతీయులు నిర్ణయించారు. ఇది చిన్న విషయమేమి కాదు. ఒక్క రోజులో పూర్తి అయ్యేది కాదు. అందువల్ల అనేకమంది భారతీయులు స్వచ్చంద సేవకులుగా మారి, 15 రోజులు పాటు కష్టపడి తలా ఒక పని నిర్వహించారు.
ఆయన జీవితంలో జరిగిన మొట్టమొదటి మహా ప్రజాయజ్ఞాన్ని గాంధీజీ ఇలా వివరించారు:
“ఈ విజ్ఞాపన పత్రం తయారుచేయటానికి చాలా శ్రమపడ్డాం. మొదట దీనికి సంబంధించిన బిల్లులను, చట్టాలను, గ్రంధాలను చదివాను. నా వాదనకు కేంద్ర బిందువు న్యాయసూత్రం. దీనితో పాటు ఆవశ్యకత కూడా. భారతదేశంలో ప్రజా ఓటు హక్కు ఎలా ఉంటుందో అలాంటి హక్కు నాటాల్ లోని భారతీయులకు కూడా ఉండాలని నేను విజ్ఞాపనపత్రంలో పేర్కొన్నాను.
15 రోజులలో 10,000 సంతకాలు సేకరించాం. ఇటువంటి కార్యాలాపాలలో అనుభవం లేని వారితో ఈ కార్యాన్ని నిర్వర్తించటం అంత సులభమైన పనేమీ కాదు. అందువల్ల ఈ పనికి ప్రత్యేక వ్యక్తులను నియమించాం. సంతకం పెట్టే ప్రతి వ్యక్తి విజ్ఞాపనపత్రంలో ఉన్న విషయాలను పూర్తిగా అర్ధం చేసుకున్న తరవాతనే వారి సంతకం తీసుకోవాలని వీరిని ఆదేశించాను. నాటాల్ రాష్ట్రంలో ఒక ఊరికి మరొక ఊరికి చాలా దూరముంటుంది. కాని నియమించబడిన స్వచ్ఛంద సేవకులు అనేక వ్యయప్రయాసలను భరించి, అత్యుత్సాహంతో తమ కర్తవ్యాన్ని భరించారు. వీరిలో Seth Dawud Muhammad, Rustomji, Ada-mji Miyakhan, Amod Jiva అతి ముఖ్యులు. వీరు అత్యధిక సంతకాలు సేకరించారు.
సేథ్ అబ్దుల్లా తన వాహనం (Carriage) లో రోజంతా ప్రయాణించాడు. నిర్దేశించబడిన కార్యాన్ని సంతోషంతో నిర్వహించిన ఈయన, ఇతరులలో ఒక్కరు కూడా రోజువారీ ఖర్చులకు పైకం ఇవ్వమని నన్ను అడగలేదు. అబ్దుల్లా గృహం ఈ సంబంధిత పనికి కార్యాలయం అయింది. నాకు సహాయపడిన అనేక మంది విద్యావంతులు ఈయన గృహంలోనే భోజనాలు చేశారు. ఈ యజ్ఞంలో ప్రతి వ్యక్తి ఎంతో కొంత తమ స్వంత డబ్బును వినియోగించారు.
17 జూలై 1894 న ఈ విజ్ఞాపన పత్రాన్ని ‘లార్డ్ రిపన్’ కు పంపించాము. ఈ విజ్ఞాపన పత్రానికి 1,000 ప్రతులను అచ్చువేసి కొన్నిటిని నాటాల్, ఇంగ్లండ్ లో ఉన్న ప్రముఖ వ్యక్తులకు పంపించాము. మరికొన్ని ప్రతులను ఇంగ్లండ్, భారత్ లోని ముఖ్య దినపత్రికలకు, ప్రచారకర్తలకు పంపించాము. వీటి ద్వారా నాటాల్ లోని భారతీయులు ఎటువంటి దయనీయమైన పరిస్థితులలో జీవిస్తున్నారో ప్రపంచానికి తెలియజేయటానికి వీలయింది.
భారతావనిలో ప్రచురించబడే Times of India ఈ విజ్ఞాన పత్రాన్ని ప్రచురించి, తమ మద్దతు తెలియజేస్తూ ఒక వ్యాసం కూడా ప్రచురించింది. అలాగే లండన్ లోని London Times మా హక్కుల పోరాటాన్ని సమర్ధించింది. ఈ పరిణామం మాలో ఉత్సాహం నింపింది.
ఈ విజ్ఞాపనను లార్డ్ రిప్పన్ మన్నించి మాకు విజయం చేకూర్చారు. కాని ఈ తొలి విజయం ఆ తరువాత మాకు అపజయాన్ని మిగిల్చింది.
ఇటువంటి పరిస్థితులలో నేను నాటాల్ వదలి భారత్ కు తిరిగివెళ్ళటం అసంభవమని అర్ధమయింది. ఇచ్చటి స్నేహితులందరు నన్ను అన్నివైపులా చుట్టుముట్టి ఇక్కడే శాశ్వతంగా ఉండమని విన్నవించారు, అభ్యర్ధించారు, కోరారు. నాకు ఉన్న కష్టాలను, నేనున్న పరిస్థితులను వారికి వివరించాను. ప్రజల ఖర్చుమీద నేను ఇచ్చట ఉండకూడదని అంతకుముందే నిశ్చయించుకున్నాను. నేను స్వతంత్రంగానే నా కుటుంబాన్ని నిర్వహించదలచుకున్నాను. ఒక మంచి ప్రదేశంలో ఇల్లు చూసుకుని అందులో నివసించాలని నిర్ణయించాను. అందులో నా కుటుంబం జీవించటానికి 300 పౌండ్లు కావాలి. అందువల్ల ఇచ్చట ఉన్న భారతీయులు తమ కోర్టుకేసులను నాకు ఇస్తే వీటి ద్వారా వచ్చే ప్రతిఫలం (ఫీజులు) తో నా కుటుంబం నడపవచ్చని తోచింది. ఈ విషయం నా మిత్రులకు చెప్పాను.
దీనికి వారు ‘మీరు ఇప్పుడు చేసే ప్రజాసంబంధిత కార్యానికి డబ్బు వసూలు చేసి ఇవ్వగలం. మీరు మా కోర్టు కేసులద్వారా వచ్చే ఫీజులతో పాటు ఈ మొత్తాన్ని కూడా ఇవ్వగలం’ అని అన్నారు.
దానికి నేను ‘ప్రజాసేవకు డబ్బు తీసుకోను. అసలు ఈ పనికి బారిష్టర్ ప్రావీణ్యం అవసరం లేదు. ఇందులో నేను నిర్వహించేది కేవలం మీకు తగిన సూచనలను ఇచ్చి, మిమ్ము ఒక దారిలో నడిపించటం. ఈ పనికి మీవద్దనుంచి ప్రతిఫలం ఎలా ఆశించగలను? కాని ఈ కార్యకలాపాలకు కొంత ఖర్చు అవుతుంది. దీనికి ఏటా 300 పౌండ్లు కావలసివస్తుంది’ అని సమాధానం ఇచ్చాను.
దీనికి వారు ‘మిమ్ములను మేము కొద్దిరోజులనుంచి చూస్తున్నాము. మీరు అనవసరంగా డబ్బు తీసుకోరు. మిమ్ములను ఇచ్చట ఉంచాలంటే మీ ఖర్చులకు డబ్బు సమకూర్చకూడదా’ అని ప్రశ్నించారు.
నా మీద ఉన్న ప్రేమ, ఉత్సాహం మిమ్ములను ఇలా మాట్లాడిస్తున్నాయి. ఇవి చాలా కాలం ఉంటాయని నేను ఎలా నమ్మను? నేను అప్పుడప్పుడు అవసరమైనప్పుడు నిఖచ్చిగా మాట్లాడతాను. అలా మాట్లాడినప్పుడు నామీద ఉన్న మీ వాత్సల్యం నిలుస్తుందో లేదో దేవుడికే తెలియాలి. ప్రజాసేవకు నేను జీతం తీసుకోను. మీరు నాకు కోర్టు కేసులు ఇస్తే చాలు. ఇది రానురాను ఒక క్లిష్టమైన సమస్యగా మారవచ్చు. ఎందుకంటే నేను శ్వేతజాతి బారిష్టర్ ను కాను. అందువల్ల కోర్టులు నన్ను ఎలా స్వీకరిస్తాయో తెలియదు. అదీ గాక నేను ఒక మంచి న్యాయవాదిగా నిలబడగలనా, లేదా అనే సంశయం మీకు ఉండవచ్చు. ఒకవేళ మీరు నన్ను మీ న్యాయవాదిగా నియమించుకుంటే మీకు నష్టం కలుగవచ్చు. ఈ పరిస్థితిలో మీరు ఫీజు ఇచ్చినా దానిని నేను ప్రజాసేవ వేతనంగానే పరిగణిస్తాను’ అని నా సంకోచాలు వారికి తెలియజేశాను.
ఈ చర్చ పర్యవసానంగా వెంటనే 20 మంది వ్యాపారస్తులు ముందుకు వచ్చి నన్ను తమ న్యాయవాదిగా నియమించుకున్నారు. సేథ్ దాదా అబ్దుల్లా వెంటనే నా నివాసానికి కావలసిన సామగ్రి, గృహోపకరణాలు కొని ఇచ్చాడు.”
వర్ణ వివక్షత
న్యాయస్థానంలో ఎల్లప్పుడూ కనిపించే గుర్తు త్రాసు. ఒక అంధ స్త్రీ పట్టుకున్న ఈ గుర్తు నిస్పక్షపాతానికి ప్రతీక. విధి ఆమెను అంధురాలిగా మార్చటానికి ఒక కారణం ఉంది. అది ఆమె ఒక వ్యక్తిని బాహ్యకోణం నుంచి గాక అంతర్గతకోణం నుంచి న్యాయ నిర్ణయం చేయటం.
కాని నాటాల్ న్యాయ సంఘం (Law Society of Natal) దీనికి విరుద్ధం. నా విషయంలో సంఘం తరచు నాటాల్ సర్వోన్నత న్యాయస్తానం (Supreme Court) చేత ఈ ముఖ్య సూత్రానికి విరుద్ధంగా తీర్పు నిప్పించి, తద్వారా ఈ త్రాసు నిస్పక్షపాతానికి ప్రతీక కాదని ఋజువు చేయాలని సంసిద్దమువుతూ ఉంటుంది.
గాంధీజీ సుప్రీం కోర్టులో న్యాయవాదిగా దరఖాస్తు ఇచ్చారు. దానితో బొంబాయి ఉన్నత న్యాయ స్థానం (High Court) లో తనకు ఉన్న సభ్యత్వం సర్టిఫికెట్ ను కూడా జతపరచారు. అలాగే ఇంగ్లీష్ భాషలో ఆయన ప్రవీణుడని బొంబాయికోర్టు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని కూడా జతపరచటం జరిగింది. ఆయన నడవడిక, ప్రవర్తన గురించి ఇద్దరు ప్రముఖులు ఇచ్చిన సర్టిఫికేట్లను కూడా ఇవ్వాలి. వీటిని యూరోపియన్ లు ఇస్తే విలువ ఎక్కువ. సేధ్ అబ్దుల్లా ధ్వారా పరిచయమైన ఇద్దరు బ్రిటిష్ వర్తకులు వీటిని ఇచ్చారు. ఈ దరఖాస్తు మొత్తం నాటాల్ న్యాయ సంఘం సభ్యుని ద్వారా పంపించాలి. దీనిని అటార్నీ జనరల్ Mr. Escombe కోర్టుకు సమర్పించాడు.
వెనువెంటనే నాటాల్ న్యాయసంఘం రంగంలోకి దిగి ఈ దరఖాస్తును వ్యతిరేకిస్తూ గాంధీజీకి ఒక పత్రం పంపించింది. అది పేర్కొన్న అ భ్యంతరాలలో ఒకటి గాంధీజీ ఇంగ్లీషు ప్రావీణ్యం గురించి ఇవ్వబడిన అసలు (original) సర్టిఫికేట్ ను జతపరచలేదని. కాని అంతర్లీనంగా ఉన్న అసలు అభ్యంతరం శ్వేతజాతికి చెందని వ్యక్తి న్యాయవాది కావటానికి ఈయన అనర్హుడు. వారి దృష్టిలో నాటాల్ అభివృద్ధి యూరోపియనుల వల్లే జరిగింది కాబట్టి న్యాయవాది వృత్తిలో కూడా వారి ఆధిపత్యమే ఉండాలి. శ్వేతేతరులు న్యాయవాదులు అయితే, క్రమక్రమంగా వారి సంఖ్యాబలం పెరిగి యూరోపియనుల ప్రభావం తగ్గి తద్వారా తమ అస్తిత్వం తగ్గిపోతుందని వారి భయం.