Menu Close
లేఖిని – కథా లోగిలి
సేకరణ, కూర్పు – అత్తలూరి విజయలక్ష్మి
వేసవి శెలవులు వద్దు బాబోయ్!
– జి.యస్. లక్ష్మి (గరిమెళ్ళ సుబ్బలక్ష్మి) –

“అమ్మా, ఆకలి…” స్వీటీ పిలుపు.

“అరగంట క్రితమే కదే టిఫిన్ తిన్నావూ?” రమ జవాబిచ్చింది.

“అది టిఫినాకలి…”

“ఓ అరగంటాగు… అన్నం పెట్టేస్తాను…”

“అది అన్నం ఆకలి…”

“మరి… ఇదేమాకలి?” విసుగ్గా నా గొంతు.

“ఇది ‘ఏదైనా’ ఆకలి…” స్వీటీ నవ్వుతూ ఇచ్చే జవాబు.

“ఏదైనా అంటే?”

“ఏదైనా అంటే ఏదైనానే!”

“ఇడ్లీ తింటావా?”

“అది టిఫిను కదా…”

“పులిహార ఉంది కాస్త తిను…”

“అబ్బా… పులిహార ఏదైనా ఎందుకౌతుందీ!”

“మరి ఏదైనా అంటే?”

“కాసేపు నోరు ఆడ్డానికమ్మా…” చెల్లెలికి సాయం వచ్చేడు బాబీ.

నీరసం వచ్చేసింది రమకి. పిండిమరలా ఈ నోరాడ్డం ఏమో కానీ, తనకి మటుకు అన్నిరకాలుగానూ నీరసం వచ్చేస్తోంది.

ఈ కరోనా మహమ్మారి వచ్చి ఎప్పుడైతే మనుషులందరూ ఇంట్లోనే ఉండి ఆఫీసు పనులూ, స్కూలు పనులూ కానిచ్చేస్తున్నారో అప్పటినుంచీ ఇంట్లో ఇల్లాళ్లకి అసలు ఖాళీ అంటూ లేకుండా పోయింది. అదే అలవాటుతో ఇప్పటికీ సెలవులు వచ్చేటప్పటికి అప్పటిలాగే అన్నీ అందించమంటున్నారు ఇంట్లోవాళ్ళు.

ఈ ‘ఏదైనా’ అన్న పదార్థానికి ఒక సమయం, సందర్భం అంటూ ఉండదు. పిల్లల మూడుని బట్టి ఆ ‘ఏదైనా’ స్వరూపం మారిపోతుంటుంది. ఒకసారి చిప్స్, ఇంకోసారి చాక్‌లెట్స్, మరోసారి జంతికలు, ఇంకోసారి చిక్కీ, ఇంకోసారి మసాలాపల్లీలు, అవి అయిన కాసేపటికే పాప్ కార్న్… ఇలా అది ఏ రూపమైనా పొందుతుంటుంది.

ఇదివరకు అంటే మగవాళ్ళు ఆఫీసులకీ, పిల్లలు స్కూళ్ళకీ సవ్యంగా సమయానికి వెళ్ళివచ్చే రోజుల్లో వారానికోసారి ఒక స్వీటూ, దాంతోపాటు జంతికలో, మిక్స్చరో చేసి పడేస్తే వారంరోజులూ నోరాడించడానికి సరిపోయేది. కానీ ఎప్పుడైతే అందరూ వాళ్ల వాళ్ళ పనులు ఇంట్లోంచే చేసుకోవడం మొదలెట్టేరో అప్పట్నించీ ఈ ‘ఏదైనా…’ అనే పదార్థం విశ్వరూపం దాల్చేసింది. ఆరారగా ఈ ‘ఏదైనా’లు అందిస్తూ, మధ్యే మధ్యే పానీయాలు సమర్పించుకుంటూ ఈ రెండేళ్ళనించీ ఇంటి ఇల్లాళ్ళ పని రెండింతలయింది. ఒకవేళ ఆ ఇల్లాలు కూడా ఉద్యోగిని అయిందంటే ఇంక ఆమె పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కే.

దానికితోడు అదేవిటో నలభీముల వారసులు కొందరు యూట్యూబులో రకరకాల కొత్త కొత్త వంటకాలు ఎలా చెయ్యాలో అప్లోడ్ చేసేస్తున్నారు. కొంతమంది పాతవంటలు కొత్తరకంగా చెయ్యడం చెపుతుంటే, ఇంకొంతమంది కొత్తవంటలు సులభంగా ఎలా చెయ్యాలో చూపిస్తున్నారు.

కొంతమంది ఆరోగ్యానికి ప్రాముఖ్యత నిస్తుంటే ఇంకొంతమంది రకరకాల రుచులని చూపెట్టి ఊరిస్తున్నారు. చాలా సులభంగా యూట్యూబ్ చూసే పిల్లలు అవన్నీ చూసి “ఇదిచెయ్యి, అది చెయ్యి” అంటూ వాళ్లమ్మల వెనకాల పడుతున్నారు.

అంతే కాకుండా వాట్సప్ గ్రూపులొకటి… స్నేహితుల గ్రూపులు, చుట్టాల గ్రూపులు, కేవలం వంటలు మాత్రమే చేసే గ్రూపులు ఇలా బోల్డు గ్రూపులు. వాటిలో రోజూ బ్రేక్‌ఫాస్ట్ దగ్గర్నించీ రాత్రి డిన్నర్ వరకూ అన్నీ ఫోటోలతో సహా అప్లోడ్ చేసెయ్యడం. అవి చూసి మిగిలినవాళ్ళు “ఆహా…ఓహో…” అంటూ పొగిడెయ్యడం… ఇవన్నీ చూస్తున్న ఇంట్లో మగాళ్ళూ, పిల్లలూ అలాంటి కొత్తరకాలు చెయ్యమంటూ ఇంటి ఇల్లాళ్ల వెనకాల పడడం చూస్తుంటే రమలాంటి మామూలు గృహిణి పరిస్థితి ఎవరితో చెప్పుకునేదీ!

ఆలోచిస్తున్న రమకి ఏడాదిక్రితం తన స్నేహితురాలు వందన చేసిన పని గుర్తొచ్చింది. అప్పుడు లాక్‌డౌన్ సమయంలో ఇలాగే ఇల్లాళ్ళందరూ ఇంట్లోవాళ్ళు కోరినవి చేసి పెట్టలేక, ఏం చెయ్యాలో తోచక కొట్టుకుంటుంటే అందరినీ కలిపి వందన ఒక జూమ్ మీటింగ్ పెట్టింది. ఆ జూమ్ మీటింగ్‌లో దీనికి ఒక పరిష్కారం సూచించింది.

అదేమిటంటే ఇల్లాళ్ళందరూ కలిసి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చదివిన సైంటిస్టులకి ఒక వినతిపత్రం సమర్పించాలి. ఆ వినతిపత్రంలో ఏముంటుందంటే వేరే గ్రహాలకి వెళ్ళే ఆస్ట్రోనాట్స్ వాళ్ళు తినడానికి బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కాప్స్యూల్స్‌లాగా మార్చుకుని తీసికెడతారు కదా… అలాగే ఇంట్లోవాళ్లకి కూడా వాళ్ళేదడిగితే అది, అన్నిరకాలూ కాప్స్యూల్ ఫార్మ్‌లోకి మారేలాగా రీసెర్చ్ చేసి, కంపెనీలకి ఆ ఫార్ములాలమ్మి, వాటిని అతి తొందరలో మార్కెట్‌లో ప్రవేశపెట్టేలా చూడమని. అలా మార్లెట్లోకి అన్ని రకాల తిండి పదార్థాలూ కాప్స్యూల్స్‌ లాగా వచ్చేస్తే హోల్‌సేల్‌గా కొనేసుకుంటే ఈ ‘ఏదైనా’ బాధ తప్పుతుందంది వందన. అందరికీ వందన చెప్పిన ఈ పరిష్కారం భలే నచ్చేసింది. దానికి తోడుగా కొంతమంది ఇంకొన్ని చేర్చేరు… అవి వరసగా…

1. కాప్స్యూల్ నోట్లో వేసుకోగానే ఆ పదార్థమే తింటున్న రుచి నాలుకకి తగలాలి.
2. కాప్స్యూల్ నోట్లో పడగానే ఆ పదార్థం వాసన ముక్కుకి తగలాలి.
3. కళ్ళకి ఆ పదార్థమే తింటున్నట్టు కనపడాలి.

పైవన్నీ జరిగినట్లు కళ్ళూ, ముక్కూ, నాలుకా మెదడుకి సంకేతాలు పంపించాలి. అప్పుడు ఆ తిన్న మనిషి తృప్తి పడినట్టు కడుపులోంచి తేనుపు రావాలి.

అంటే ఇడ్లీ కాప్స్యూల్, పచ్చడి కాప్స్యూల్, సాంబార్ కాప్స్యూల్ కనక వేసుకుంటే నాలుకకి వాటి రుచీ, ముక్కుకి సాంబార్ వాసనా వచ్చి, అవి వేసుకోగానే కడుపులోంచి ఇడ్లీ, సాంబార్ తిన్నట్టు తేనుపు రావాలంటూ అందరూ ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికి వచ్చేసేరు.

వెంటనే వినతిపత్రం తయారుచేసి, దానిమీద వెయ్యిమందికి పైదాకా గృహిణుల సంతకాలు సేకరించి, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డైరెక్టర్ ప్రవీణ్‌గారికి స్వయంగా వెళ్ళి అందించేరు గృహిణులందరూ. ఆ డైరక్టరుగారు ఎంత మంచివారో… వీరి వినతిని తొందరలోనే పరిశీలిస్తామని హామీ ఇచ్చేరు.

ఏడాది దాటిపోయింది… మళ్ళీ వేసవి సెలవులు కూడా వచ్చేసేయి. ఆ న్యూట్రిషన్ ఆఫీసునుంచి కబురూ, కాకరకాయా లేదు.

రమా, వందనా మరో పదిమంది గృహిణులూ కలిసి వాళ్ళ వినతిపత్రం సంగతి ఏమయిందో కనుక్కుందామని ఆ ఆఫీసుకి వెళ్ళి ప్రవీణ్‌గారిని కలిసేరు.

ఆయన ఎంతో ఆదరంగా వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడేరు.

“మీరు అడిగినవన్నీ చెయ్యడానికి కాప్సూల్స్ లాంటివి సరిపోవండీ.. అవన్నీ చెయ్యడానికి ఏకంగా రోబోనే కనిపెట్టాలి…” అన్నారాయన.

“అదేంటీ!”

“అదే మరి… మీరు వినతిపత్రంలో చెప్పినవి చెప్పినట్టు అవాలంటే అవన్నీ లాబ్‌లో అవవు. వాటికోసం అవన్నీ చేసే చేసే రోబోని సృష్టించాలి. అదెలా ఉండాలంటే దేవుడు ప్రతి ఇంట్లో తనుండలేక అమ్మని సృష్టించనట్టు ఆ రోబోని సృష్టించాలి. అది మావల్ల కాదండీ.” అంటూ చేతు లెత్తేసేరాయన.

తెల్లబోయి చూస్తున్న రమా వాళ్ళని చూసి ఇంకా ఇలా అన్నారు. “అంతేకాదు… ఆఖరికి ఎంత బాగా చేసారనుకున్నా సైంటిస్టులు అమ్మలాంటి రోబోను మటుకు చెయ్యలేరు. అది ఆ ఒక్క దేవుడికే సాధ్యం.”

“హారి దేవుడా! ఎంత పని చేసేవయ్యా…” అసంకల్పితంగా రమ నోట ఆ మాట వచ్చేసింది.

రమ మాట విన్న ఆ డైరెక్టర్ గారు, “అలా ఎందుకనుకోవాలీ! మిమ్మల్ని తన అంశగా చేసి, ప్రతి ఇంట్లోనూ ఒక అమ్మను సృష్టించిన ఆ దేవుడికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకోవాలి మీరు.” అన్నారు.

తమందరినీ అంతగా పొగిడేస్తున్న ఆ డైరెక్టరుగారికి నమస్కారం చెప్పుకుని, “అయితే ఈసారి వినతిపత్రం నేరుగా ఆ దేవుడికే ఇచ్చుకుంటాం.” అంది వందన.

“ఏమనీ!” ఆసక్తిగా అడిగారాయన ముందుకు వంగి.

“ఓ దేవుడా… తొందరలో మళ్ళీ స్కూళ్ళు తెరిచేలా చూడవయ్యా… అని”

ఫక్కున నవ్వారాయన.

********

Posted in May 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *