Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర

శ్రీనాథుని కావ్యాలు

చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడు
      రచయించి తిమరుత్తరాట్చరిత్ర
నూనూగు మీసాల నూత్న యౌవనమున
      శాలివాహన సప్త శతి నొడివితి
సంతరించితి నిండు జవ్వనమున
      శ్రీ హర్ష నైషధకావ్య మాంధ్రభాష
ప్రౌఢ నిర్భర వయః పరిపాకమున
      గొనియాడితి భీమ నాయకుని మహిమ.

ప్రాయమెంతయు మిగుల గైవాలకుండ
కాశికా ఖండమను మహా గ్రంధమేను
తెనుగు జేసెద కర్ణాట దేశ కటక
పద్మ వనహేళి శ్రీనాథ భట్ట సుకవి!!
(శ్రీనాథుని కాశీ ఖండం – 1-7)

శ్రీనాథుడు పైన చెప్పిన కావ్యాలే గాకుండా మరికొన్ని గ్రంథాలు కూడా వ్రాశాడు. అవి లభ్యం కాలేదు. అవి:

1. నందనందన చరిత్ర, 2. వల్లభాభ్యుదయము, 3. కామశాస్త్రం, ధనంజయ విజయము.

శ్రీనాథుడు విద్యాధికారిగా పద్దెనిమిది సంవత్సరాలు కొండవీటి రెడ్డి రాజ్యంలో ఉన్నాడు. కానీ శ్రీనాథుడు విద్యాధికారిగా ఉన్నప్పటికీ ఏ కావ్యము వ్రాయకుండా చాటువులు, శాసనాలు వ్రాస్తుండడం కొంత ఆశ్చర్యకరమైన విషయమే అని అన్నారు ఆరుద్ర. బహుశా మనకు దొరకకుండా గ్రంథాలేవైనా వ్రాసి ఉండవచ్చని నా అభిప్రాయం. అంతటి మహా కవి గంటం కదలిక లేకుండా అన్ని సంవత్సరాలు ఉంటుందా?

1. మరుత్తరాట్చరిత్ర

ఈ కావ్యాన్ని శ్రీనాథుడు తన 14 వ ఏట రచించాడు. ఇందులో ఉన్న నాటకీయత శ్రీనాథునికి నచ్చింది. ఈ కావ్యానికి మూల కావ్యం అంటూ ఉన్నట్టు లేదు. అందుకే ఆరుద్ర ఇలా అన్నారు. ‘ఏ ఒక్క కావ్యం లోనూ ఇంత సూటిగా లేదు’ అంటూ ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క కథ ఉన్నదని, ఆ కథలన్నీ చదివి ఉత్తేజితుడై శ్రీనాథుడు రసవత్తరమైన పద్యకావ్యంగా రచించినట్లు మరుత్తరాట్చరిత్ర ను గూర్చి తెల్పి అందలి కథా విధానమంతా వివరించారు.

ఈ మరుత్తరాట్చరిత్ర లో నాయకుని పేరు అవీక్షుతుడు. చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు రచించినా శ్రీనాథుడు ఈ కావ్యాన్ని రసవత్తరంగా వ్రాశాడు. కొండవీటి రాజు అనవేమారెడ్డి కి మహాసేనాని అయిన మామిడి పెద్దన కుమారుడైన మామిడి వేమనకు అంకిత మిచ్చినట్లు వేమన తమ్ముడు సింగన పద్యం వల్ల తెలుస్తున్నదని ఆరుద్ర తెల్పారు.

2. గాథా సప్త శతి (ప్రాకృత గ్రంథానికి తెలుగు అనువాదం)

“చిన్నారి పొన్నారి చిరుత కూకటి” శ్రీనాథుడు నూనూగు మీసాల నూత్న యౌవనములోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి గదా. అందుకే ‘శాలివాహన సప్తశతి’ ని రచించాడు. ఇది మూలంలో హాలుడు రచించిన ప్రాకృత గ్రంథం. దీనిని శ్రీనాథుడు తెనిగించాడు. ఇది పూర్తిగా దొరకలేదు. మూడు పద్యాలు మాత్రమే లభ్యమైనాయి.

అష్ట భాషా పాండిత్యం ఆ రోజుల్లో అవసరం. శ్రీనాథుడు అందుకే ప్రాకృతం నేర్చుకొన్నాడు. ఇందులోని శ్రీనాథుని ప్రసిద్ధమైన అనువాద పద్యం.

ముఘ మాసంబు పులివోలె మలయుచుండ
బచ్చడం బమ్ముకొన్నాడు పసరమునకు
ముదిత చన్నులు పొగలేని ముర్మురములు
చలికి నొరగోయి కేలుండు సైరికుండు

సైరికుడు అంటే రైతు. ఇతని ప్రవర్తన ఇక్కడ సైనికునితో సమానంగా శ్రీనాథుడు ఊహించి రైతు మొదలైన పదాలు కాకుండా సైరికుడు అని వాడడం వల్లనే శ్రీనాథుడు మహాకవి అనిపించుకొన్నాడు. ఇక్కడ ముర్మురము అంటే కుంపటి. ఆమె వక్షస్థలం సెగ లేని కుంపటి అని కవి చమిత్కారం.

మాఘంలోచలిపులి మీద బడింది. కానీ అతనికి పశువులను కొనాల్సిన అవసరం వచ్చింది. అప్పుడతడు తను కప్పుకునే కంబళిని అమ్మి పశువులను కొన్నాడు. మరి చలిపులిని చంపేదెలా? అని అంటే తన అర్థాంగి వక్షోజాల వెచ్చదనమనే ఖడ్గంతో చలిపులిని తరిమేశాడట. కంబళి కన్నా అర్థాంగి సన్నిధి అతనికి వెచ్చదనాన్ని ఇచ్చిందని చమత్కారం. ఇలాంటివి శ్రీనాథుని లో వేలకు వేలున్నాయి. ఆరుద్ర దేనినైనా వివరంగా వ్రాయనిదే వదలడు. సమగ్ర ఆంద్ర సాహిత్యం చదివితే వాటి తియ్యదనం తెలుస్తుంది.

ఈ గాథా సప్తశతి జోలికి శ్రీనాథుని తర్వాత రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు తప్ప మరెవరూ పోలేదని ఆరుద్ర తెల్పారు. (స.ఆం.సా. పేజీ 687). క్రీడాభిరామం అనే పుస్తకంలో శ్రీనాథుని అనువాద పద్యాలు దొరుకుతాయి. పెదకోమటి వేమారెడ్డి గాథా సప్తశతి లోని నూరు (100) గాథలు తీసుకొని “సప్తశతీ సారం” అనే పేర మంచి టీక వ్రాశాడు.

శృంగార నైషధము

ఒక మహాకావ్యం ఉదయించడానికి పూర్వం రసహృదయులు, పండితులు అయిన రాజులుండేవారు. మామిడి పెద్దన మూడవ కుమారుడు సింగన పెదకోమటి వేముని ఆస్థానంలో మంత్రిగా ఉండేవాడు. యితడు సంస్కృతంలో దిట్ట. జ్యోతిష్యంలో గొప్పవాడు. జ్యోతిష్యంలో సిద్ధాంత భాగానికి వ్యాఖ్య వ్రాశాడు.

సింగనకు సంస్కృత కావ్యమైన శ్రీహర్షుని నైషదీయ చరిత్ర అంటే మహా యిష్టం. తనువు మరిచిపోయేవాడు. అందుకే శ్రీనాథుడు తన అనువాదంలో ఒక చోట సింగన యొక్క నైషధ కావ్య పఠనాసక్తిని గూర్చి “శ్రీ హర్ష సుకవి కవితా వ్యాహార కథా సుధా నాస్వాద సుఖ రంగ మామిడి సింగా” అని సంబోధించాడు.

నిరంతరం నైషధ పఠనావృత్తాన్నిగ్రోలే సింగన మంత్రి మిత్రుడైన శ్రీనాథుని చేత సంస్కృత నైషధాన్ని తెనిగించాలన్న నిర్ణయానికి వచ్చాడు. శ్రీనాథుని కి మించిన వారు లేరని సింగన తలచడానికి కారణం లేకపోలేదు. శ్రీనాథుడు వ్యాస వాల్మీకి, మయూర, భాసాదులను హర్షుని కాళిదాసుని మొదలైన సంస్కృత కవుల వాక్సుధా సముద్ర కెరటాలపై ఓలలాడిన కవిసార్వభౌముడు. అందుకే శృంగార శ్రీనాథుని చేత శృంగార నైషధాన్ని రచింప చెయ్యాలనుకొన్నాడు. అందుకే శ్రీనాథునితో “బ్రాహ్మీదత్త వరప్రసాదుడవు నీవు” అని శృంగార నైషధ మహా కావ్యాన్ని రచింప జేశాడు.

అనువాదం – ఆరుద్ర వివరణ క్లుప్తంగా:

శ్రీనాథుని శైలిని కొందరు పండితులు, కవులు ఆక్షేపించారు. దానికి కారణం లేకపోలేదు. గాఢ పాకమై (నారికేళపాకం) సంస్కృతంలో హర్ష మహాకవి రచించాడు. దీనిని తెనిగించే శ్రీనాథుడు కొన్ని చోట్ల ఆయువుపట్టు వంటి శ్లోకాలను యధాతథంగా తెనుగులోకి దింపి పద్యం చివర తెలుగు భాషలోని విభక్తులైన డు,ము,వు,లు తగిలించి దానిని తెనుగు పద్యమన్నాడు. అందుకు సంస్కృత కవులు ఆక్షేపించి ‘నీ డు,ము,వు,లు నీవు తీసుకొని మా నైషధాన్ని మాకివ్వు.’ అని చెప్పి శ్రీనాథుని అనువాద విధానాన్ని ఆక్షేపించారు. ఈ విషయాన్ని గూర్చి ఆరుద్ర రెండు పద్యాల వంటి శ్లోకాలను చూపించారు. ఉదాహరణకు ఒకటి “ప్రాతఃకాలము వాయసము....” అనే పద్యం. దీనిలో ఉన్న అర్థ కాఠిన్యం ఏవిటంటే కాకులయొక్క, కోకిలల యొక్క కూజితములు అందరికీ “కావ్, కావ్” అని “కుహూ, కుహూ” అని వినిపిస్తే మన కవిగారి చెవులకు కాకులు కౌః, కౌః అని అరిచినట్లు, కోకిలలు తుహి, తుహి అన్నట్లు వినబడ్డాయట. ఇందులో శ్రీనాథుడు గారు పాణినీయ వ్యాకరణాన్ని లోపలినుండి బయటకు తీశాడు. ఇది సామాన్యునికి జీర్ణమౌతుందా? అని పండితుల ప్రశ్న.

**** సశేషం ****

Posted in September 2023, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!