తెలుగు దోహాలు
- కవులు కలమును ఝుళిపిస్తే, మార్పు వచ్చు సంఘమున!
ఆత్మ బలమే యుండినచో, రాదు సమస్య బ్రతుకున! - స్వీయ సుఖము కావలెనంటె, భయమన్నది విడిచేయి!
పరుల సుఖము ఆశిస్తుంటె, స్వ సుఖాలను వదిలేయి! - ప్రపంచాన్ని మార్చ దలచిన, ముందు నీవు మారాలి,
దైవమునే చేరదలచిన, భక్తి బాట నడవాలి! - వంచన వదిలి పెడితేనే, మంచి యోచనలు కలుగు!
గతమును మరచి పోతేనే, బ్రతుకు సవ్యముగ జరుగు! - సాధువువలె బ్రతకాలంటె, కోరికలనే త్యజించు,
అణకువతో మెలిగినపుడే, పదుగురి మెప్పు లభించు. - దైవముచే లిఖించబడును, జరుగు భువిని వివాహము,
ఏడు జన్మల బంధనమును, విడదీయును కాగితము! - ఆలు మగల నడుమనెపుడు, తగదు అన్యుల జోక్యము,
అత్తా కోడలి సఖ్యతే, భువినియుండుట ముఖ్యము. - ఎల్లలు ఎరుగని ప్రేమకే, వసుధను ప్రతీక జనని,
అన్నా చెల్లెలు బంధమే, చెప్పదగునులె ఘనమని. - అందుచుండగ ఉచితములే, మించుచుండె బద్ధకము,
జీవన ఉపాధి దొరుకకే, నలిగె బడుగు జీవితము. - వెన్న దొంగ గోవిందుడే, నాథుడు విశ్వ మంతకు,
మన్ను తిన్న నోటనే, జగతిని చూపె యశోదకు.