ఆ రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర తండ్రి పక్కన రఘురామ్ కూర్చున్నాడు. స్రవంతి వచ్చి తాతయ్యకు రెండవ పక్కన కూర్చుంది. వెంటనే జగన్నాధం గారు స్రవంతిని వారించారు. "అమ్మలూ లే తల్లీ! అది జీవన్ చోటు. మా పరిచయం బలపడినప్పటినుండి అతడు ప్రతిరోజూ భోజనానికి అక్కడే కూరుచుంటున్నాడు. లేమ్మా!" అన్నారు.
స్రవంతి కుర్చీలో కూర్చున్నదల్లా గమ్మున లేచింది. జీవన్ కి అది సబబనిపించలేదు. అసలే అతడు, వాళ్ళమధ్య కూర్చుని తినడానికి మొహమాటపడుతున్నాడు.
చివరకి ఎంతో ఇబ్బంది పడుతూ అన్నాడు, "వద్దు తాతయ్యా! నాకిక్కడ బాగుంటుంది, నేనిక్కడే కూర్చుంటా" అంటూ వచ్చి రవి పక్కన కూర్చున్నాడు.
"నాల్గు రోజుల భాగ్యానికి ఇన్ని మార్పులెందుకు! ఎవరి చోటులో వాళ్ళు ఉండడం అందరికీ మంచిది కదాని అన్నాను" అన్నారు జగన్నాధ రావుగారు.
రజని రఘురామ్ వైపు కోపంగా చూసింది. రఘురామ్ మొహం ముడుచుకున్నాడు. మీనాక్షి వడ్డన ప్రారంభించింది. ఒక విధమైన బిగువు చోటుచేసుకుంది ఆ ప్రదేశంలో. అందరూ తలలు వంచుకుని మౌనంగా భోజనం చేయసాగారు.
జీవన్ కి అది చాలా బాధకలిగించింది. రోజూలా కబుర్లతో, జోకులతో, నవ్వులతో కాకుండా, ముక్తసరి మాటలతో ఆ రాత్రి భోజనాలు ఎలాగోలా ముగిశాయి. వంచిన తలెత్తకుండా ఎంతో ఇబ్బందిపడుతూ, తింటున్న జీవన్ని చూస్తూ, తను భోజనం పూర్తి చేసింది స్రవంతి.
"అయ్యో! ఈ రాత్రి ఎవరూ కడుపునిండా తిండి తినలేదు, వండినవి వండినట్లే మిగిలిపోయాయి. పెద్దాయన అలా అనకపోతే బాగుండేది" అనుకుంది మీనాక్షి బాధగా.
భోజనం ముగించి వెళ్లి పడక కుర్చీలో విశ్రాంతిగా కూర్చున్న జగన్నాధంగారికి, ఇవ్వాల్సిన మందులన్నీ ఇచ్చి, ఆయన పక్క దులిపి వేసి, రాత్రి దాహమైతే అందుబాటులో ఉండాలని, మంచం పక్కనున్న టీపాయ్ మీద మంచినీళ్ళతో ఉన్న సీసా ఉంచాడు జీవన్. అలా పెద్దాయన రాత్రి సుఖంగా నిద్రపోవడానికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తిచేశాక, ఇంకా తానూ అక్కడ ఉండడం మంచిపని కాదనీ, ఏదో ఒక సాకు చెప్పి తల్లితో కలిసి ఇంటికి వెళ్లిపోవడాం మంచిది - అనిపించింది జీవన్ కి.
"తాతయ్యా! ఇంటిదగ్గర పూర్తి చెయ్యాల్సిన పని ఒకటి ఉంది, అమ్మతో నేను కూడా ఇంటికి వెడతాను" అంటూ పెద్దాయన్ని సెలవడిగాడు.
జీవన్ పడుతున్న "టెన్షన్" ని అర్థం చేసుకున్న జగన్నాధం గారు వెంటనే అతనికి అనుమతి నిచ్చారు.
మీనాక్షి, తన భోజనం ముగించి, వంటిల్లు నీటుగా సద్ది, గ్లాసునిండా వెచ్చని పాలు తెచ్చి పెద్దాయనకు ఇచ్చి, సెలవు తీసుకుంది. తరువాత మీనాక్షి రజని దగ్గరకు వెళ్లి, "రేపు నేను వచ్చి కాఫీలు పెడతాను. ఎన్ని గంటలకు రమ్మంటారు" అని వినయంగా అడిగింది.
ఎవరి మీదనో, ఎందుకో - ఏమీ తెలియని ఉక్రోషంతో రగిలిపోతూ, మనసంతా నిండివున్న అశాంతితో చిరచిరలాడిపోతూ ఉందేమో, రజని పెద్దగా ఆలోచించకుండానే, "రోజూ వేళకే రండి. మరేం మెహర్భానీ అవసరం లేదు" అనేసింది.
మీనాక్షీ జీవన్ లు ఇంటికి వెళ్లిపోయారు. అప్పటికే నిద్రవేళ కావడంతో పెద్దాయన లేచి తన గదిలోకి నడిచారు. నిద్రపోడానికి వెడుతున్న తాతయ్య వెనకే ఆయన గదిలోకి వచ్చిoది మనుమరాలు స్రవంతి.
ఆమెను ప్రేమగా ఆహ్వానించారు ఆయన. “రామ్మా స్రవంతీ, రా! వచ్చి ఇలా మంచం మీద కూర్చో” అంటూ తను ఒక పక్కకు జరిగి ఆమెకు కూర్చోడానికి చోటిచ్చారు.
స్రవంతి కూర్చున్నాక ఆమె చేతిని తనచేతిలోకి తీసుకుని మృదువుగా పట్టుకున్నారు. కుశల ప్రశ్నలు అయ్యిన తరువాత అడిగింది స్రవంతి ...
“ఈ గ్రీకువీరుడు నీకు ఎక్కడ దొరికాడు తాతయ్యా!?”
“గ్రీకువీరుడా!” తాతయ్య ఆశ్చర్యపోయారు, “ఎవరమ్మా నీ ఆలోచనలను ఆక్రమించుకున్న ఆ రాకుమారుడు?” చిరునవ్వుతో మనుమరాలివైపు చూస్తూ అడిగారు జగన్నాధం గారు.
“అదే తాతయ్యా! దేముడు నీకు వరంగా ఇచ్చిన నీ మనుమడు! ఇందాకా మనతో కలిసి భోజనం చేశాడే – అతన్ని గురించే అడుగుతున్నా. అతడు నీకు ఎలా పరిచయమయ్యాడు? టాల్ గా, హాండ్సమ్ గా ఉన్న అతన్ని చూడగానే నాకు మ్యూజియం లో చూసిన పాలరాతి గ్రీకు వీరుడి శిల్పం గుర్తుకి రావడంతో అతనికి ఆ పేరు నిక్ నేమ్ గా పెట్టాను” అంది స్రవంతి ఉత్సాహంగా.
“ఇంతకీ అతడు నాకు ఎలా పరిచయంయ్యాడో చెప్పాలంటే మాత్రం చాలా పెద్దకథ ఉంది. టూకీగా చెపుతా విను” అంటూ జరిగినదంతా క్లుప్తంగా మనుమరాలికి చెప్పారు తాతయ్య.
ఆశ్చర్యపోయింది స్రవంతి. అతనికి అందమైన రూపమే కాకుండా అపురూపమైన మంచి బుద్ధి కూడా ఉoదన్నమాట - అనుకున్న స్రవంతికి అప్పటి కప్పుడు అతనిపై సద్భావం ఏర్పడిపోయింది. అంతేకాదు, తాతయ్యకు చివరి రోజుల్లో మంచి సహవాసం దొరికినందుకు ఆమె సంతోషించింది మనసులో.
“నిజం చెప్పాలంటే తల్లీ! ఈ జీవన్ నాకొక వరంలాగే దొరికాడమ్మా! నాకు జరిగిన యాక్సిడెంట్, నన్నీ అబ్బాయికి అప్పగించి నాకు మేలే చేసిందని చెప్పవచ్చు. అందుకే అంటారు భగవంతుడు ఏమిచేసినా మన మంచికే చేస్తాడు – అని. ఆసుపత్రినుండి ఇంటికి వచ్చాక నా అవసరాలన్నీ ఈ తల్లీకొడుకులే కనిపెట్టి చూస్తున్నారు. వీళ్ళు నన్నాదుకోకపోతే నేనేమయి పోయేవాడినో! బహుశా తిండికి మొహంవాచి, మాడి మాడి ప్రాణాలు వదిలేవాడినేమో! నాకు డబ్బుంది, కాని ఏం లాభం! మీ నాన్నమ్మ పోయాక ఒంతరితనంతో; చూసేవాళ్ళూ, చేసేవాళ్ళూ లేక మహా నరకం అనుభవిoచానంటే నమ్ము! ఇన్నాళ్ళకు ఆ దేవుడికి నాపై దయ కలిగింది” అన్నారు జగన్నాధంగారు.
“నిజమే తాతయ్యా! నాకూ అలాగే అనిపిస్తోంది. మేము నీకు చెయ్యలేని సాయం వాళ్ళు చేస్తున్నారు. అందుకు బదులుగా వాళ్లకి మనం ఏమిచ్చినా తక్కువే” అంది స్రవంతి.
మనుమరాలి మాటలు జగన్నాధంగారికి సంతోషాన్నిచ్చాయి. “అతడు నాకు ప్రాణదానం చెయ్యడమేకాదు, ఆ తరవాత సుఖంగా బ్రతికే దారి కూడా చూపించాడు. అలాంటి వాడిని నా ఆత్మీయుడనుకోవడం తప్పా!”
“ఎంతమాత్రం కాదు తాతయ్య! అయినవాళ్ళు కానివాళ్ళు అయినప్పుడు, కానివాళ్ళు అయినవాళ్ళు కావడంలో వింత ఏముంది? మనకు రక్త సంబంధీకులు కాకపోయినా, మనకోసం బాధ్యతగా శ్రమించే వాళ్ళను మనవాళ్ళు అనుకోడంలో తప్పులేదు. మనవాళ్ళు కాదనుకోడమే తప్పు - అనిపిస్తోంది నాకు తాతయ్యా!”
“టీనేజ్” అన్నది పాదరసం లాంటిది! ఆ వయసులో భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది. రాగ ద్వేషాలు కూడా ఉధృతమే ఆ వయసులో! జీవన్ ని గురించి పెద్దాయన చెప్పిన మాటలు కౌమారప్రాయంలో ఉన్న స్రవంతి హృదయం మీద చెరగని ముద్ర వేశాయి. జీవన్ పైన ఆమె కొకవిధమైన ఆరాధనా భావం ఏర్పడిపోయింది. అతనిని గురించి ఆమెకు ఇంకా ఇంకా వినాలన్న కోరిక ఉన్నా, తాతయ్యకు ఆవులింతలు రావడంతో సెలవు తీసుకోక తప్పలేదు.
“ఇంక నిద్రపో తాతయ్యా! గుడ్ నైట్” అంటూ లేచి, లేడి పిల్లలా చెంగున పరిగెత్తుకుంటూ అక్కడనుండి వెళ్ళిపోయింది స్రవంతి.
మనుమరాలి పరుగులో తాతయ్యకు సెలయేటి గల గలలు వినిపించాయి. చిరు దరహాసంతో ఆయన పెదవులు విచ్చుకున్నాయి. ప్రశాంతంగా పడుకుని కళ్ళు మూసుకున్నారు, వెంటనే ఆయనకు నిద్రపట్టేసింది.
* * ** * ** * ** * *
ఆ మరునాడు మామూలు వేళకు మెలకువ వచ్చింది జగన్నాధం గారికి. కాని రోజూలా కళ్ళు తెరిచేసరికి జీవన్ ఎదురుగా కనిపించలేదు. నెమ్మదిగా ఆయనకి అంతా గుర్తొచ్చింది, ఇంక ఆసరాకోసం ఎదురుచూడకుండా, నెమ్మదిగా చెయ్యీ కాలూ కూడదీసుకుని, మంచం దిగి, కర్ర ఆసరాగా చేసుకుని జాగ్రత్తగా బాత్రూమ్ వైపు నడిచారు ఆయన. నెమ్మదిగా తన పనులు తానే చేసుకోసాగారు. కాని అడుగడుగునా ఆయనకు జీవనే గుర్తుకి రాసాగాడు.
రోజూ తను కళ్ళు తెరవగానే “గుడ్ మార్నింగ్ తాతయ్యా!” అంటూ విష్ చేసి, చెయ్యాసరా ఇచ్చి పక్కపైనుoడి లేవదీసి, బ్రష్ మీద పేస్టు వేసి తన చేతికిచ్చి, తనను నీళ్ళ గదిలోకి పంపి తలుపు చేరవేసి, బయట తనకోసం కనిపెట్టుకుని ఉండేవాడు. దగ్గరుండి వీపురుద్దీ, చెంబుతో నీళ్ళు ముంచి చేతికిచ్చీ స్నానం చేయించేవాడు. తను స్నానం చేసి వచ్చేసరికి కట్టుకోవలసిన బట్టలు బయటికి తీసి ఇచ్చేవాడు. తను తయారై వచ్చి కుర్చీలో కూర్చోగానే పొగలుగక్కే ఉదయపు కాఫీ రెడీ గా ఉంచేవాడు. అప్పుడు పేపర్ లోని విశేష విషయాలు చదివి చెప్పేవాడు. మీనాక్షి వచ్చేవరకూ తనకు తోడుగా ఉండి, ఆమె తయారు చేసిన కాఫీ, టిఫిన్ తనతోపాటుగా తీసుకుని తను స్థిమితంగా టి. వీ. చూస్తూ కూర్చున్నాక, తన పనిమీద బయటికి వెళ్ళేవాడు.
“ఇవన్నీ పెద్దపెద్ద పనులు అయ్యినా, కాకపోయినా బాధ్యతకీ బంధానికీ గొప్ప గుర్తులవి. జీవన్ కి తాతయ్య మీదున్న ప్రేమకు నిదర్శనాలు” అనుకున్నారు మురిపెంగా జగన్నాధంగారు, జీవన్ ని తలుచుకుంటూ.
కాలకృత్యాలు తీర్చుకుని, నెమ్మదిగా వచ్చి పడకకుర్చీలో కూర్చున్న జగన్నాధంగారి దగ్గరకు వచ్చాడు కొడుకు రఘురాం. “ఎవడా అబ్బాయి నాన్నా? అలా దర్జాగా వచ్చి మనతోపాటు కూర్చుని భోజనం చెయ్యడానికి ఎంత ధైర్యం! ఆఫ్టరాల్ ఒక వంటమనిషి కొడుకు! అతడు మనకేమౌతాడని అంత గౌరవమిస్తున్నావు?”
జగన్నాధంగారు కొడుకు మొహంలోకి గుచ్చి చూశారు, “ఆ అబ్బాయి ఎవరని అడుగుతున్నావా? ఒక్క మాటలో చెప్పాలంటే అతడు నా ప్రాణదాత! అతడు నన్ను బస్సు కిందపడి ముక్కలుముక్కలై, కుక్కచావు చావకుండా రక్షించి, వెంటనే ముందు వెనుకలు ఆలోచించకుండా, తన చేతి డబ్బు ఖర్చుపెట్టి, వైద్యం చేయించి కాపాడిన ఘనుడు! నేను తిండికి మొహంవాచి, ఆకలికి అలమటించిపోతూంటే నాకు కమ్మని భోజనం దొరికే దారి చూపించిన అన్నదాత! అసలు సంగతి చెప్పాలంటే, నువ్వు నాకు చెయ్యవలసిన సేవలన్నీ ఆ అబ్బాయి నాకు చేస్తున్నాడు. నిజం చెప్పాలంటే అతన్ని ఎంత గౌరవిoచినా - అది తక్కువే ఔతుంది” అంటూ ఆయన కొడుకుమీద కంఠశోషగా కేకలుపెట్టారు.
రఘురాం కూడా ఊరుకోలేదు, తండ్రిమీద ఎదురుకేకలు పెట్టాడు. “తిoడి కంత ఇబ్బందైతే. కళ్ళల్లో ప్రాణాలుంచుకుని అలా రోడ్లవెంట తిరక్కపోతే ఈ వంటలక్కని అప్పుడే పెట్టుకోవచ్చుకదా... ఇంతోటి దానికీ ఇన్ని రంగులు పులమడం అవసరమంటావా?”
“అమ్మ పెట్టదు, అడుక్కు తిననీయదు - అన్నట్లుంది నీ వరస! ఈ వయసులో ఏపని చెయ్యాలన్నా సమర్ధత చాలదన్నది నీ కిప్పుడప్పుడే తెలియదు. నీకూ నా వయసు వచ్చినప్పుడుగాని నా బాధ నీకు అర్ధమవ్వదు. ఏ దేవుడి దయవల్లో నాకొక దారి దొరికింది, నన్నిలా బ్రతకనియ్యి. ఇక ఆ పిల్లాడి ఋణ మంటావా - అది నే నేమిచ్చినా తీరేది కాదు! ఇది నా అభిప్రాయం.”
“ఐతే నేను విన్నది నిజమేనన్న మాట! విల్లేదో రాశావుటగా?”
జగన్నాధంగారు విస్తుపోయారు. తను, సమయం వచ్చేవరకూ ఈ విల్లు విషయం ఎవరికీ తెలియకూడదని కట్టడి చేశారు. కానీ అది, ఎక్కడో దూరాన ఉన్న తన కొడుక్కి ఎలా తెలిసిందో ఆయనకి అర్థమవ్వలేదు.
ఆయన ఇంక బుకాయించదలుచుకోలేదు. “ఔను నిజమే! విల్లు రాశా. ఈ మాట నీకు ఎవరు చెప్పారు?”
“నా ఫ్రెండ్ రమేశ్! నీ లాయర్ ఫ్రండ్ రామేశంగారికి అసిస్టెంట్. మనుమడు, మనుమడు - అంటూ ఆస్తంతా రాసేశావా ఏమిటి? “
ఇంతవరకూ జగన్నాధంగారు ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఆఖరుకి జీవన్ కి కూడా! లాయరుకి రహస్యంగా ఉంచమని గట్టిగా చెప్పి ఉంచారు. కాని, లాయరు అసిస్టెంట్ ద్వారా ఈ వార్త, ఉత్తరదేశంలో ఉద్యోగం చేస్తున్న కొడుక్కి చేరిపోయింది. “కానియ్! ఎప్పుడో ఒకప్పుడు ఈ గడబిడ పడక తప్పదు కదా! అదేదో తొందరగా ఇప్పుడే వచ్చి పడింది, అంతే తేడా” అనుకుని మనసు సరిపెట్టుకునే ప్రయత్నంలో పడ్డారు ఆ పెద్దాయన.
“నేనేమైనా వెర్రాడినా ఏమిటి? నా స్వార్జితమైన ఈ ఇంటినిమాత్రమే నా అనంతరం నా ప్రాణదాతకు చెందేలా రాశాను. మీ తాత ఆస్తి మొత్తం నీకే ఉంటుందిలే. ఎంతైనా నువ్వు నాకు కొడుకువి కదా! నీ బాధ్యతలు నువ్వు మర్చిపోయినా, నా బాధ్యత నేను మర్చిపోలేదు. అతడిని మనుమడన్నానని వెక్కిరించనక్కరలేదు. నీ వయసు వాడైతే, కొడుకు బాధ్యతలను తలకెత్తుకున్న వాడిని కొడుకనే అనుకుందును. మరీ బొత్తిగా మనుమడి వయసువాడైపోయాడు. అందుకే మనుమడన్నాను.”
తండ్రి మాటలు విన్న రఘురాం మొహం వెలవెల బోయింది. పాలిపోయిన కొడుకు మొహం చూసి ఇన్నాళ్లకు ఒక మంచి “రిపార్టీ” ఇచ్చానని సంతోషించారు జగన్నాధంగారు.
“ఏదో పేపర్ కోసం ఫైళ్ళు వెతుకుతుంటే, రమేశ్ కి నీ విల్లు కనిపించిందిట. వెంటనే నాకు ఫోన్ చేశాడు. సంగతేదో తేల్చుకోవాలని వెంటనే సెలవుపెట్టి ఇలా వచ్చా. ఏదో ఎమోషన్లో ఆ విల్లురాసినా దానిని నువ్వు మార్చి రాయొచ్చు. ఒక మనిషి తన జీవితకాలంలో ఎన్నిసార్లైనా విల్లుని మార్చి మార్చి రాయొచ్చు. ఆ “కోన్ కిస్కా” గాడికి మన ఆస్తిని తేరగా ధారపోస్తానంటే నేను ఒప్పుకోను.
“అదా సంగతి! నువ్వింకా నాకు యాక్సిడెంటు అయ్యిందని - కొంచెం ఆలస్యంగానైనా - చూడడానికి వచ్చావనుకున్నా! ఎంత పొరపాటు … ఒకటి గుర్తుంచుకో - కన్న బిడ్డలు తమ బాధ్యతలు మరచిపోయినప్పుడు, వాటిని ఏమీ కానివాళ్ళు తలకెత్తుకుని ప్రేమగా నిర్వహించినప్పుడు వారసత్వపు హక్కుల్లో కూడా మార్పులు రాక తప్పదు. వాళ్ళ ఋణం కొంతైనా తీర్చుకోవాలి కదా!” అన్నారు జగన్నాధంగారు.
“అంత ఋణపడ్డట్లు అనిపిస్తే ఒక ఐదువేలో, పదివేలో చేతులో పెడితే సరిపోయేదిగా, లక్షల విలువైన ఆస్తులు రాసి ఇవ్వడం దేనికి?”
కొడుకలా నిలదీస్తూంటే జగన్నాధంగారు ఏమాత్రం తొణకలేదు. “నీ దృష్టిలో నా ప్రాణం అంత "చీపు" కావచ్చు, కాని నాకలా అనిపించలేదు. అయినా నా ప్రాణదాత ఋణం ఎలా తీర్చుకోవాలో నువ్వు నాకు చెప్పనక్కరలేదు. నేనేం చెయ్యాలో నాకు తెలుసు” అన్నారు ఆయన కొడుకువైపు నిరసనగా చూస్తూ.
ఉద్రేకపడడం వల్ల జగన్నాధం గారికి BP బాగా పెరిగిపోయింది. అంతలోనే గుండె నెప్పితో ఆయన గిలగిలలాడిపోసాగారు. ఒళ్లంతా చెమటలు పట్టాయి. పడక కుర్చీలో నిస్త్రాణగా వెనక్కి వాలిపోయి బాధపడసాగారు.
రఘురాo కి ఏమి చెయ్యడానికీ తోచలేదు. టేబుల్ మీద అందు బాటులో ఉన్న “సార్బిట్రేట్” టాబ్లెట్ తీసి తండ్రి నోట్లో వేసి అక్కడనుండి వెళ్ళిపోయాడు, భార్యకి విషయం చెప్పడం కోసం.
రాత్రి రాసుకున్న లిస్టు పట్టుకుని, కొట్లు తెరిచే వేళకు వెళ్ళి, లిస్టులో ఉన్నవన్నీ కొని ఆటోలో వేసుకుని తీసుకువచ్చాడు జీవన్. వాటిని ఇంట్లోకి చేరవేసి తనకు రావలసిన డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు ఆటో డ్రైవర్. ఆటోని పంపించేసి ఇంట్లోకి వచ్చిన జీవన్ కుర్చీలో కూర్చుని గుoడె పట్టుకుని బాధపడుతున్న జగన్నాధంగారిని చూసి కంగారుపడ్డాడు. చెయ్యి పట్టుకుని నాడి చూసి, “తాతయ్యా! సార్బిట్రేట్ అందుబాటులోనే ఉంచా, వేసుకున్నావా? డాక్టర్ని పిలవడం మంచిదేమో” అంటూ కంగారుగా ఫోన్ దగ్గరకు పరుగెత్తాడు.
రజని, రఘురాం అక్కడకి వచ్చేసరికి జీవన్ రిసీవర్ ఎత్తి, ఫోన్ డయల్ చేస్తున్నాడు. వెంటనే జీవన్ చేతిలోనుండి ఫోన్ లాక్కున్నాడు రఘురాం. “నేను వచ్చాకదా! ఇక నీ అవసరం ఏమీ లేదు. ఇక వెళ్ళి నీ పని నువ్వు చూసుకో“ అన్నాడు రఘురాం. జీవన్ చేసేదేమీ లేక ఒక పక్కగా నిలబడ్డాడు.
రఘురాం ఫోన్ లాక్కున్నాడే గాని, ఎవరికి ఫోన్ చెయ్యాలో, ఏ నంబర్ డయల్ చెయ్యాలో, ఏమీ తెలియక తబ్బిబ్బు పడుతున్నాడు. టైం గడిచిపోతోంది. జీవన్ కి కంగారుగా ఉంది. చివరకి ఇక ఊరుకోలేక పాకెట్ నోట్బుక్ తీసి, జగన్నాధంగారి పర్సనల్ డాక్టర్ పేరు, నంబరు చెప్పాడు. తప్పని సరిగా ఆ నంబర్ కి ఫోన్ చేసి తండ్రి పరిస్థితిని గురించి తెలియజేశాడు రఘురాం.
అలవాటుగా ఏడయ్యీ సరికి వచ్చింది మీనాక్షి. గుమ్మం పక్కన బజారునుoడి తెచ్చిన సామాను గుట్టగా పడి ఉంది. పెద్దాయన పరిస్థితి తెలియని మీనాక్షి ఆ సామానుని సద్దడం మొదలుపెట్టింది. రవి, స్రవంతి దొడ్లో చేరి వాలీబాల్ ఆడుకుంటున్నారు. లివింగ్ రూమ్ లో ఉన్నారు తక్కినవాళ్లు.
రజని జీవన్ ని చూసి మొహం చిట్లించింది. అది చూసి రఘురాం, “నువ్వింక వెళ్ళవచ్చు. వెళ్ళి నీ స్వంత పనులు చూసుకో. ఆయన్ని చూసుకోడానికి నేనున్నాను” అన్నాడు.
“డాక్టర్ వచ్చి మందులు రాసి ఇస్తే, అవి తెచ్చి ఇచ్చి వెడదామని ఆగానండి” అన్నాడు జీవన్ నిర్లిప్తంగా. రఘురాం తన ఎడల చూపిస్తున్న నిరసనకు కారణమేమిటో తెలియక, అకారణంగా ఆయనకి తనపై ఇంత కోపమెందుకని బాధపడ సాగాడు. కాని తాతయ్యను వదిలి వెళ్ళడానికి మనస్కరించక అక్కడే ఉండిపోయాడు. “సార్బిట్రేట్” పనిచెయ్యడంతో తాతయ్యకు బాధ కొంతలో కొంత తగ్గినట్లుoది. పడక కుర్చీలో వెనక్కివాలి కళ్ళు మూసుకుని పడుకుని సన్నగా మూలుగుతున్నారు ఆయన. ఆయనను అక్కడనుండి కదపవచ్చో, కూడదో తెలియలేదు జీవన్ కి.
రఘురాం భార్యకు దగ్గరగా వెళ్ళి గుసగుసగా అన్నాడు, “ఇందాకటినుండి ఎన్నో రకాలుగా వెళ్ళిపొమ్మని చెపుతూనే ఉన్నా, కాని మనిషి కదలడే! కాలుపట్టుకు లాగితే చూరుపట్టుకుని వేలాడే రకం కాబోలు!”
రజని జీవన్ వైపు చురుక్కున చూసి, భర్తతో, “ఔను!” అంది. భర్తకి దగ్గరగా జరిగి, అతనికి మాత్రమే వినిపించాలని గుసగుసలాడింది, “నాకు తెలియదా ఏమిటి, మంచితనం నటించి జనాన్ని మభ్యపెట్టి, నెమ్మదిగా పక్కన చేరి, సమయంచూసి ఇల్లు గుల్ల చేసేది ఇలాoటి వాళ్ళే! జాగ్రత్తగా ఉండాలి మనం” అంది.
వాళ్ళు ఎంత నెమ్మదిగా గుసగుసలాడినా ఆ మాటలు జీవన్ కి వినిపించాయి. అతని మనసు గాయపడింది. అయినా తాతయ్యకోసం అన్నీ ఓర్చుకోవాలనుకున్నాడు. డాక్టర్ వచ్చి తాతయ్య పొజిషన్ ఏమిటో చెప్పాక, ఆయన రాసిచ్చిన మందులు తెచ్చి ఇచ్చి, ఆ తరవాతే తను వెళ్ళడం, అంతవరకూ ఎవరేమన్నా పట్టించుకో కూడదు - అని గట్టిగా నిశ్చయించుకున్నాడు.
డాక్టర్ మరో పది నిముషాలు గడిచేసరికి వచ్చాడు. జగన్నాధంగారిని పరీక్షించి, “మైల్డు హార్టు అటాక్. వెంటనే ఆసుపత్రిలో చేర్పించడం మంచిది. మళ్ళీ వస్తే ప్రమాదం” అని చెప్పి, ఇంజక్షన్ చేసి, మందులు రాసి ఇచ్చి, వాటిని ఎలా వాడాలో రఘురామ్ తో చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. రఘురాం, జీవన్ సాయపడగా జగన్నాధంగారు నెమ్మదిగా లేచి వెళ్లి మంచం మీదపడుకున్నారు. ముందు అనుకున్నట్లుగానే మందులు తెచ్చి, రఘురాం చేతికి ఇచ్చి, తాతయ్య ప్రశాంతంగా మంచం మీద పడుకోడం చూసి, అక్కడనుండి వెళ్ళిపోయాడు జీవన్.
సామానంతా సద్ది, వచ్చిన మీనాక్షి “టిఫిన్ ఏమి చెయ్యమంటారు” అని రజనిని అడిగింది.
“టిఫిన్ మాట తరవాత. ముందు కాఫీల సంగతి చూడండి” అంది రజని విసుక్కుంటూ, తప్పంతా మీనాక్షిదే ఐనట్లు. మీనాక్షి మనసు చివుక్కుమంది. అయినా మాటాడకుoడా వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెట్టే ప్రయత్నంలో పడింది. ఆమె మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది.
అప్పుడే టైం ఎనిమిది దాటింది, ఇంకా ఆ ఇంట్లో ఎవరూ కాఫీలు తాగిన జాడలేదు. పెద్దాయనకు ఈ మధ్య లేస్తూనే జీవన్ కలిపి ఇచ్చిన కాఫీ తాగడం అలవాటయ్యింది. జీవన్ ఈ రోజు ఇక్కడ లేకపోవడంతో ఆయనకీ కాఫీ ఇచ్చివుoడరు ఎవరూ, పాపం! వేళకి కాఫీ లేక ఏ తలనెప్పయినా వచ్చిందో ఏమో! తొందరగా కాఫీ కలపాలి - అనుకుంది మీనాక్షి.
అందరికీ కాఫీలు ఇచ్చి, పెద్దాయనకు మీనాక్షి కాఫీ తీసుకెళ్లేసరికి ఆయన, ఇంజక్షన్ ప్రభావం వల్లనో ఏమో, గాఢమైన నిద్రలో ఉన్నారు. ఇక చేసేదేమీ లేక కాఫీ వెనక్కి తీసుకెళ్ళిపోయిoది.