“ఎంతపని చేశావురా రంగా!” అని ఒక్క కేకపెట్టాడు దుఃఖంతో రమాపతి. అంతలోనే తాయారువైపుకి చూసి, ”ఇదేమిటమ్మా తాయారూ! నువ్వైనా వద్దని చెప్పకూడదా! తగుదునమ్మా- అని గడందుకున్నావు! పిల్లా డెక్కడ?” అంటూ తాయారుపై నిష్టూరం వేశాడు ఆయన.
గడ వెయ్యడం ఆపకుండానే జవాబు చెప్పింది తాయారు. “మీరేం గాబరా పడకండయ్యగారూ! మా మావకి సక్కగా ఈతచ్చుగందా, ఎలుగొచ్చేతలికి ఆడు మీకాడుంటాడు. ఇక పిల్లోడంటారా – ఆడూ సక్కగా, మారాజులా బొంతమీన తొంగొని నిద్దరోతూ కలలుగంటన్నాడండయ్యా, మీరేమీ దిగులెట్టుకోమాకండి” అంది.
పడవ మరికొంతదూరం వెళ్లేసరికి కొద్దిగా వెలుగొచ్చింది. ఇంకా ఒడ్డు చేరకముందే ఏదో మిట్ట ఎక్కడంతో పడవ కదలకుండా నిలబడిపోయింది.
రమాపతి, తానొక్కడూ బరువైన ఆ పడవను బలంగా నీటిలోకి తొయ్యాలంటే మాటలుకాదు. పడవలో తనకు సాయపడగల మరో మగవాడెవరూ లేరు కదా! “ఇప్పుడేమి చెయ్యాలి” అన్న ఆలోచనలో పడ్డాడు. అంతలో ఆయనకి గుర్తొచ్చాయి టపాసులు.
***********
తెల్లవార వస్తోంది. కాకులు కూస్తున్నాయి. ఊరిలో జనం ఒకరొకరే నిద్ర లేస్తున్నారు. క్షణ క్షణానికి జనం చేసే సందడి పెరుగుతోంది ఊళ్ళో. అకస్మాత్తుగా వినిపించిన టపాసులు పేల్చిన చప్పుడు వినిపించింది. ఆ చప్పుడుని ఊరిజనం సరిగానే అర్ధం చేసుకున్నారు. ఎవరో వరదలో చిక్కుపడి అసహాయ స్థితిలో ఉన్నారు - అని అర్ధం అయ్యింది వాళ్లకి. వెంటనే ఆ చప్పుడు వినిపించినవైపుకి గుంపుగా బయలుదేరారు ఆ ఊరి జనం, అవసరంలో ఉన్నవాళ్ళకు సహాయం చెయ్యడం కోసం. పంచెలు ఎగ్గట్టి నీటిలో దిగి పడవను బలంగా ఈడ్చుకు వచ్చారు ఒడ్డుకి. అక్కడ నీరు మరీ ఎక్కువ లోతుగా లేదు.
ఆ రోజుల్లో; అతిధుల్ని, అభ్యాగతుల్ని, అవసరంలో ఉన్నవాళ్ళని ఆదుకోడం అన్నది ప్రతి గృహస్థుకి కనీస ధర్మమని నమ్మేవారు. అంతేకాదు; ఈ వేళ ఈ అవసరం వీరికి వచ్చింది, రేపా అవసరం మనకే రావచ్చు- అనుకునేవారు. "పెట్టినమ్మకి పుట్టిందే సాక్షి" అని నమ్మి, ఎవరికైనా సాయపడడానికి సిద్ధంగా ఉండేవారు ఆనాటి వాళ్ళు.
ఆ ఊరిలో వున్నవారిలో చాలామంది రమాపతికి తెలిసినవాళ్ళు, స్నేహితులూను. వెంటనే అక్కడున్నవాళ్లకి, పురోహితుడు, పూజారి ఐన రామశాస్త్రి కుటుంబం ఉన్న పరిస్థితిని గురించి చెప్పాడు రమాపతి. వెంటనే వాళ్ళు పడవ నడపడంలో నేర్పరితనం ఉన్న ఇద్దరిని జతచేసి పడవనిచ్చి రామశాస్త్రి కుటుంబాన్ని తీసుకురమ్మని, దారి చెప్పి పంపించారు.
పొద్దు బారెడు పైకి ఎక్కి వచ్చేసరికి రంగడుకూడా అక్కడకు వచ్చి చేరాడు. రంగడి ఒంటికైన గాయాలను చూసి రమాపతికి కళ్ళ నీళ్ళు తిరిగాయి. “ఎందుకురా రంగా, అంత సాహసం చేశావు” అని అడిగాడు ఆయన.
"గాలి విసురుకి పడవ ఒరిగినప్పుడల్లా నీరు ఒంచలదాకా వస్తోంది. వెంటనే పడవ బరువు తగ్గకపోతే పడవ ఒరిగి ములిగిపోద్దనిపించిందయ్యా. “ఏటి సేయ్యాలా” అని ఆలోసించిన. సివరాకరికి ఇంతకన్నా మంచిదారి మరోటి ఏదీ నాకు తోచలేదు. నాకు ఈతొచ్చు. ఈదుకుంటా ఒడ్డుకు రాగలనని నాకు తెలుసు. కరమం సాలక ఏ పామయినా ముట్టి నేను సచ్చిపోయినా పరవాలేదు, నా బారియా బిడ్డలను మీరు గాలికి ఒగ్గేయరు. ఆ దయిర్ణం నాకుంది" అన్నాడు రంగడు.
“వెర్రాడా! చూడు, ఒళ్ళంతా ఎలా గాయాలయ్యాయో” అంటూ రమాపతి రంగడి బుజం తట్టి, పైగుడ్డతో కళ్ళు తుడుచుకున్నాడు.
పడవ వెనకాలే ఈదుకుంటూ వస్తున్నా రంగడిని, ఒక నీటిప్రవాహం పక్కకు తోసేసింది. రంగడు దారి తప్పాడు. తప్పుదారినిపడి ఈదుతున్న రంగడికి నీటిలో మునిగివున్న తుప్పలు తాలూకు ముళ్ళు, పుడకలు గీరుకుని ఒళ్ళంతా గాయాలయి, రక్తం చిమ్మసాగాయి.
ఆ ఊరిలో ఉన్న సంచికట్టు వైద్యుడు, కొబ్బరినూనెలో ఏవేవో ఆకుల పసరులు పిండి, రంగరించి ఇచ్చాడు. వాటిని తాయారు రంగడి గాయాలకు పూసింది. నాలుగు రోజుల్లో ఆ గాయాలన్నీ పూర్తిగా మానిపోయాయి.
వరద వెనకట్టీ దాకా రమాపతిగారి కుటుంబమంతా ఆ ఊరిలోనే ఉంది. తరవాత ఇల్లు బాగుచేయించుకుని స్వగ్రామానికి వెళ్ళిపోయారు వాళ్ళు
*********
ఆశ్వీయుజ మాసం వచ్చింది. శరత్కాలం రావడంతో గోదావరి నీరు తేటబడింది. వానలు వెనకట్టాయి. వాన మేఘాలు పింజలు పింజలుగా విడిపోయి, తెలుపెక్కి ఆకాశంలో తేలుతూ, పేలిన పత్తికాయల్నిఆరపోసినట్లుగా ఉన్నాయి. ఒద్దిక పాటిస్తూ, వయ్యారాలొలికిస్తూ ప్రవహిస్తున్న గోదావరి - జనాలకు అంతంత కష్టనష్టాలు కలిగించినది ఈ నదేనా - అనే విభ్రమాన్ని కలిగిస్తోంది అందరికీ.
తిరిగి మరో పంటను పండించే ప్రయత్నంలో పడ్డారు రైతన్నలు. వాళ్ళు హలం చేతపట్టి పొలం దున్ని, ఆ సాలుకి రెండవతూరి విత్తనాలు వెయ్యడం మొదలుపెట్టారు. ఈసారైనా పొలాలు మంచి ఫలసాయం ఇచ్చి, వరదవల్ల వచ్చిన నష్టాన్ని కొంతైనా పూడుస్తాయన్న ఆశతో ఉన్నారు వాళ్ళు. పదిరోజులు వరసగా వరదలో మునిగి ఉండడంతో చక్కగా ఎదుగుతున్న మొక్కలన్నీ నిలువునా కుళ్ళిపోయాయి. ఆ సాలు తొలితడవ పంట మొత్తం వరద దెబ్బకు నాశనమైపోయింది. విత్తిన విత్తనాలు, పెట్టిన పెట్టుబడి కూడా నష్టమైపోడంతో రైతులు మొహాలు చిన్నబుచ్చుకున్నారు.
వరదవల్ల వచ్చిన జననష్టం, ధననష్టం, ప్రాణినష్టం నెమ్మదిగా మర్చిపోయే ప్రయత్నంలో పడ్డారు అందరూ. జనజీవనం ఎప్పటిలాగే సాదాసీదాగా సాగిపోతోంది. దసరా పండుగలు దగ్గరలో ఉండడంతో, తాము పడిన కష్టాలన్నీ పక్కనపెట్టి, పండుగ సన్నాహాలలో పడిపోయారు వాళ్లు.
ఒక రోజు అక్కడి వాళ్ళు ఆజానుబాహుడైన ఒక వ్యక్తి, మేలుజాతి గుర్రంపైన సవారీ చేస్తూ ఆ పరిసరాల్లో తిరుగుతూండడం చూశారు. నీలంగా ఉన్న అతని కనుపాపలు, బంగారు వన్నెలోవున్న అతని జుట్టు, తెల్లటి ఒళ్ళు - అక్కడి వాళ్లకి ఆశ్చర్యాన్ని కలిగించాయి. అతడు యక్షుడో, కిన్నరుడో, కింపురుషుడో అయ్యి ఉంటాడనీ; వాళ్ళెవరూ కాకపోతే దివినుండి భువికి దిగివచ్చిన ఏ దేవదూతో కావచ్చుననీ ఆశ్చర్యంతో గుసగుసలు పోయారు ఊళ్ళో వాళ్ళు. ఇంతవరకు ఎప్పుడూ వాళ్ళు శ్వేత జాతీయుడిని చూసిన పాపానపోలేదు మరి!
శివాలయం ఎదుట, ఎప్పుడో ఎవరో పుణ్యాత్ముడు ఒక రావిచెట్టు, ఒక వేపచెట్టు ఒకేచోటును పాతి పెంచి, వాటిచుట్టూ చక్కని అరుగు కట్టించాడు. ప్రతిరోజూ ఆ ఊరిలోని తగు మనుష్యులంతా అక్కడ జేరి ఊరుమ్మడి విషయాలమీద చర్చలు జరుపుతూంటారు. అందరూ కలిసి ఆలోచించి వారికి సబబనిపించిన నిర్ణయాలు తీసుకుంటారు. అదే ఆ ఊరి రచ్చబండ! అదే అక్కడి న్యాయస్థానం కూడా. ప్రతిరోజూ ఊరిజనం ఆకబురూ, ఈ కబురూ చెప్పుకునే చోటు అదే.
ఆరోజు అక్కడ రామశాస్త్రి, రమాపతి, మరో ఇద్దరు ముగ్గురు ఊరి పెద్దమనుష్యులు కూర్చుని, పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ సమయంలో ఆ శ్వేతజాతీయుడు అక్కడకువచ్చాడు. గుర్రాన్ని దిగి, రచ్చబండమీడున్న వాళ్లకు సాల్యూట్ చేసి, వచ్చీరాని తెనుగులో, విచిత్రమైన యాసతో, “నాపేరు ఆర్థర్ కాటన్. గవర్నమెంట్ ఉద్యోగిని. ఈ ప్రాంతం సర్వేకోసం ఇటు వచ్చాను” అని చెప్పాడు అతను.
అక్కడివాళ్లు ఆయనని ఆ ఊరికి అతిధిగా భావించి మర్యాదలు చేశారు. చక్కగా కాచిన వెచ్చని, చిక్కటి ఆవుపాలలో ఏలకిపొడి, బెల్లం కలిపినవి ఆయన తాగడానికి ఇంటిదగ్గరనుండి తెప్పించి ఇచ్చాడు రమాపతి. మిష్టర్ కాటన్ అక్కడి వాళ్ళని కుశలప్రశ్నలు వెయ్యడం మొదలుపెట్టాడు.
అప్పటికి వరదవచ్చి ఊళ్ళను ముంచినది ఎక్కువరోజులు కాలేదేమో, ఆయన “కుశలమా” అని అడగ్గానే వాళ్లకు, మర్చిపోయామనుకున్న వరద వలన వాళ్ళు పడిన కష్టాలన్నీ ఒక్కసారిగా మళ్ళీ గుర్తువచ్చి అందరి ముఖాలూ మ్లానమయ్యాయి. బేల మనసున్న సోంబాబుకు కళ్ళవెంట జలజలా కన్నీరు కారి అతని చెంపల్ని తడిపింది.
వెంటనే మిష్టర్ కాటన్, ఈ సమిష్టి దుఃఖానికి కారణమేమిటని అడిగాడు. ఇంతవరకూ వాళ్ళని ఇలా కుశలమడిగిన ప్రభుత్వోద్యోగు లెవరూ లేరు. అసలు అధికారులెవరూ, మారుమూలనున్న ఆ ప్రదేశానికి వచ్చి వాళ్ళ మొహాలు చూపించిన పాపానకూడా పోలేదు.
తాము పడే బాధల్నిగురించి ఎవరికైనా చెప్పుకుంటే తమ తల బరువు తీరుతుందన్న ఆలోచనతో వాళ్ళు ఆ నూతనునితో వరదగోదావరి వల్ల తాము పడుతున్న కష్టాలన్నీ చెప్పుకున్నారు. అంతేకాదు, చుట్టూ అంత నీరున్నా గుక్కెడు తాగేనీరు కూడా లేక పడుతున్న ఇబ్బందులను గురించి కూడా చెప్పారు. ఏటా ఏటా వచ్చే గోదావరి వరదవల్ల పంటలు పాడవ్వడం, ఊళ్లు ఊళ్లు కొట్టుకుపోవడం, కూడూ గూడూ కూడా కరవై జనం పడే యాతనలు - అన్నీ చెప్పారు. వరద వల్ల పంటలు, ఆస్తులూ కూడా నష్టమైపోవడంతో తరచూ కరువు వచ్చి తాము పడుతున్న ఇక్కట్లన్నిటినీ కాటన్ కి వివరంగా చెప్పారు వాళ్ళు.
"మాటల కందని కష్టాలు మావి. అవి ఎంత చెప్పినా తరిగేవి కావు" అన్నాడు సోంబాబు, కట్టుకున్న పంచె కొస పైకెత్తి కళ్ళు తుడుచుకుంటూ.
తాము పడుతున్న యాతనలన్నీ ఏకరువు పెట్టడంవల్ల అక్కడి వాళ్ళు తమ తలబరువు తగ్గి తెరిపిని పడ్డారేమో గాని, వాళ్ళ తిప్పలు విన్న జనరల్ కాటన్ కి మాత్రం తల బరువెక్కిపోయింది. అక్కడున్న నికృష్ట పరిస్థితులవల్ల అక్కడి వాళ్లు పడుతున్న బాధలన చక్కగా అర్థంచేసుకున్నాడు ఆయన. ఏదోవిధంగా వాళ్లకు సాయం చెయ్యాలని అక్కడి కక్కడే ఆయన మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాడు. అంతలో అతని సిబ్బంది అక్కడకు రావడంతో గుర్రమెక్కి వారి వెంట వెళ్ళిపోయాడు కాటన్.
కోణసీమ వాసులు పడుతున్న కష్టాలు అతని హృదయాన్ని ద్రవింపజేయడంతో, ఇర్రిగేషన్ ఇంజనీర్ ఐన ఆర్థర్ కాటన్ అక్కడున్నవాళ్ళ కష్టాలు తొలగించడం ఎలాగా - అన్న ఆలోచనలో పడ్డాడు. ప్రతి రోజునా వృధాగా సముద్రం పాలౌతున్న అమూల్యమైన గోదావరీ జలాలను కనుక సారవంతమైన ఈ కోణసీమ నేలపైకి మరలించగలిగితే, ఇక్కడ బంగారు పంటలను ఎంతో తేలిగ్గా పండించ వచ్చునన్నది అతడు గుర్తించాడు. వెనువెంటనే అతడు కార్యోన్ముఖుడైనాడు. తను చేస్తున్న సర్వేతో పాటుగా ఆ ప్రదేశాన్ని కూడా సమగ్రంగా పరిశీలించి, ఆపై మనసులో ఒక చక్కని పధకాన్ని ఊహించి పెట్టుకున్నాడు.
ధవళేశ్వరం వద్ద గోదావరీ నదికి ఆనకట్ట కట్టి, ఆ నీటిని కాలువలద్వారా కోణసీమలోని సుసంపన్నమైన నేలకు కనుక అందివ్వగలిగితే, వరదలను అరికట్ట గలగడమే కాకుండా, ఆ ప్రదేశమంతా సస్యశ్యామలంగా మారుతుందనీ, సాగు నీటితోపాటుగా జనాలకు తియ్యని తాగునీరు కూడా సంవృద్దిగా అందుతుందనీ, అక్కడితో ఆ ప్రాంతపు ప్రజలకు కరువు, కాటకాలవల్ల వచ్చే కష్టాలన్నీ కడముట్టి పోతాయనీ, అందరూ సుఖ శాంతులతో హాయిగా బ్రతకగలరనీ అతడు చక్కగా తన మనో ఫలకంపైన చక్కగా దర్శించగలిగాడు.
పనిలో పనిగా కాటన్, తన ఊహలలోని ప్రాజెక్టు యొక్క సమగ్ర స్వరూపాన్ని, ఆనకట్ట నిర్మాణానికి అయ్యే ఖర్చుని, ఆపై ఆ ఆనకట్టవల్ల వచ్చే లాభాన్ని, చక్కగా వివరిస్తూ ఒక నివేదికను తయారుచేసి, బ్రిటిష్ ప్రభుత్వం ఎదుట ఉంచాడు. ఆ లేఖలో వారికి చక్కగా తెలియడం కోసం కాటన్ ఇంగ్లాండ్ లోని "ధేమ్సు" నదిని ఉపమానంగా వాడుకున్నాడు . "ఒక సంవత్సర కాలంలో ధేమ్సు నదినుండి సముద్రానికి చేరుతున్న నీరు, ఒక్క రోజులో ఇండియాలో ఉన్న గోదావరి నది నుండి వృధాగా సముద్రానికి చేరుతోంది" అని రాశాడు లేఖలో. అంతే కాదు, ఈ ప్రాజెక్టువల్ల ప్రజలు మాత్రమే కాదు, ప్రభుత్వం కూడా లబ్ది పొందు తుందని నొక్కి వక్కాణించాడు.
ఈ ప్రాజక్టు వల్ల ప్రభుత్వానికి వచ్చే అపరిమితమైన ఆదాయాన్ని గురించి కూడా తను రాసిన లేఖలో చక్కగా వివరించాడు జనరల్ కాటన్. పంటపొలాలపైన వచ్చే రెవెన్యూ వల్ల ప్రభుత్వానికి చాలా డబ్బు సమకూరుతుందనీ, అడి మాత్రమే కాకుండా, కాలువలగుండా నడిచే రహదారీ పడవలపై, ఒకచోట పండిన పంటలు మరొక చోటికి అవ్వడంవల్ల వ్యాపారాలు శీఘ్రంగా వృద్ధిపొందుతాయనీ, వాటి ద్వారా వచ్చే వ్యాపార సుంకంవల్ల కూడా ప్రభుత్వానికి రాబడి గణనీయంగా పెరుగుతుందనీ, ప్రభుత్వాధికారుల కళ్ళకు కట్టేలా వివరించాడు. ఈ ప్రాజెక్టు దిగ్విజయంగా ముగిశాక, దీనిమూలంగా వచ్చే రాబడి, దీనిని కట్టడానికైన పెట్టుబడికి ఇబ్బడి ముబ్బడిగా ఉంటుందనీ చాటిచెప్పి, ఎట్టకేలకు ప్రభుత్వాన్నిపెట్టుబడి పెట్టేందుకు ఒప్పించగలిగాడు కాటన్. ధవళేశ్వరం దగ్గర గోదావరీనదిపై ఆనకట్ట కట్టడానికయ్యే ఖర్చు, డెల్టా ప్రాంతంలో కాలువలు తవ్వించడానికి అయ్యే ఖర్చు నిమిత్తం అవసరమయ్యే డబ్బు ప్రభుత్వఖజానానుండి త్వరలోనే విడుదలయ్యింది. ఆపై అనతికాలంలోనే ఇర్రిగేషన్ ఇంజనీరైన జనరల్ కాటన్ ఆధ్వర్యంలో ధవళేశ్వరం దగ్గర గోదావరినదికి ఆనకట్ట కట్టే పని మొదలయ్యింది
భారతీయ సివిల్ ఇంజనీర్, తొలి తెలుగువాడు శ్రీ వీణం వీరయ్య అనే అతనిని కాటన్ కి సహాయకునిగా నియమించారు. అతడు భూములను సర్వే చేస్తున్నది మొదలు, ఆనకట్ట నిర్మాణం పూర్తయ్యేదాకా, కాటన్ కి కుడి భుజంలా ఉంటూ, వెంట నుండి అడుగడుగునా అతడికి సహకరించాడు.
బ్రిటిష్ వాడైన కాటన్ తమకు చేస్తున్న సాయాన్ని తలుచుకుని, కోణసీమలోని వేదపండితులు, కాటన్ దొర పేరున సంకల్పం చెప్పి, ఆయనని వేదమంత్రాలతో ఆశీర్వదించారు. పని నిర్విఘ్నంగా కొనసాగాలన్న కోరికతో రమాపతి గుడిలో వినాయకుడికి సహస్రదళ పూజ జరిపించి, ఊళ్ళో ఉన్న పేదలందరికీ సంతర్పణ చేశాడు. భవిష్యత్తు మీది ఆశతో కోణసీమ వాసులందరి హృదయాలలోనూ ఆనందం వెల్లువయ్యింది.
దేశ విదేశాలనుండి కావలసిన యంత్ర పరికరాలు తెప్పించాడు కాటన్. ప్రాంతీయ జనం బ్రహ్మానందంతో ఆ ప్రాజెక్టు పనిలో పాల్గొన్నారు. టెక్నాలజీ సాయం అంతంతమాత్రంగా ఉన్న ఆ రోజుల్లో కూడా ఆఘమేఘాలమీద పని జరిగింది. రాజోలు తాలూకాకు కాలువను పొడుగించడం కోసం, మధ్యలో అడ్డుగా వున్న వైనతేయం పైనుండి సాగేలా, గన్నవరం దగ్గర “అక్విడెక్టు” కట్టి, కాలువను అమలాపురం తాలూకానుండి రాజోలు తాలూకాలోకి ప్రవేశించేలా ఏర్పాటుచేసి, రెండు జిల్లాల నడుమ నిరంతరాయంగా, గౌతమీ జలాలనేకాదు, ఏకబిగిని కాలువలో రహదారీ పడవలు కూడా నడిచే ఏర్పాటు చేశాడు మహానుభావుడు. వృధాగా పోకుండా సుమారుగా ప్రతి, మూడు మైళ్ళకి ఒకటి ఉండేలా పడవలకాలువల పొడుగునా లాకులు కూడా నిర్మింపజేశాడు కాటన్.
ఆనకట్ట పని సగంలో ఉండగా కాటన్ కి అనారోగ్యం ప్రకోపించడంవల్ల, తప్పనిసరిగా వైద్యానికని ఆయన వేరే చోటకి వెళ్ళవలసివచ్చింది. ఆ వార్త వినగానే కోణసీమ వాసులందరూ తల్లడిల్లిపోయారు. ఆయన అనారోగ్యాన్ని తలుచుకుని గగ్గోలు పడ్డారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఊరూరా గృహస్తులు గుళ్ళలో దైవానికి ఆయన పేరుమీద పూజలు చేయిస్తే, వేదపండితులు తాము నిత్యం చేసే జపతపాదుల ఫలాన్ని ధారపోసి, ఆయనకు ఆయురారోగ్య ఐశ్వర్యాదులు ప్రసాదించమని దైవాన్ని వేడుకున్నారు.
రామశాస్త్రి ఇరు సంధ్యలా తాను చేసే గాయత్రీమంత్ర జపఫలాన్ని ఏరోజు కారోజు కాటన్ దొరపేరున ధారపోసేవాడు. రమాపతి కాటన్ పేరుమీద సంకల్పం చెప్పి ప్రతిరోజూ సుందరాకాండ పారాయణం చెయ్యడం మొదలుపెట్టాడు. స్త్రీలు లలితా సహస్రనామాలు చదివి, అమ్మవారిని దయయుంచి కాటన్ కి తొందరగా జబ్బు తగ్గిపోయేలా అనుగ్రహించమని వేడుకున్నారు. కొద్దిరోజుల పరిచయంతోనే తన సద్భుద్దివల్ల కాటన్ అక్కడి వారి హృదయాల్లో స్థిరమైన చోటును సంపాదించుకుని కోణసీమలో ఉన్న యావజ్జనానికీ అత్యంత ఆత్మీయుడయ్యాడు.
అనారోగ్యం కారణంగా కాటన్ వదలి వెళ్లిన ఆనకట్టపని ఆగిపోలేదు. దాని పూర్తి బాధ్యతను ఇంజనీర్ శ్రీ వీణం వీరన్న, తన భుజానికి ఎత్తుకుని, సక్రమంగా నడిపించాడు. వాసుల ఆకాంక్ష ఫలమో, ఆయన అదృష్టమో గాని, మొత్తానికి కాటన్ అనారోగ్యం తగ్గి, త్వరలోనే కోలుకున్నాడు.
ఆనకట్ట నిర్మాణం వేగంగా పూర్తయ్యింది. బడ్జెట్ కంటే కొద్దిపాటి తక్కువలోనే ఆనకట్ట పని మొత్తం ముగించి, ప్రభుత్వానికి లెక్కలు చూపించి మిగిలిన డబ్బు వెనక్కి ఇచ్చేసి ప్రభుత్వం చేత "భేష్" అనిపించుకున్నాడు “ది గ్రేట్ ఇర్రిగేషనల్ ఇంజనీర్, జనరల్ ఆర్ధర్ కాటన్!”
1852 వ సంవత్సరంలో ఈ ప్రాజెక్టు పనిచెయ్యడం ప్రారంభించింది. కాలువలకు నీరు వదిలారు. బుసబుసా పొంగి, ఆ గోదావరీ జలం, ఎండిపోయి, సొమ్మసిలి నిద్రావస్థలో పడి ఉన్న నేలను ముద్దుపెట్టుకుంది. వెంటనే నేల నిద్రలేచింది. కొత్తగా తమ నట్టింటి సమీపానికివచ్చిన ఆ నీటికి భక్తి శ్రద్దలతో ఊరూరా ఉన్న జనులు పూజలుచేసి, నైవేద్యాలు సమర్పించుకున్నారు తలమునకలైన సంతోషంతో కాటంకి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. "ఇక నుండీ బంగారం పండించమా మేము" అనుకుంటూ ఉవ్విళ్ళూరారు రైతన్నలు.
కాలువలద్వారా రహదారీ పడవలు పలుచోట్లకు వెళ్ళడం మొదలుపెట్టాయి. కోణసీమకే కాదు, ఉభయగోదావరి జిల్లాలకూ కూడా కావలసినంత తాగునీరు, సాగునీరూ కూడా కాలువలద్వారా సంవృద్దిగా అందించబడింది. తమకు మాత్రమే కాదు, తమ భూములకు కూడా దాహార్తి తీరడంతో కోణసీమ వాసులు త్వరలోనే తమ కోణసీమ, కోనసీమగా మారనుందంటూ చాలా చాలా సంతోషించి ఘనంగా పండుగ చేసుకున్నారు. పడవల కాలువలు, పెద్ద కాలువలు, పిల్ల కాలువలు, పంటకాలువలు, బోది కాలువలు, ఊట కాలువలు - ఇలా ఉభయ గోదావరి జిల్లాలలోనూ పలు పలు విధాలుగా, పడుగు పేకలుగా అల్లుకున్న కాలువలవల్ల ప్రజల దాహార్తి తీరడమేకాకుండా, చూస్తూండగా కోణసీమ సస్యశ్యామలమై కోనసీమగా మారిపోయింది. అనతికాలంలోనే మొత్తం ఆంధ్రప్రదేశ్ కే "నందనవనం" అనిపించుకుంది కోనసీమ అందరిచేత.
కొద్దిరోజుల్లో అక్కడ వరి, చెరకు లాంటి ఎక్కువ నీరు కోరే పంటలు, అరటి, మామిడి లాంటి పళ్ళ తోటలూ ఎటుచూసినా కనిపించసాగాయి. అక్కడి వాళ్ళు రెట్టించిన ఉత్సాహంతో ఒళ్ళువంచి పనిచేశారు. బంజరు భూములు పళ్ళతోటలుగా, పోరంబోకులు పంటపొలాలుగా మారిపోయాయి. గాలికి అలలు అలలుగా కదులుతూ, హరిత సముద్రమా అనే భ్రాంతి పుట్టేలా, ఎటు చూసినా కనుచూపుమేర ఆకుపచ్చని వరిచేలే కనిపించసాగాయి అక్కడ. అలా కొన్నాళ్ళు గడిచేసరికి ఉభయగోదావరిజిల్లాలకు కలిపి, "భారత్ కీ ధాన్యాగార్" అనే పేరొచ్చింది. అంతా కాటన్ దొర చలువ - అన్నారు కృతజ్ఞతతో గోదావరి జిల్లాల వాళ్ళు.
కాటన్ కన్న కల అక్షరాలా నిజమయ్యింది. కోనసీమకు పట్టిన దరిద్రదశ వదిలిపోయింది. తరచూ కరువు కాటకాలతో అలమటించే కోణసీమ వాసులకు కాలువలద్వారా నారికేళాంబువులవంటి తీయని అఖండ గౌతమీ జలాలు చక్కగా అందుబాటులోకి వచ్చాయి. కాటన్ పుణ్యమా - అని, కోనసీమ ఆంధ్రప్రదెశ్ కే నందనవనమయ్యింది. కోణసీమ వాసులు కోనసీమ వాసులై, సంపన్నులై సుఖించారు.
కోనసీమలో పండిన రకరకాల పంటలు, కాలువలద్వారా తక్కువ రవాణా ఖర్చుతో ఇతర ప్రాంతాలకు ఎగుమతి కావడంవల్ల అక్కడ వ్యాపారం వృద్ధిపొంది, ఇటు ప్రజలకు, అటు ప్రభుత్వానికీ కూడా లాభించింది. తలమునకలైన కృతజ్ఞతతో కాటన్ దొరని డెల్టాలోని వారు - తన తపఃశక్తితో దివినుండి భువికి సురగంగను తెచ్చిన భగీరధునితో పోల్చి - “అపర భగీరధుడు" అన్నారు. గుర్రంపై సవారీ చేస్తున్నట్లుగా ఉన్న కాటన్ దొర విగ్రహాన్ని ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర ప్రతిష్టించారు. ఆ దారిన వెడుతున్న ఏ కోనసీమవాసీ కూడా నిండారు భక్తితో ఆయన విగ్రహానికి నమస్కరించకుండా ముందుకు అడుగువేయడు.
కాని రమాపతికి, కాటన్ దొరని "అపర భగీరధుడు" అనడం నచ్చలేదు. అతడు ఆ మాట ఒప్పుకోలేదు. భగీరధుడు తనవారికి మాత్రమే పుణ్యలోకప్రాప్తికోసం సురగంగను భూమిమీదకు తెస్తే , స్వర్గం నుండి దూకుడుగా భూమికి వచ్చిన గంగను, తన జటాజూటంలోకి పట్టి, ఆ ఉధృతాన్ని అణచి, గంగను సరైన దారికి మళ్ళించి, భూమిమీదున్న జనులకు మేలు చేసినవాడు శివుడు. భగీరధుడు తనవాళ్ళ కోసం చేసినదానిలో స్వార్థం ఉంది. కాని శివుడు ప్రజలకోసం చేసిన దానిలో త్యాగముంది. తనకేమీ కానివాళ్ళమైన మనం పడుతున్న కష్టాలను అర్థం చేసుకుని, వాటిని తీర్చడం కోసం, తాను అహోరాత్రాలు శ్రమించి, గోదావరిని అదుపులో పెట్టి, మనకు తాగునీరు, సాగునీరు అందించిన మహానుభావుడు కాటన్. మనము పడుతున్న కష్టాలను బాపడానికి అవతరించిన - సాక్షాత్తూ ఆ శివునిలా కనిపిస్తున్నాడు నాకు. మీరేమైనా అనండి, నేను మాత్రం ఆయనను ఆ పరమశివుడే అంటాను" అన్నాడు. ఆ మాటలు అంటున్నప్పుడు ఉద్వేగంతో రమాపతి కళ్ళు మెరిశాయి.
రచ్చబండ దగ్గరున్న వాళ్ళందరూ వెంటనే చప్పట్లు కొట్టి , రమాపతి అన్న మాటలకు తమ వత్తాసుని, సంతోషాన్ని వ్యక్తం చేశారు."
అంతవరకూ చెప్పి మా తాతయ్య తన కథను ముగించాడు.
**************
తరవాత కూడా ఇంకా కాటన్ నిస్వార్ధ సేవల్ని గురించి నా మనసులోకి ఏవేవో ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. కట్టి నూరేళ్లయినా చెక్కుచెదరని, గోదావరిపైనున్న పాత రైలు వంతెన కూడా, ముఖ్యంగా నాకు, ఒక రిడిల్ గా తోచింది.
బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని దోచుకుపోడానికే వచ్చిన దోపిడీదారులే ఐనప్పటికీ, వారిలో కొద్దిమంది నిష్పక్షపాత బుద్ధితో ప్రజల శేయాన్ని, దేశాభివృద్ధిని గురించి ఆలోచించిన వాళ్ళు కూడా లేకపోలేదు. వారిలో ప్రముఖుడు కాటన్ దొర. ఒక్క ఆంధ్రప్రదేశ్ కే కాకుండా, ఇంకా భారతదేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో "ఇర్రిగేషన్ సిష్టం"లో ఉన్న లోటుపాట్ల నెన్నిటినో సవరించాడు. చిన్నా పెద్దా డాముల నెన్నింటినో కట్టాడు. ఇటు ప్రజలకు, అటు ప్రభుత్వానికీ కూడా రాబడిని పెంచాడు ఆయన. ఎట్టకేలకు బ్రిటిష్ ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించింది. ఆయనకు "నైట్ హుడ్" ఇచ్చి గౌరవించింది. అది మొదలు ఆయన సర్ ఆర్ధర్ థామస్ కాటన్ గా చెప్పబడ్డాడు.
సర్ థామస్ ఆర్ధర్ కాటన్ కి కుడిభుజంగా నిలబడి ఆనకట్ట నిర్మాణంలో అడుగడుగునా ఆయనకు సాయపడి, నిర్మాణం శీఘ్రంగా జరిగేందుకు తోడ్పడిన భారతీయుడు, తెలుగువారిలో తొలి సివిల్ ఇంజనీర్ ఐన శ్రీ వీణం వీరన్నకి బ్రిటిష్ ప్రభుత్వం "రాజా బహదూర్" బిరుదాన్నిచ్చి సత్కరించింది. కాటన్ అనారోగ్యపడి పని విడిచి, వైద్యం కోసం వెళ్లిన సమయంలో కూడా, ఆపకుండా పని జరిపించిన ఘనత సివిల్ ఇంజనీర్ వీణం వీరన్నదే! సమర్థులైన దేశీయ కార్మికులను సమకూర్చడంలో, వాళ్ళ చేత శ్రద్ధగా పనిచేయించడంలో వీరన్న చేసిన కృషి అమోఘం. ఆయన సహాయ సహకారాలను గుర్తించిన కాటన్ తన స్వహస్తాలతో వీరన్న దేశానికి, ప్రభుత్వానికి చేసిన సేవను కొనియాడ ఆయనను గౌరవించడం మన కర్తవ్యమని తన పైవాళ్ళకి లేఖ రాసి రికమెండ్ చేశాడు. ప్రభుత్వం వీరన్నకి రాజాబహదూర్ బిరుదాన్ని, ఒక ఊరు రెవిన్యూ మీది హక్కును ఇచ్చి గౌరవించింది.
ఆనకట్ట దగ్గర తొలుత కాటన్ విగ్రహాన్ని ప్రతిష్టించినప్పుడు అక్కడ చెక్క బడిన శిలా శాసనంలో ఆనకట్ట నిర్మాణంలో కాటన్ కు సహోద్యోగిగా, అత్యంత సహాయకుడిగా పనిచేసిన సివిల్ ఇంజనీర్ వీణం వీరన్న అను తెలుగువాని గురించి, మాతృదేశానికి, అతడు చేసిన అమూల్యమైన సేవను గుర్తించి, బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను "రాజా బహదూర్" బిరుదంతోనూ, ఒక గ్రామం తాలూకు రెవెన్యుడూ మీది హక్కుతోనూ సత్కరించిన విషయం గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. కానీ 1953లో రాజమండ్రీ ప్రాంతంలో వరద గోదావరి చేసిన భీభత్సంలో కాటన్ విగ్రహం, ఆ పరిసరాలు - మొత్తం అన్నీ కొట్టుకుపోయాయి. ఆ తరువాత తెనుగువారు తిరిగి కాటన్ విగ్రహాన్ని ప్రతిష్టించినప్పుడు, గోదావరిపైన ఆనకట్ట కట్టడంలో తన శక్తి యుక్తులను ధారపోసి, కాటన్ మన్ననలను పొందిన, తొలి తెలుగు సివిల్ ఇంజనీరు, శ్రీ వీణం వీరన్నను మరచిపోయారు మన తెలుగువారు.
భారతదేశ వ్యాప్తంగా ఉన్న తన అభిమానుల్ని దుఃఖసముద్రంలో ముంచి సర్ ఆర్ధర్ థామస్ కాటన్ తన 94 వ ఏట 1899లో పరమపదానికి చేరుకున్నాడు.
************
1970 వ సంవత్సరంలో నూరు సంవత్సరాలు పైబడ్డ ధవలేశ్వరం ఆనకట్టకి మన ప్రభుత్వం మరమ్మత్తులు చేయించి, ఎత్తును పెంచారు. అలా ఎత్తుని పెంచడం వల్ల రిజర్వాయిర్ లో మరింత ఎక్కువ నీరు నిలవచేసే అవకాశం వచ్చింది. ఈ పునర్నిర్మితమైన ఆనకట్టకి కాటన్ గౌరవార్ధం కాటన్ బేరేజ్ అనే పేరు పెట్టారు. అంతేకాదు, ఆయన జ్ఞాపకార్ధం ఆయన నివసించిన ఇంటిని, కాటన్ మ్యూజియంగా మార్చి, అక్కడ ఆయన ఆనకట్ట నిర్మాణానికి వాడిన పనిముట్లు (టూల్సు) ఆయన వాడుకున్న వస్తువులు, రికార్డులు వగైరా ఆయనకు సంబంధించిన వస్తువుల్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికీ అటు వెళ్ళినప్పుడు ఆనకట్ట దగ్గరున్న సర్ ఆర్ధర్ థామస్ కాటన్ విగ్రహానికి మ్రొక్కని కోనసీమ వాసి ఉండడు. అంతేకాదు, గోదావరి పుష్కరాలలో ఆయనకు సద్గతులు శాశ్వతం కావాలని పిండప్రదానం చేసేవారు ఈ తరంలో కూడా ఉన్నారు అన్నది విశేషం. కష్టాల కడలి ఐన కోణసీమను, సుఖాల కొలువు ఐన కోనసీమగా తీర్చి దిద్దిన మహాశిల్పి "సర్ ఆర్ధర్ థామస్ కాటన్ మహాశయుడు" అనడం అతిశయోక్తి కాదు.