మర్నాడు అదే టైమ్! అలాంటి సిట్యుయేషన్. సేం టు సేం!
“హాయ్!” ధీరజ మూడు అక్షరాల్ని మూడుయుగాలు టైప్ చేశానని అనుకుంది.
“నిను చూడక... మనసాగక ఎన్ని పగటి కలలో?” సుభాష్ సెహబాష్ గా పంపాడు
“అబ్బో!”
“నిజం రా! ఎన్ని ఊహలో?”
“పో”
“పొమ్మంటే రమ్మని అర్ధం!”
ధీరజ బోల్డు ‘హాహాహాహ్హ’ లు టైప్ చేసి పారేసింది.
“ఓహ్! సడన్ గా బాస్ పిలుపు! వెళ్ళాలి” సుభాష్ నుంచి వచ్చిన హఠాత్ గా వచ్చిన మెసేజ్ చూసి –
“ఏయ్... ఆగాగు” గాభరాగ రిప్లై ఇచ్చింది.
“ఆగానురా! నిన్ను విడిచి నేనెక్కడికి పోగలను? అసలు కదలగలనా? నిన్ను చూడాలని ఆశ. ఫొటోల్లో తప్ప నిన్ను చూసానా? నువ్వు వైజాగ్... నేను హైద్రాబాద్! సాయంత్రం బీచ్ వైపు వచ్చి ఆ కెరటాల చప్పుళ్లలో, ఆ వీస్తున్న గాలుల్లో నీ నవ్వుల్ని చూద్దామంటే... ఉద్యోగం చెయ్యక తప్పదురా! అక్కడికీ ట్రాన్సఫర్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాను!” బోలెడంత ఆవేదన టక టకా ట్రాన్సఫర్ అయిపోతోంది. పిల్లది నలిబిలి అయిపోతోంది.
“సుభా!”
“చెప్పుమా!” గొప్ప ముద్దు.
“మధు నన్నేమీ అనడు కానీ ఇక్కడ ఉండలేకపోతున్నాను. మనసంతా నువ్వే! ఎంత బెంగగా ఉందో!”
“ఎంత లక్కీ నేను? మనసంతా నేనేగా? ఓయ్ పిల్లా! ఇంక బెంగ పడకు. భోజనం చేసి నిద్రపో! సాయంత్రం నెట్ సెంటర్ కి వెళ్ళి సరదాగా స్కైప్ నేర్చుకో! నేను నేర్పుతా అంటే నీకు డౌటు! అందులో ఏమి లేదు పిల్లా! హాయిగా ఒకరిముందు ఒకరు కూర్చుని చూసుకుంటూ కబుర్లు చెప్పుకోవొచ్చు. సరేనా? ముత్యాల్లాంటి ప్రింట్ అక్షరాలు ధీరజ గుండెల్లోకి దూసుకుపోయాయి. అంతే.
“సుభా! ఐ లవ్యూ!” టైపింగ్ ప్రేమ సూపర్ డూపర్ హిట్!
“మీటూ రా! ఇప్పుడు నేను ఒక అద్భుతమైన బహుమతి ఇవ్వబోతున్న కాచుకో!”
“సరే!”
“కళ్ళు మూసుకుని నన్ను తలుచుకుంటూ ఓకే అన్నప్పుడు కళ్ళు తెరచి చూడాలి!” అన్నాక సరే అంది.
పిక్చర్ మెసేజ్ అది. ఒక యవ్వన జోరు మరో యవ్వనాన్ని గాఢంగా ముద్దు పెట్టుకుంటున్న ఫోటో అది. దాన్లో అమ్మాయి తన్మయత్వం స్పష్టంగా కనపడుతోంది.
“వావ్!” అని టైపు చేసింది ధీరూ.
“ఏయ్! ముద్దెక్కడ పెట్టానో చెప్పుకోవాలి ఉమ్మ్... అన్నాడు”
“కళ్లమీద!”
“కాదు. పాపిట మీద… తలవంచి... దగ్గరగా తీసుకుని...
“……..” చుక్కలొచ్చాయి సుభాష్ కి అక్షరాలకి బదులు.
“ఏంట్రా? వెళ్తాననా? ఇలా దిగులుగా ఉంటే వెళ్లగలనా?”
“నువ్ మళ్ళీ ఎప్పుడు వస్తావ్?” అక్షరాల దిగులు.
“ఓహ్! ఆదా? ఇలా వెళ్ళిరేపు నా ఏంజెల్ పాదాల ముందు మోకరిల్లి ఉంటాడు ఈ భక్తుడు.” అన్నాడు. అంతే! ధీరజ ఢమాల్! అసలే బలహీనప్పిల్ల! అయినా శక్తి తెచ్చుకుంది.
“ఛ! అలా అనొద్దు! నువ్వు ఉండేది నా ఈ హృదయం లో!” లవ్ సింబల్ పంపించింది.
“వహ్వా! ఏయ్ ఉమ్... రేపు నేను రాగానే ముద్దు ఎక్కడ పెట్టానో చెప్పాలి సరేనా? బై!” వెళ్ళిపోయాడు. అక్కడే రెండు నిముషాలు ఉండి నెట్ ఆఫ్ చేసి ఖాళీ అయిపోయింది ధీరజ.
ఆమెకిప్పుడు లోకం శూన్యం!!
******
ఆ సాయంత్రం చిన్నారి ధీరజ కి బోలెడంత తలనొప్పి వచ్చింది. ఎప్పుడు?
‘మధు’ అనే ఆమె భర్త తలుపు కొట్టగానే!
తల చుట్టూ చున్నీ కట్టుకుని ఉన్న ఆమెని పొదవి పట్టుకుని ప్రేమగా అనునయిస్తూ పడుకోబెట్టాడు మధు. “ఈమె తనది అనుకోగానే ఒక దగ్గరతనం ఉప్పొంగింది. తను ఎనిమిదిగంటలు డ్యూటీ లోనే ఉంటాడు. అన్ని గంటలూ ధీరజ ఒంటరిగానే ఉంటుంది పాపం. ఎంతకష్టం!” అనుకున్నాడు.
ధీరజ బి.ఎస్.సి. ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు పెళ్ళిచూపులు జరిగాయి. అప్పుడే పరీక్షలు అయ్యాక పెళ్ళి చేసుకుంటానని నెమ్మదిగా చెప్పింది. ఆ వినయం, ఆమె అందం తనని నిలువనివ్వక పోతే తొందరపడి పెళ్ళికి ఒప్పించాడు. ఇప్పుడు పట్టుదలగా చదువుతోందో ఏమో... తలనొప్పి రాదా! ప్రేమగా తల నిమిరి, తాను ఫ్రెషప్ అయి కాఫీ కాచి ఇచ్చి వంట మొదలుపెట్టాడు. ‘అమ్మయ్య’ అనుకుంటూ హాయిగా నిద్రపోయింది ధీరజ. వంట అయ్యాక ఆమెని సున్నితంగా నిద్రలేపి బతిమాలగా బతిమాలగా అన్నం తినడానికి టేబుల్ దగ్గరికి వచ్చింది. అమ్మడికి ఆకలి దంచేస్తోంది. ఒక దాన్లో ఉప్పులేదు. ఇంకోదానిలో ఉప్పూ కారం రెండూ చాలా ఎక్కువ. ప్చ్! పెరుగుతో అన్నం తిని మళ్ళా మంచం ఎక్కేసింది. టేబుల్ క్లీన్ చేస్తూ చాలా నొచ్చుకున్నాడు మధు. తాను ఇక మీదట శని, ఆదివారాల్లో వంట నేర్చుకుంటానని గట్టిగా చెప్పాడు.
అప్పటికి నెల రోజులయింది పెళ్ళయి!
పడక సంగతి అటుంచితే ముద్దూ, ముచ్చట కి కూడా ఓ దారిలేదు!
“ఏంటీ అమ్మాయి పట్టుదల? ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయకపోతే కొంప మునిగిపోతుందా?” అనుకున్నాడు. మళ్ళీ సర్దుకుంటూ -
‘అయ్యో! చదువు ముఖ్యం కదా? తన కాళ్ళ మీద తాను నిలబడేదాక భర్తగా తన సపోర్ట్ ఉండొద్దూ? పాపం... రోజంతా చదువుతోందేమో? లేక పుట్టింటి మీద బెంగా?’ ఇలా కొనసాగాయి అతడి ఆలోచనలు.
తెల్లవారాక నవ్వుతూ ‘గుడ్ మార్నింగ్’ చెప్పింది. బెడ్ కాఫీ ఇచ్చింది. మంచి టిఫిన్ పెట్టింది. దేవుడి ముందు అగరొత్తులు వెలిగించింది. ఇల్లంతా పరిమళం వెదజల్లుతుంటే అన్నీ సమకూర్చింది. ఆ చిరునవ్వు చూసి ఉత్సాహంగా ఆమె వైపు చూశాడు. టిఫిన్ బాక్స్ అతడి బాగ్ లో సర్దుతూ టైమ్ కి తినాలని జాగ్రత్త చెప్పింది. లిఫ్ట్ వరకు వచ్చి సాగనంపుతుంటే...వద్దని వారించినా ఏమి పరవాలేదని నమ్రతగా చెప్పింది.
‘కొత్త కదా పాపం...అంతా సద్దుకుంటుంది లే’ అని సంబరపడ్డాడు మధు!
లిఫ్ట్ వెళ్ళగానే తలుపు దఢాలున మూసేసింది.సుతారంగా సిస్టమ్ ఆన్ చేసింది.
‘వచ్చేసిందోచ్ ఫేస్ బుక్!’
‘భలే ఉంటారీ ఆడపిల్లలు. ముద్దుచేసి పారేస్తారు కదా అమ్మా బాబులు... సినిమా పైత్యం అంటించుకునీ’ ...అనుకుంటున్నాడు ఇంకా సుభాష్.
వచ్చీరాగానే– ‘శెభాష్ చిన్నారీ!” అన్నాడు. అప్పుడప్పుడు ఇలాంటి ముద్దుపేర్లు వాడి ఆమెను అందలమెక్కించి చలింపజేసి హత్తుకుపోతాడు. ఎలా పిలిస్తే ఆమె సుడిగాలికి అల్లల్లాడే చిగురుటాకులా గిలగిలల్లాడుతూ ఉంటుందో ఒడుపు తెలిసిన వాడు.
“బుజ్జీ... ఎందుకంత సైలెంట్ గా ఉన్నావ్? నిన్ను తలమీదకి ఎక్కించుకున్నా తెలుసా? కులాసాగా లెటర్స్ కొడుతున్నాడు. ఇంకా బతిమాలాలి భామని” అనుకున్నాడు.
“అలా బుంగమూతి పెట్టకూ...”
ధీరజ నిజంగానే బుంగమూతి పెట్టేసింది.
“నువ్వు నిజంగా నాకోసం ఎదురుచూసావో లేదో అని డౌట్!” అంది. ఓయాబ్బో! అని మనసులో అనుకుని...
“లేదుగా?”
“పో అయితే... నీతో మాట్లాడను!”
“ఎక్కడికీ పోతాను చిన్నదాన? నీ చాటు ల్లో చిక్కుకుంటి చిట్టి దానా!”
“అన్నీ కబుర్లు”
“ఈ కబుర్లే లేకపోతే ఈ చిలుక నా ఒడిలో వాలేదా? నా ప్రాణం విలవిలలాడేదా? నీ వాణ్ని అవాలని గిలగిలలాడేదా?”
“సుభాష్”
“ధీరూ”
“ఐ లవ్ యు ఒక్కటి గుర్తు పెట్టుకో! నీకు నేను, నాకు నువ్వు!”
“తెలుసు కన్నా! నాన్నని ఎదిరించలేక... మధు తో ఉండలేక నేను నరకం అనుభవిస్తున్నాను!”
“బంగారూ! జరిగిందేదో జరిగిపోయింది. ఇంక మనమేం చేయాలో ఆలోచిద్దాం!”
“నువ్వు అప్పుడే పరిచయం కదా? చెప్పి ఉండాల్సింది. ఎంత పిచ్చిచేసాను!”
“ధీరూ! ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని నువ్వంటుంటే అసలు ఎక్కలేదు నాకు. నువ్ ఒప్పేసుకుంటావని కూడా అనుకోలేదు. నాకు మళ్ళీమళ్ళీ చెప్పి ఒత్తిడి చేయాల్సింది!”
“నా తలరాత!” ఎవరో అన్న మాట అది. ఎందుకు అంటారో కూడా తెలియదు అమ్మణ్ణి కి.
“నీ తలరాత మారుస్తా. నేనెన్నటికీ నీ వాడిని”
“వీపింగ్ రా...!” బోలెడన్ని సినిమాల సీన్లు గుర్తొచ్చి ఆటోమాటిక్ గా కన్నీళ్ళు ఉత్తినే రెడీ.
“నో. నో. నీకు నేనున్నాను. అవునూ స్కైప్ నేర్పుతాను రెడియేనా?”
“వాట్శప్ అయితే ఈజీ ట కదా... ఎవరో చెప్పారు. సరే నువ్వేదంటే అదే!”
ఎలా ‘లాగిన్’ అవాలో ఒకటికి రెండు సార్లు విడమరిచి చెప్పాడు. చేతకాకపోతే _
“అమ్మడికి బుర్ర తక్కువే!”
“సుభాష్! అల్లా అన్నావంటే చూడు”
“సరే ఈ సారి శ్రద్దగా విను” టైప్ చేశాడో, లేదో.. .
ఓపెన్ అయిపోయింది స్కైప్. సుభాష్ ని చూసి “ఎంత హండ్సమ్ గా ఉన్నాడు? అని ధీరజ అనుకుంటే... ధీరజ ని చూసి లొట్టలేశాడు సుభాష్. ’లడ్డూ లాంటి పిల్ల. లక్కీ ఛాన్స్!’ అనుకున్నాడు. ఎందుకో స్కైప్ ఆఫ్ అయిపోయి మళ్ళీ మళ్ళీ ట్రై చేసింది ధీరజ.
కొన్ని చెదురుమదురు గీతలు నెమ్మదిగా క్లియర్ పిక్చర్!
“నువ్ చాలా అందంగా ఉన్నావు ధీరూ!” మత్తుగా మగటోన్.
నువ్వు నాక్కనిపించడం లేదు సుభా!” ఏడుపు మొహం పెట్టింది. ఈసారి నవ్వు వినిపించింది.
“ఇక్కడ నేను కూడా ఇక్కడ ఆన్ చేయాలి ధీరూ!” అంటూ వచ్చాడు.
“అమ్మయ్య! ఎంత అదృష్టం సుభా!”
“అమ్మాయి గారికి అన్నీ ఎక్కువే!” అన్నాడు డబుల్ మీనింగ్ లో. ఎలాగైతేనేం? ఒకరికొకరు బాగా నచ్చారు. ఒకటే చూసుకున్నారు. చూసుకుంటున్నారు.. . చూసుకుంటూనే ఉన్నారు. తనివితీరా! మనసారా!
మూడు సంవత్సరాల పరిచయం. సినిమాల్లోలా ఒకటే తపన!
“నువ్వు ఎటో చూస్తున్నట్టు ఉంది సుభా!”
“అలాగే ఉంటుంది బుజ్జమ్మా!”
“నువ్ నాకు చాలా నచ్చావు సుభా!”
“అవునా? నువ్వూ నాకు చాలా నచ్చావ్. నేనూహించిన దానికంటే బాగున్నావు. కాకపోతే... ఒక్కొక్కమాట సాగదీస్తూ.
ధీరజ కి సిగ్గే సిగ్గు! “ఈ శుభసందర్భంలో ఒకటి అడగనా? సుభాష్ గొంతులో మత్తు. మళ్ళీ మళ్ళీ సద్దుకుని...”
“ఒద్దు లే. ఇంకోసారి!” అన్నాడు మళ్ళీ.
“నా దగ్గర సందేహమా?” అలిగింది.
“మరి నువ్వేం అనకూడదు అడిగాక!” ముందర కాళ్ళకి బంధం వేశాడు.
“అనను. ప్రామిస్!”
అడగబోతున్నట్టు మొహం పెట్టి స్విచ్ ఆఫ్ చేశాడు.
అదో కొత్త టెక్నిక్!
ఆ తర్వాత ఎఫ్.బి. లోకి కూడా రాలేదు. మూడు రోజులు గడిచాయి.
ధీరజ కి పిచ్చెక్కిపోతోంది. కోపం వచ్చేస్తోంది. ఎందుకు సుభాష్ తనకి ఫోన్ నెంబర్ ఇవ్వడు? వాట్స్ ప్లో కి రాడు? ఎన్నిసార్లు అడిగింది? ఎప్పుడూ మాట మార్చి ఇంకో టాపిక్ లోకి దించడమే!
ఇంట్లో మధు ఆమెని గమనిస్తున్నాడు. అర్ధమయీ, అవనట్టుగా ఉంది. అసలు తాను ఆఫీస్ కి వెళ్ళాక ధీరజ ఏమి చేస్తుంది? బుక్స్ వెతికాడు. నోట్సులు పొందికగా రాసినట్టు ఉన్నాయి. చిన్న నోట్ బుక్ లో తానేమేమి చదివింది, ఇంకా ఏమేమి చదవాలో డేట్స్, టైమింగ్స్ రాయబడి ఉన్నాయి. ఆమె కబ్బోర్డ్ అంతా వెతికాడు. బట్టలన్నే లైనుగా కుదురుగా ఉన్నాయి. ఇల్లంతా కలియదిరిగాడు. తాను అనుమానించడానికి ఏమీ లేదు. ఆలోచనలో పడ్డాక – ఆమెకి సెక్స్ మీద భయం లాంటిది ఏదో ఉందని అనిపించింది. ఒక లేడి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి తన ప్రోబ్లమ్ ఏమిటో చెప్పాడు. డాక్టర్ నెమ్మదిగా, దయగా ధీరజకి ధైర్యాన్నిచ్చే ఎన్నో సంగతులు చెప్పుకుపోతుంటే ధీరజకి నవ్వు ఆగడం లేదు.
ఆదివారం అలా గడిచిపోయాక సోమవారం తొమ్మిదిన్నర గంటలకి సుభాష్ కోసం సిస్టెమ్ ఆన్ చేసింది. స్కైప్ లోకి వెళ్తే సుభాష్ వచ్చాడు. అదే తడవుగా నిన్న జరిగిన లేడీ డాక్టర్ ఉదంతం చెప్పి బోరున ఏడ్చేసింది.
“కూల్ డౌన్ డార్లింగ్ వర్క్ లోడ్ రా! అందుకే రాలేకపోయా!” అన్నాడు జాలిపడేలా మొహం పెట్టి. రోషంగా తలెత్తింది ధీర.
“నువ్విప్పుడే అటో, ఇటో తేల్చాల్సిందే!” అంది.
“ఏంటోచెప్పరా బంగారం!” అన్నాడు లాలనగా.
“మొదట్నుంచి చూస్తున్నాను నేనంటే నీకు నిర్లక్షం, చులకన, అలుసు...”
“బంగారం! బంగారం! ఆపరా తల్లీ ఇంత పెద్ద పెద్ద అభాండాల నామీద? ఇంత కోపం ఎందుకురా? అనునయించాడు. కాస్త తగ్గింది ధీర!
“మరి? మాట్లాడుతూ మాట్లాడుతూ వెళ్లిపోతావ్! ఫోన్ నెంబర్ అడిగితే మాట మారుస్తావ్! నీ పర్సనల్ విషయం ఏది అడిగిన ఆన్ లైన్ ఆఫ్ చేసి వెళ్లిపొతావ్. ఎందుకలా సుభా? నువ్వంటే ప్రాణం కదా నాకు? నీ కోసమే ఈ బతుకు కదా? నిజం చెప్పు. నేను మధు తో హాయిగా ఉంటూ, నిన్ను మోసం చేస్తున్నాననుకుంటున్నావా?” ఏదో సినిమా లో డైలాగులు ఔపోసన పట్టేసింది ధీరమ్మ. ఆమె కళ్ళల్లో నుంచి నీళ్ళు సుళ్ళు తిరిగి రాలిపడ్డాయి.
“ధీరూ! తల్లీ, బంగారం, బుజ్జమ్మా! నాకోసం ఇంత కన్నీరా? నీ మీద నాకు డౌటా?” అతడి మొహంలో భరించలేని బాధ!
“సరే! నువ్వు నన్ను నమ్మడం లేదని అర్ధం అవుతోంది. ఇదుగో నా ఫోన్ న్ంబర్. కాల్ మీ!” అన్నాడు. కాల్ చేసింది. నెక్స్ట్ సెకెండ్ ఫోన్ లిఫ్ట్ చేశాడు.
“ఇప్పుడు అమ్మాయి గారికి తృప్తిగా ఉంది కదా?“ అన్నాడు.
“సారి!” అంది చెవులు పట్టుకుని తలవంచి. ఇదీ అమ్మాయి గారు సినిమాలో కాపీ కొట్టిందే!
ఇదేసందు...అదే మందు అన్నట్టుగా “ఇప్పుడు అడగవచ్చా?” కొంటెగా అడిగాడు.
“ఊం!” అంది.
“ఈ బంగారు బొమ్మని, అపరంజి రెమ్మని బుజ్జిపాపాయిలా కళ్ళారా చూడాలని“ అని ఆగాడు.
“హహహ! నావయసిప్పుడు ఇరవై రెండు. నన్నెలా బుజ్జి పాపాయిలా ఎలా చూడగలవ్?” పకపక నవ్వుతూ ఏదో అర్ధమయి టక్కున ఆగిపోయింది.
“అలా నవ్వకు. మతిపోతుంది నాకు. ఈ స్కైప్ లో నుంచి వచ్చేసి అమాంతం ఎత్తుకుపోగలను. అప్పుడుంటుంది నీ పని!” కవ్వించాడు. ఇంకా పగలబడి నవ్వింది. ఆ రోజంతా నవ్విస్తూనే ఉన్నాడు. దాదాపు రెండు గంటల పాటు ఉన్నాడతడు.
“సరే కానీ నేను అడిగింది బాగా ఆలోచించు. ఐయామ్ వెరీ సీరియస్!” అని కట్ చేశాడు తెలివిగా. తన మాటల్తో పిచ్చిదాన్ని చేస్తే తప్ప తన మాట వినదని అర్ధం అయిపోయింది సుభాష్ కి.
సడన్ గా స్కైప్ ఎందుకు కట్ అయిందో తెలియక ఎఫ్.బి. లోకి వచ్చి మెసేజ్ ల మీద మెసేజ్ లు ఇచ్చి గ్రీన్ లైట్ వెలగకపోతే అతడు ఆన్ లైన్ లో లేనట్టు అర్ధమై దు:ఖం ఆగలేదు. మర్నాడు పొద్దున్న దాకా అతడింక కనపడడు. ఓ! ఫోన్ నెంబర్ ఉందిగా? కాల్ చేస్తే? లేడికి లేచిందే ప్రయాణం కదా? కాల్ చేసింది. స్విచ్ ఆఫ్! చదవాల్సింది చాంతాడంత ఉన్నా ఏమి తోచనట్టు టివి లో లవ్ సాంగ్స్ పెట్టుకుంది. ఒక హీరోయిన్ ప్రియుణ్ణి తలచుకుని కన్నీరుమున్నీరు గా విలపిస్తోంది. సడన్ గా పాట అందుకోగానే సీన్ మారి పోయి ఎండిపోయిన చెట్టుని ఆనుకుని దిగులుగా, జాలిగా ఏడుస్తోంది. అది చూశాక ఏడుపు వచ్చేసింది ధీరజ కి. బావురుమంది తనని ఆ స్థానంలో ఊహించుకుని!
****సశేషం****
రచయిత్రి పరిచయం ..పేరు: బులుసు సరోజినిదేవిప్రకాశం జిల్లా, దరిశిలో...జూన్ 29, 1956 లో జన్మించిన పట్టిసపు సరోజినీ దేవి, వివాహానంతరం బులుసు సరోజినీ దేవి అనే పేరుతో రచనలు మొదలుపెట్టారు. వీరి తల్లిదండ్రులు పట్టిసపు ఉమామహేశ్వరరావు గారు జోగులాంబ గారు . ఈమె 2010లో తన మొదటి కవితతోనే జాతీయస్థాయి రంజని కుందుర్తి అవార్డు సొంతం చేసుకొని రచనలను మొదలుపెట్టారు. 2011లో మరో జాతీయస్థాయి ఎక్స్ రే అవార్డును పొందారు. వీరి మొదటి కథ రంజని వారు సాధారణ ప్రచురణకి తీసుకున్నారు. తర్వాత నాలుగు కథలకు ప్రైజులని రంజని వారిచే పొందారు. వీరు రాసిన "శ్రీముఖి" అనే నాటిక జాతీయస్థాయి రెండవ బహుమతి పొందింది. సంగీత స్రష్ఠ శ్రీశ్రీ శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసి ఎంతో అదృష్టాన్ని కూడగట్టుకున్నారు. నాలుగు గురజాడ పురస్కారాలను అందుకున్నారు. వీరు 'కళామిత్ర' అనే బిరుదును పొందారు. ఉన్నత ప్రమాణాలు విలువలు కలిగిన రచనలు చేయడం వీరికి ఇష్టం. నాలుగు నవలలు, నాలుగు నాటికలు, దాదాపు 500 కథలు, 300 కవితలు, కొన్ని వ్యాసాలు రాశారు. వీరికి రచనలు చేయడం అంటే ఎంతో ఇష్టం. ప్రముఖుల ప్రశంసలు: తెలుగు సాహిత్య ప్రపంచంలో బులుసు సరోజినీ దేవి గారి పేరు వినని వారు ఉండరు. ఆమె రాసిన ఈ మూడు కథలు వైవిధ్యవంతమైన జీవితాన్ని పరిచయం చేస్తున్నాయి. 'రెండో పెళ్లి', 'బొంకుల దిబ్బ' అనే కథలు స్త్రీల వైపు నుంచి జీవితాన్ని చూడడానికి... పారాహుషార్ అనే కథ నన్ను నివ్వెరపరిచింది. ఒకప్పుడు టిప్పు సుల్తాన్ దాడికి గురైన ఆ కథ ఇప్పుడు చెప్పటంలో మరొక కొత్త సత్యం ఆవిష్కరణ ఆవిష్కారమవుతోంది. చరిత్రల్ని సాధారణంగా మనం స్థూలంగా దేశానికో, ప్రాంతానికో, రాష్ట్రానికో సంబంధించినవిగా చెప్పుకుంటాము.విభేదనలకు గురికాబడ్డ కారణంగా మనం ఒక జాతిగా, రాష్ట్రంగా, ప్రాంతంగా రూపొందే క్రమంలో చరిత్రను స్థూలంగా చెప్పుకునే క్రమంలో, చాలాసార్లు సూక్ష్మ చరిత్రల్ని మనకు తెలియకుండానే తుడిచేస్తుంటాము. అలా తుడిచి పెట్టబడటానికి ఇష్టపడని ఒక సూక్ష్మ చరిత్ర స్థూల చరిత్రకు ఎదురు తిరిగిన ఈ కథ చదివితే పాఠకుడికి ఆ వివేకం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. -వాడ్రేవు చినవీరభద్రుడు |