సంధ్య స్మరణ భుజం మీద చేయి వేసి “ఎలా ఉన్నావు? సరిగా తింటున్నావా?” అంది.
“నా సంగతి సరే తాతయ్య ఎలా ఉన్నారు.. నేనిప్పుడు తాతయ్యని చూడాలి” అంది.
ఇప్పుడు విజిటర్స్ ని అలోవ్ చేయరమ్మా.. సాయంత్రం చూడచ్చు.. ఇంటికి వెళ్ళు అమ్మతో.. ఫ్రెష్ అయి భోజనం చేసి రావచ్చు అన్నాడు దీపక్..
ఎందుకు అలోవ్ చేయరు.. నేను వెళ్తాను.. నేనిప్పుడే చూడాలి అంటూ మాధవన్ వైపు చూసి “నీ విజిటింగ్ కార్డు ఉంది కదా” అంది.
జేబులోంచి కార్డు హోల్డర్ తీసి ఒక కార్డు చేత్తో పట్టుకున్నాడు.
“రా వెళదాం అంటూ అతని చేయి పట్టుకుని ఐ సి యు వైపు వేగంగా నడుస్తున్న స్మరణని విస్తుబోయి చూడసాగింది సంధ్య..
ఆమె చూపులు గమనించినట్టు “అతను పెద్ద పొజిషన్ లో ఉన్నాడుగా ...పంపిస్తారేమో..మనం ఆపినా అదిప్పుడు ఆగదు” అన్నాడు దీపక్.
స్మరణ, మధు నర్స్ కి విజిటింగ్ కార్డు చూపించి లోపలికి వెళ్ళారు. ఒంటినిండా రక,రకాల వైర్లు, ఆక్సిజన్ తో ఉన్న ఆంజనేయులుని చూడగానే స్మరణకి దుఃఖం ఆగలేదు. ఆమె భుజం మీద చేయి వేసి గట్టిగా నొక్కి పట్టుకున్నాడు మధు ధైర్యం చెబుతున్నట్టు.
స్మరణ ఆయన చెవి వైపు ఒంగి మెత్తగా పిలిచింది “తాతయ్యా..!”
“మేడం! మీరు చూసి వెళ్ళండి.. దయచేసి డిస్టర్బ్ చేయద్దు.. డాక్టర్ వస్తే తిడతారు...” హెచ్చరించింది నర్స్.
“తాతయ్య మాట్లాడరా సిస్టర్!” బేలగా అడిగింది.
“ఆయన కండిషన్ ఎలా ఉంది.. నేను ఎవరితో మాట్లాడచ్చు” అడిగాడు మధు.
“ఎనిమిదిన్నరకి డాక్టర్ వస్తారు.. మీరు అప్పుడు మాట్లాడచ్చు.. ప్రస్తుతం మెడిసిన్స్ కి రెస్పాండ్ అవుతున్నారు.. “
“మైల్డ్ ఎటాక్ కి ఇవన్నీ ఏంటి సిస్టర్” అంది కన్నీళ్ళతో స్మరణ.
“మైల్డ్ కాదు... సివియర్ ఎటాక్”
ఆవిడ సమాధానం విన్న స్మరణ షాక్ తగిలినట్టు చూసింది..”నిజమా మీరు చెప్పేది..”
“అవును... ప్లీజ్ మీరింక వెళ్ళండి... డాక్టర్ వచ్చాక రండి” తొందరపెట్టింది ఆమె.
స్మరణ చేయి పట్టుకుని “పద వెళదాం..” ఆవిడని ఇబ్బంది పెట్టకూడదు.. వాళ్ళ రూల్స్ వాళ్లకి ఉంటాయి... డాక్టర్ వచ్చాక మాట్లాడదాము” అంటూ బలవంతంగా బయటకు తీసుకువచ్చాడు మధు.
ఏడుస్తూ వచ్చిన స్మరణ వైపు కంగారుగా చూసి దగ్గరగా తీసుకుని “ఏమైంది తాతయ్య ఎలా ఉన్నారు” అడిగింది సంధ్య.
మధు దీపక్ తో చెప్పాడు..”ఏమి లేదు.. కంగారేం లేదు.. తను బరస్ట్ అయింది అంతే.. డాక్టర్ ఎనిమిదిన్నరకి వస్తారుట నేను మాట్లాడతాను. అవసరం అయితే ఇంకో మంచి హాస్పిటల్ కి షిఫ్ట్ చేద్దాము.. మీరేం టెన్షన్ పడకండి”
స్మరణ ఏడుస్తూ “నాకు ఎందుకు చెప్పలేదు తాతయ్యకి severe ఎటాక్ వస్తే.. అసలు ఎందుకు వచ్చింది? ఏమైంది తాతయ్య ఎందుకోసమైనా టెన్షన్ పడ్డారా” ప్రశ్నలు సంధించింది.
సంధ్య మాట్లాడలేదు. దుఃఖం గొంతులోనే అదిమిపెడుతూ మౌనంగా ఉండిపోయింది.
దీపక్ మధుతో అన్నాడు. “మీరు ఇద్దరూ ఇంటికి వెళ్లి ఫ్రెష్ అవండి నా మిసెస్ కూడా వస్తుంది”
“డాక్టర్ తో మాట్లాడి వెళ్తాను.. డోంట్ వర్రీ” అన్నాడు మధు.
“నేను తాతయ్యని చూడకుండా వెళ్ళను” మొండిగా అంది స్మరణ.
“సరే! సరే! కనీసం కాంటీన్ కి వెళ్లి బ్రష్ చేసుకుని కాఫీ ...” దీపక్ మాట మధ్యలో అన్నాడు మధు.. “అన్నీ అయాయి.. మీరేం కంగారు పడద్దు..”
కాసేపు దీపక్ జరిగిన విషయం మధుకి వివరించాడు. సంధ్య స్మరణకి ఆరోజు రాత్రి ఏం జరిగిందో చెప్పింది. అలాగే రాజమండ్రి వెళ్లి వచ్చిన దగ్గర నుంచి ఆంజనేయులు ముభావంగా ఉండడం, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండడం అన్నీ చెప్పి “ఎందుకో ఆయన చాలా మధన పడినట్టు అనిపించింది.. ఎందుకో నాకు తెలియలేదు.. ఎంత అడిగినా ఏమి లేదమ్మా అన్నారు కానీ అసలు ఏమి చెప్పలేదు. అక్కడ ఏం జరిగిందో ఏంటో... సడెన్ గా ఇల్లు అమ్మకానికి పెట్టారు.. నాకేం అర్థం కావడం లేదు స్మరణా!” అంది.
స్మరణ ఆలోచిస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయింది.
అంత గంభీరమైన వాతావరణంలోనూ సంధ్య మనసులో ఒక మూల ఒక ప్రశ్న సమాధానం కోసం అన్వేషిస్తూ సుడులు తిరగసాగింది.. “అతనెవరు?”
జీవితం విచిత్రమైంది.. ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుందో తెలియదు.. మధ్యలో సాగే ప్రయాణంలో కలుసుకునే బాటసారులే బంధాలు, అనుబంధాలు పేరుతొ మనుషుల చుట్టూ అనేక రూపాలుగా అల్లుకునిపోతారు.. కొన్ని అల్లికలు సులభంగానే వాదులు అవుతాయి.. కొన్ని అల్లికలు చిక్కుముడులుగా మారి బంధం అనే పేరుతొ ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. సంధ్య ని చుట్టుకున్న బంధం ఆంజనేయులు.. ఇప్పుడు ఆ బంధం నిశ్శబ్దంగా తెగిపోయింది. ఆమె కుప్పకూలిపోయింది.
స్మరణ వెర్రిగా అరిచింది. దీపక్ నిశ్చేష్టులయ్యాడు.. నేను కోరక కోరిన ఒక్క కోరిక నువ్వు తీర్చలేకపోయావా తండ్రీ అని మూగబోయిన మనసుతో ప్రశ్నించాడు దేవుడిని.
సరిగ్గా ఎనిమిది గంటలకి సిస్టర్ హడావిడిగా పరుగులు పెట్టడం.. డాక్టర్స్ రావడం.. దీపక్ ని పిలిచి మీకు ఆయన ఏమవుతారు అని అడగడం.. మరో అరగంటలో ఊపిరి ఆగిపోయింది అని చెప్పడం జరిగింది. తండ్రి చెప్పా, చేయకుండా నిష్క్రమించడం తట్టుకోవాలో, కుప్పకూలిన భార్యని ఓదార్చాలో, కన్నీటి సముద్రంలో తల్లడిల్లుతున్న కూతురిని ఊరడించాలో తెలియని అయోమయావస్థలో దీపక్ పిచ్చి చూపులు చూస్తూ ఉండిపోయాడు. అందరినీ ఆదుకోడానికి అక్కడ ఉన్నది ఒకే వ్యక్తి మాధవన్.. చక,చకా జరగాల్సిన కార్యక్రమం అతనే చూసుకున్నాడు. బిల్ కట్టేసి, ఆంజనేయులు పార్ధివ దేహాన్ని, అంబులెన్స్ లో ఎక్కించి, మిగతా ముగ్గురినీ కారులో ఎక్కించి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఆ సమయంలో అతను ఎవరు? ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు అనే సందేహం ఎవరికీ కలిగే సమయం కానీ, ఆలోచన కానీ రాలేదు. చాలా మామూలుగా తన విద్యుక్త ధర్మం లా చేసాడు. తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పి, ఫ్లైట్ టికెట్ పంపించాడు వెంటనే బయలుదేరి రమ్మని.
షాక్ నుంచి క్రమంగా తేరుకున్న దీపక్ తన బాధ్యతలు నెరవేర్చాడు.. రాజమండ్రిలో ఉన్న ఆత్మీయులకి, తమ్ముడికి, అక్కగారికి ఫోన్ లు చేసాడు.
సంధ్య, స్మరణ ల శోకం తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది.
మరునాడు మూడు దాటాక ఆంజనేయులు గారి అంత్యక్రియలు బంధువులు, హితులు, సన్నిహితులు వీడ్కోలుతో గౌరవంగా జరిగాయి.
మౌనం ఓ గాలి కెరటం అయి దిగంతాల వైపు పయనించింది. డెబ్భై ఏళ్ల ప్రస్థానం మహాప్రస్థానంగా పిడికెడు బూడిదలో కలిసిపోయింది. ఆయన సమాధి చుట్టూ కొడుకు, కోడలు, మనవరాళ్ళ కన్నీటి చెరువులు కాపలా కాస్తున్నట్టు ఏర్పడ్డాయి.
వీళ్ళు ఎవరు? వీళ్ళకి నాకు ఏమిటి సంబంధం అని మీనాక్షి కానీ, మధు కానీ అనుకోలేదు.. వాళ్ళు ఎవరు అని దీపక్, సంధ్య అనుకోలేదు.. వాళ్ళు చెప్పినట్టు యాంత్రికంగా కదిలారు.. కార్తీక్ వచ్చాడు. అన్నగారిని పట్టుకుని భోరుమని ఏడ్చాడు... అక్కగారికి టికెట్ దొరకలేదని రాలేదని వీడియో కాల్ చేసి తండ్రి నిర్జీవ శరీరాన్ని చూపించాడు.
పది రోజులు గడిచిపోయాయి. ఈ మధ్యలో మధు తల్లిని అక్కడే వదిలి స్మరణకి ధైర్యం చెప్పి బెంగుళూరు వెళ్ళాడు. మళ్ళీ పదోరోజు వచ్చాడు.
జరగాల్సినవన్నీ యధాప్రకారం జరిగాయి. పన్నెండో రోజుకి రాజమండ్రి కదలి వచ్చింది. ఆంజనేయులు తో శాశ్వతంగా ఆ రోజుతో తెగతెంపులు జరిగాయి అందరికి .. మరునాడు అందరితో పాటు కార్తీక్ కూడా వెళ్ళిపోయాడు. తమ్ముడికి తన బాధ్యతగా చెప్పాడు దీపక్. నాన్న ఇల్లు అమ్మేశాడు.. ఆ వ్యవహారాలు కొంచెం సెటిల్ అయ్యాక చూసి మీ వాటాలు ఇస్తాను.
నాకేం ఒద్దు ... నాన్నని జీవితాంతం కనిపెట్టి ఉంది నువ్వు.. వదిన.. అన్నిటికీ మీరే అర్హులు.. స్మరణ పెళ్ళికి నా కానుకగా నా వాటా ఇచ్చేయి..నేను పెళ్ళితో నా ఇండివిడ్యువాలిటీ కోల్పోయాను.. నన్ను క్షమించు అన్నాడు కార్తీక్. అన్నదమ్ములు ఇద్దరూ కాసేపు గాఢ పరిష్వంగంలో అన్నేళ్ల వియోగాన్ని తోసివేసి దగ్గర అయ్యారు. వదిన గారి పాదాలకు నమస్కరించి సెలవు తీసుకున్నాడు కార్తీక్.
స్మరణ దగ్గరకు వెళ్లి “స్మరణా! బాబాయి అనే వరస తప్ప నీకు నేనేమి చేయలేదు.. నీ పెళ్ళికి తప్పకుండా వస్తాను.. నన్ను మర్చిపోకు” అన్నాడు.
బాబాయ్ అంటూ గట్టిగా వాటేసుకుని బావురుమంది స్మరణ.
కార్తీక్ కూడా తట్టుకోలేకపోయాడు. మధు స్మరణ ని వారిస్తూ “ఊరుకో ఏంటిది? ఇది లైఫ్.. డైజెస్ట్ చేసుకోవాలి” అన్నాడు.
కార్తీక్ అతని వైపు చూసాడు. స్మరణ బాబాయి చూపుల్లో భావం గ్రహించి తల ఊపుతూ అంది “మధు..” అర్ధం అయినట్టు కార్తీక్ మధుకి షేక్ హ్యాండ్ ఇచ్చి “గాడ్ బ్లెస్ యు” అన్నాడు.
అతను వెళ్ళిపోయాక స్మరణ, మధు ఆమె గదిలో కూర్చున్నారు.
“నువ్వు కూడా నాతో వచ్చేసేయ్... ఇక్కడే ఉండి పిచ్చిదానివి అవుతావు.. రేపటి నుంచీ నీ రొటీన్ మొదలు పెట్టు.. కొత్త ప్రాజెక్ట్ వచ్చింది.. మొత్తం నిన్నే హెడ్ గా పెడుతున్నాను. మేక్ యువర్ సెల్ఫ్ బిజీ... అమ్మ, నువ్వు నేను వెళ్ళిపోదాం ... మళ్ళీ వద్దాం. మీ పేరెంట్స్ కూడా రేపటి నుంచీ జాబ్కి వెళ్ళిపోతారు కదా? అన్నాడు.
“నిన్ను చూపించకుండానే తాతయ్యని పంపించేసాను మధూ.. నాకిప్పుడు అసలు దేని మీదా ఆసక్తి లేదు.. ఎందుకింత నిర్లక్ష్యం చేసాను. మనం కలిసిన వెంటనే తాతయ్యకి ఫోన్ చేసి చెప్పడం, వెంటనే మనం రావడం చేసి ఉంటే కనీసం నిన్ను చూసేవాడు ... ఇప్పుడు, ఇప్పుడు నాకు చాలా పెద్ద తప్పు చేసినట్టు అనిపిస్తోంది మధూ!” బావురుమంది.
“అలాగే అనిపిస్తుంది.. నిజానికి నువ్వు చేసిన తప్పు ఏమి లేదు. ఇలా జరుగుతుందని ఊహించలేదు కదా.. ఒక్క రోజే కదా ఆలస్యం అయింది.. కాబట్టి అనవసరంగా ఏదేదో ఊహించుకుని బాధపడకు. అంతా సెటిల్ అవుతుంది. మనం మళ్ళీ వచ్చేనెలలో వచ్చి మీ పేరెంట్స్ తో అన్ని విషయాలు మాట్లాడదాము సరేనా..” లాలనగా అన్నాడు.
స్మరణ మాట్లాడలేదు. ఇప్పుడు తన పెళ్లి మధుతో అమ్మ ఒప్పుకుంటుందా లేదా అన్న సందేహం కన్నా తను తప్పు చేసానన్న అపరాధభావన ఆమెని క్రుంగదీస్తోంది. తాతయ్యని మళ్ళీ ఎలా తెచ్చుకోడం.. ఏదన్నా అద్భుతం జరిగి ఆయన అలా నడిచి రావచ్చు కదా అనిపిస్తోంది.
వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటున్న సమయంలో మీనాక్షి సంధ్యతో మాట్లాడుతోంది. ఆమె వివరంగా ఒకప్పుడు ఇద్దరూ ఇరుగు,పొరుగు అన్న విషయం, మధు, స్మరణ ల స్నేహం, వాళ్ళ అనుబంధం, తిరిగి వాళ్ళు కలుసుకున్న సందర్భం అన్నీ చెప్పింది. సంధ్య విస్తుబోయి వింది. ఈ పన్నెండు రోజులు ఆ తల్లి, కొడుకులు స్వంత మనుషుల్లా ఆ ఇంట్లో జరగాల్సిన కార్యక్రమాలు జరిపించడం, బంధువులని, మిత్రులని ఆదరించడం గమనిస్తోంది కానీ వాళ్ళు ఎవరు? ఈ ఇంటికి వాళ్లకి ఏమిటి సంబంధం అని ఆలోచించే ఓపిక ఆవిడకి లేకపోయింది. ఇప్పుడు మీనాక్షి చెప్పింది విన్న తరవాత ఆమె నోట మాట రానట్టు ఉండిపోయింది.
“మేము మళ్ళీ వచ్చేనెలలో వస్తాము. అప్పడు మిగతా విషయాలు మాట్లాడుకుందాము. ఇప్పుడు మాట్లాడడం భావ్యం కాదు.. అందుకే మీకు మా గురించి చెప్పి వెళ్తున్నాను. మేము పరాయి వాళ్ళం కాదు.. మీ బంధువులం... ఆత్మీయులం.. స్మరణ మా పిల్ల.. మీకేం కావాలన్నా నా కొడుకు ఉన్నాడు. స్మరణ ఎంతో వాడూ అంతే అనుకోండి.. జాగ్రత్తగా ఉండండి.. మీకు చెప్పేంత గొప్పదాన్ని కాదు.. కానీ లైఫ్ అంటే జననం, మరణం... ఇవి రెండూ తప్పవు ... మీరు ఆయన్ని ఒక తండ్రిలాగా చూసుకునేవారని బాబు చెప్పాడు.. మర్చిపోవడం కష్టం.. మర్చిపొమ్మని చెప్పను.. కానీ ఆయన లేరు అన్న వాస్తవం అంగీకరించి ధైర్యంగా ఉండండి.. మీకు రావాలి అనిపిస్తే బెంగుళూరు రండి”
అక్కడే ఉండి ఆవిడ మాటలు వింటున్న దీపక్ కళ్ళు చెమర్చాయి.
మధుని చూడగానే సదభిప్రాయం కలిగింది.. అతను ఇంట్లో మనిషిలా వ్యవహారాలూ చూసుకుంటుంటే గౌరవం కలిగింది.. అభిమానం పెరిగింది... అతను తనకి కాబోయే అల్లుడు అని తెలియగానే గర్వంతో గుండె ఉప్పొంగిపోతోంది.
సంధ్య గుండెల్లో ఓ పక్క అగ్నిపర్వతాలు, మరో పక్క ఘనీభవించిన కన్నీటి సముద్రాలు భాష ప్రవహించడానికి అడ్డుపడుతోంటే మౌనంగా మీనాక్షిని ఆలింగనం చేసుకుని ఆవిడ పట్ల, ఆవిడ కొడుకు పట్ల కలిగిన భావాన్ని, కృతజ్ఞతని ఆ చిన్న ప్రతిస్పందన ద్వారా తెలియచేసింది.
మధు ఆ దృశ్యం చూసి ఒక్క క్షణం అప్రతిభుడై నిలబడి గబుక్కున ఒంగి ఆ దంపతులకు నమస్కరించాడు.
అక్కడ జరుగుతున్న అపురూపమైన సన్నివేశాన్ని మౌనంగా వీక్షిస్తున్న ఆమె చూపులు ఆంజనేయులు ఫోటో వైపు మళ్ళాయి.
గులాబీ దండ మేడలో వేసుకుని నుదుటన కుంకుమ బొట్టుతో ఉన్న ఆంజనేయులు స్మరణ వైపు చూసి నవ్వుతూ “ చూసావా ఎంత హాయిగా సమస్య తీరిందో.. అనవసరంగా టెన్షన్ పడ్డావు తల్లి.. ఇప్పుడు ఆనందంగా ఉందా.. ఆ కన్నీళ్లు ఎందుకురా... నేనెక్కడికి వెళ్లాను.. మరో రెండేళ్లలో నీ కడుపునే పుడతాను” అంటూ తల మీద చేయి వేసి నిమురుతూ దీవించినట్టు అనిపించింది.