Menu Close
VSRao
అశోక మౌర్య
డా. వల్లూరుపల్లి శివాజీరావు

3. అశోకుడు

అశోకుడి రాజ్య కాంక్ష, ఆధ్యాత్మిక ఆతర్మధనం

క్రీ.పూ. 268 లో అశోకుడు మౌర్య సింహాసనం అధిష్టించిన తీరు ఒక పధకం ప్రకారంగా గాని, ఆయన తండ్రి బిందుసార ఊహించిన విధంగా గాని జరగలేదు సరికదా, కేవలం రక్తసిక్తమైన పరిస్థితులలో జరిగింది. బిందుసార మరణం తరువాత 4 ఏళ్ళు జరిగిన ఈ దారుణమైన హింసవల్ల ఈ నూతన మౌర్య చక్రవర్తి అనేక సమస్యలను ఎదుర్కొనవలసి వచ్చింది. తన సామ్రాజ్య పాలనలో అధికారుల విధేయత అతి ముఖ్యమైనది. దీని నిరూపణ కోసం అశోకుడు వీరికి విధేయత పరీక్షలు పెట్టడం జరిగింది. వ్యతిరేకులకు, అవిధేయులకు, పగబట్టిన వారికి శిక్షలు అంగచ్చేధన, మరణం అమలు జేయటం జరిగింది. ఈ అగత్యాలు మౌర్య రాజ్యమంతటా అశోకుడి పాలన ప్రారంభంలో మార్మోగాయి.

పాలన ఆరంభదశలో అశోకుడు ఒక విశ్రామం లేని, వ్యాకులం నిండిన చక్రవర్తి. దీని నుండి బయటపడటానికి ఆయన ఒక ఉత్తమమైన అశరీరి, ఆధ్యాత్మిక జ్ఞాని కొరకు అన్వేషణ ప్రారంభించటం జరిగింది. ఆదిలో జీన (జైన) మతం వైపు ఆకర్షుడయినా, అందులో నిర్దేశించిన పూర్తి అహింస ఆయనకు మూఢత్వం అనిపించి దాని ఎడల మొగ్గు చూపలేదు. ఫలితంగా బౌద్ధమతానికి దగ్గరగా జరిగి ఒక ఉన్నతుడయిన, తనను ప్రభావితం చేయగల బౌద్ధ జ్ఞాని కొరకు అన్వేషించటం జరిగింది. అటువంటి వ్యక్తి లేక వ్యక్తులు తారసపడితే ఆయనకు (వారికి) తనకు లభించిన రాజ్యాన్ని వదులుకోటానికి సిద్ధమయ్యాడు ఈ మూడవ మౌర్య చక్రవర్తి! అశోకుడి ఈ నిర్ణయంలో ఆయన జ్యేష్ఠ పత్ని, బౌద్ధ మత స్తురాలు ‘దేవి’ ప్రభావం చాలా ఉంది.

ఈ అన్వేషణలో ఆయన అనేక మంది జ్ఞానులను, సన్యాసులను తన రాజగృహానికి పిలిపించి, వారికి అనేక బహుమతులు ఇచ్చి వారితో మత సంబంధిత విషయాలు చర్చించటం జరిగింది. ఆయన ప్రశ్నలకు వారినుంచి సంతృప్తికరమైన జవాబులు రాలేదు.

అశోకుడి అన్వేషణ చివరకు ఒక బౌద్ధ భిక్షువు ‘నిగ్రోధ’ (Nigrodha) తో ముగిసింది. ఈయన ఒక రోజు పాటలీపుత్రలో ఒక వీధిలో భిక్షాటన చేయటం అశోకుడు చూడటం జరిగింది. ఆ సమయంలో సుందరుడయిన ఈ యువకుడు, ప్రశాంతమైన రూపంతో నిర్భయంగా మందగమనంతో నడుస్తూ ప్రశాంతతే ఆభరణంగా ధరించి ఉన్నాడు.

ఈ బౌద్ధ భిక్షువును రాజ ప్రసాదానికి అశోకుడు ఆహ్వానించి అయన నేర్చుకున్న మతాన్ని, జ్ఞానాన్ని, విలువలను తనకు బోధించమని వేడుకొనటం జరిగింది. దీనికి నిగ్రోధ “మనఃపూర్వకమైన స్వభావమే అమరత్వానికి సోపానం” అనే చెప్తూ, “ఉదాసీనత మరణానికి మార్గం; మనస్సు మరణించదు; నిరుత్సాహకులు నిర్జీవులు” అని సంక్షిప్తంగా వెల్లడించాడు. ఆ తరువాత ఆయన గౌతమ బుద్ధ వచించిన ధర్మ సూత్రాలు, వీటికి సంబంధిన అనేక విషయాలు విశదీకరించటం జరిగింది. వీటిని విన్న అశోకుడు సంతసించి నిగ్రోధకు బహుమతిగా 4 లక్షల వెండి నాణాలు, రోజుకు ఎనిమిది భాగాల (portions) బియ్యం ఇవ్వ జూపితే ఆయన తిరస్కరించటం జరిగింది. ఈ నిరాడంబర బౌద్ధ భిక్షువు ద్వారా ప్రభావితం అయిన వెంటనే ఈ మౌర్య రాజు ఒక బౌద్ధ సంఘం దర్శించాడు. అప్పటినుంచి బౌద్ధమతం ప్రచారం చేయటం, విస్తరించటం, వ్యాప్తి చేయటం అశోకుడి పాలనలో అతి ముఖ్య భాగమయింది.

పరస్పర విరుద్ధమైన ఆలోచనలు: అసంపూర్ణ ఆధ్యాత్మికతా? లేక రాజ్య విస్తరణా?

నిగ్రోధ ద్వారా ఉపదేశం పొందినా, అశోకుడి మనస్సు బౌద్ధమతంవైపు పూర్తిగా లగ్నమవలేదు. ఆయన మనస్సు ఇంకా రాజ్యాన్ని స్థిరీకరించి, విస్తరించే దిశలోనే ఉంది.

రాజ్యాధికారం స్వీకరించిన తరువాత అనేక పరిపాలనా సమస్యలు అశోకుడిని చుట్టుముట్టాయి. పల్లెల్లోని ప్రజలకు జీవనోపాధి చూపాలి; తన రాజ్యం లోనే జన సాంద్రత ఉన్న చోట్ల నుంచి లేక పరాయి ప్రదేశాల నుంచి ప్రజలను మళ్లించి తక్కువ జనం ఉన్న చోట్ల వారిని స్థిరపరచాలి; రాజ్యం సరిహద్దులలో కోటలు నిర్మించాలి. గనులు, కర్మాగారాలలో కార్మికులను, పనులను పోషించాలి; ఓడ రేవుల ద్వారా విదేశీ వాణిజ్యం, దేశంలోనే ఇతర రాజ్యాలతో వాణిజ్యం, మరో ఎన్నో విషయాలలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలి.

వీటి ద్వారా ఆదాయం పెంచుకోవటం, ప్రజలను సుభిక్షం ఉంచటం రాజు ప్రధమ కర్తవ్యం. అవసరమయినప్పుడు దుష్ప్రవర్తుల మీద దండం ఉపయోగించాలి. అప్పటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా వర్ణాశ్రమాలను ప్రోత్సహించాలి, స్థిరీకరించాలి. అన్నిటి కంటే అతి ముఖ్యమైనది రాజు శక్తి, బలం, ఖజానా, సైన్యం మీద ఆధారపడుతుంది. వీటిన్నన్నిటిని సమర్ధవంతంగా నిర్వహించటానికి అశోకుడికి ఆదిలో కొన్నాళ్ళు పట్టింది.

విశ్వ చక్రవర్తి, రారాజు

అశోకుడి ఆలోచనలలో అతి ముఖ్యమైనది తాను అతి త్వరలో సమస్త ప్రపంచాన్ని జయించి పరిపాలించబోయే ‘విజిగీషు’ (vijigishu: చక్రవర్తి). ఈయనకు ఆదర్శం దాదాపు 70 ఏళ్ల క్రితం ఈ ఘన కీర్తి సాధించిన మాసిడోనియా రాజు ‘అలెగ్జాండర్’. ఈ ప్రయత్నంలో ఈ మౌర్య రాజు “నేను అనేక రాజ్యాలను జయించాలి. ఈ ఆశ్రయ సాధనలో విజయం సాధిస్తే నేను అనేక కోటలు, దుర్గములు, నీటి కాలువలు, వాణిజ్య మార్గాలు, బంజరు భూములమీద నివాసాలు, గనులు, వృక్ష-అడవులు, గజ, అశ్వ సంపద, తదితర లాభసాటి వనరులను స్వాధీనం చేసుకుంటే శత్రువులకు హాని కలిగించి వారిని శాశ్వతంగా నిర్వీర్యం చేయవచ్చు” అని ఆలోచించాడు అశోకుడు.

ఈయనకు ముందు అప్పటి కొంతమంది రాజులు అప్పటి ప్రపంచంలో చాలా భాగాన్ని జయించి తమ రాజ్యాలను విస్తరించి రారాజులుగా వెలుగొందిన వారు చాలామంది ఉన్నారు. సుమారు మూడు వందల ఏళ్ల క్రితం (క్రీ.పూ. 559-530) మధ్య పర్షియా చక్రవర్తి అయిన Cyrus II (Cyrus the Great) మధ్య ఆసియా, పశ్చిమ ఆసియాను జయించి యూరోప్ లోకి జొచ్చుకువెళ్లి టర్కీ వరకు తన ఆధీనంలోకి తీసుకు రావటం జరిగింది. అంతటితో ఆగక అప్పటి వాయువ్య భారతావనిని (గాంధార: ఇప్పటి ఆఫ్గనిస్తాన్; సింధు, పంజాబు) కూడా తమ ఏలుబడిలోకి తెచ్చుకోవటం జరిగింది. ఆ విధంగా Cyrus II అప్పటి జగత్తులో మొదటి ప్రపంచ చక్రవర్తి గా వెలుగొందాడు.

ఇది జరిగిన 200 ఏళ్ళు తరువాత గ్రీస్ రాజధాని ఏథెన్స్ (Athens) కు దగ్గరలో ఉన్న మాసిడోనియా రాజు అలెగ్జాండర్ అనేక గ్రీసు పట్టణాలను స్వాధీనం చేసుకుని ఆఫ్రికాలోని రాజ్యాలను జయించి, పర్షియాలో విజయ పతాకం ఎగరవేసి భారతావనిలో ప్రవేశించి తన సామ్రాజ్యాన్ని పంజాబు వరకు విస్తరించటం జరిగింది.

ఈ ఆలోచనాధోరణిలో ఉన్న అశోకుడు చాణక్య (కౌటిల్య) రచించిన ‘అర్థశాస్త్రం’ లో విశదీకరించిన రాజనీతిని పూర్తిగా అనుసరించటం జరిగింది. ఈ కారణంగా ఆయన కన్ను మొదట తూర్పు సముద్ర తీరాన ఉన్న ‘కళింగ’ రాజ్యం మీద పడింది. ఈ సామ్రాజ్యం ఇప్పటి ఒడిశా (Odisha/Orissa) రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని ‘శ్రీకాకుళం’ జిల్లా వరకు వ్యాపించి ఉంది. ఈ దండయాత్ర అశోకుడు సింహాసనం ఎక్కిన (క్రీ.పూ. 268) తరువాత ఎనిమిదవ సంవత్సరంలో (క్రీ.పూ. 261 లో) జరిగింది.

ఘోర కళింగ యుద్ధం

ఆ కాలంలో అశోకుడు తన సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో కళింగ రాజ్యం ప్రతికూలంగా మారింది. పాటలీపుత్ర నుంచి తన అధీనంలో ఉన్న మధ్య-భారతావనికి (Central Indian Peninsula), దక్షిణ భారతావనికి త్వరగా చేరాలంటే కళింగ రాజ్యం ఒక పెద్ద అడ్డంకిగా మారింది. అదీగాక తూర్పు సముద్ర (బంగాళాఖాతం) తీర వాణిజ్యం అంతా కళింగ రాజ్యం అధీనంలో ఉంది.

విశాల కళింగ రాజ్యాన్ని జయించాలంటే అనేక ఏర్పాట్లు చేసుకోవాలి. శత్రుసైన్య బలం తెలుసు కోవాలి; శత్రు రాజ్యానికి చేరే ప్రయాణ మార్గం, ప్రయాణానికి, యుద్ధానికి అనువైన ఋతువు/కాలం, ఇతర విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పాటలీపుత్ర కంటే కళింగ రాజధాని ‘తోశాలి’ (Tosali/Toshali) లో వాతావరణం అత్యంత వేడిగా ఉంటుంది. అందువల్ల కళింగులతో యుద్ధానికి శీతాకాలం అనువుగా ఉంటుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చలికి అలవాటు పడ్డ ఏనుగులు, అశ్వాలు, ఇతర యుద్ధ జంతువులను తగిన విధంగా వినియోగించుకోవచ్చు.

అశోకుడి సైన్యంలో విలుకాళ్లు (archers), బరిశలతో యుద్ధంచేసే పదాతి దళం, సేనానాయకులు, మావటీల అధీనంలో ఉన్న గజ దళం, యుద్ధ సామాగ్రి (గదలు, ఒడిసెలు/పంగల కర్రలు), ఖడ్గాలు, విల్లంబులు, రాళ్లను విసిరే యంత్ర సామాగ్రి, మొదలగు వాటిని రవాణా చెయ్యాలి. వీటికి తోడుగా భోజన సామాగ్రి, తిను బండారాలు తీసుకువెళ్ళటానికి ఎద్దుల బళ్ల శ్రేణి కూడా ప్రయాణించాలి.

పాటలీపుత్ర-తోశాలి మధ్య దూరం 900 కి.మీ. అశోకుడి భారీ యుద్ధ సైన్యం మెల్లగా కదులుతూ రోజుకు 20 కి.మీ. (12 మైళ్ళు) మాత్రమే పయనించగలదు. ఇటువంటి మందగమనంతో యుద్ధానికి అనువైన, నిర్ధారించిన గమ్యానికి చేరాలంటే కనీసం 5-6 వారాలు పట్టింది.

గంగానదికి కుడి తీరాన ఉన్న పాటలీపుత్ర నుంచి మౌర్య సైన్యం మొదట బంగ/వంగ (Banga: Bengal; Vanga) దేశం లోని మిడ్నపూర్ (Midnapur) చేరుకొని, అచ్చట నుంచి మహానది డెల్టా ప్రాంతాన్ని దాటి కళింగలో ప్రవేశించి గమ్యం తోశాలి చేరుకోవాలి.

ఈ కళింగ యుద్ధం ఇప్పటి భుభనేశ్వర్ (భువనేశ్వర్) కు దక్షిణ వైపున 8 కి.మీ. దూరంలో ఉన్న ఎత్తైన ‘ధౌలి’ (Dhauli) కొండ/పట్టణానికి, దీనికి దగ్గరలో ఉన్న ‘దయా’ నది మధ్య ఉన్న విశాల పీఠభూమి మీద జరిగింది. మౌర్య సైన్యానికి అశోకుడు నాయకత్వం వహిస్తే, కళింగ సైన్యానికి రాజు అనంత పద్మనాభ నాయకత్వం వహించటం జరిగింది.

క్రీ.పూ. 261 శీతాకాలంలో ఇరువైపులా భారీ సైన్యాలు మోహరించాయి. ఈ చారిత్రాత్మిక యుద్ధం లో వేలాది సైనికులు అతి కర్కశంగా వధించబడ్డారు, అసువులు బాసారు. యుద్ధ భూమి రక్తశిక్తమయి, రక్తం ఏరులు కట్టి, వరదలై పారి సమీపాన ఉన్న ‘దయా’ (Daya) నదిలోకి ఉధృతంగా ప్రవహించటం జరిగింది. వీరి రక్తం కొన్ని నెలల పాటు ప్రవహించినందువల్ల దయానది క్రమంగా ఎఱ్ఱ రంగు సంతరించుకుంది.

కళింగ యుద్ధం గురించి అశోకుడు వెల్లడించిన మనోవేదన

ఈ చారిత్రాత్మిక మహా మారణ యుద్ధంలో జరిగిన దారుణ రక్త పాతాన్ని చూసి అశోకుడు తీవ్రంగా చలించిపోయి ఈ వినాశనానికి తానే కారణభూతుడని విచారించాడు. కొన్ని ఏళ్ల తరువాత ధౌలిలో ఒక శిలా శాసనం (13వ) ద్వారా ఆయన తన మనోవేదనను ఈ విధంగా వర్ణించటం జరిగింది:

“ఎనిమిది ఏళ్ళు పరిపాలించిన తరువాత దేవుళ్ళకు ప్రియ్యమైన (Beloved of the Gods) ‘రాజు ప్రియదర్శి’ కళింగను జయించాడు. 1,50,000 మంది ప్రజలు (జనులు) బహిష్కరించబడ్డారు; 1,00,000 మంది చంపబడ్డారు, దీనికి ఎన్నో రెట్లు మంది నశించారు……

“కళింగ ను జయించిన తరువాత ‘దేవ ప్రియ’ (Beloved of the Gods) పశ్చత్తాపం పొందారు. ఎందుకంటే ఒక స్వతంత్ర దేశ (రాజ్య) ప్రజల సంహరణ, వధ, మరియు బహిష్కరణ ద్వారా సాధించిన విజయం 'దేవ ప్రియ' కు అమిత దుఃఖం కలిగించింది. ఇది అతి దుఃఖకరమైనది; ఆయన మనస్సును బాగా క్రుంగదీసింది; అచ్చట నివసించే బ్రాహ్మణులు, శ్రమణలు (బౌద్ధ, జైన సన్యాసులు), ఇతర మత శాఖల వారు, బోధకులు, విధేయతతో ఉండే గృహస్థులు, సత్ప్రవర్తనులు, మిత్రులకు అంకితమయిన వారు, పరిచయస్థులు, సహోద్యోగులు, బంధువులు, సేవకులు, ఇతరులు హింసించ బడ్డారు, వధించబడ్డారు, తమ ప్రియ వ్యక్తులనుంచి విడదీయబడ్డారు.....”

“ఆ యుద్ధంలో మరణించిన/చంపబడిన/బహిష్కరింపబడిన వందో వంతు లేక వెయ్యో వంతు జనులు ఈ రోజు ఆ విధంగా బాధపడితే, అది ‘దేవ ప్రియ’ మనస్సుమీద బలంగా పడి దానిని జీర్ణించుకోలేకపోయారు...... ధర్మం విజయ సాధిస్తే అది అత్యంత ఉత్తమమైనదిగా ‘దేవప్రియ’ పరిగణిస్తారు.....”

ఈ చారిత్రాత్మిక యుద్ధం సైనికులతో పాటు బ్రాహ్మణ పురోహితులు, గురువులు, బౌద్ధ సన్యాసులకు జరిగిన నష్టాన్ని చూసి విపరీతంగా అశోకుడు చలించి, పశ్చాతాపం చెంది ఇక భవిష్యత్తులో ఇతర రాజ్యాలమీద దండెత్తకూడదని నిర్ణయించటం జరిగింది. కళింగను లోబర్చుకున్న తరువాత అశోకుడు మనఃపూర్వకంగా ధర్మం ఆశించాడు, ధర్మం ఆచరించాడు, ధర్మం బోధించాడు.

యుద్ధ విజయం కంటే ధర్మ విజయం ఎన్నో రెట్లు మేలు అని తెలుసుకుని అప్పటినుంచి భౌతిక దాడులకు స్వస్తి చెప్పటం జరిగింది. ఆవిధంగా అప్పటివరకు 8 ఏళ్ళు ‘చండ-అశోక’ గా పేరొందిన ఈ మౌర్య చక్రవర్తి శేష జీవితాంతం అంతా, అంటే సుమారు 30 ఏళ్ళు, ‘ధర్మ-అశోక’ గా పేరొందాడు.

ఈ ధర్మ-అశోక తన సిద్ధాంతాలను ఆచరించమని గిరిజనులకు, సరిహద్దు రాజ్యాలకు విజ్ఞప్తి చేయటం జరిగింది. కళింగ రాజ్యానికి అనుబంధంగా ఉన్న సామంత రాజ్యాల ప్రజలు చక్రవర్తిని (అశోకుడిని) తండ్రిగా భావించి ఆయనను విశ్వసించమని కోరటం కూడా జరిగింది. అశోకుడు నియమించిన అధికారులు తన సిద్ధాంతాలను అన్ని వర్గాల ప్రజలలో ప్రచారం చేయాలని ఆదేశించాడు.

ధర్మాచరణంలో ఇతర రాజ్యాల స్వతంత్రను గౌరవిస్తూ వాటిమీద దండయాత్రలకు స్వస్తి చెప్పటం జరిగింది. అంతేకాక పరాయి రాజ్యాల ప్రజల, జంతువుల సంక్షేమం కొరకు చాలా కృషి చేయటం జరిగింది. శాంతిని ప్రబోధిస్తూ అశోకుడు తన రాయబారులను పశ్చిమ-ఆసియా, మధ్య ఆసియాలోని గ్రీకు, పర్షియన్ రాజ్యాలకు పంపించాడు.

Dhauli-Shanti-Stupa-Bhubaneswar
Photo Credit: Wikimedia Commons
ధౌలి (Dhauli) కొండ మీద అశోకుడు నెలకొల్పిన శాంతి స్థూపం: ఇది కళింగ యుద్ధం జరిగిన ప్రదేశం. ఇచ్చటే అశోకుడు చెక్కించిన 13 వ శిలాశాసనం ఉంది.

Kalinga-battlefield-daya-river-dhauli-hills
Photo Credit: Wikimedia Commons
కళింగ (ఒడిశా) లోని దయా నది తీరాలు, దగ్గరలో ఉన్న ధౌలి కొండ/నగరం, అచ్చటి విశాల పీఠ భూమి: ఇచ్చట క్రీ.పూ. 261 శీతాకాలంలో కళింగ యుద్ధం జరిగింది.

అశోకుడి ధర్మ క్షేత్రం గురించి మరి కొన్ని ఆసక్తికర విషయాల గురించి వచ్చే సంచికలో తెలుసుకుందాము.

మీ అభిప్రాయాలు, స్పందన తెలియజేసేందుకు నా ఈ మెయిల్: dr_vs_rao@yahoo.com

****సశేషం****

Posted in September 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!