వీక్షణం 170 వ సమావేశం అక్టోబరు 16న అత్యంత ఆసక్తిదాయకంగా జరిగింది. ఏకబిగిన జరిగిన ఈ సమావేశ ప్రారంభంలో వీక్షణం భారతీయ ప్రతినిధి శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారు స్వీయ పరిచయ కర్తలను సభకు పరిచయం చేసి వారిని వేదికపైకి ఆహ్వానించారు. ఇద్దరు మహోద్దండులైన కవులు డా.గీతామాధవి, శ్రీ వసీరా గార్ల స్వీయపరిచయ ఉపన్యాసం కోసం "ఇంకా తెలవారదేమి, ఈ చీకటి విడిపోదేమి" అంటూ ఎదురు చూసిన వారిలో ఈ సమీక్షకుడు కూడా ఒకరు!
డా.గీతామాధవిగారు తూర్పుగోదావరికి చెందిన జగ్గంపేటలో జన్మించారు. ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి కె.వరలక్ష్మి, శ్రీ రామమోహనరావుగార్ల పెద్దమ్మాయి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నారు. అమెరికాలో అడుగుపెట్టాక కఠినమైన సాహితీదీక్షతో అక్కడి తెలుగువారిని, సాహితీ ప్రియులను వెతికిపట్టుకుని "వీక్షణం" అనే ఈ సాహితీ గవాక్షాన్ని స్థాపించారు.
డా.కె.గీత కవయిత్రి, రచయిత్రి, గాయని, భాషా నిపుణులు. పూర్తి పేరు గీతామాధవి. “నెచ్చెలి” అంతర్జాల వనితా మాస పత్రిక వ్యవస్థాపకులు & సంపాదకులు. అమెరికాలో ప్రఖ్యాత సాఫ్ట్ వేర్ కంపెనీలో "తెలుగు భాషా నిపుణురాలి" గా పనిచేస్తున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషాశాస్త్రంలో పి.హెచ్.డి, అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో ఎం.ఎస్ చేశారు. పది సం.రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. 2006లో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి "ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు" పొందారు.
ద్రవ భాష (2001), శీత సుమాలు (2006), శతాబ్ది వెన్నెల (2013), సెలయేటి దివిటీ (2017), అసింట (2022) కవితా సంపుటాలు, సిలికాన్ లోయ సాక్షిగా (2018) కథా సంపుటి, వెనుతిరగని వెన్నెల (2021) నవల, At The Heart of Silicon Valley -Short stories (2023), Centenary Moonlight and Other Poems (2023), అనగనగా అమెరికా (కాలమ్స్)(2025) ప్రచురింపబడ్డాయి. "అపరాజిత" (గతముప్పయ్యేళ్ల స్త్రీవాద కవితా సంకలనం 1993-2022) 2022 కు సంపాదకత్వం & ప్రచురణ వహించారు.
'గీతా కాలం', "అనగనగా అమెరికా" అనే కాలమ్స్, "నా కళ్లతో అమెరికా", "యాత్రాగీతం" అనే ట్రావెలాగ్స్, "కంప్యూటర్ భాషగా తెలుగు" అనే తెలుగు, ఇంగ్లీషు భాషల్లో భాషా పరిశోధనా వ్యాసాలు, లలితగీతాలు వీరి ఇతర రచనలు. కవిత్వంలో అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం మొ.న అవార్డులు, నవలకు తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ సాహితీ పురస్కారాన్ని పొందారు. రేడియో కార్యక్రమాలలో విరివిగా పాల్గొన్నారు. సాహిత్య అకాడెమీ ఆహ్వానంపై భారతదేశం లోని ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, అస్సామ్ వంటి అనేక ప్రాంతాల్లో సభల్లో పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా ప్రతిష్టాత్మక బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, బెంగుళూరు విశ్వవిద్యాలయం, తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, నన్నయ్య విశ్వవిద్యాలయం, అనేక డిగ్రీ స్థాయి కళాశాలల్లో తెలుగు భాష, సాహిత్యాలపై ఉపన్యాసాలిచ్చారు.
అమెరికాలో తానా, ఆటా, టాటా, వంగూరి ఫౌండేషన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండు, ఫ్రాన్స్ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించారు. 2017లో హైదరాబాద్ లో జరిగిన తెలుగు మహాసభలకు అమెరికా నుండి ప్రత్యేక అతిథిగా ఆహ్వానం పొంది కవిత్వవేదికలో పాల్గొన్నారు. 2019 లో "తెలుగు టైమ్స్" వారిచే అమెరికాలోని 17 మంది తెలుగు ప్రముఖుల్లో ఒకరిగా గుర్తించబడ్డారు. అమెరికాలోని "తానా" తెలుగు బడి "పాఠశాల"కి గత దశాబ్దిగా కరికులం డైరక్టర్ గా సేవలందిస్తున్నారు. లలిత సంగీత గాయనిగా అనేక బహుమతులు అందుకున్నారు. 2017 లో గీత రచయితగా, గాయనిగా సినిమా రంగ ప్రవేశం చేశారు. “గీతామాధవి” షార్ట్ ఫిలిమ్స్ అధినేత. టోరీ తెలుగు రేడియోలో "గీతామాధవీయం" పేరుతో సంగీత, సాహిత్య టాక్ షో ని నిర్వహిస్తున్నారు. తెలుగులో రచయితలందరి వివరాలు పొందుపరిచే "తెలుగు రచయిత" వెబ్సైటు వ్యవస్థాపక అధ్యక్షులు & నిర్వాహకులు.
తన స్వీయ పరిచయంలో ఎన్నో ఉపయోగపడే అంశాలను సభలోని వారితో పంచుకున్నారు. పుస్తకాలు చదవనిదే సాహిత్యం ఒంట పట్టదు అంటారు. 'కవిత్వం తన జీవితంలో ప్రధాన భాగం, కవిత్వం లేనిదే నేను లేను' అని అనర్గళంగా ఉపన్యసించారు. మాబోటి కవులకు ఆమె జీవితం ఓ మార్గదర్శనం. ఓ చేత్తో కవిత్వం రాస్తూ, మరో చేత్తో 600 పేజీల ఒక నవల వ్రాయడం కూడా ఒక అద్భుతం! తాను వ్రాసిన స్త్రీవాద కవిత్వంతో బాగా పాపులర్ అయ్యారు.
పిదప, వ.సీ.రా (వక్కలంక సీతారామారావు)గారు 1980ల నుంచి కవిత్వం రాస్తున్నారు. 1989లో తొలికవితా సంపుటి 'లోహనది' అచ్చయ్యింది. లోహనదికి ఫ్రీవెర్స్ ఫ్రంట్, గరికపాటి అవార్డులు వచ్చాయి. 1994లో సోషియో పొలికల్ పొయెట్రీ ‘మరోదశ’ కవితా సంకలనం అచ్చయ్యింది. 2022లో ‘సెల్ఫీ’ కవితా సంపుటి వెలువరించారు. సెల్ఫీకి ఉమ్మడి శెట్టి సత్యారాధేయ అవార్డు, ఖమ్మం ఈస్థటిక్స్ అవార్డులు వచ్చాయి. వృత్తి జర్నలిజం. వివిధ పత్రికలు టీవీ చానెళ్లలో పనిచేశారు.
వసీరా గారు తమ స్వీయపరిచయంలో గీతామాధవి గారి దారిలోనే వెళ్లారు. వీరు కూడా గీతగారిలాగానే విస్తృతంగా పూర్వకవుల కవిత్వాన్ని చదివారు. భావకవిత్వం, విప్లవ కవిత్వంతో బాటూ, సర్రియలిస్టిక్ పొయెట్రీని వ్రాశారు. వారు ప్రకృతి సౌందర్య పిపాసి. ప్రస్తుతం వ్రాసే కవుల కవితలు ఏవీ హృదయాన్ని తాకడం లేదు అని అసంతృప్తిని వ్యక్తం చేశారు.
పిదప గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, కవిసమ్మేళన సామ్రాట్ డా.రాధాకుమగారి సంయుక్త ఆధ్వర్యంలో కవిసమ్మేళనం ప్రారంభమైంది.
తొలుత గీతామాధవిగారు తన 'అవసరార్థపు పద్యం' కవితలో 'రాతి పొరల్లో అయినా నీరు ఉంటుందేమో - మనిషి గుండెలో మాత్రం జిత్తులమారి నెత్తురే ఉంటుంది' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వ.సీ.రా గారు తన 'సూర్య స్పర్శ' అనే కవితలో సూర్యుని రమణీయతను అందంగా వర్ణించారు.
కె.శ్యామలాదేవిగారు ఆదర్శ మహిళ అనే కవితలో స్త్రీ పడే ఇబ్బందులను వర్ణించారు. ఎవరు గొప్పవాళ్ళు ఏం చేస్తే గొప్పవారు కాగలరు అని భవానీ ముప్పాళ్ళగారు వివరించారు. శ్రీ అయ్యలరాజు సోమయాజుల ప్రసాద్ గారు కవిత్వమంటే ఛందో బద్ధం కావలిసిన అవసరం లేదు అంటూ కవిత్వ లక్షణాలను వివరించారు.
బుక్కపట్నం రమాదేవిగారు మంచి భార్యతో ఒక భర్త ఎలా అనుభూతిస్తాడో చెప్పారు. ప్రసాదరావు రామాయణం అనే నేను నా 'బందిని' అనే కవిత్వంలో స్త్రీ జన్మ ఎంత దుర్భర జీవితాన్ని మోస్తున్నదో చెప్పాను. శ్రీ వీరాచారి గారు గుర్రం జాషువా గారిని గురించి కవిత్వంచెప్పారు. డా.కోదాటి అరుణగారు బతుకమ్మపై శ్రావ్యంగా పాడారు! శ్రీ ఘంటా మనోహర్ రెడ్డిగారు తన ఘంటారావం కవితలో ఊరు వదలనివారికి విశ్వం తెలియదు అంటూ సందేశాత్మకమైన కవిత చదివారు.
ఆనం ఆశ్రితారెడ్డిగారు మాతృభాషా ఔన్నత్యాన్ని తన కవితలో వినిపించారు. ఆలపాటి సత్యవతి గారు దసరాలో అమ్మవారి అవతారాలను స్త్రీ జీవితానికి సమన్వయిస్తూ చదివిన కవిత క్రొత్తగానూ, అద్భుతం గానూ ఉన్నది. అవధానం అమృతవల్లిగారు కడదాకా వినిపించే సవ్వడి కవిత ప్రశంసలను అందుకుంది. బృందగారి చిత్ర విచిత్రం సరదాగా నవ్విపుట్టించింది.
వైరాగ్యం ప్రభాకర్ గారు ఈనాటి యువత డ్రగ్గులతో పెగ్గులతో ఎలా నిర్వీర్యమై పోతున్నారో వివరించారు. నెల్లూరి ఇందిరాగారు మనిషి స్వార్థంతో ప్రకృతిని ఎలా ధ్వంసం చేస్తున్నాడో తన కవితలో వినిపించారు. చీదెళ్ల సీతాలక్ష్మి గారు డా.అబ్దుల్ కలాంగారి గొప్పతనాన్ని చెప్పారు. పరిమి సత్యమూర్తి గారు కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో వివరించారు. మేడిశెట్టి యోగేశ్వరరావుగారి ఓట్లపండుగ కవిత చాలా బావుంది.
షర్మిలగారు ప్రకృతిని ప్రేమిద్దాం కవిత సందేశాత్మకం. వాసిరెడ్డి నిర్మలగారు భూలోక స్వర్గం కవిత చదవగా, శోభాదేశ్ పాండేగారు మనసులో కలిగిన ఆనందం అంటూ చదివారు/ శ్రీ ఉప్పలపాటి వెంకటరత్నం గారి "చెత్త బండోళ్ళు" కవిత హృద్యం గావుంది. దీకొండ చంద్రకళ గారి నవరాత్రి అమ్మవార్లగురించి చదివారు. కొత్త ప్రియాంక ఓటమే గెలుపుకు నాంది అన్నారు. డా.రాధా కుసుమగారి గుడిమెట్లు కవిత ఎంత బావుందో!
చివరగా శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారు తన సహజ శైలిలో, కంచు కంఠం తో అక్షర మాయాజాలం అనే కవిత హైలైట్! గీతామాధవి, రాజేంద్ర ప్రసాద్ గార్ల వందన సమర్పణతో సమావేశం ఆసక్తి దాయకంగా ముగిసింది. ఈ 170వ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.