Menu Close
Rajesam Thokala
బుద్ధుని మార్గం (పద్యకవిత)
తోకల రాజేశం
ఉ: వింతలు కావుగాని పృథివీతలమెల్ల నొకానొకప్పుడ
    త్యంతవిశాలమైన హృదయానికి వేదిక గాగ జీవితా
    లింతకు నంతలై యెదిగెనిచ్చట కేంద్రము జేసి-బుద్ధుడా
    కాంతికి కారణమ్ము-గత గాధలు తోవల జూపు గావుతన్!

చ: కులముల పేరు చెప్పుకొని కొందరు-తాగిన రీతిగా మత
    మ్ముల నడి వీధి జేర్చి జనముల్ శిబిరమ్ములు గట్టి కొట్టుకోన్
    చలికెనయైన మంటయని చంకలు గుద్దెడి వారు కొందరి
    ట్టుల విభజింపజూచిన కడుం జెడు కాలము దాపురింపదే?

చ: గతమును బొందవెట్టి ఘనకార్యము జేసితిమంచు పొంగు దు
    ర్మతుల చరిత్ర నేడు కడు మాన్యతనొందును గాక నంతనే
    చితికి నశించునే నిజము? చెట్టయి లేవక! కాన న్యాయ స
    మ్మతమగు మార్గమెప్పుడు ప్రమాణముగా తలపోయగా వలెన్

ఉ: నీతియు రీతియున్ మనిషి నీడల నుండి పరుంగులెత్తి యే
    గోతియొ?నూతియో వెతుకుకొన్న విధంబుగ నొంటియయ్యె, ఈ
    రాతిరి మాన్పి మానవతలన్ తెలి వెన్నెల వోలె జొన్పి జే
    యూతనొసంగు దివ్య పురుషోత్తముడొక్కడు బుద్ధుడే కదా!

రచయిత పరిచయం

Rajesam Thokalaతోకల రాజేశం మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం ఆవడం గ్రామానికి చెందిన వారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. 9 వ తరగతి చదువుతున్నపటి నుంచే పద్యాలు రాస్తున్నారు. వీరి ఊరు ఆవడంలో చదివే పిల్లలు 20 మందితో శతకాలు రాయించారు. ఇప్పటివరకు వీరు తెలుగు బాల శతకం (2006), చెమట చుక్కలు (నానీలు-2010), పాతాళ గరిగె (సాహిత్య వ్యాసాలు-2013), అడవి దీపాలు (వచన కవిత్వం-2017), మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర (తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురణ-2020), కొబ్బరి నీరా! శతకం (పదిమందితో కలిసి-2023), మట్టి విజయం (పద్యకవిత్వం-2024) అనే పుస్తకాలు ముద్రించారు. తెలుగులో వెలువడుతున్న ప్రసిద్ధ దిన, వార, మాస పత్రికలన్నింటిలోనూ రాజేశం రాసిన కవితలు, వ్యాసాలూ వచ్చాయి. తెలుగునాట ప్రతిష్టాత్మక ఎక్స్ రే ప్రధాన పురస్కారం (2012), సహస్ర వసంతాల పద్య పురస్కారం(2012), సాహితీ శిరోమణి పురస్కారం(2015), సినారె పురస్కారం(2023), తో పాటు రాష్ట్రస్థాయిలో పలు పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రచయితల వేదికకు మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు.

Posted in November 2026, పద్యకవితలు, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *