ఆ రోజంతా త్యాగరాజు తన శిష్యులతో సంగీత సాధనలోని కొన్ని మెలకువలు తెలుపుతూ, గానంలో మధుర భావాన్ని పెంచుటెటులో, శ్రోతలలో భావస్పూర్తి పతాకస్థాయి చేర్చుట ఎటుల సాధ్యమో, శ్రోతల హృదయాలలో ఆర్ద్రతని ఏవిధంగా పెంపొందించవచ్చునో ‘పంచరత్న కీర్తన’ లను ఉదాహరణగా తీసుకుని వివరిస్తూ తాను పాడుతూ గడిపాడు. వాటిలో ఆఖరిది, అతి క్లిష్టమైనది ‘ఎందరో మహానుభావులు’ వివరించాడనికి ఎక్కువ కాలమే వినియోగించాల్సి వచ్చింది.
శిష్యబృందం వెళ్లిపోయిన తరువాత సాయం సంధ్యాదికాలు ముగించుకుని రాత్రి శ్రీరామునికి, సీతమ్మతల్లికి నైవేద్యం ఆరగింపచేసి, పవళింపుసేవ చేసి, రాత్రి తాను అల్పంగా ఫలహారం భుజించి పరుండి పోయాడు. అలవాటు ప్రకారం తెల్లవారు జామున లేస్తూనే శ్రీ రామపాద దర్శనానికి పూజాగృహంలోకి వెళ్లి చూస్తే తర తరాలుగా కొలుస్తున్న ఏకాండ పంచలోహ శ్రీరామపరివార మూల విరాట్ విగ్రహం కనబడలేదు. పొరబాటు బడ్డానేమోననుకుని కళ్లు నులుముకుంటూ మళ్లీ చూసినా, గతరాత్రి చేసిన పూజా నైర్మల్యం ఉందిగాని విగ్రహం మాత్రం లేదు. గుండె గుభేల్ మనగా ఒక్కసారి “రామా” అని అరచి, భార్య కమల, స్నానాదికానికి గానీ తీసిందేమోనని “కమలా” అని పిలిచాడు ఆతృతగా. ఆమె వచ్చి మూల విరాట్ లేకపోవడం చూసి ఆశ్చర్యపోవడం ఇప్పుడు ఆమె వంతు అయింది. పరిస్థితిని గ్రహించి దిగులు చీకటి కమ్మిన త్యాగయ్య అక్కడే కూర్చుండిపోయాడు. ఎల్లా మాయమైపోయాడు తన శ్రీ రామ ప్రభువు? అనుకోకుండా త్యాగయ్య నోటినుంచి వచ్చింది కీర్తన రూపంలో-
మనసా! శ్రీరాముని దయలేక మాయమైన విధమేమి, రాగం: మారరంజని – తాళం: ఆది
పల్లవి: మనసా! శ్రీరాముని దయలేక మాయమైన విధమేమి? ॥మనసా॥
అను పల్లవి: ఘన దురితమ్ముల గోట గట్టి నా కార్యముల చెరచితివో? ॥మనసా॥
చరణము: పర తారల పర ధనముల కాస
బడి చెడి తిరిగితివో లేక
పర జీవాత్ముల హింసించితివో
వర త్యాగరాజ నుతుని మరచితివో ॥మనసా॥
అంటూ నిందాస్తుతి చేసి తన తప్పిదం తెలుసుకుని తానే ఏదో అపరాధం చేసి ఉంటాడు లేకపోతే అంతగా ప్రేమతో భక్తితో నిష్టతో సేవిస్తున్న తన శ్రీరాముడు తనని విడిచి పెట్టి పోవడమేమిటి? తను చేసిన ఏదో తప్పిదం వల్లనే తనపై శ్రీరాముని దయ తొలగిపోయింది…ఏమని చెప్పుకొందును ఎవరితో మొరలిడుదు …త్యాగరాజు భక్తి విరహము తాళలేక;
నిను వినా నా మది యెందు నిలువదే శ్రీహరిహరి; రాగం: నవరస కన్నడ – తాళం: రూపక
పల్లవి: నిను వినా నా మది యెందు నిలువదే శ్రీహరిహరి ॥నిను॥
అను పల్లవి: కనులకు నీ సొగసెంతో
గ్రమ్మి యున్నది గనుక ॥నిను॥
చరణము(లు):
నీదు కథలు వీనులందు
నిండియున్నవి రామ
శ్రీద నీ నామము నోటఁ
జెలగి యున్నది గనుక ॥నిను॥
నేను యెచటఁ జూచినను
నీవైయున్నది రామ
భానువంశ తిలక నీదు
భక్తుఁ డనుచు పేరు గనుక ॥నిను॥
కపటమౌ మాట లెల్ల
కమ్మనైనది నా
తపము యొక్క ఫలము నీవే
త్యాగరాజ సన్నుత ॥నిను॥
మరొక వేదనాభరిత ఆలాపన:
రామచంద్ర నీ దయ రామ ఏల రాదయ, రాగం: సురటి – తాళం: ఆది
పల్లవి: రామచంద్ర నీ దయ - రామ ఏల రాదయ ॥రామ॥
చరణము(లు): కామకోటి సుందర - కరధృత మందరా
ప్రేమమీర ముందర - బిల్వ రాక యుందురా ॥రామ॥
కాననంబు తాపమో - కైక మీద కోపమో
నేను జేయు పాపమో - నీకు శక్తి లోపమో ॥రామ॥
ఆడదన్న రోసమో - అలనాడు పాసమో
మేడలేని వాసమో - మేము జేయు దోసమో ॥రామ॥
కల్లలైన నేయమా - కంటె నీకు హేయమా
తల్ల డిల్ల న్యాయమా - త్యాగరాజ గేయమా ॥
దుఃఖము మరింత పొరలి రాగా నిశ్చేష్టుడై కన్నీరు మున్నీరు కాగా అలాగే ఉండిపోయాడు.
***
గాలివాన తిరువాయూర్ని, కావేరి నదిని వరదలలో ముంచెత్తుతోంది. ఉధృతి పెరిగి, నది అంచున ఉన్న చెట్లను కూకటి వేళ్ళతో పెకలించి కావేరిలోకి లాక్కుని ఆ వరదలో కొట్టుకు పోతున్నాయి సర్వమూ. ఒడ్డున కూర్చుని వానలో తడుస్తూ తన రాముని చూడలేకపోతినే నన్నదిగులు ఆవరించగా చింతాక్రాతుడై ఉన్న త్యాగయ్య వరద ప్రవాహాన్ని విచారంతో అయోమయంగా చూస్తున్నాడు. అప్పుడే నాలుగు రోజులైంది తను అత్యంత ప్రేమతో రోజూ పూజించుకునే రామ పరివార దేవతా మూర్తి అదృశ్యమై. ఎక్కడని వెదకాలి? అయినా ఈ బీదవానింట దొంగలు పడడమేమిటి, తనకు ఉన్న ఆస్తి అంతా అదే అయిన ఆ రామ మూర్తినే దోచుకెళ్లడ మేమిటి? తనకైతే దాని విలువ చెప్పలేనన్ని కోట్లు, కానీ దాని పదార్థ ఖరీదు అంతగా ఉండదు, అందువల్ల అది దొంగల పని అయివుండదు. తనపై రాముని దయ ఎందువల్లో కొరవైంది. ఆ రాముని దయలేనిదే పోయిన విగ్రహం లభించుట అసంభవం. చింత ముప్పిరిగొనగా, భావోద్రేకంతో దుఃఖం తన్నుకుని వచ్చి కన్నులు మూసుకుంటే గొంతులోంచి గీత రూపాన వెలువడ్డ స్వరం;
అన్యాయము సేయకురా రామ! నన్నన్యునిగ జూడకురా; నాయెడ, రామ! రాగం: కాపి – తాళము: ఆది
పల్లవి: అన్యాయము సేయకురా రామ! నన్నన్యునిగ జూడకురా; నాయెడ, రామ! ॥అన్యాయము॥
అను పల్లవి: ఎన్నో తప్పులు గలవారిని, రాజన్య! నీవు బ్రోచినావు గనుకను ॥అన్యాయము॥
చరణము: జడభరతుఁడు జింక శిశువునెత్తి బడలిక దీర్చగ లేదా?
కడలిని మునిగిన గిరి నొక కూర్మము గాపాడ లేదా?
పుడమిని పాండవ ద్రోహిని ధర్మ పుత్రుఁడు బ్రోవగ లేదా?
నడిమి ప్రాయమున త్యాగరాజనుత!
నా పూర్వజు బాధ దీర్ప లేదా? ॥అన్యాయము॥
ఆపుకోలేని భోవోద్రేకంతో కన్నులు మూసుకుని ఇంకా;
ఎన్నడు చూతునో ఇనకులతిలక నిన్నెన్నడు చూతునో, రాగం: కలావతి – తాళం: ఆది
పల్లవి: ఎన్నడు చూతునో ఇనకులతిలక నిన్నెన్నడు చూతునో ..
అను పల్లవి: పన్నగశయన! భక్తజనావన!
పున్నమి చందురుఁబోలు ముఖమ్మును ఎ..
చరణము: ధరణిజ సౌమిత్రి భరత రిపుఘ్న వా
నరయూథపతి వరుఁడాంజనేయుఁడు
కరుణను ఒకరికొకరు వర్ణింప నా
దరణను బిలిచే నిను త్యాగరాజార్చిత! ఎ..
కన్నీటీతో నిండిన కన్నులు తెరిచి చూడగా ఎదురుగా కావేరి వరద నీటిలో కొట్టుకుపోతూన్న కట్టనొక దానికి తగులుకుని సగం మునిగి తేలుతున్న విగ్రహము, కనబడగా, అది నిజనేనా అని కనులు నులుముకుని మళ్లీ చూస్తే, నిశ్చయంగా అవును తను రోజూ ఆరాధించే విగ్రహమే అది! ఉన్నపళంగా లేచి ఒక్క అదటున నదిలోకి దూకి కొట్టుకుపోతున్న ఆ కట్టె వైపు ఆతృతగా శక్తి కొలది వేగంగా ఈదుకుంటూ వెళ్లి ఆ విగ్రహన్ని పట్టుకుని రెండు చేతులతో ఆతృతగా తడిమిచూసి అవును అది తాను రోజు స్నానాదికాలు చేసి తుడిచి పెట్టే ఆరాధించే విగ్రహమే, తాను అత్యంత భక్తితో కొలిచే దైవమే నని నిశ్చయించుకుని ఆత్రుతగా, ఆప్యాయంగా గుండెలకి హత్తుకుని తన మొరవిన్న ఆ దేవుని అపార కరుణకు ఆనందము పట్టలేక ఉబికి వచ్చే కన్నీరు కావేరి నీటి ప్రవాహంలో కలుస్తూండగా, దానిని ఎత్తుకుని ఎట్లా ఈదుతూ ఒడ్డుకు చేరాడో, ఇంటికి ఎట్లా చేరాడో వంటిపై స్పృహలేకుండానే అంతా జరిగి పోయింది. దానిని పీఠము పైన పెట్టి ఆనన్దాశ్రువులు వర్షిస్తుండగా, ఆడుతూ గెంతుతూ ఆనంద పారవశ్యముతో…పాడసాగాడు;
కనుగొంటిని శ్రీరాముని నేఁడు. రాగం: బిలహరి – తాళం: దేశాది
పల్లవి: కనుగొంటిని శ్రీరాముని నేఁడు ॥క॥
అను పల్లవి: ఇనకులమందు ఇంపుగాను బుట్టిన
ఇలలోన సీతానాయకుని నేఁడు ॥క॥
చరణము: భరత లక్ష్మణ శత్రుఘ్నులు కొలువఁ
బవమానసుతుఁడు పాదములఁ బట్ట
ధీరులైన సుగ్రీవప్రముఖులు
వినుతిసేయ త్యాగరాజనుతుని నేఁడు ॥క॥
మరొకసారి కనులారా చూసి ఆనందాన్ని ప్రకటిస్తూ ఇలా పాడసాగాడు;
ఇంతకన్నానందమేమొ ఓరామ రామ , రాగం: బిలహరి, తాళం: రూపకము
పల్లవి: ఇంతకన్నానందమేమొ ఓరామ రామ ॥ఇం॥
అను పల్లవి: సంతజనులకొల్ల సమ్మతియుంటే కాని ॥ఇం॥
చరణము(లు): ఆడుచు నాదమునఁ బాడుచు ఎదుటరా
వేడుచు మనసునఁగూడి యుండేది చాలు ॥ఇం॥
శ్రీహరికీర్తనచే దేహాదియింద్రియ స
మూహముల మఱచి సోహమైనదె చాలు ॥ఇం॥
నీజపములవేళ నీజగములు నీపై
రాజిల్లు నయ త్యాగరాజనుత చరిత్ర ॥ఇం॥ఎ
మరియు ఉద్విగ్న హృదయుడైన త్యాగయ్య ఆ తడిసిన బట్టలతోనే;
ఇన్నాళ్లు దయరాకున్న వైనమేమి? రాగం: నారాయణ; తాళం: గౌళ - చాపు
పల్లవి: ఇన్నాళ్లు దయరాకున్న వైనమేమి?
ఇపుడైన దెలుపవయ్య! ॥ఇన్నాళ్ళు॥
అను పల్లవి: చిన్న నాట నుండి నిన్నేగాని నే
నన్యుల నమ్మితినా? ఓ రామ! ॥ఇన్నాళ్ళు॥
చరణము(లు):
అలనాడు తరణి సుతార్తినిఁ దీర్పను
వలసి నిల్వగ లేదా? అదియుగాక
బలము జూపలేదా? వాని నేర
ములకుఁ దాళుకొని చెలిమిఁజేసి పద
ముల భక్తి నియ్యగ లేదా? నాయందు నీ ॥కిన్నాళ్ళు॥
ధన గజాశ్వములు దనకుఁ గలుగఁ జేయు
మని నే నిన్నడిగితినా? ఇఁక నే
కనక మిమ్మనినానా? శ్రీరామ నా
మనమున నిను కులధనముగ సం
రక్షణముఁ జేసితిగాని మరచితినా? ॥ఇన్నాళ్ళు॥
తల్లి తండ్రి యన్నదమ్ములు నీవని
యుల్లము రంజిల్లఁ బెద్దలతోను
కల్లలాడక మొల్ల సుమముల నీ
చల్లని పదములఁ గొల్లలాడుచు వెద
జల్లితిగాని త్యాగరాజునిపై నీ ॥కిన్నాళ్ళు॥
ఆయన అనుభవిస్తున్న భక్తిమయ ఆనంద పారవశ్యం చూస్తూ, ఆయన భక్తి ఏకాగ్రత తో వేస్తున్న గంతులు చూసి, త్యాగయ్య సతీమణి కమల, ఆయన గురించి ఎంత తెలిసినా, ఈ కొత్త కోణాన్ని చూసి ఆశ్చర్య పడింది. ఆయన ఆనందమే తన సౌభాగ్యముగా తలచి, సీతమ్మకి మ్రొక్కుతూ వరుసగా అనేక ధన్యవాదాలు తెలుపుకొంది.