Menu Close
అయ్యగారి సూర్యనారాయణమూర్తి
స్రవంతి
అయ్యగారి సూర్యనారాయణమూర్తి
శ్రీపద్మావతీదర్శనము
చం.	సరసిజపత్రనేత్రముల సన్నిధిఁ గాంచితి స్వర్ణకాంతులన్
	స్థిరముగ శుక్రవారమునఁ చెన్నగు నా యభిషేకమూర్తిగా
	మురిపెము లొల్కు మోము విధిమూరుతమందునఁ దొల్త, నాపయిన్
	స్ఫురదురుపూర్ణరూపము మనోనయనోత్సవమౌచుఁ గన్పడెన్

 మ.కో.	మాతృదర్శనభాగ్య మీగతి మాటిమాటికిఁ గల్గ నా
	       చేత మెంత ముదబ్ధిశీకరసేచనంబున ధన్యమై
	       ప్రాతరుత్సవభాగ్య మొందెనొ వ్యక్త మే నొనరింపఁగాఁ
	       జేత గాదుగ యట్టి తల్లికిఁ జేతు లెత్తి నమించెదన్

నాదనీరాజనం కళావేదిక వేంకటేశ్వరదర్శనము
ఉ.	చూచితిఁ బాదపద్మములఁ, జూచితి నీ శుభదస్వరూపమున్,
	జూచితి నామమున్ నగవుఁ, జూచితి నీ చుబుకంబు, నా పయిన్
	జూచితి శంఖచక్రములఁ, జూచితి మాతల, మువ్వురున్ మమున్
	జూచినచో ఫలించును మనోరథముల్ వెస వేంకటేశ్వరా! 
                                
ఉ.	వ్యక్తము సేయ నెట్లగు ననంతునికైనను వాణికైన వే
	దోక్తభవన్మహత్వ? మమృతోపమమంగళదాయిమూర్తి! సం
	సక్తము సేయవే మదిని సంతతమున్ భవదంఘ్రిసేవనో
	ద్యుక్తము గాఁగ శంకరకరోత్థితభక్తనికాయవందితా!

ఉ.	నీవె శరణ్యమంచుఁ బదనీరజముల్ కడుభక్తి నమ్మి మా
	భావము లందు నింపుకొని పావనమౌ భవదీయరూపమున్
	గోవెలగంటలోయనఁగ గుండియచప్పుడులే తరింప నీ
	సేవల పాల్గొనంగ దయసేయవె భాగ్యము వేంకటేశ్వరా!

శ్రీరామప్రణతి
ఉ.	నీతికి జాతికిన్ సుగుణనిశ్చలధర్మప్రతీతికిన్ సన
	త్స్ఫాతికి(1) మూలమౌ దశరథప్రభుసూతికి భల్లకీశసం       
	గాతికి(2) దుష్టరాత్రిచరఘాతి కవారితజిద్ధనుష్కళా
	ధీతికి(3) సర్వభూతహితధీయుతసత్యవచోవిభూతికిన్(4)
	పాతికి(5) నంజలింతుఁ బదపద్మపరాగనిరస్తగాలన
	భ్రాతితపోధనాగ్రసరపాణిగృహీతికి(6) విశ్వపాతికిన్(7)
(1)	ఎల్లపుడు వృద్ధికి
(2)	ఋక్షవానరుల స్నేహితునకు
(3)	వారింపబడని, జయించు లక్షణము కల ధనుర్విద్యాకోవిదునకు
(4)	అన్నిభూతములకు హితమైన బుద్ధితో కూడిన సత్యవచనసంపద కలవానికి
(5)	ఏలిక యైన వానికి
(6)	పాదములనెడు కమలముల పుప్పొడి చేత గొప్పమునివరునిభార్య(అహల్య)
యొక్క శాపమును పోగొట్టినవానికి
(7)	క్ష్మానాథునకు
Posted in November 2026, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *