Menu Close
నిర్మలాదిత్య
కథ వెనుక కథ
నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్)

అమెరికా జీవితాలు ఇక్కడ కథలు రాసే వారికి ఎప్పుడూ తరగని ఖజానాలు. ఇక్కడి అక్షయ పాత్రలో పాత్రలకు కొరత లేదు. కాబట్టి ఎన్నో మంచి కథా వస్తువులు దొరుకుతాయి. ఆ కథలు చదువరుల నేపథ్యం బట్టి వారి ముఖాలలో మందహాసం, పెదవి విరుపు, ఏకంగా ముడుచుకోవడం వంటి మెరుపులు, మార్పులు సృష్టిస్తూ ఉంటాయి. కానీ కథా వస్తువు పిల్లల చదువు, పెళ్ళిళ్ళ వైపు మళ్ళితే, ఇక్కడి వారి మనసులు ఒక్కసారి కరిగి ఆర్ద్రతతో నిండిపోతాయి. అందుకే ఈ కథ ఈ దేశంలో పిల్లలని పెంచి పెద్ద చేసి, పెళ్లి చేసిన వారందరికీ మరీ మరీ నచ్చుతుంది అని నా అంచనా. కథా వస్తువు మానవత్వానికి సంబంధించినది కావడం వల్ల అందరికీ నచ్చుతుంది అని కూడా ఆశిస్తున్నాను.

ఇక ఈ కథలో అల్లినట్లు పందిరి కొనడం జరిగింది. కాకపోతే పిల్లల పుణ్యమా అని, కథలలోలా కాకుండా, ఇంటి వెనుక సరస్సు తటాన పెళ్లి పందిరి వేయడం, కావలసిన వారి సందడితో పెళ్లి చేయడం జరిగింది. అలానే ఆ పందిరి ఓ యువ జంటకి అమ్మడం జరిగింది. ఆ జంట వెళ్ళిపోయిన తరువాత ఆ చిన్న మొత్తం తీసుకోకుండా ఉండాల్సింది అని బాధ పడడం కూడా జరిగింది. నేను కూడా అంత మంచి వాడిని కాదని తెలిసింది. అందుకే ఈ కథకు స్ఫూర్తి ఇచ్చిన ఆ వెస్ట్ ఇండీస్ జంటకు ఈ కథ అంకితం.

కొన్ని కథలు మిత్రులు కోరడం వల్ల నేరుగా కథా సంకలనాలకు, వార్షిక సంచికలకు పంపించడం జరిగింది. ఇదివరకు  'సిరిమల్లె' లో ఈ కథా సిరీస్ లో వచ్చిన 'ట్వీట్ ట్వీట్', 'అఖిలం మధురం', ఇప్పుడు మీరు చదవబోతున్న 'మండపం' ఈ కోవలోని కథలే. పత్రికలలో ప్రచురిస్తే పాఠకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అలానే మంచి కథలకు పాఠకుల నుండి ఆదరణ, స్పందన లభిస్తుంది. అది ఈ కథకు మీ నుండి లభిస్తుందని ఆశిస్తున్నాను.

మండపం

మండపం

సాయంత్రం ఇంటి దగ్గరే రెండు మైళ్ళ నడక తరువాత, ఇంటికి వస్తూ పోస్ట్ బాక్స్ లోని ఉత్తరాలను తీసుకున్నాను. బంధుమిత్రులు వాట్సప్ కు, బ్యాంకులు, కరెంట్, నీటి కంపెనీలు పేపర్ లెస్ కు మారాక ఉత్తరాలు కోసం వేచివుండడం, వచ్చిన తరువాత ఆత్రంగా విప్పి చదవడంలో ఉన్న ఆనందం కోల్పోయామనిపిస్తుంది. చాలా మటుకు చెత్తలో వేయాల్సిన ఉత్తరాలే. తాగే నీరు కాలుష్యం తగ్గిస్తాము అని వాటర్ సిస్టమ్స్, కట్టే కరెంట్ బిల్లు తగ్గిస్తాము అని సోలార్ ప్యానెల్స్ అమ్మ ప్రయత్నించే కంపెనీల కార్డులే ఎక్కువ. ఇవి కాకుండా, ఇన్సూరెన్స్ మార్చమని, కొత్త క్రెడిట్ కార్డు తీసుకోమని వచ్చే ఉత్తరాలు కవర్ విప్పకుండానే చెత్త లో వేయాలని చించేస్తున్నాను. అలాంటి కవరే అని చింపి పారవేయబోతుండగా ఏదో కార్డు కవర్లో పెట్టినట్లు గట్టిగా తగిలింది. ఆగి జాగ్రత్తగా కవరు చింపి చూస్తే ఒక ఫోటో కార్డ్ ఉంది.

మండపం ఫోటో అది. ఏదో మాట వరసుకు అడిగాను ఆ పిల్లను, గుర్తుండి పంపించిందే అని ముచ్చట పడ్డాను.

మండపం, చక్కగా అలంకరించారు. ఆ మండపం బొమ్మ చూస్తూనే, నా మనస్సు పులకించిపోయింది. మరో క్షణమే అంతులేని నిసృహ.

మండపం అంటే నాకు ఎందుకీ అబ్సెషన్? మండపం చూడగానే నాకు కలిగే ఈ ఫీలింగ్స్ కు కారణాలేమిటి? నాకేమో ఒక్కోసారి, ఒక్కో జవాబు సరి అనిపిస్తుంది.

***

మొదట్లో నాస్టాల్జియ కారణమనుకున్నాను. చిన్నప్పుడు మా ఊర్లో పెళ్ళిలు ఇంట్లోనే జరిగేవి. పెళ్లికి ఒక వారం ముందే అమ్మతో మేమంతా పిల్లలము మా ఊరికి చేరుకొనే వాళ్ళం. మా నాన్న గారు పని వల్ల, పెళ్లికి ఒక రోజు ముందు మాత్రం వచ్చేవారు.

ఇంటి ముందు వీధిలో, ద్వారాలకు రెండు వైపులా ఉన్న దిన్నెల పైన మా పిల్లలందరికీ ఒకటే ఆటలు. పెళ్లికి ఒకరోజు ముందు మా ఇంట్లోని పని వారు, పెరట్లో ని కొబ్బరి చెట్ల నెక్కి కొబ్బరి మట్టలను నరికి ఇంటి ముందు వేసేవారు. గునపాలతో నాలుగు గోతులు తవ్వి, నాలుగు పొడవాటి దూలాలు పాతి పెట్టడం తో మండపం రూపం మొదట కనిపించేది. అటు తరువాత ప్రతీ దూలానికి ఒక కొబ్బరి మట్ట నిలబెట్టి కొబ్బరి ఆకుల అందంగా అల్లడంతో, మండపం పచ్చ స్తంభాలతో ప్రకృతి అందాలతో కనిపించేది. మరి కొందరు నేల మీదే కొబ్బరి మట్టలు నడుమగా చీల్చి ఆకులు అల్లి, కొబ్బరి చాపలలాగ తయారు చేసేవారు.

ఆ చాపలను నాలుగు స్తంభాల మధ్య, స్తంభాల కొనలు కలుపుతూ పైన కట్టడంతో, పెళ్లి పందిరి కళ వచ్చేసేది. చేనులో ఒక వైపు వేసిన పూల చెట్లనుండి వచ్చిన చేమంతులు, బంతులు సరాలు సరాలు గా, పెళ్లికి వచ్చిన బంధు జనాలలోని అందరు ఆడవాళ్ళు గుంపుగా కూర్చుని, అల్లేవారు. ఆ సరాలను జీతగ్గాళ్లు పందిరి స్తంబాల చుట్టూ, స్తంభాల నడుమ కట్టిన చాపల పైన అందంగా చుట్టి. దుప్పట్లు, దొంతెలు, వధూవరులు కూర్చోడానికి పొడవాటి పీటలు, మండపం లో జరిగే తంతుకు ముక్కాలి పీటలు అలా అమర్చుతూ పోతుంటే అందమైన పెళ్లి మండపం తయారైయ్యేది. ఇప్పుడు తలచు కున్నా ఆపుకోలేని ఆనందం, ఉద్వేగం వచ్చేస్తుంది.

అలా నాకు మండపం మీదున్నది నాస్టాల్జియా అని చాలా సార్లు నాకు నేను సమాధాన పర్చుకొనే ప్రయత్నం చేసాను. ఎందుకో సరి కాదు అనిపించేది.

మండపం గురించి ప్రతి దినం ఆలోచించాల్సిన పని లేదు కదా. నాకు కూడా అంతే. కానీ పరిస్థితులు కొన్ని విషయాలను మన ఆలోచనల స్టేజి ముందుకు తోసేసి మరి కొన్నిటిని తెర మరగు చేసేస్తాయి. అలా మండపం మళ్లీ ఒక సూత్రధారిలా, ఇటీవల, ప్రత్యక్ష మవ్వడానికి కారణం మా అబ్బాయి.

నా లోకమంతా అబ్బాయే అని, ఈ దేశం కాని దేశంలో, బ్రతుకుతున్న దాన్ని. వాడిని పెంచి పెద్ద చేసి, వాడికీ ఒక ఉద్యోగం వచ్చి వాడి జీవితం ఒక గాడిలో పడ్డ తరువాత, వాడి పెళ్లి ఒక సమస్య అయ్యి కూర్చుంది. సమస్య నాకు, వాడికి కాదు.

మా ఇద్దరి పోలికలు వచ్చాయి కాబట్టి అందగాడే. అది ప్రతీ తల్లి అనుకునేదే అని త్రోసి పుచ్చేయకండి. వాడు ఇంటికి తెచ్చి నాకు పరిచయం చేసిన అమ్మాయిల, తేకుండా చూపిన ఫోటోలలో ఉన్న అమ్మాయిల అందాలే దానికి ఋజువు. కానీ ఎవరితో ఎక్కువ రోజులు ఉండడు. ఇక ఇదే అమ్మాయి నా కోడలు అనుకునే సరికి బ్రేక్ అప్ అయ్యింది అని తాపీగా చెప్తాడు. వాడు బ్రేక్ అప్ అయ్యిన తరువాత నా దగ్గర బాధ పడింది మొదటి సారే. ఆ అమ్మాయి వాడితోనే పని చేసేది. బాగా ఇష్ట పడ్డాడు అనుకుంటాను. అటు తరువాత వచ్చిన అమ్మాయిలతో వీడే రాజీ పడలేదు అనిపిస్తుంది. వాడి అందమే వాడికి శత్రువు అయ్యిందనుకుంటాను. డేటింగ్ ఆప్ లో తను నచ్చి వచ్చే అందమైన అమ్మాయిలకు కొదువ లేదు. వదిలేసినా ఇంతకన్నా మంచి సోల్ మేట్ దొరుకుతుందనే నమ్మకం కావచ్చు.

అలాంటిది, ఒక సంవత్సరం పైనే కేరెన్ తో ఒకే అపార్ట్మెంట్ లో కలిసి ఉన్నాడంటే నా ఆశలు మళ్లీ చిగురించాయి. కేరెన్ కూడా నాతో బాగా దగ్గర అయ్యింది. నేను కేరన్ ను కిరణ్ అని పిలిచేంత దగ్గరగా. వాడితో పెళ్లి ప్రసక్తి తేకుండా ఆగలేక పోయాను.

"కిరణ్ నచ్చింది అంటున్నావు. నాకూ నచ్చింది. సంవత్సరం పైన కలిసి కాపురం చేస్తున్నారు. పెళ్లి చేసుకో నాన్న," అంటూ బ్రతిమాలాను.

"కలిసి బాగానే ఉంటున్నాము కదా. పెళ్లి ఎందుకు? కేరెన్ నాకు నచ్చింది. కేరెన్ కు నేను నచ్చాను. మేము విడిపోము అన్న నమ్మకం మాకు ఉంది. ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోదలచుకోలేదు," అని మా అబ్బాయి కొట్టి పడేసాడు.

పెళ్లి ఇప్పుడు కాదంటున్నాడు, కానీ పెళ్లి అవ్వుతే వద్దన లేదు కద. పెళ్లికి ఒప్పుకున్నట్లే అనిపించి నా మనస్సులో ఆనందం ఉవ్వెత్తున ఎగసింది. ఆ ఊపులో పెళ్లి ఏర్పాట్లకు కావలసిన పనులగురించి ఆలోచించడం మొదలెట్టాను. ఇంటి వెనకాల ఒక ఎకరం పైన బ్యాక్ యార్డ్ ఉంది. పచ్చటి పచ్చిక్క, లేండ్ స్కెప్ వేసిన పూల మొక్కలు, చెట్లు - ఇంతకన్నా మంచి పెళ్లి విడిది ఎక్కడ దొరుకుతుంది. ఇంట్లోనే చేయాలనుకున్నాను. అలా చేస్తే నాకు కావాల్సిన విధంగా మండపం ఏర్పాటు చేసుకోవచ్చు అన్న ఆలోచన కూడా ఓ ముఖ్య కారణం అని నా అనుమానం. మండపం మళ్లీ ప్రత్యక్షమై నా ఆలోచనలను ఆక్రమించేసుకున్నది.

నాకు ఉండేది చాలా తక్కువమంది స్నేహితులే. వేళ్ళ మీద లెక్క పెట్ట వచ్చు. ప్రస్తుతం మా ఊళ్ళో ఉన్న నా మిత్రులు మలర్, పద్మ, నర్గీస్ లను పోగు చేసి ఒక వాట్సప్ గ్రూప్ మొదలుపెట్టా. పెళ్లి ఇంట్లో అయినా, బయట చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. రిసెప్షన్ కి హాల్ వెదకాలి. ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, డి.జే, మెహెంది ఆర్టిస్ట్స్, క్యాటరర్ అందరినీ వెదికి పట్టుకోవాలి…మండపం?

అన్నీ పనులు మా గ్రూపులో అందరూ సంతోషంగా పంచుకున్నాం. మండపం దగ్గిరే పేచీ వచ్చింది.

అప్పుడే నర్గీస్ "మండపంకు కావలసినది నాలుగు కాళ్ళు ఒక కప్పే కదా, మనం ఓ కెనోపి కొని మండపం గా మర్చేయొచ్చు," అంది.

"గ్రేట్ ఐడియా. నా దగ్గర సిల్క్ పువ్వులు ఉన్నాయి. మా చెల్లి కావాలంటే మరి కొన్ని ఇండియా లో కొని కొరియర్ ద్వారా పంపించగలదు. వాటితో కెనోపి ను మండపం గా మార్చేయోచ్చు," అంది పద్మ.

"మా ఫార్మ్ లో నుంచి అరటి ఆకులతో ఉన్న చెట్లు, మామిడి ఆకులు తెప్పించి మండపం అలంకరించొచ్చు," అంది మలర్.

"నా దగ్గర పాత సిల్క్ చీరలు ఉన్నాయి. మండపం పైన అందంగా డ్రాప్ చేస్తే బాగుంటుంది," అన్నాను నేను.

అనుకోవడమేమిటి, నేను వెంటనే అమెజాన్ లో వెదికి ఓ మంచి చెక్క కెనోపి ఆర్డర్ చేసాను. నా స్నేహితులు కూడా కావాల్సిన వస్తువులు మరుసటి వారాంతం కి ఏర్పాట్లు చేయడంతో, నేనే లేడీస్ వీకెండ్ ఔట్ అని, అందరినీ ఇంటికి పిలిచాను. మేము ఆట పాటల మధ్యలో, శనివారం పొద్దున్న మొదలు పెట్టి, మండపం ఆ రోజు సాయంత్రానికల్లా పూర్తి చేయ గలిగాము. మండపం అందంగా వచ్చింది. అరటి చెట్లు, పూలు తెచ్చి కట్టేస్తే రేపే అబ్బాయి పెళ్లి పెట్టుకోవచ్చు.

మరుసటి రోజు మా అబ్బాయి వచ్చాడు. వెంటనే వాడిని బ్యాక్ యార్డ్ తీసికెళ్ళి నేను మా స్నేహితులు కష్టపడి కట్టిన మండపం చూపెట్టాను.

"ఓహ్ కెనోపి! మన చెట్లే ఒక పెద్ద పందిరి లాగా కొమ్మలు పరుచుకున్నాయి. మళ్లీ ఈ కెనోపి ఎందుకమ్మా? అదేంటి చీరలు కట్టినట్లున్నారు?" అన్నాడు మా అబ్బాయి.

"అది మండపం రా. నీ పెళ్లి మండపం. ఎలా ఉంటుందో అని కట్టి చూసాము. అరటి చెట్లు, మామిడి ఆకు తోరణాలు, పూలు మాత్రం ఫ్రెష్ గా పెళ్లి రోజు కట్టాలి. పూర్తిగా పెళ్లి మండపం కళ వచ్చేస్తుంది," అన్నాను సంతోషంగా. పెళ్లి మండపం చూపెట్టి వాడి పెళ్లికి తొందర చేద్దాం అని ఒక అత్యాశ నా మాటల వెనుక దాచ ప్రయత్నించాను కానీ, మా వాడు పసి కట్టేసాడు.

"అదేంటమ్మా. అలా అనేసావు. నేను పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పలేదే," ఆశ్చర్య పడ్డాడు మా వాడు.

"నువేంట్రా మరో షాక్ ఇస్తున్నావు. కిరణ్ తో సంవత్సరం పైనే ఉన్నావు. కిరణ్ మాటల మధ్యలో 'ప్లానింగ్ ఫర్ కిడ్స్ ' అంది. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు. నాకు ఒక బాధ్యత అయిపోతుంది కదా. పెళ్లి చేసుకోకుండా పిల్లలను కని నా పరువు తీయొద్దు," అన్నాను నేను, సమస్య తీరిపోయింది అనుకుంటే మళ్లీ మొదటికి వచ్చాడేమిటి అనుకుంటూ.

"నా పెళ్ళికి, పిల్లలు కనడానికి సంబంధం ఏమిటి? 'లివింగ్ టుగెదర్' ఏదో కొత్త తెలియని విషయంగా చెప్పొద్దు. నీ దగ్గరే ఇది వరకు విన్నాను, మీ ముందు జనరేషన్ లోనే ఆ సినీ రచయిత ఎవరో పెళ్లి చేసుకోకుండానే ఇంకో రచయిత్రి తో కలిసి జీవితం గడిపాడు అని నువ్వే చెప్పావు. నన్ను తొందర చేయొద్దు," అన్నాడు మా అబ్బాయి.

"అవును నీవన్నది నిజమే. కానీ అలా బ్రతకడం చాలా అరుదు. బహుశ నాకు తెలిసి వారి జంట ఒక్కటే అలా బ్రతికారు. అలాంటి అరుదైన సంఘటనలు నీకు అన్వయించుకోవద్దు. పెళ్లి చేసుకోరా," అని అడిగాను. బ్రతిమలాడి నట్లనిపించింది.

"అమ్మ ఎన్ని సార్లు చెప్పినా నీకు అర్థం అయినట్లు లేదు. మాకు పెండ్లి చేసుకొనే ఆలోచన లేదు. నీకు అంతగా బాధనిపిస్తే, పెళ్లి ఖర్చుల కని దాచిన డబ్బులు, నాకు ఇచ్చేయి. అవి నర్సరీ కి కావలిస్తే ఖర్చుకు వస్తాయి," తాపీగా అన్నాడు మా అబ్బాయి. వాడి మాటలతో, నా కోపం నషాళానికి ఎక్కేసింది.

"అమ్మంటే నీకు లెక్కే లేదురా. ఎన్ని ఆశలు పెట్టుకొన్నాను. అన్నీ వమ్ము చేస్తున్నావు. నీ పెళ్లి మండపం లో చేద్దామని ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. నీవు ఏ మాత్రం సహకరించవు. ఐ యాం వెరి డిజప్పాయింటెడ్," నా అక్కస్సు ఏ మాత్రం దాచకుండా చెప్పేశాను.

"సో, నువ్వు మండపం మీద కన్న కలలు, నా పెళ్లి తో ముడి పెట్టేస్తే ఎలా అమ్మా. నీ జీవితంలోని తీరని కోరికలకు, తగిలిన దెబ్బలకు నేను, నా పెళ్లి పరిష్కారం కాదు," వాడూ అదే కోపంతో అన్నాడు.

బుద్దులెక్కడ పోతాయి. నాకు, నరహరి కి ఉన్న అవలక్షణాలు అన్నీ కూడా పుణికి పుచ్చుకున్నాడు. వాడన్న మాటలు బాకులు లాగా నా గుండెను గుచ్చుకున్నాయి. వెంటనే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. వాడు నోరు జారాడు అని వాడి ముఖంలో మారుతున్న రంగులే తెలుపు తున్నాయి. కానీ వాడు తన నిర్ణయం మార్చుకోడని, పెళ్లే అవసరం లేని వాడికి, మండపం కూడా అనవసరం అని మా ఇద్దరికీ అర్థం అయిపోయింది.

వాడు విస, విస వెళ్ళిపోయాడు. నేను వెంటనే ఫోన్లో నా బ్యాంక్ ఆప్ కి వెళ్లి, నా అకౌంట్ లో నుంచి పెళ్లికి అని అట్టే పెట్టిన మొత్తం డబ్బు ను వాడి అకౌంట్ కు పంపించేసాను. ఎంత మాట అన్నాడు. అలా మాటలతో హార్ట్ చేయడం వాడు వాళ్ళ నాన్న దగ్గర నుంచే నేర్చుకున్నాడు. తెలివితో బాటు అందంగా ఉండే వారు తక్కువ. కానీ వాటితో బాటు ఒక పొగరుబోతుతనం, పదునైన నాలుక ఉండడం విషాదకరమే. ఆ విషయంలో ఈ తండ్రి, తనయులు అచ్చు గుద్దినట్లు ఒకటే.

నరహరిని కాలేజీలో కలిసాను. మరీ అందగత్తె కాక పోయినా, మంచి ఆకర్షణ ఉన్న ముఖం నాది. నా కళ్ళు మరీను, అని చాలా మంది చెప్పగా వున్నాను. కాలేజీ లో మాత్రం ఫస్ట్. అన్నీ కార్యక్రమాల్లో దూరే దాన్ని, రాణించే దాన్ని. నా వెంట నరహరితో బాటు చాలా మంది వెంట బడ్డా, నేను మాత్రం నరహరికి పడిపోయాను. ఆ మాయలో పడి, మా తల్లి తండ్రుల మాట కూడా వినలేదు. 'వద్దు తల్లి, వాడి ప్రవర్తన సరి అనిపించలేదు. వారి కుటుంబం గురించి కూడా మనకు సరిగా తెలియదు ' అని నాన్న, తను చెప్పడమే కాక చాలా మందితో చెప్పించాడు. చివరకు నన్ను తీసుకెళ్ళి నాలుగు వందల మైళ్ళ దూరంలో ఉన్న, మా చిన్నాన్న ఇంట్లో కట్టడి చేసేసాడు.

నరహరి నేనున్న చోటు కనుక్కొని తన ఫ్రెండ్ కారు ను తీసుకొస్తే మా చిన్నాన్న ఇంట్లో నుంచి తప్పించుకొని నరహరి తెచ్చిన కారు ఎక్కేసాను. అక్కడి నుంచి ఫ్రెండ్స్ సాయంతో రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి కావడం, మేము ఒక ఇంటి వాళ్ళం కావడం జరిగిపోయింది. అలా నా పెళ్లి ఒక మంచి కళ్యాణ మండపంలో జరిగే అవకాశాన్ని నా చేజేతులా నాశనం చేసుకున్నాను. ఆ మాట ఇప్పుడు చెప్పి ఎలా దెప్పి పొడిచాడు నా కొడుకు. కళ్ళలో మళ్లీ నీళ్ళు తిరిగాయి. ఒంటరి తనం ఆవహించింది. నేనంటే మొహం మొత్తి, మరో అమ్మాయి వేటలో పడి, నరహరి నన్ను చంటి వాడితో వదిలేసిన రోజులు గుర్తుకు వచ్చాయి. మళ్లీ పై చదువులు చదివి, ఉద్యోగంలో చేరి, ఈ కొత్త దేశంలోకి వలస వచ్చి, వీడు పైకి రావడానికి నేను పాడిన పాట్లన్ని నా ముందు ఫాస్ట్ ఫార్వర్డ్ అయ్యాయి. వాడికి, వాడి నాన్న లేని లోటు, నా వల్ల అని ఎక్కడో ఓ కోశానా నా మీద కోపం ఉందా? ఎందుకు ప్రతిసారీ ఒక గొడవ తోనే మా మధ్య మాటలు ముగుస్తాయి?

కొంత స్థిమిత పడిన తరువాత వాడు చెప్పిన మాటల్లోను నిజముందనిపించింది. నా పెళ్లి మండపంలో జరగని దాని వల్లనే నాకు ఈ మండపంపై ఈ పట్టింపా?

ఆరు నెలల తరువాత తను తండ్రి కాబోతున్నాని, నేను పెళ్లి కని ఇచ్చిన డబ్బులతో కట్టిన నర్సరీ బొమ్మలు పంపించాడు, నా కొడుకు. ఇంతకూ వాడు పెళ్లి చేసుకున్నాడో లేదో తెలియదు. కానీ తగిలిన గాయాల గాట్లు ఇంకా పచ్చిగానే ఉన్నాయనిపించింది. నేను వాడు పెట్టిన వాయిస్ మెయిల్ కి జవాబివ్వలేదు. ఎందుకో అస్సలు మాట్లాడాలనిపించలేదు.

ఎప్పుడు పెరట్లోకి వచ్చినా కనిపిస్తున్న కెనోపి - కాని పెళ్లి ని గుర్తుకు తెస్తూ, నాకు భయం అంతకు మించి బాధ పెట్టే దిష్టి బొమ్మలా కనిపించ సాగింది. ఇక దీని అవసరం లేదని, మలర్ ని పిలిచి నేనూ తనూ నిచ్చెన వేసుకొని స్తంభాల నట్లు తీసేసి అమెజాన్ వాడు పంపిన కార్డ్ బోర్డ్ కార్టన్ లోనే ప్యాక్ చేసేసాం. నెల దాటింది కాబట్టి అమెజాన్ వాడు రిటర్న్ తీసుకోడు. ఫోటోలు తీసి, క్రెగ్ లిస్ట్ లోనూ, ఫేస్ బుక్ మార్కెట్ ప్లేస్ లోనూ వేసాను. ఐదారు మంది మన ఇండియన్స్ నుంచే ప్రశ్నలు వచ్చాయి. అన్నీ జవాబులు ఇచ్చి, ధర అడిగినంత వరకు తగ్గించి ఒప్పుకున్నా అందరూ చివరి క్షణం వెనుకంజ వేసిన వారే. మన వాళ్లకి ' బయర్స్ రిమోర్స్' కొనక ముందే వచ్చేస్తుందేమో.

ఇక ఎవరూ కొనరు, ఏదో 'గుడ్ విల్ 'కో దానం చేద్దాం అనుకునే సరికి ఒక మెసేజ్ వచ్చింది. తనకు కెనోపి నచ్చిందని, సాయంత్రం వచ్చి తీసుకుంటానని చెప్పింది. వచ్చినప్పుడు చూసుకుందాంలే, లేక పోతే ఈ వీకెండ్ డొనేట్ చేసేద్దాం అనుకున్నా.

అనిత పెర్శాద్ అంటే అమ్మాయని తెలుసు కానీ ఎలా ఉంటుందో తెలియదు. ఎవరో తరచు కేంపింగ్ చేసే అమ్మాయి అయ్యి ఉంటుంది అనుకున్నా. సాయంత్రం ఆరుకంతా చెప్పిన సమయానికి టంచనుగా ఒక అమ్మాయి డోర్ బెల్ నొక్కింది. తలుపు తీసి చూచాను. చామన ఛాయ కంటే నలుపే అనే రంగుతో, పొడవుగా లావు వల్ల పొట్టిగా కనిపిస్తున్న ఆకారంతో, లూస్ గా జీన్స్, టీ షర్ట్ వేసినా దాచుకొలేని పెద్ద పొట్టతో ఉంది ఆ అమ్మాయి అనిత. కానీ వీటి నన్ని కప్పి పుచ్చి ఆ అమ్మాయి అంటే చూస్తూనే ఆప్యాయిత కలిగించే నవ్వు, పెద్ద కంటి అద్దాల వెనుకనున్న చిలిపి కళ్ళు ఉన్నాయి. నా ముఖంలోనూ చిరు నవ్వు. నేను అనిత తో చూసిన వెంటనే కనెక్ట్ అయ్యి పోవడం జరిగి పోయింది.

బేరాలు కూడా ఏమీ చేయలేదు. ఎక్కడ పెట్టారు ప్యాకేజీ అని ఒకటే సారి అడిగివేసింది. ఏమిటంత తొందర అన్నాను నేను. తన సెకండ్ జాబ్ ఇంకో గంటలో మొదలవ్వుతుంది అని హడావుడి గానే చెప్పింది.

గరాజి తలుపు తీసి "బరువుంది ఎవరైనా ఉన్నారా సహాయానికి," అన్నాను నేను.

"ఇదిగో నా బోయ్ ఫ్రెండ్ రిక్," అని ట్రక్ లో నుంచి దిగుతున్న మరో స్థూల కాయాన్ని పరిచయం చేసింది. తను నల్లవాడి లాగానే ఉన్నాడు. ఉంగరాల ఆఫ్రో జుట్టు. ఇద్దరూ చిన్నవారే. ముప్పై లోపే వయస్సు ఉంటుంది. ఇద్దరూ చెరో కొన చేయి వేసి ప్యాకేజీ నీ ట్రక్ లో చేర వేసారు.

అమ్మాయి తొందరలో ఉన్నట్లే తెలుస్తున్నది. పాపం రెండు మూడు జాబ్స్ చేస్తున్న బీద వారిలా కనిపిస్తున్నారు. కానీ ఆ అమ్మాయి ముఖం చూసి నేను నా మనస్సు లో మెదులుతున్న ప్రశ్నలు వేయకుండా ఉండలేక పోయాను.

"నీ ముఖం చూస్తే ఇండియన్ లాగా ఉన్నావు. ఏ దేశం నుంచి వలస వచ్చారు? ఎందుకు ఈ కెనోపి కొంటున్నావు," అని అడిగాను.

"నాది జమైక. నా రూట్స్ ఇండియా నుంచే. కాదంటే మా తాత ముత్తాతలు ఒక నూట యాభై ఏళ్ల క్రితం భారత దేశం నుంచి జమైకాకు వచ్చారు. ఇదిగో రిక్ ది కూడా కరీబియన్ దేశమే. తను గ్రెనడా నుంచి వచ్చాడు. ఇద్దరం వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్నాం. మీరు పెట్టిన ఫోటోలలో ఒక ఫోటో అచ్చు మన భారతీయ పెళ్లి మండపం లాగానే అనిపించింది. నా పెళ్లి భారతీయ సాంప్రదాయాలతో పెళ్ళి మండపంలో జరగాలని ఆశ. ఇద్దరం పని చేస్తున్నా పెళ్లి ఖర్చులు బాగానే అవ్వుతాయి. అందుకే ఇలా కావలసిన వస్తువులు క్రెగ్ లిస్ట్ లో వెతుక్కొని కొంటున్నాము. ఇంతకీ ఎంతన్నారు ఖరీదు?" అడిగింది అనిత.

పర్శాద్ అంటే ప్రసాద్ అని ఇప్పుడర్థం అయ్యింది. అమ్మాయి అనిత ప్రసాద్ అన్న మాట. అనిత, రిక్ లు తమ పర్సులు తీసి ఒక్కో డాలర్ వెదికి పట్టుకొని ఖరీదు కు సరిపడా డాలర్ లు జమ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నాకు చూస్తూనే జాలి, ముచ్చట వేసింది.

"ఎందుకు పెళ్లి మండపంలోనే చేసుకోవాలనుకుంటున్నావు? మీ పేరెంట్స్ మీ పెళ్లికి సాయపడరా?" అడిగాను నేను.

అనిత అంత తొందర లోనూ నవ్వుతూ మీ మొదటి ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు. కానీ రెండో ప్రశ్నకు ఉంది. మా పేరెంట్స్ మేము హై స్కూల్ ముగించిన తరువాత తమ బాధ్యత అయిపోయిందని అన్నారు. ఇక మా పాట్లు మావే. పెళ్లి చేసుకోవడం, దాని ఖర్చులు అన్నీ మావే," అంది. మొత్తం మీద లెక్క సరి పోయిందన్న సంతోషంతో ఒక డాలర్ నోట్ల కట్టను నా చేత పెట్టబోయింది.

ఎందుకో నా గొంతుక అడ్డుకుంది. నా ముఖంలోని మార్పులు అనితకి కనిపించి ఉండాలి.

"కంగ్రాట్స్ అండ్ బెస్ట్ విషెస్. మీ పెళ్లి కి ఈ మండపం నా పెళ్లి కానుక అనుకో. డబ్బు ఇవ్వనవసరం లేదు. వీలైతే ఈ మండపంలో మీ పెళ్లి ఫోటో ఒకటి నాకు పోస్ట్ చేయి," అన్నాను నా గద్గద స్వరం కప్పిపుచ్చుతూ.

డబ్బులు వద్దనే సరికి వారిద్దరి ముఖంలోను ఒక ఆశ్చర్యంతో మిళితమైన ఆనందం కనిపించింది.

"తప్పక పంపిస్తాను. థాంక్స్," అని అనిత చెప్పిన వెంటనే వెళ్లి పోయారు.

***

ఆ అనిత పంపించిన ఫోటోనే ఇది.

బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల పుణ్యమనుకుంటా, కెనోపి ని మండపం లాగా మార్చి బాగానే అలంకరించింది అనిత. నాలుగు మూలల, అరటి చెట్లు కట్టేసారు. పైన మామిడి కొమ్మలు, పూల తో అలంకరించారు. అక్కడక్కడా కరీబియన్ టచ్ లు కనిపించినా, మన సాంప్రదాయ బద్దంగానే మండపం వెలిగి పోతున్నది. మండపంలో అనిత పట్టు చీరలో, రిక్ పట్టు పంచలో, తెల్లటి పలు వరుస నవ్వులతో మరింత వెలిగిపోతున్నారు.

ఫోటో తిప్పి చూసాను. అనిత దగ్గరి నుండి మేసేజి. మండపం ఇచ్చినదానికి మరో సారి థాంక్స్ చెప్పుతూ,

"మీరు మండపంలో ఎందుకు పెళ్లి చేసుకోదల్చుకున్నావు అన్న మీ ప్రశ్న కు నాకు జవాబు దొరికింది. మంచి ప్రశ్న వేసారు. నాలో నేను చాలా ఆలోచించాల్సి వచ్చింది. చివరకు నాకు తట్టిన జవాబు, మండపం చూస్తూనే ఇలాంటి మండంపం లోనే పెళ్లి చేసుకున్న మా తల్లిదండ్రులు గుర్తుకు వస్తారు. ఇంకొంచెం వెనక్కు వెళ్లి ఆలోచిస్తే, వారిద్దరి తల్లి తండ్రులు, నా తాతలిద్దరు, అమ్మమ్మ, నాన్నమ్మ తో కలిసి నలుగురు గుర్తుకు వస్తారు. అలా తరం, తరం వెనక్కు వెళ్తుంటే, రెండు, నాలుగు, ఎనిమిది, పదహారు అంటూ, ఈ భూమి నిండి పోయేంత నా పూర్వీకులు గుర్తుకు వస్తున్నారు. అలానే నేను ఇప్పుడు చూసేవారంతా నా బంధు జనాలే అనిపిస్తుంది. ఈ మండపం నాకు ఆ కనెక్షన్ ఇస్తుందనిపిస్తుంది. అందుకే మండపంలో నా పెళ్ళికి ఇష్ట పడ్డానేమో," అని రాసింది అనిత.

ఒక్క నిమిషం నాకు షాక్ తగిలి, నా మెదడు క్లియర్ అయ్యినట్లని పించింది. నాకు మండపం మీదున్న అబ్సెషన్ కూడా కారణం దొరికింది. మండపంలో నేను నా తెగిపోయిన బాంధవ్యాలకు పరిష్కారం వెదుక్కుంటుంటే, అనితకు మండపంలో  ఏకంగా వసుధైక కుటుంబమే కనిపిస్తున్నది. మండపం నాకూ, అనితకు మరేవరికైన వచ్చే ఆలోచనలకు ఒక సంకేతమే. నాట్యాలలో, నాటకాలలో ఉపయోగించే ప్రాప్ వంటిదే. నాకు కావలసినది మండపం కాదు, నా ఆలోచనలలో మార్పు.

నాకూ నేను సరి చేసుకోవలసిన పాత బాంధవ్యాలు, కొత్తగా చేసుకోవలసిన పరిచయాలు చాలానే ఉన్నాయి. వెంటనే ఆ పని మొదలు బెట్టాలని పించింది.

ఫోన్ తీసి మా అబ్బాయి నంబర్ నొక్కాను.

***

- డయాస్పోరా తెలుగు కథానిక - 2023

********

Posted in November 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *