Menu Close
Samudraala Harikrishna
గోవింద సందేహం! (కథ)
సముద్రాల హరికృష్ణ

"వస్తాను వస్తాను", అని ముచ్చట పడి మారాం చేస్తున్న సత్యను చూసి ఆశ్చర్యపడ్డాడు లీలాక్రృష్ణుడు.

ఏవిఁటిదీ, రుక్మిణీదేవి భవనానికి ఫలహారానికా నే వెళ్తున్నది? ఎందరెందరినో రాజుల నణచివేసి రాజ్యాలు లాక్కొని, వేల మంది స్త్రీలను, రాకుమార్తెలనూ చెరపట్టిన క్రూరాసురుడితో యుద్ధానికి కదా, తెలిసే అడగుతోందా అని అనుమానం వచ్చింది, అంతటి సందేహాల కావలివాడైన జగన్నాథుడికి సైతం!

ఆడవారితో వ్యవహారం, ఏదో అర్థం వుండకుండా ఉండదని నిర్ధారణకు వచ్చి, మెల్లగా అడిగి తెలుసుకున్నాడు కారణం!

తెలుసుకుని "ఓహో చిన్నప్పుడు నేర్చిన అస్త్ర విద్యను ప్రయోగించి చూసుకోవాలనే ఉబలాటం పాపం", అని జాలిగుండె కల నాథుడు కాబట్టి సరే పద,"కొమ్మా, విల్లందుకొమ్మా", అని ధనువందించాడు.

ఆమె వీణ మీటే సన్నని నాజూకైన వేళ్ళతో ఆ ధనువును ఆనందంగా తీసుకుని, సుతారంగా పట్టుకుని- ప్రియనాథుడికి నమస్కరించింది.

మరునాడే ప్రాగ్జ్యోతిషానికి తరలి వెళ్ళాలి. అంతా సన్నద్ధమైంది. సత్యాదేవి మందిరంలో సుమారు గంట నుంచి నిరీక్షిస్తున్నారు, స్వామివారు. ఆమె నేను సిధ్ధమని చెప్పి బయటకు వస్తే, బయలుదేరుదామని!

అంతఃపురాంతర కక్ష్యలోకి అయ్యవారికి కూడా అనుమతి లేదు ఆ రోజు, పోనీ ఆలస్యానికి కారణమేమిటో తామే వెళ్ళి తెలుసుకుందామంటే.

దేవి వారి ప్రధాన సఖి ఈ ప్రవేశ నిషేధాజ్ఞల విషయం చెప్పగానే, సరస శేఖరులు శ్రీకృష్ణులవారు ఒక చిరునవ్వు నవ్వి, ఓపిగ్గా నిరీక్షిస్తున్నారు సత్యాదేవి కోసం!

ఎట్టకేలకు, సాత్రాజితీదేవి రానే వచ్చారు, అపర ఐశ్వర్యలక్ష్మి అవతారంలో!

ఆ ఆభరణ భూషితయై ధనువు దాల్చి వచ్చిన సతిని చూసి అయ్యవారు నిలువెల్లా ఆశ్చర్యంలో మునిగి పోయారు! పసిడి నాగరం మొదలు పాద మంజీరాల వరకు, దాల్చని ఆభరణమే లేదు. తాటంకాలు, నాసికామణులు, కంకణాలు, బాజుబందులు. వడ్డాణమూ ఒకటేమిటి సర్వమూ దాల్చి సర్వాభరణభూషితయైన అమ్మవారి అవతారంలో నిలుచున్నారు శ్రీశ్రీశ్రీ సత్యభామాదేవి గారు!

ఆమె ఒంటినిండా నగలే. నగల వెలుగులే. అటూ ఇటూ కదులుతుంటే వాటి సునాద వినోదాలే!

***

చెప్పాల్సిన ధర్మం కాబట్టి, శ్రీక్రృష్ణులవారు అన్నీ చెప్పారు.

యుద్ధానికి ఈ అవతారం పొసగదన్నారు, ఆ నగల బరువుతో కదలిక ఇబ్బందని చెప్పి నచ్చజెప్ప చూశారు, చూడగానే, శత్రువుకు తేలిక భావం కలిగి రెచ్చిపోతాడేమో అన్నారు!

ఏది చెప్పినా "ససేమిరా ఇట్లాగే వస్తాను" అని రాణీ వారు హఠం పట్టి, వేణీబంధం చక్కజేసుకుంటూ లీలగా తోసిపుచ్చారు.

"సరే, జరుగనీ దైవేఛ్ఛ", అన్నారు చిద్విలాసులు, చిరునవ్వుతో!

గలగలా నవ్వి, "మా దష్టిలో అది మీరే", అని సత్యాదేవి ధీమాగా జవాబిచ్చారు.

రథం శత్రునగరం వైపు పరుగులు తీసింది.

***

అతికాయమహాకాయుడు నరకుడు విస్తుపోయాడు, కృష్ణుడితో పాటు ఈ సర్వాభరణభూషిత సత్యావతారాన్ని చూసి.

యుద్ధం మొదలైంది. ఇరు వర్గాలు శరవర్షం కురిపిస్తున్నాయి. ప్రతి నరకుడి బాణమూ మధ్యలోనే త్రుంచివేయబడుతోంది, సత్య వేసిన బాణాలతో. ఆశ్చర్యపోతున్నాడు నరకుడు, తన గురి చెదరటంతో.

అనేక ఆభరణాల గలలలలు, కంకణాల ఝణంఝణ శబ్దాలూ వినిపించి మతి పోగొడ్తున్నాయి అతనికి, సరిగ్గా బాణం వేసే సమయంలో.

ఒకసారి గమనించిన సూక్ష్మగ్రాహిణి సత్యాదేవి పదేపదే వాడి బాణప్రయోగ సమయానికి అవే శరసంధాన భంగిమలు అతివేగంగా పెట్టడంతో నగలన్నీ మ్రోగీ, పంచకళ్యాణి నాట్యంలా అనిపించీ వినిపించసాగింది నరకుడికి.

ఆమె దేహకాంతులకే భ్రమసిపోతున్న శత్రువుకి, ఆ ఆభరణాల ధగధగలూ, మిరుమిట్లు గొలిపే కాంతులు జోడై, కంటిచూపును నిలువనీయలేదు.

ఇటు ధగధగ్గయామనమైన కాంతి వెల్లువగా వీరనారి సత్యామణి, అటు ఆ ఉరవడిలో కళ్ళు చెదిరి నిస్సహాయుడై నిలిచిన నరకాసురుడు.

ఆహవాంగణంలో కత్తుల తళతళలూ, వాటి రాపిడిలో వచ్చే ఖణఖణలూ మాత్రమే పరిచితమైన ఆ శత్రువుకి ఈ కొత్త కాంతులు వింతే కాదు, వీటిని ఎట్లా ఎదుర్కోవాలో తెలియని అయోమయమూ ఏర్పడ్డది!

ఇంకెక్కడి గురి?! అది కాస్తా చెదిరిపోయి, తన బాణం రెండు ముక్కలైపోతోంది తృటిలో!

తన భంగపాటు చూసి అవతలి వైపు రథంలో సత్యాకృష్ణుల నవ్వులూ, వారి సైన్యం చేసే కహకహలూ, కోలాహలాలూ--నరకుడి మతి పూర్తిగా పోయే పరిస్థితి వచ్చేసింది.

కొంత సేపు ఈ సత్యభామాదేవి వీరవిహారం కానిచ్చి, ఇక ఆమె కదనరంగపు ముచ్చట తీరిందని గ్రహించిన కృష్ణుడు- ఆమెకు విరామం ఇచ్చి, తానే పూనుకొని, త్వరగానే నరకుని మట్టుపెట్టాడు.

తన యుధ్ధరంగపు ఆరంగేట్రం విజయవంతమైనందుకు ఆనందిస్తూ, సత్యాదేవి పతిపై మల్లెలచూపులతో పూల బాణాలు వేయకనే వేసినట్లైంది.

తక్షణమే నరకుడి చేతిలో బందీలైన రాజులనూ, స్త్రీ జనాన్ని అందరినీ విడిపించి, విజేతలై ద్వారకకు మరలారు, సత్యాకృష్ణులు.

ద్వారకలో ప్రజలు తమ ప్రియతమ నాయకుడికీ, అంతకంటే ఎక్కువగానే తమ రాణి, వీరనారి సత్యాదేవికీ ఘననీరాజనాలు పలికారు, ఉత్సవాలు చేశారు.

***

సత్యాదేవి మందిరానికే నేరుగా వచ్చిన స్వామి ఆ రోజు మృష్టాన్న భోజనం ముగించి విశ్రాంతి తీసుకుంటున్నారు. పక్కనే సత్యభామాదేవి పతి పట్ల తన అనురాగం అంతా చూపిస్తూ ---

లేలేత తమలపాకులలో ఏలకులు, లవంగము, జాపత్రి, కుంకుమపువ్వు లాంటి  సుగంధద్రవ్యాలు తగుమాత్రపు మోతాదులో తానే వేసి, చిలకలుగా చుట్టి మాధవుల వారి చేతికిస్తూ....

"సత్యాదేవి గారిని ఒక్క సందేహం, అడగవచ్ఛా", అన్నారు స్వామి చిలిపిగా!

"అడగండి", అన్నది ఆమె సహజమైన రాజసం తొణికిసలాడిస్తూ!

"నరకుని పై మీ విజయానికి కారణం మీ రత్నమాణిక్య ఖచితమైన ఆభరణాల జిగేలుమనే వెలుగు కిరణాలా లేక వాటి ఘలంఘలలా?!

ఇవేవీ గాక--

మీరు వేసిన బాణాలా అని మా చిరుసందేహం", కృష్ణమూర్తి వారన్నారు, ముఖం గంభీరంగా ఉంచటానికి ప్రయత్నిస్తూ!

విని ఒక్క క్షణం అవాక్కై,తేరుకుని "భలే వారే! సందేహమేముందీ, రెండూనూ" అన్నది ఆమె, ఎంతో నమ్మకంతో, నిశ్చలంగా!

స్వాతిశయం, ఆభిజాత్యాలతో పాటు మా సత్యకు నిజాయితీ కూడా ఒక పాలు ఎక్కువే పాపం--నిజాన్ని వెంటనే ఒప్పుకుంది అనుకున్నారు సత్యభామావిధేయ శ్రీకృష్ణులవారు, తనలో తానే నవ్వుకుంటూ!

స్వామివారితో పాటే తానూ చిరునవ్వులు చిందించారు, భామాదేవిగారు, ఆ మందిరంలో ఆనందరాగ కాంతులను ప్రసరింపజేస్తూ, ఆ క్షణాన!

జగమంతా దీపావళీ మహాపర్వ సంరంభానికి సిధ్ధమౌతున్న, అమవస నాటి ఆ పున్నమి వేళ!

సురకాంతలు కాదు సురపతులే చేయని నరకాంత ఘనకార్యం, వీరకాంతాలలామ సాత్రాజితీదేవి సాధించిన జయకరమైన ఆ వేళ!

********

Posted in November 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *