Menu Close
అయ్యగారి సూర్యనారాయణమూర్తి
“ఫ్రెట్ వర్క్” కళ
అయ్యగారి సూర్యనారాయణమూర్తి

చిత్రము 13, 14

Fretwork-13

చిత్రం 13
ఈ కళాఖండంలో వేరే ఏమీ బొమ్మలేదని ఇటునుండి అటు కనిపిస్తూ నిరూపిస్తుంది.

Fretwork-14

చిత్రం 14
ఇందులో ఒకే డెకొలాంషీట్ లో, కేవలం ఐమూలగా కోసిన ఱంపపు కోతలతోనే అలనాటి అందాల తార దర్శన మిస్తుంది.

ఫ్రెట్ వర్క్ కళలో ఇది అనితరమైన డాక్టరేట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే, దీన్ని తయారుచేసేటప్పుడు, కళాకారుని కంటికి కేవలం 10 నుండి 12 అంగుళాల దూరంలో ఉండి  ఏ చిత్రభాగం మీద పని చేస్తున్నాడో తెలియని (అంత దగ్గరనుండి బొమ్మ కనిపించదు కాబట్టి) స్థితిలో కోసే వంకరటింకరగా సాగే ఱంపపు కోతలలో ఏమాత్రం (తలవెండ్రుకవాసి)  భేదం వచ్చినా, దూరం  నుండి చూస్తే కనిపించే బొమ్మ చెడిపోతుంది. ప్రతీకోతకి ఈ చివరినుండి మొదలుపెట్టి ఆ చివరిదాకా ఆపకుండా కోసి అక్కడ వెనక్కి తిరిగి మళ్ళీ మొదట ప్రారంభించిన చోటుకు కోసిన కోత ప్రక్కనే కోస్తూ చేరుకోవాలి. దానితో ఏర్పడిన సన్నటి బద్ద లాంటి డెకొలాం ముక్కను జగ్రత్తగా తీసివేయాలి.  అంతేకాదు, కోతలన్నీ పూర్తి  అయ్యేటప్పటికి కళాఖండంలో ఈ చివరా ఆ చివరా తప్ప ఆధారం లేని త్రాళ్ళవంటివి మాత్రమే మిగులుతాయి. రానురాను, ప్రతియొక్క కోత వలన కలిగే అదురు వలన అంతవరకు ఏర్పడిన ఈ త్రాళ్ళవంటి అతిసున్నితమైన భాగాలలో ఏ ఒక్కటైనా తెగిపోవచ్చును. అలా జరిగితే మొత్తం పారవేయవలసి వస్తుంది. ఒకరోజులో ఒకటి లేదా రెండు కోతలు మాత్రమే చేయడానికి వీలవుతుంది. అంతకంటే ప్రయత్నిస్తే ఎన్నో రోజుల తీవ్ర కష్టం ఒక్క క్షణంలో వ్యర్థమైపోతుంది.

కళాకారుని సంక్షిప్తనామం ASN* అనే అక్షరాలతో ఇవే కోతలలో నిక్షిప్తం చేయడం ఒక విశేషం.

* Ayyagari Surya Narayanamurthy

రచయిత పరిచయం:

Ayyagari-Suryanarayana-Moorthyఅపురూపకళాస్రష్ట – అయ్యగారి సూర్యనారాయణమూర్తి

శ్రీ అయ్యగారి సూర్యనారాయణమూర్తి బహుముఖప్రజ్ఞాశాలి. వీరు కీ.శే. శ్రీ సీతారామమూర్తి, శ్రీమతి రాజ్యలక్ష్మిగార్ల కనిష్ఠపుత్రులు.

మూర్తిగారు విద్యాభ్యాసం మొదలుపెట్టి నప్పటినుండి సరస్వతీమాత కటాక్షానికి పాత్రులై, చదువులలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి ఎన్నో పతకాలను కైవసం చేసికొన్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ లో ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల, విశాఖపట్టణము నుండి పట్టభద్రులయ్యారు. ఆ రోజుల్లో ఐదేళ్లపాటు సాగిన ఇంజనీరింగ్ విద్యాభ్యాసంలో, విశాఖపట్టణము మరియు కాకినాడ ఇంజనీరింగ్ కళాశాలల అన్ని విభాగాలలోని విద్యార్ధులందరిలో, ఐదేళ్లలో వ్రాసిన టెక్నికెల్ మరియు నాన్ టెక్నికల్ పాఠ్యాంశాల పరీక్షలన్నింటి మొత్తములో అత్యధికమైన మార్కులు సాధించి శ్రీవేపాకృష్ణమూర్తి గోల్డ్ మెడల్ ను పొందిన ఆదర్శవిద్యార్థిగా వీరు నిలిచేరు. ఆ తర్వాత, మూర్తిగారు ఇంజనీరింగ్ పరిశ్రమలలో కొన్ని సంవత్సరాలు విశేషానుభవం గడించి ఐఐఎమ్, అహ్మదాబాద్ లో మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేరు.

వృత్తిరీత్యా, మూర్తిగారు ఇంజనీరింగ్ మరియు మేనేజ్మెంట్ రంగాలలో పలుసంస్థలలో సృజనాత్మకతకు పెట్టింది పేరయి ఉన్నతపదవులలో అరుదైన మన్ననలు పొందేరు.

ప్రవృత్తిరీత్యా, వీరు చేయి తిరిగిన ఛందోబద్ధసుకవి, కళాకారులు. ‘సిరిమల్లె’ పాఠకులకు మూర్తిగారి ఉత్తమకవిత్వపటుత్వము గతపదివసంతాలుగా సుపరిచితమే. ఈ సంచికలో ముర్తిగారిలో ఉన్న విశేషకళాకారుణ్ణి పరిచయం చేయడానికి చాలా సంతోషిస్తున్నాము.

మూర్తిగారు ‘ఫ్రెట్ వర్క్’ అనే హస్తకళలో బాల్యం నుండే ఎంతో నైపుణ్యం ప్రదర్శించిన దిట్ట. వీరి కళ గురించి, అందులో వీరు సృష్టించిన కళాఖండాల గురించి గతంలో మాటీవీ, ఈటీవీ మరియు భారత్ టుడే ఛానెళ్ళలో ప్రసార మయ్యింది. మన ‘సిరిమల్లె’ పాఠకులందరికీ ఈ కళావిశేషాలు తెలియజేయడంకోసం ప్రత్యేకంగా ఒక ధారావాహికను ఈ అంగ్ల నూతన సంవత్సర సంచికతో ప్రారంభిస్తున్నాము.

Posted in November 2026, కళలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *