Menu Close
Kasi Viswanatham
పలుకుబడి కథలు
కాశీ విశ్వనాథం పట్రాయుడు

నందో రాజా భవిష్యతి!

చామలాపల్లి అగ్రహారంలో రామవ్వ, లచ్చవ్వ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకరోజు సాయంత్రం ఇద్దరూ లచ్చవ్వ ఇంటి అరుగుమీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.

అంతలో ఎదురింటి ఇల్లాలు సీత కంటతడి పెట్టుకుంటూ వారి దగ్గరకు వచ్చింది.

“ఏమైంది సీతా? “నిన్న రాత్రి మీ ఇంట్లో గొడవ జరిగినట్టుంది. నేను వాకిట్లోకి వస్తే అరుపులు వినిపించాయి” అని అడిగింది రామవ్వ.

“నా మొగుడు తాగుడుకు బానిసైపోయాడు. కూలిపని చేసి సంపాదించిన డబ్బుతో రోజూ తాగొచ్చి ఇంట్లో గొడవ చేస్తాడు. పిల్లలకు కడుపునిండా తిండి పెట్టడానికే ఇబ్బందిగా ఉంది” అంటూ కన్నీళ్లు తుడుచుకుంది సీత.

“నిన్న రాత్రి వంట చేసుకున్నావా?” అని అడిగింది లచ్చవ్వ.

“లేదు అవ్వా! నాలుగు రోజులైంది పొయ్యి వెలిగించి. రామవ్వ ఇచ్చిన అన్నం, పులుసు పిల్లలు తిని పడుకున్నారు. నేను నీళ్లు తాగి పడుకున్నాను” అంటూ మళ్లీ ఏడ్చింది సీత.

“ఏడవకు తల్లీ! ఏదో ఒకరోజు నీ మొగుడికి బుద్ధి రావచ్చు. పిల్లల కోసమైనా తాగుడు మానేసి వాళ్లను బాగా చూసుకోవచ్చు” అంటూ రామవ్వ ఓదార్చింది.

“ఇంట్లో ఎప్పుడూ గొడవలే. పిల్లలు కూడా భయపడుతూ బతుకుతున్నారు. వాళ్ల భవిష్యత్తు గురించే నా బెంగంతా” అంది సీత.

“నిజమే సీతా! కానీ ఇప్పటి పరిస్థితిని బట్టి వాళ్ల భవిష్యత్తును ముందే ఎలా నిర్ణయించగలం? కాలం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలుసు? నందో రాజా భవిష్యతి!” అంది లచ్చవ్వ.

“అంటే ఏంటి లచ్చవ్వా?” అని అడిగింది సీత.

“అది ఒక నానుడి… పూర్వం ఉత్తుంగభుజుడు అనే రాజు ఉండేవాడు. అతడు ఒక వేశ్య మాటను మంత్రముగా భావించి, తన పట్టపురాణిని రాజప్రాసాదానికి దూరంగా వనాంతర గృహంలో ఉంచాడు.

అప్పటికే రాణి గర్భవతి. కొన్నాళ్లకు ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాలుడే రాజ్యానికి వారసుడు. అయినా రాజు ఆ బిడ్డను పట్టించుకోలేదు.

ఒకరోజు ఓ నగల వర్తకుడు విలువైన వజ్రాల హారాన్ని రాజు వద్దకు తీసుకొచ్చాడు. అప్పటికే రాజు తన సర్వస్వాన్ని వేశ్యకు ధారపోశాడు. అందువల్ల హారం కొనలేకపోయాడు.

ఆ వర్తకుడికి రాణితో పరిచయం ఉండడంతో ఆమెను చూడటానికి వనాంతర గృహానికి వెళ్లాడు. రాణి దీనస్థితిని చూసి జాలిపడి, హారాన్ని ఆమెకు అప్పుగా ఇచ్చాడు.

అప్పుడు దాసి రాణితో, ‘అమ్మా! మీ కుమారుడే రేపు రాజు కావచ్చు. భవిష్యత్తును ఎవరు ఊహించగలరు? కాబట్టి హారం తీసుకోండి’ అని చెప్పింది.

రాణి దాసి మాట విని హారం తీసుకుంది.

కొంతకాలానికి రాజు, వేశ్య ఇద్దరూ పాముకాటుకు గురై చనిపోయారు. మరికొంతకాలానికి ఆ వర్తకుడు కూడా మరణించాడు.

దాసి చెప్పినట్టుగానే నందుడు రాజయ్యాడు. రాణి వద్ద ఉన్న హారం చివరకు ఆమెకే దక్కింది.

అందుకే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరూ ముందుగా చెప్పలేరని, ప్రస్తుత పరిస్థితులను చూసి ఆశ కోల్పోకూడదని చెప్పడానికి పెద్దలు ‘నందో రాజా భవిష్యతి’ అనే నానుడిని ఉపయోగించేవారు” అని చెప్పింది లచ్చవ్వ.

“నిజమేనవ్వా! నువ్వన్నట్లు నా పిల్లల భవిష్యత్తు కూడా ఎప్పటికైనా బాగుపడితే అదే చాలు” అంటూ కన్నీళ్లు తుడుచుకుంది.

“అదే ధైర్యంతో ఉండు తల్లీ! మంచి రోజులు వస్తాయని నమ్ము” అంటూ లచ్చవ్వ ఆమె భుజం తట్టింది.

లచ్చవ్వ మాటలతో సీత మనసులో మళ్లీ చిన్న ఆశ చిగురించింది. పిల్లలను తలచుకుంటూ ఆమె తన ఇంటివైపు నడిచింది.

***********

రచయిత పరిచయం

Kasi Viswanathamనా పేరు కాశీ విశ్వనాథం పట్రాయుడు. నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడను. ప్రవృత్తి రీత్యా రచయితను. 300 కవితలు, 200 బాలగేయాలు, 50 సాంఘిక కథలు, 500 బాలల కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పిల్లలతో గడపడం, వారికి కథలు చెప్పడం, వారికి నచ్చిన కథలు రాయడం నాకు ఎంతో ఇష్టం. తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగించడానికి, తెలుగు భాష గొప్పతనం, జాతీయాలు, నుడికారాలు, సామెతలు గురించి నేటి తరం పిల్లలకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదే ఉద్దేశ్యంతో కొంతమంది రచయితలు ఇంతకు ముందు జాతీయాలు, సామెతలు వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి రాశారు. అయితే నేను భాషోపాధ్యాయుల కోరిక మేరకు ఆ సామెతలను, జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగించారు అనే విషయాన్ని కథల రూపంలో అందిస్తున్నాను. వీటిని తరగతి గదుల్లో బోధించడానికి, ఉదాహరణలుగా చెప్పడానికి, జాతీయాలు, సామెతలు పిల్లల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఎంతగానో ఉపయోగ పడతాయి. నన్ను ప్రోత్సహించి, నా రచనలు విద్యార్థులకు, తెలుగు భాషాభిమానులకు చేరువయ్యేలా కృషి చేయాలని సంకల్పించిన సిరిమల్లె పత్రిక సంపాదకులు మధు బుడమగుంట గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను క్రింది బాక్స్ లో కామెంట్స్ రూపంలో తెలుప మనవి. – కాశీ విశ్వనాథం.

Posted in November 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *