Menu Close
Prathap CH
శివశక్తి - సృష్టిమూల చైతన్యం
డా. సి. హెచ్. ప్రతాప్

శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి।
అతస్త్వామారాధ్యాం హరిహరవిరించాదిభిరపి
ప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి॥
(సౌందర్యలహరి, శ్లోకం 1)

సృష్టి ఎక్కడి నుండి మొదలవుతుంది? కేవలం నిశ్చల చైతన్యం నుంచా? లేక క్రియాశీలక శక్తి నుంచా? ఈ ప్రశ్నకు అద్వైత–శాక్త సంప్రదాయాలలో అత్యంత గంభీర సమాధానాన్ని అందించే శ్లోకమే సౌందర్యలహరి తొలి శ్లోకం. జగన్మాతను ఉద్దేశించి శంకరాచార్యులు — శక్తితో అనుసంధానమైనప్పుడే శివుడు సృష్టిని నిర్వహించగల సమర్థుడవుతాడని, శక్తి తోడు లేకపోతే ఆ పరమశివుడు కనీసం స్పందించడానికి కూడా సమర్థుడు కాడని స్పష్టం చేస్తారు.

ఇక్కడ “శివుడు” అంటే నిశ్చలమైన, నిర్గుణమైన బ్రహ్మచైతన్యం. “శక్తి” అంటే ఆ చైతన్యానికి రూపం, క్రియాశీలత ప్రసాదించే జగన్మాత స్వరూపం. చైతన్యం మాత్రమే ఉండి క్రియాశక్తి లేకపోతే ఏ కార్యమూ జరగదు; అలాగే చైతన్యపు మార్గదర్శకత్వం లేని శక్తి అస్తవ్యస్తమవుతుంది. అందువల్ల శివ–శక్తుల సమన్వయమే సృష్టి మూలరహస్యం. ఈ అభేద తత్త్వాన్ని మన సంప్రదాయం అర్ధనారీశ్వర రూపంతో చాటిచెప్పింది. శివుడు సత్-చిత్ స్వరూపుడైతే, శక్తి ఆనంద రూపిణిగా విలసిల్లుతుంది.

ఈ ఆధ్యాత్మిక సత్యం కేవలం విశ్వసృష్టికే కాకుండా మనిషి అంతరంగానికి కూడా అనువర్తిస్తుంది. మానవ శరీరంలో వెన్నుపాము దిగువన ఉండే కుండలినీ శక్తి జాగృతమై, శీర్షభాగంలో ఉన్న సహస్రార చక్రాన్ని చేరుకుని శివచైతన్యంతో ఐక్యమైనప్పుడే సాధకునికి ఆత్మానుభూతి లభిస్తుంది. అలాగే దైనందిన జీవితంలో ఆలోచన ఒక నిశ్చల శక్తి అయితే, దానికి రూపమిచ్చేది సంకల్పబలం. జ్ఞానం ఒక వెలుగు అయితే, దాన్ని ప్రతిఫలింపజేసేది ఆచరణ.

ఈ శ్లోకంలో మరో ప్రాధాన్య అంశం ఉంది — పరాశక్తి సర్వదేవతలకూ ఆరాధ్యురాలు. బ్రహ్మ, విష్ణు, రుద్రులతో పాటు సకల దేవతలూ ఆమెను నిరంతరం ఉపాసిస్తారు. అంతటి మహాశక్తిని ప్రణమిల్లడం, స్తుతించడం పూర్వజన్మ సుకృతం లేని మానవుడికి ఎలా సాధ్యమవుతుందని శంకరులు వివరిస్తారు. ఇక్కడ సుకృతం అంటే కేవలం క్రతువులు చేయడం కాదు. మంచిని గుర్తించే నైర్మల్యం, వివేకం, సత్యాన్వేషణ తపన, వినయం కలగడమే నిజమైన సుకృతం.

భారతీయ యోగ శాస్త్రంలోనూ, తంత్ర మార్గంలోనూ శివశక్తులు ప్రాణ–అపాన వాయువులుగా, ఇడా–పింగళ నాడులుగా భాసిస్తాయి. అంతరంగంలో ఉన్న ఈ రెండు శక్తుల నడుమ సమతుల్యత సాధించడమే సాధన. అహంకారంతో ఉన్న మనస్సుకు దైవత్వం గోచరించదు. వినయం నెలకొన్న హృదయలోనే ప్రతి జీవిలోని దైవస్పర్శ అనుభవమవుతుంది.

వేదాంత దృష్టిలో శివుడు ప్రకాశ స్వరూపుడైతే, శక్తి విమర్శ స్వరూపిణి. అనగా స్వీయ ప్రకాశాన్ని ఆత్మవిమర్శ పూర్వకంగా వ్యక్తీకరించే సామర్థ్యమే శక్తి. భౌతిక విజ్ఞానశాస్త్రం కూడా పదార్థం, శక్తి నాణేనికి బొమ్మా బొరుసు లాంటివని, రూపాంతరం చెందుతుంటాయని చెబుతుంది. ఇదే సత్యాన్ని వేల సంవత్సరాల క్రితమే సౌందర్యలహరి రూపంలో శంకరులు అందించారు. పదార్థంలో దాగి ఉన్న శక్తిని వెలికితీయడమే సాధన.

సౌందర్యలహరి తొలి శ్లోకం కేవలం ఒక ప్రార్థన కాదు; శాక్త తత్త్వానికి ప్రవేశద్వారం. జగత్తులో కనిపించే ప్రతి సృష్టి, స్థితి, లయ ప్రక్రియల వెనుక ఉన్న పరాశక్తిని శంకరులు మనకు సాక్షాత్కరింపజేస్తారు. శివుడు చైతన్యం; శక్తి ఆ చైతన్యపు వ్యక్తరూపం. శివుడు ఆధారమైతే, శక్తి ఆ ఆధారంలో వ్యక్తమయ్యే జగత్ రూపం.

దైవాన్ని ఆరాధించే ముందు అంతరంగంలోని అహంకారాన్ని నిగ్రహించాలి. చైతన్యాన్ని శక్తితో, జ్ఞానాన్ని ధర్మాచరణతో, వివేకాన్ని సేవాతత్పరతతో కలిపినప్పుడే మానవ జీవితం పరిపూర్ణమవుతుంది. అదే సౌందర్యలహరి అందించే శాశ్వత సందేశం.

***********

Posted in November 2026, ఆధ్యాత్మికము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *