Menu Close
లేఖిని – కథా లోగిలి
సేకరణ, కూర్పు – అత్తలూరి విజయలక్ష్మి
ఆదర్శం వెనుక...
- హోతా పద్మినీదేవి -

నేను డ్రైవ్‌ చేస్తున్న ఆడికారు బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబరు సెవన్‌‌లో ఉన్న నా బంగ్లాని సమీపించగానే గేటు దగ్గరున్న సెక్యూరిటీ గార్డు గేటు బార్లా తెరిచి వంగి, చిరునవ్వుతో నాకు సెల్యూట్‌ చేసాడు. కారు పోర్టికోలో ఆపాను. అక్కడున్న బిఎమ్‌డబ్ల్యూ కారుని తళతళలాడేలా తుడుస్తున్న డ్రైవర్‌ నా దగ్గరకి వచ్చి నా చేతిలోని బ్రీఫ్‌కేసుని అందుకున్నాడు.

నేను హాల్లోకి ప్రవేశించేసరికి ట్రేలో చల్లటి మంచినీళ్ళ గ్లాసుతో ఎదురొచ్చింది. నా భార్య మంచినీళ్ళు తాగి గ్లాసు ట్రేలో ఉంచింది. ఇంత అందమైన భార్యని పొందిన నా అదృష్టాన్ని మనసులోనే అభినందించుకుంటూ స్నానం చేయడానికి బాత్‌రూమ్‌లోకి నడిచాను.

చెవి దగ్గర అలారం మోత, వంటింట్లోంచి కుక్కర్‌ విజిల్‌ ఏకకాలంలో నాకు నిద్రాభంగం కలిగించాయి. కమ్మని కల చెదిరిపోయింది. విసుగ్గా కళ్ళు విప్పి అలారం టైమ్‌పీసు పీక నొక్కాను. ఆఫీసుకి వెళ్ళాలని గుర్తొచ్చి ఆదరాబాదరా లేచి బాత్‌రూమ్‌లోకి పరిగెట్టాను.

స్నానం చేస్తున్నంతసేపూ ఆ కల గుర్తొచ్చి నా మనసు నిరాశగా మూలిగింది.

దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నేను చిన్నప్పటినుండీ పేదరికాన్నే చవి చూసాను. మా నాన్న చనిపోయేసరికి, నన్ను మా అమ్మ నన్ను ఇంజనీరింగ్‌ చదివించింది. బస్సులో కాలేజీకి వెళుతూ బైక్‌ ల మీదా, కార్లలో కాలేజీకి వచ్చే నా క్లాస్‌మేట్స్‌ని చూసి వాళ్ళ స్థానంలో నన్ను నేను ఊహించుకుని కలలు కనేవాడిని.

క్యాంపస్‌ సెలక్షన్స్‌లో టీసీఎస్‌లో ఉద్యోగం వచ్చింది. ట్రైనింగ్‌ పూర్తయి ఉద్యోగం పర్మనెంట్‌ కాగానే హైదరాబాద్‌లో పోస్టింగ్‌ వచ్చింది. ఒక చిన్న ఇల్లు  అద్దెకు తీసుకుని మా అమ్మనీ, చెల్లెలినీ తీసుకువచ్చాను. నాకొచ్చే జీతంలో ఆ మహానగరంలో మేము ముగ్గురం బతకాలి. చెల్లికి చదువు, పెళ్ళి బాధ్యత నాదే. నేను కలలో నుంచి వాస్తవానికి రాక తప్పలేదు. అయినా ఆ కల నన్ను వెంటాడుతూనే ఉంది. ఆ కల నిజం కావాలంటే ఏ లాటరీయో తగలాలి లేదా ఓ కోటీశ్వరుడికి అల్లుడిని కావాలి. అది అసంభవమని నాకు తెలుసు. సినిమాల్లోలాగా ఏ డబ్బున్న అమ్మాయీ నన్ను ప్రేమించదు. నా కల కలగానే మిగిలిపోవలసిందేనా అనే నిరాశ, నిస్పృహలు నన్ను మరింత కుంగిపోయేలా చేస్తున్నాయి. బిల్‌గేట్స్‌, అంబికా రామచంద్రరావు, త్రివేణీ దేను వెంకట సుబ్బారావు.... వాళ్ళలో ఏ ఒక్కరూ రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోలేదు. కొన్నేళ్ళ నిర్విరామకృషి వాళ్ళనాస్థానంలో ఉంచింది. కానీ... అంత ఓపిక, ఓర్పూ నాకు లేవు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడినెలా కావాలా అనే ఆలోచనే రాత్రి, పగలు నన్ను తినేస్తుంది.

నేను ఉద్యోగంలో చేరి ఏడాది నిండింది. అమ్మ నా పెళ్ళి ప్రస్తావన తెచ్చింది. నెలకి ముప్పైవేలు జీతం. ప్రతి చిన్నదానికీ సర్దుకుంటూ ప్రతి రూపాయి లెక్కగా ఖర్చు పెడుతూ రేపటి గురించి భయపడుతూ...ఛ... ఏం బతుకు నాది? అయినా నాలాంటివాడు ఏ  అమ్మాయిని పెళ్ళి చేసుకున్నా ప్లాటు కొనుక్కోవాలన్నా, కారు కొనుక్కోవాలన్నా బ్యాంకు లోను తీసుకోవలసినదే. పిల్లలు పుడితే వాళ్ళకి పాలడబ్బాలూ, రోగాలు, రొచ్చులూ, చదువులూ అన్నింటికంటే ముందు మా చెల్లెలి పెళ్ళి ఆపై ఆలోచించలేకపోయాను. వయసు ఆడతోడు కోసం తపిస్తున్నా, రాజీపడి గంతకు తగ్గ బొంతని చేసుకోవాలనే చేదు నిజం నాలోని అసంతృప్తి సెగని మరింత రాజేసింది.

“నాకు ఇప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు. చేసుకోవాలనిపించినప్పుడు చెబుతాను. ఇంతవరకూ నన్ను ఇబ్బంది పెట్టకు...” అని కరాఖండిగా  చెప్పాను.

***

ఆరునెలల తరువాత ఆ రోజు నేను ఆఫీసు నుంచి ఇంటికి రాగానే అమ్మ నాకు అన్నం పెట్టి నాకెదురుగా కూర్చుంటూ చెప్పింది, “నీకో పెళ్ళి సంబంధం వచ్చిందిరా...”

“నేను పెళ్ళి చేసుకోనని చెప్పానుగా...” అసహనంగా అన్నాను.

“సంబంధం మంచిదే... ఎస్‌ ఎస్‌ కన్‌స్ట్రక్షన్స్‌ చైర్మన్‌ గారి అమ్మాయి. ఆయనకి ఒక్కతే కూతురట. పెళ్ళయిన మూడేళ్ళకే భర్త యాక్సిడెంట్‌లో మరణించాడట. ఏడాదిన్నర వయసున్న పాప ఉందిట ఆమెకి. అయినా మనకి తగిన పిల్లని చేసుకోవాలి. కానీ, వితంతువుని... అదీ ఒక బిడ్డ తల్లిని పెళ్ళి చేసుకోవలసిన కర్మమేమిటి?” అంటోంది అమ్మ.

“వద్దని చెప్పేశావా?” నా గుండె గొంతులోకి వచ్చింది.

“ఇంకా ఏమీ చెప్పలేదు. అయినా మనకి నచ్చకపోతే మాత్రం ముఖంమీద చెబుతామా ఏమిటి?”

“ఎవరి ద్వారా వచ్చిందీ సంబంధం”

“మనకి దూరపు బంధువు ఒకాయన భీమవరంలో ఉన్నారులే. సూర్యనారాయణరాజు అని, వరసకి నీకు బాబాయి అవుతాడు. పిల్ల తండ్రి ఆయనకి మేనత్త కొడుకట.”

“అవునా?” నాకు అన్నం తినబుద్ధి కాలేదు. తిన్నాననిపించి చెయ్యి కడుక్కుని లేచి లాప్‌ట్యాప్‌ ఓపెన్‌ చేసాను. గూగుల్‌లో అమ్మ చెప్పిన ‘ఎస్‌ ఎస్‌ కన్‌స్ట్రక్షన్స్‌’ అనే కంపెనీ కోసం సెర్చ్‌ చేయసాగాను. క్షణాల్లో కంపెనీ వివరాలన్నీ వచ్చాయి. వైజాగ్‌, విజయవాడలో కూడా ఆ కంపెనీ బ్రాంచీలున్నాయి. కొన్ని కోట్ల ఆస్తి. ఒకతే కూతురు. మా కులంలో, నా బంధువర్గంలో ఎవరికీ రాని గొప్ప సంబంధం నాకు వచ్చింది. కానీ... ఒక్కటే లోటు ఆమెకి ద్వితీయ వివాహం. అయినా నా పిచ్చిగాని ఆమెకి మొదటి పెళ్ళయితే ఈ సంబంధం నన్నెందుకు వెతుక్కుంటూ వస్తుంది? నేను కలలు కన్న జీవితాన్ని సంఘంలో గౌరవాన్ని ఈ పెళ్ళితో పొందవచ్చు. నేను ల్యాప్‌ట్యాప్‌ క్లోజ్‌ చేసి, “ఈ పెళ్ళి నాకు ఇష్టమే” అని అమ్మతో చెప్పాను.

ఆవిడ అభ్యంతరం చెప్పబోయింది. “ఒక వితంతువునో విడాకులు తీసుకున్న అమ్మాయినో పెళ్ళి చేసుకోవాలన్నది నా ఆదర్శం. అందుకే ఇన్నాళ్ళూ పెళ్ళి చేసుకోలేదు” స్థిరంగా చెప్పాను. అమ్మ మరేం మాట్లాడలేకపోయింది.

మరో నెలలో ప్రియాంకతో నా పెళ్లి గుడిలో సింపుల్‌‌గా జరిగింది. రిసెప్షన్‌ మాత్రం ఫైవ్‌స్టార్‌ హోటల్లో వైభవంగా జరిగింది. ఆ రిసెప్షన్‌కి, రాజకీయ నాయకులతో పాటు సినిమా హీరో హీరోయిన్లూ, ప్రొడ్యూసర్లూ కూడా తరలి వచ్చారు. మా మామగారికి ఎంత పలుకుబడి ఉందో తెలిసి, అలాంటి వ్యక్తికి అల్లుడినైన నా అదృష్టానికి నన్ను నేను అభినందించుకున్నాను. అందమైన భార్య, కోట్ల ఆస్తి. నేను కలలు కన్న జీవితం నా అరచేతిలోకి వచ్చింది.

కానీ నా భార్యని తాకినప్పుడల్లా, ఆమె శరీరాన్ని నాకంటే ముందు మరోవ్యక్తి తాకాడని, ఆమె ఆఘ్రాణిత పుష్పమనీ నా మనసులో అసంతృప్తి. అయితే డబ్బూ తద్వారా నేననుభవిస్తున్న సుఖాలూ అతి త్వరలోనే ఆ భావాన్ని డామినేట్‌ చేసాయి. నేను ప్రియాంకని అమితంగా ప్రేమిస్తున్నట్లు నటించసాగాను.

“మోడువారిన నా జీవితంలోకి వసంతంలా మీరు వచ్చారు. మీరు సాక్షాత్తు దేముడేనండీ” అందో సారి ప్రియాంక కన్నీళ్ళతో.

నేనామె కన్నీటిని సున్నితంగా తుడిచాను. “వితంతువునో, విడాకులు తీసుకున్న అమ్మాయినో పెళ్ళి చేసుకోవాలనేది నా ఆదర్శం. భార్య చనిపోయిన లేదా భార్య నుంచి విడిపోయిన మగవాడు పునర్వివాహం చేసుకోగా లేనిది అదే పరిస్థితులో ఉన్న అమ్మాయి పెళ్ళి చేసుకుంటే తప్పేమిటి?” గంభీరంగా చూస్తూ అన్నాను. ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయాను.

మేము హనీమూన్‌ ముగించుకుని ఇంటికి వచ్చిన మరునాడు మా మావగారు నన్ను తన ఆఫీసుకు తీసుకుని వెళ్ళారు. ఆఫీసులో స్టాఫ్‌ అంతా తమ సీట్లలో నుంచి లేచి ఆయనతోబాటు, నాక్కూడా నమస్కరించారు. నేను చిరునవ్వుతో హుందాగా ఆ నమస్కారాలను స్వీకరిస్తూ ఆయనని అనుసరించాను.

ఆయన ఒక రూమ్‌ ముందాగి డోర్‌ తెరచి లోపలికి వెళ్ళారు. “రండి” అన్నారు. నన్ను ఆహ్వానిస్తూ... ఆ గది వాల్‌ టు వాల్‌ కార్పెట్‌తో రిచ్‌గా ఉంది. ఎయిర్‌ కండిషన్డ్‌ గది కావడం వలన చల్లగా ఉంది. ఆయన టేబుల్‌కి వెనుకవైపు ఉన్న రివాల్వింగ్‌ ఛెయిర్‌ చూపిస్తూ, “కూర్చోండి అల్లుడుగారూ... ఇవాల్టి నుంచి మన కంపెనీ ఎండీ మీరే” అన్నారు.

ఆయన చెప్పింది క్షణకాలం నాకు అర్థం కాలేదు. అర్థం కాగానే సంతోషంగా ఎగిరి గంతెయ్యాలనిపించింది. నేను చప్పున వంగి ఆయన పాదాలని తాకి కళ్ళకద్దుకున్నాను. ఆయన అస్పష్టంగా నన్ను ఆశీర్వదించారు.

నెల కిందట ముప్ఫైవేల జీతగాడిని. ఇప్పుడు పెద్ద కన్స్‌స్ట్రక్షన్‌ కంపెనీకి ఎండీని. ఆడీ కారులో డ్రైవర్‌ డ్రైవ్‌ చేస్తుంటే దర్జాగా కూర్చుని ఆఫీసుకి వెళ్ళి వస్తున్నాను. మా పెళ్ళయ్యాక మా మామగారూ, అత్తగారూ వేరే ఇంటికి మారిపోయారు, పాపని మా దగ్గర వదిలేసి. మాపెళ్ళిలో మా అత్తగారి చంకనున్న పాపని చూసాను. కానీ ఇంత దగ్గరగా చూస్తున్నది ఇదే మొదటిసారి. పాపలో ప్రియాంక పోలికలు లేవు. బహుశా ‘అతని’ పోలికనుకుంటాను. ఇపుడిప్పుడే మాటలు వస్తున్నాయి. ముద్దుగా ఉంది. అయినా పాపని నా బిడ్డగా స్వీకరించలేక పోతున్నాను. పైగా పాపపైన నాకు అకారణ ద్వేషం కలుగుతోంది. ప్రియాంక మొదటి భర్తతో పంచుకున్న మధుర క్షణాలకి సాక్ష్యం ఈ పాప.

ఒకరోజు, “నాన్నా” అని ముద్దుగా పిలుస్తూ దగ్గరకు వచ్చింది. అలా పిలవమని ప్రియాంక చెప్పి ఉంటుంది. ల్యాప్టాప్‌లోకి చూస్తున్న నేను పాపని పట్టించుకోలేదు. ఓరకంటితో చూసాను. కాస్త దూరంలో నిలబడిన ప్రియాంక నన్నే చూస్తోంది. నేను సీరియస్‌ గా పనిచేస్తున్నట్లు నటించసాగాడు.

ప్రియాంక పాపని ఎత్తుకుని లోపలికి వెళ్ళిపోయింది. నేను పాపని తప్పించుకుని తిరగడం, దాన్ని కనీసం ఎత్తుకోకపోవడం గమనించింది ప్రియాంక. కొన్నిరోజుల తరువాత పాప వాళ్ళమ్మమ్మ దగ్గరకి వెళ్ళిందని ప్రియాంక ఎవరితోనో చెప్పడం విన్నాను.

ఆమె మనసు నా ప్రవర్తనతో గాయపడి ఉంటుందా? ఆమె దృష్టిలో నా విలువ తగ్గిపోయిందా? నాలో నేను తర్కించుకున్నాను. ఆమె మాత్రం అసలేమీ జరగనట్టు ప్రవర్తిస్తోంది. కానీ, ఆమె కళ్ళలోకి లోతుగా చూస్తే ఆ అందమైన కళ్ళల్లో కన్నబిడ్డని దూరం చేసుకున్న తల్లి బాధ కనిపించి ఉండేది.

అయినా, నేను పాపకి తండ్రిని కాలేనని ఆమె ముఖం మీద చెప్తే మాత్రం ఆమె ఏం చెయ్యగలదు?

నాతో గొడవపడి విడాకులు తీసుకోలేదు కదా? అసలే ఒకసారి జీవితంలో దెబ్బతిన్న అమ్మాయి. నేనామె బలహీనతని ఆసరాగా తీసుకున్నాను.

***

ఐశ్వర్యవంతుల అల్లుడినయ్యాక నాలో నిద్రాణంగా ఉన్న కోరికలు పడగ విప్పాయి. అందులో మొదటి కోరిక... సింగపూర్‌ వెళ్ళి అక్కడ మెరీనా బేసాండ్స్‌లో కెసినోలో జూదం ఆడాలనే కోరిక. ఆ కోరిక నాలో కలగడానికి కారకుడు హరీష్‌. వాడు బీటెక్‌లో నా క్లాస్‌మేట్‌. వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్‌ మేగ్నట్‌. ప్రతి సంవత్సరం పరీక్షలు రాయగానే ఫ్యామిలీతో ప్లెజర్‌ ట్రిప్‌కి విదేశాలకు వెళ్ళేవాడు. ఆ ఏడాది సింగపూర్‌ వెళ్ళాడు. అక్కడ వాడు చూసిన ప్రదేశాలను వర్ణించి చెబుతుంటే చెవులే కాదు. నోరు కూడా వెళ్ళబెట్టి వినేవాళ్ళం మేమంతా...

హరీష్‌ అక్కడ కెసినోలో వెయ్యి సింగపూర్‌ డాలర్స్‌ని పోగొట్టుకున్నాడట. అయినా వాళ్ళ డాడీ వాడినేమీ అనలేదుట. అప్పటినుంచీ నాలో సింగపూర్‌ వెళ్ళాలనీ, అక్కడ కెసినోలో జూదం ఆడాలనే కోరిక తీవ్రతరమైంది.

కానీ, మా మామగారు నాకు చెక్‌పవర్‌ ఇవ్వలేదు. జీతమైనా ఎంత ఇస్తారో తెలియదు. అయినా నన్ను కంపెనీకి ఎండీని చేసిన ఆయన ఆ లెవల్‌కి తగ్గట్టు జీతం ఇవ్వరా? నా భార్య దగ్గర ఆ విషయం ప్రస్తావించడానికి నాకు అహం అడ్డొస్తున్నది. ఒకటో తారీఖు రెండు రోజులుందనగా మా అక్కౌంటెట్‌ నా రూమ్‌కి వచ్చి నా బ్యాంకు అక్కౌంట్‌ నెంబరు అడగటంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను.

మరునాడు ఆదివారం మా మామగారు మా ఇంటికొచ్చారు. కుశలప్రశ్నలూ, మామూలు కబుర్లూ అయ్యాక ‘‘మీ అమ్మగారికి నేను డబ్బు సాయం చేద్దామంటే కన్నకొడుకు ఉండగా నా నుంచి డబ్బు తీసుకోవడం పరువు తక్కువగా ఆవిడ భావిస్తారేమోనని భయపడ్డాను. మీ చెల్లెలి పెళ్ళి గురించి నువ్వే మాత్రం దిగులుపడకు. ఆ అమ్మాయి పెళ్ళి బాధ్యత నాది” అన్నారు.

“అబ్బే! ఎందుకండీ?” అన్నాను మొహమాటపడుతూ. మా అమ్మకి ఆయన డబ్బు సాయం చేయడం నాకు చిన్నతనమే.

మరునాడు నేను ఆఫీసులో ఉండగా నా మొబైల్‌కి వచ్చిన మెసేజ్‌ నాకు అసంతృప్తిని, నిరాశను కలుగజేసింది. నా బ్యాంకు ఖాతాలో మా కంపెనీ నుంచి యాభైవేల రూపాయలు జమ చెయ్యబడ్డాయని దాని సారాంశం.

ఫ్లాటు రెంటూ, మా అమ్మా చెల్లెలి పోషణ ఖర్చూ పోగా నా దగ్గర ఇంకేం మిగులుతుంది? పేరుకి ఈ కంపెనీ ఎండీని. ఈ కోట్ల ఆస్తిలో ఒక్క రూపాయి కూడా స్వతంత్రంగా ఖర్చుపెట్టలేను. ఏమీ చేయలేని అసహాయతతో, ఉక్రోషంతో పళ్ళు కొరుక్కున్నాను.

***

నేనూ, ప్రియాంక గైనకాలజిస్టు శమంత ఎదురుగా కూర్చున్నాం. ఆవిడ, ప్రియాంకను ‘పెళ్ళయి ఎన్నేళ్ళయింది? పీరియడ్స్‌ రెగ్యులర్‌గా వస్తున్నాయా?’ లాంటి రొటీన్‌ ప్రశ్నలడిగి తరువాత తనని కర్టెన్‌ వెనక్కి తీసుకెళ్ళింది. లోపలనుంచి వాళ్ళిద్దరి మాటలు వినిపిస్తున్నాయి. తనకి మొదటి భర్త వలన పాప పుట్టిందని చెబుతోందా? నేను ముడివడిన భ్రుకుటితో ఎదుటిగోడ మీదున్న ఫోటోలోని బోసినవ్వుల పాపాయిని చూస్తున్నాను.

ప్రియాంకకి పాపని మరింత దూరం చేయాలంటే మాకు పిల్లలు పుట్టాలి. అవును. నాకు మగబిడ్డ కావాలి. ఈ ఆస్తికి వారసుడు కావాలి. మరో నిముషం తరువాత డాక్టరూ, ఆ వెనుకనే ప్రియాంక బయటకొచ్చారు.

డాక్టరు నాతో అంది “మీ వైఫ్‌కి ఒక పాప ఉందని చెబుతున్నారు. ఆమెకి మళ్ళీ తల్లి అయ్యే అవకాశం ఉంది. మీలో ఏ లోపమూ లేదని నిర్ధారణ అయితే ఇపుడు చూద్దాం!” అందావిడ ప్రిస్క్రిప్షన్‌ పాడ్‌ మీద ఏదో రాస్తూ...

ఆమె నాకు అందించిన కాగితాన్ని తీసుకుని చదివాను. నాలో వీర్యకణాల శాతం ఎంత ఉందో తెలిపే పరీక్ష ఇది. “థాంక్‌ యూ డాక్టర్‌” అని బయటకి నడిచాను.

రెండురోజుల తర్వాత ఆఫీసు నుంచి వస్తూ ల్యాబ్‌ నుంచి రిపోర్టు తీసుకున్నాను. అటునుంచే నేరుగా వెళ్ళి డాక్టర్‌ని కలిసాను. నేను ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. డాక్టర్‌ నా ఫ్రెండ్‌ భార్య. ఆవిడకి మా మావగారితో కనీసం ముఖపరిచయం లేదని నిర్ధారించుకున్నాకే ప్రియాంకని ఆవిడ దగ్గరకి తీసుకెళ్ళాను. ల్యాబ్‌కీ, హాస్పిటల్‌కి మా కారులో కాకుండా క్యాబ్‌‌లో వెళ్ళడం రెండో జాగ్రత్త.

డాక్టరు శమంత నా రిపోర్టు చూసి పెదవి విరిచారు. “మీలో సంతానోత్పత్తికి కావలసిన వీర్యకణాలు లేవు. మీరు తండ్రయ్యే అవకాశం లేదు.”

“వేరే దారి లేదా డాక్టర్‌?” తగ్గు స్వరంతో అడిగాను.

“వీర్యదాత వీర్యంతో మీకు సంతానం కలగవచ్చు. ఐవిఎఫ్‌ ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుంది. అయినా ఎందుకివన్నీ? మీకు పాప ఉందిగా?” అందావిడ.

నాలో సంఘర్షణ. ప్రియాంక మొదటి భర్తకి సంతానాన్ని నా బిడ్డగా స్వీకరించలేని నేను... ఇప్పుడు వేరొకరి వీర్యంతో నా భార్యకి సంతానం కలిగినా నా బిడ్డగా అంగీకరించగలనా? నాలోని లోపాన్ని నిజాయితీగా ఒప్పుకునే పెద్దమనసు నాకు లేదు. నేనేం చెయ్యాలో ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాను.

నేను ఇంటికొచ్చేటప్పటికి ప్రియాంక యథాప్రకారం మంచినీళ్ళు అందించింది. నేను తాగాక, “కాఫీ తెస్తాను” అని లోపలకి వెళ్ళబోయింది. నేనామె చెయ్యిపట్టి ఆపేసాను. “నీకు నామీద కోపంగా లేదా?” ఆర్తిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాను.

“కోపమా? ఎందుకు?” విస్మయంతో ఆమె కళ్ళు వెడల్పయ్యాయి.

‘‘పాపని నీకు దూరం చేసినందుకు’’

ఆమె ముఖంలో క్షణకాలం అనేక రంగులు మారాయి. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో చూస్తూ అంది. “మీరు దూరం చెయ్యడమేమిటి? నేనే పాపని మా అమ్మదగ్గరకి పంపేసాను...” అన్నది.

“నేను పని ఒత్తిడి వలన పాపని పట్టించుకోవడం లేదు. అంతేకానీ పాపంటే ఇష్టం లేక కాదు. పాప నా ప్రాణం. మనకు పిల్లలు పుడితే పాపమీద నాకున్న ప్రేమ తగ్గిపోతుందని భయం వేస్తోంది. అందుకే మనకు పిల్లలు వద్దు. వెంటనే వెళ్ళి పాపని మన దగ్గరకు తెచ్చుకుందాం.”

ప్రియాంక ఆనందంతో మూగబోయింది.

***

మా మామగారు గుండెపోటుతో మరణించారు. ఇల్లంతా శోకసంద్రమయింది. నాకు మాత్రం ఆయన మరణం అంతులేని సంతోషాన్ని కలుగజేసింది.

‘హమ్మయ్య’ ఆయన అడ్డు తొలగింది. ఇక ప్రియాంకనీ, పాపనీ మూడో కంటికి తెలియకుండా అడ్డు తొలగిస్తే, ఈ ఆస్తిపైన సర్వాధికారాలూ నావే. ‘ముసిల్ది! మా అత్తగారు ఎన్నేళ్ళు బతుకుతుందిలే’ అనుకుంటుంటే నా మనసుకి ఏదో నిశ్చింత, ఊరట! మా మావగారి కర్మకాండలకి హాజరైన ఆయన బంధువర్గం ముందు ప్రియాంక మీదా, పాపపైనా అవసరమైన దానికంటే ఎక్కువ ప్రేమని ప్రకటించి, వాళ్ళ దృష్టిలో సాక్షాత్తూ భగవంతుడిని అనే మార్కులు కొట్టేసాను. మా మామగారి మరణాన్ని లోలోన ఆనందిస్తూనే పైకి బాధను, దుఃఖాన్నీ ప్రకటించసాగాను. ఆయన దశదిన కర్మలన్నీ వైభవంగా జరిగిపోయాయి.

పదమూడోరోజు మా ఫ్యామిలీ లాయర్‌గారు వచ్చి, మా మామగారు స్వదస్తూరీతో రాసి రిజిస్టర్‌ చేసిన విల్లుని చదివి వినిపించారు.

ఆ విల్లు ప్రకారం ఆయన స్థిరచర ఆస్తులలో ఒక వంతు దానధర్మాలకి కేటాయింపబడింది. మిగిలిన ఆస్తి మా అత్తగారికి, ప్రియాంకకీ చెరిసగం చెందుతుంది. మా అత్తగారి తదనంతరం ఆవిడ పేరుమీదున్న ఆస్తి ప్రియాంకకి, పాపకీ చెందుతుంది. అంతేతప్ప, ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నాకు రాదు. నన్ను కంపెనీ ఎండీగా కొనసాగించాలనీ ఏటా పదిశాతం జీతం పెంచాలనీ ఆయన అభీష్టం. ఆ విల్లులోని సారాంశం తెలియగానే నా కాళ్ళకింద భూమి కంపించినట్లయింది. ఆస్తిపైన ఆశతో, ఆదర్శం పేరుతో ప్రియాంకని పెళ్ళిచేసుకున్నాను.

నా ఆదర్శం వెనుక ఉన్న కుటిలాలోచన మా మామగారికి తెలిసిపోయిందా? పాపని నేను బాగా చూసుకోకపోవడం గమనించి దూరాలోచనతో ఇంత పగడ్బందీగా విల్లు రాశారా? ఈ విషయాన్ని ఆయన మనసులోనే ఉంచుకున్నారా, లేక అత్తగారితోనూ ప్రియాంకతోనూ కూడా చర్చించారా? నా తలతిరిగిపోయి స్పృహ తప్పినట్టయింది.

*********

Posted in November 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *