Menu Close

Shabdavedhi pagetitle

- గౌరాబత్తిన కుమార్ బాబు -
వెంకటగిరి పట్టణ చరిత్ర
(సంస్థాన చరిత్ర మరియు ప్రాచీన అంశాలు)

వెంకటాద్రి పర్వతానికి ఉత్తరం నాలుగు ఆమడల దూరంలో ఉన్న శేషాచల పర్వతానికి తూర్పున మూడు పరుగుల దూరంలో ఉన్నందున ఈ గ్రామానికి వెంకటగిరి అనే విష్ణుపరమైన పేరు ఏర్పరిచారు. ఈ శేషాచల పర్వతానికి దిగువ వెంకటగిరికి నైరుతి మూలాన ఒక నది పుట్టి అది వెంకటగిరికి తూర్పుగా గుంటి మడుగు అనే పేరు కలిగి ప్రవహిస్తున్నది. దీనికే కైవల్యా నది అని పేరు. 1892లో ఈ నదిపై గిర్డర్ వంతెనను నిర్మించారు.

(దూరం కొలవడానికి పరుగు అనే పదం వాడడం చూసి అయోమయం వద్దు, క్రింద ఇచ్చిన వివరణ చదవండి: - పొడవుకు సంబంధించిన కొలతలలో అతి పెద్ద కొలత ఒక యోజనము, దీన్ని కొన్నిచోట్ల ఆమడ అని కూడా అంటారు. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో ఆమడను దాదాపు 10 మైళ్ళుగా ప్రామాణీకరించారు. ప్రతి యోజనము నాలుగు పరుగులు లేదా నాలుగు కోసులు. కోసు లేదా పరుగు ఎంత దూరం అన్న విషయం మాత్రం ప్రాంతాన్ని బట్టి రెండు మైళ్ళ నుండి రెండున్నర మైళ్ళ దాకా మారుతుంటుంది.)

కైవల్యా నదికి అవతల ఒడ్డున మనులాలపేట, బంగారుపేట, చెవిరెడ్డిపల్లి, అమ్మవారిపేట, పెరియవరం పంచాయతీలు ఉండేవి.

బస్ స్టేషన్, రైల్వేస్టేషన్, గురుకుల పాఠశాల, గవర్నమెంట్ కళాశాల, ఐ.ఐ.హెచ్.టి, సబ్ స్టేషన్, పాలకేంద్రం, తెలుగుగంగ ఆఫీస్, ఫైర్ స్టేషన్ వంటి ఆధునిక అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఈ ఐదు పంచాయతీల పరిధిలో జరిగాయి. G.O.M.s.No.13 dt: 06-01-2005 ద్వారా ఈ ఆరు పంచయతీలను థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీగా మార్చారు. అలా ప్రస్తుత వెంకటగిరి పట్టణం ఏర్పడింది.

వెంకటగిరి పూర్వపు పేరు కలిమిలి. కైవల్యా నది ఒడ్డున కొలువై ఉన్న గ్రామ దేవత కలివేలమ్మ పేరు మీదనే ఊరికి కలిమిలి అనే పేరు వచ్చింది. కలిమిలికి కొంత దూరంలో పాలెంకోటకు సమీపంలో వెలిగొండలో దుర్భేద్యమైన దుర్గం ఉన్నది. అందువల్ల కలిమిలి ఓ సైనిక కేంద్రంగా ఉండేది. పదిహేడవ శతాబ్దం మొదట్లో చంద్రగిరి నుండి రాజ్యం చేస్తున్న విజయనగర ప్రభువు వెంకటపతిరాయలి వద్ద నాయకుడిగా ఉన్న గొబ్బూరి జగ్గరాయలి ఆధీనంలో కలిమిలి మరియు అనుబంధంగా ఉన్న దుర్గం ఉండేవి. గొబ్బూరి పాలెగాండ్ల కోట ఉన్న ప్రాంతాన్నే ఇప్పుడు వెంకటగిరి టవున్ లో పాతకోట అని పిలుస్తున్నారు. దీనికి సమీపంలోనే చోళుల కాలంనాటి పెరుమాళ్ళ గుడి అంటే వరదరాజస్వామి ఆలయం ఉన్నది. కైవల్యా నది తూర్పు ఒడ్డుకు కొంత దూరంలో రామలింగేశ్వర స్వామి గుడి ఉన్నది. అది వెంకటగిరిలో ఉన్న గుడులలోకెల్లా పాతదని అంటారు.

సదాశివరాయలి (క్రీ.శ 1542 నుండి 1565 వరకు) కాలంనాటి తామ్రశాసనంలో కలిమిలి సీమ ప్రస్తావన:-

ఈ తామ్ర శాసనం గురించి మెకంజీ కైఫియత్తుల్లో ఉంది. వెంకటగిరి తాలూకా వుంజేపల్లి గ్రామ పురోహితుడైన బీదర నారాయణప్ప అనే ఆయన బుస్సుపాళెం గ్రామాన అష్టమాంశం అగ్రహారం అనుభవిస్తుండేవాడు. ఇతను కాళహస్తి తాలూకు ఇనగలూరు గ్రామంలో కాపురం ఉన్నాడు. ఇతని వద్ద నుండి మెకంజీ ఈ తామ్ర శాసనం సేకరించాడు. ఈ శాసనం యొక్క సారాంశం :- శాలివాహన శక వర్షంబులలో 16వ దగు శతబ్దంలోని రక్తాక్షి నామ సంవత్సరంలో సదాశివరాయలు విజయనగరంలో రత్నసింహాసనారూడుండై పృథ్వీ రాజ్యం చేస్తుండగా వల్లం బొట్లు కుమారులగు తిరుమల భొట్లు, వెంకట భొట్లు, కొండు భొట్లు మొదలైన ఐదుగురికి చంద్రగిరి రాజ్యంలో చెల్లే కలిమిలి సీమలో వెలుగుగంగు అనేవాడు వ్యవహారం చేస్తూ ఉండగా వల్లెవేటి గ్రామం వద్ద రాజుపాళెం గ్రామం సర్వమాన్యం అగ్రహారం చేసి తామ్ర శాసనం రాయించి ఇచ్చినారు.

కలిమిలి వెంకటగిరిగా ఎలా మారింది? వెంకటగిరి సంస్థానం ఎలా ఏర్పడింది?

వెంకటగిరి రాజాల మూలపురుషుడు నల్గొండ జిల్లా అమ్మనగల్లుకు చెందిన చెవిరెడ్డి. వీరు కాకతీయ గణపతిదేవుని సమకాలీకుడు. గణపతిదేవుడు చెవిరెడ్డికి సామంత పదవినిచ్చాడు.

చెవిరెడ్డి నుండి పదిహేడవ తరమైన పిన్న కొండప్పనాయుడు వెలుగోడులో ఉంటూ ఏరువసీమను విజయనగర సామంతుడిగా పాలించేవాడు. వీరికి తిమ్మాంబ, అక్కమ్మ, సింగమ్మ అను ముగ్గురు భార్యలు. అక్కమ్మ కు రంగప్ప నాయుడు, యాచమ నాయుడు, తిమ్మనాయుడు అను ముగ్గురు కుమారులు; తిమ్మాంబకు కుమార తిమ్మ నాయుడు, కొండప్ప నాయుడు,పెద కొండప్ప నాయుడు, రాయప్ప నాయుడు అను నలుగురు కుమారులు.

యాచమ నాయుడి కుమారుడైన కస్తూరి రంగప్పనాయుడు వెంకటగిరి రాజాలలో పందొమ్మిదవ తరం. వీరి రెండవ కుమారుడైన పెద యాచమ నాయుడు లేదా యాచశూరుడు వెంకటగిరి రాజాలలో ఇరవైవ తరం. వీరి పెద్ద కుమారుడైన కుమార రంగప్ప నాయుడు బొబ్బిలి రాజాలలో మొదటివాడు. ఆరవ కుమారుడైన కుమారయాచమనాయుడు వెంకటగిరి రాజాలలో ఇరవై ఒకటవ తరం. రాయప్ప నాయుడి కుమారుడే వెంకటాద్రి నాయుడు.

తాళికోట యుద్ధం తరువాత విజయనగర సామంతులు అనేకులు స్వతంత్రం ప్రకటించి తమలో తాము కలహించుకునేవారు. అలాంటి సమయంలో క్రీ.శ 1579లో కడప మండలంలోని కోడూరు వద్ద భీకర యుద్ధం జరిగింది. ఆ సందర్భంలోనే వెంకటాద్రి నాయుడు నెల్లూరు మండలంలోని కలిమిలి మీద దాడి చేసి గొబ్బూరి వంశస్తులు నుండి కలిమిలి కోటను, దుర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అప్పుడే కలిమిలికి తన పేరు మీద వెంకటగిరి అని పేరు మార్చారు. వెంకటాద్రినాయుడి తర్వాత వెంకటగిరిని ఆయన కుమారుడు రాయప్ప నాయుడు పాలించాడు. వీరి తర్వాత వెంకటగిరిని మళ్ళీ గొబ్బూరు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. కలిమిలి దుర్గం మీద దొరికిన శాసనాల బట్టీ గొబ్బూరు వాళ్ళు తొలుత కార్వేటి నగరం వారి వద్ద నుండి కలిమిలిని స్వాధీనం చేసుకున్నారు. క్రీ.శ 1614 నాటికి నెల్లూరు మండలంలోని వెంకటగిరి, పాలెంకోట, రాపూరు, పొదలకూరు, ఓగూరు, ప్రళయకావేరి వంటివన్నీ గొబ్బూరి వాళ్ళ ఆధీనంలో ఉండేవి. ఉత్తర మల్లూరులో క్రీ.శ 1693లో బంగారు యాచమ నాయుడు జుల్ఫికర్ ఖాన్ చే హత్య గావించబడిన తరువాత భారతదేశ చక్రవర్తి ఔరంగజేబ్ వెంకటగిరి కేంద్రంగా పదునాలుగు తాలూకాలపై అధికారం ఇస్తూ వెలుగోటి వారికి క్రీ.శ 1695లో సన్నదు ఇచ్చారు.

అప్పటి నుండీ వెంకటగిరిని పాలించిన వెలుగోటి రాజుల జాబితా :-

  1. రాజా శ్రీ సర్వజ్ఞ కుమార యాచమ నాయుడు బహదూర్ (క్రీ.శ 1695-క్రీ.శ 1748)
  2. రాజా శ్రీ బంగారు యాచమ నాయుడు బహదూర్ (క్రీ.శ 1755-క్రీ.శ 1776)
  3. రాజా శ్రీ కుమార యాచమ నాయుడు బహదూర్ (క్రీ.శ 1777-క్రీ.శ 1804)
  4. రాజా శ్రీ బంగారు యాచమ నాయుడు బహదూర్ (క్రీ.శ 1804-క్రీ.శ 1848)
  5. రాజా శ్రీ వెలుగోటి కుమార యాచమ నాయుడు బహదూర్ CSI (క్రీ.శ 1848-క్రీ.శ 1879)
  6. మహారాజా సర్ వెలుగోటి గోపాలకృష్ణ యాచేంద్ర బహదూర్
    G.C.I.E పంచహజార్ మన్సబ్ దార్ (క్రీ.శ 1879-క్రీ.శ 1916)
  7. లెఫ్టినంట్ సర్ వెలుగోటి గోవింద కృష్ణ యాచేంద్ర బహదూర్
    KCIE ADC పంచహజార్ మన్సబ్ దార్ (క్రీ.శ 1916-క్రీ.శ 1937)
  8. రాజా శ్రీ వెలుగోటి సర్వజ్ఞ కుమార యాచేంద్ర (క్రీ.శ 1937-క్రీ.శ 1949)

వరదరాజస్వామి ఆలయం :-

చోళులు తమ పరిపాలన కాలంలో శైవ వైష్ణవ మతాలను ఆదరించారు. వారు తమ పరిపాలనా విభాగాలలో అనేక వరదరాజస్వామి ఆలయాలను నిర్మించారు. కలిమిలి కోట మరియు దుర్గం కూడా అప్పట్లో చోళుల పాలనలో ఉండేది. కాంపాలెంలోని వరదరాజస్వామి ఆలయాన్ని చివరి చోళ రాజైన 3వ రాజేంద్ర చోళుడు (1246–1279 CE) నిర్మించాడు. 3వ రాజేంద్ర చోళుడితో చోళ సామ్రాజ్యం అంతరించింది. రాజ్యం పాండ్యుల చేతికి వచ్చింది. 3వ రాజేంద్ర చోళుడి తదుపరి వచ్చిన పాండ్య రాజులు ఆలయానికి రాజగోపురం నిర్మించారు.1279లో మారవర్మన్ కులశేఖర పాండ్యన్ I రాజేంద్ర చోళ IIIని ఓడించి పాండ్యుల పాలనను స్థాపించాడు, దీనితో చోళ సామ్రాజ్యం ముగింపుకు వచ్చింది. తరువాతి కాలంలో శిథిలావస్థకు చేరిన ఈ ఆలయంలో రాజా కుమారయాచమనాయుడు బహదూర్ క్రీ.శ 1855లో తిరుమల రామానుజ పెదజీయర్ స్వామివారిచే వైఖాసన ఆగమయుక్తంగా పునః ప్రతిష్ఠ గావించారు. తిరిగి సుమారుగా ఓ దశాబ్దం క్రితం టీ.వి.యస్ కంపెనీ ఈ ఆలయాన్ని మళ్ళీ జీర్ణోద్ధరణ గావించింది.

శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం :-

వెంకటగిరిని క్రీ.శ 1755 నుంచి క్రీ.శ 1776 వరకు పరిపాలించిన శ్రీ రాజా బంగారు యాచమ నాయుడు బహదూర్ క్రీ.శ 1760వ సంవత్సరంలో కైవల్య వాగు ఒడ్డున కాశీ నుండి ఓ సాధువు తెచ్చి ఇచ్చిన శివలింగాన్ని ప్రతిష్టించి కాశీ విశ్వనాథుని పేరిట గుడిని నిర్మించారు. క్రీ.శ 1774వ సంవత్సరంలో గుడిలో నిత్య కైంకర్యాలు ఆటంకం లేకుండా జరగడం కోసం చింతగుంట గ్రామాన్ని దానం చేశారు.

వీరి కుమారుడైన రాజా కుమార యాచమ నాయుడు బహదూర్ ఈ గుడిని బాగా అభివృద్ధి చేశారు. గుడిలో 64 అడుగుల ఎత్తుగల ఏకశిలా ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు. అలానే స్వామి వారికి ఏటా పది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం ఆరంభించారు. ప్రతి సంవత్సరం జూన్ లో జరిగే ఈ ఉత్సవాలకు సుమారు ముప్పై వేల నుండి నలభై వేల వరకు జనం హాజరవుతారని 1873లో అచ్చువేసిన నెల్లూరు జిల్లా మ్యానువల్ లో జాన్.ఏ. బోస్వాల్ రాశారు. శ్రీ కాశీ విశ్వనాథస్వామి మహోత్సవం జ్యేష్ట శుద్ధ దశమి నుండి బహుళ పంచమి వరకు పదకొండు రోజుల పాటు జరుగుతుందని, పౌర్ణమి రోజున జరిగే నంది సేవ, పాడ్యమి రోజున జరిగే రథోత్సవం వందలాది మంది భక్తులను ఆకర్శిస్తాయని, సుమారు రెండు వేల మంది ప్రజలు చుట్టు ప్రక్కల గ్రామాల నుండి వస్తారని 1961 ఆంధ్రప్రదేశ్ సెన్సస్ నివేదికలో కూడా పేర్కొన్నారు.

**********

Posted in August 2026, వ్యాసాలు

1 Comment

  1. Jayaram

    Very nice to know about the history of Venkatagiri. So many unknown facts of Andhra’s history are linked with Venkatagiri.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *