ఆ మధ్యేదో రిపేర్ పని అవుతోందని తెలిసి, ఈ లేక్ పార్కుకి రావట్లేదు మార్నింగ్ వాక్ కోసం నేను ఓ రెండు నెలలుగా. ఇవాళెందుకో చూద్దాం రిపేర్ అయిపోయిందేమో అని ఆ పార్క్ కే వెళ్ళాను.
సుమారు ఏడు కావస్తోంది టైము. అప్పటికే పిల్లా జెల్లా, యువతీయువకా, ముసలి ముతకాతో సహా చాలా మందే నడుస్తున్నారు.
ఎవరి నడక వారిదే, ఎవరి లోకం వారిదే ఆ నడకలోనూ!
ఒకరు నిట్టనిలువుగా, పాదు నుంచి పై వరకు ఒకే కాండంతో ఉన్న కొబ్బరిచెట్టు లాగా నిటారుగా ఉండి నడుస్తూ! అనగా ఈషన్మాత్రం వంగకుండా, ramrod straight!
ఒకరు కాళ్ళీడ్చుకుంటూ, ప్రభుత్వ పైకంతో ఏ గుడో గోపురమో కట్టించిన దేవదాసు లాగా.
అహఁహఁ, దేవదాసంటే వినోదా వారి ట్రాజీ ఎపిక్ హీరో కాదు నేనంటోంది; దేవుడికి భృత్యానుభ్రృత్యులై భక్తితో దాసులైన వారి గురించి. దేవునికి దాసులైన వారు!
ఇక పోతే, కొన్ని నడకలు సింగ్సాంగ్ వెరైటీలు, స్వింగ్స్ on a walk! ఇంకొన్ని ఆయాసంతో ఆగి ఆగి చూసి చూసి ప్రొసీడ్ అయ్యే వృద్ధ లారీల టైపు. లారీల వెనుక ఏమి రాసుంటుంది, పోతంత అక్షరాలతో, గుర్తు చేయాలేవిఁటీ, "Stop Look Proceed", అనేగా!
ఇంకొక పెద్ద బ్యాచ్--"రోజూ నడిచఘోరించండి, లేదో మీ సమస్య పెరగటమే కానీ తరగటం అంటూ ఉండదిక", అని డాట్రారుచే కేకలేయించుకున్న బ్యాచ్!
వీరి ఒళ్ళు ససేమిరా ఒప్పుకోదు ఏ నడకకీ, వీరి మనసు గుండ్రాయిలా మొరాయిస్తుందీ పరిశ్రమకు! ఆ నిరోధాన్నెదిరిస్తూ తమతో తాము యుద్ధం చేస్తున్న పిటియబుల్ బ్యాచ్! పాజిటివ్ గా చెప్తే, ఫైటింగ్ స్పిరిట్స్!
ఇదొక నానా గోత్రభ్యః - అధిక బరువుతో అందగించినవారు, అరుగుదల మందగించినవారు, కీళ్ళనొప్పులు అదుపులో ఉంచ దలచిన వారూ; వారూ వీరూ, అందరూనూ-అనేకమంది!
ఆపసోపాలు పడుతూ, బల్లల మీద కూర్చుంటూ లేస్తూ, ఆ రోజు మొక్కు ఆయిందనిపించేవారు.
ఇక ఉరుకుల పరుగుల పిల్లమూకలే కళ ఆ పార్కులో ఆ వేళ.
సీతాకోకచిలకల లాగా, అటు తుర్రుమంటూ ఇటు తుర్రుమంటూ, నలుగురికీ కాళ్ళకడ్డమొస్తూ, తప్పించుకుంటూ! వీరిదో సందడి! పైగా వీరందరికి మహానుభావులు మల్లాది వారి హామీ, ఓ శ్రీరామరక్ష ఉండనే ఉన్నది!
"ఇల్లు పీకి పందిరేసి పకపకలాడితే, పిల్లలున్న లోగిలని దేవుడే మెచ్చేనులే", అంటూ!
***
ఇక నాలుగు ముక్కల్లో మా పార్కు వర్ణన సేయ దొడంగుదును.
ఇదేమిటీ పార్కు వర్ణన అనగానే ఏదో నైమిశారణ్యం వర్ణన లాగా ఆ గ్రాంథిక మొఛ్చేస్తోంది దానంతటదే, తన్నుకుంటూ! లాభం లేదు తమాయించుకుంటాను,సాదాసీదా "నాకొచ్చిన" బాసలో చెపుతాను.
"ఎందుకొచ్చిన కొచ్చినూ", పెళ్ళిపుస్తకపు ముళ్ళపూడి వారి డైలాగ్ గుర్తొచ్చి అటుగా పోతోంది పెన్ను! అయినా కోతికొమ్మచ్చి ఆడటం వారి హక్కు, అందులో మనం దఖలిడరాదు.
మళ్ళీ వర్ణన దగ్గరికొస్తే ఇదొక చిన్నది కాని పెద్ద పార్కే.
కింద చిన్న లేకూ(సరస్సు' అనగూడదేమో, పెద్దగా ఊహించుకునే ప్రమాదముంది కాబట్టి) చుట్టూ ఎత్తుగా ఎగుడుదిగుడు పాత్ వే, చెట్లూచేమలూ, ఉయ్యాళ్ళూ, సైయ్యాటలూ!
అనగా, పిల్లల ప్లే ఏరియా, పెద్దలకూ అందరికీ ఎక్సర్సైజు చేసుకోవటానికి నిలువు, అడ్డం ఐమూల అన్ని రకాల ఇనుప బార్లూ, ఎక్విప్మెంటూ! మధ్యమధ్యలో హాయిగా కూచోటానికి సిమెంటు బల్లలు ప్రతి పాతిక గజాలకూ! అక్కడక్కడా, కుటీరాల ఆకారంలో విడుదులు, అందులో కూర్చోడానికి అరుగులూ!
ఒకచోట మాత్రం ఏదో పురాతన కాలానికి ఊహలను తీసుకెళ్ళేట్టు ఉంటుంది.
మామూలుగా నడిచే నడవ కంటే కిందకు లోయలాగా ఉండి అందులో మంచి మంచి పెద్ద చెట్లు! కాస్త వెలుతురు తక్కువగా ఉండి ఉన్నదాని కంటే ఎక్కువ చల్లదనంతో ఉన్నట్టనిపిస్తూ!
ఆ లోయలో అక్కడక్కడా నేల మీద రాలిపడే బాదం ఆకులూ, ఇంకా ఇతర చెట్ల ఆకులూ, ఒక జిగిబిగిల తివాచీలాగా! ఆ ఆకులు, రంగురంగుల్లో, వాడిపోయీ వెలిసిపోయీ- రకరకాల సైజుల్లో!
అంతా ఖాళీయే, కానీ నా కళ్ళకేదో వరుసగా ఏదో సత్రయాగం జరుగుతుంటే వరుసగా వేద పఠనం చేస్తున్న మునిగణాలతో ఉన్న నైమిశమే అనిపిస్తుంది ఒక్కోసారి.
ఒక్కోసారి, స్కూలు పిల్లలు ఆనందంగా వరుసగా కూచుని త్రృప్తిగా మధ్యాహ్నం భోజనాలు ఆరగిస్తున్నట్టు! ఒక్కోసారి ఏదో వీణా వేణు మృదంగాల, గాన కచ్చేరీలకు అనువైన స్థలంగా అనిపిస్తూంటుంది.
ఊహలకేం ఎన్నెన్ని ఆకాశవీథులైనా తిరిగొస్తాయి, నిజానికి మాత్రం అక్కడ అంతా ఖాళీయే! కానీ ఓ అందమైన ఖాళీ, వనలక్ష్మి కొలువుండే స్థానం!
ఇక కొలను చూస్తే, ఎండాకాలం కావటంతో receding hairline తో ఉన్న ఒక సుందరవదనంలాగా అనిపించింది.
ఇది వరకు నీళ్ళున్న ప్రాంతం, కొలను విస్తారం మెల్లమెల్లగా తరుగుతూ వస్తోంది, నీటి కింద బండలను ఫోటో తీసి చూపిస్తూ! ఆ ఉన్న నీళ్ళలోనే కొన్ని బాతులు తేలిపోతున్నాయి, నౌకావిహారం లెవెల్లో!
కొన్ని కొంగలు నీళ్ళఅంచున నిలబడి జపాలు చేస్తున్నాయి, ఎర కనబడితే చాలు ఒరలోకి లాగేద్దామని ఏకాగ్రతతో!
కొన్ని ఏవో పేరు తెలియని పక్షులు నీళ్ళలోనే ఉన్న ఒకటి రెండు చెట్ల కొమ్మల మీద వాలి,ఉన్నాయి పహరా కాస్తున్నట్టు.
ఏవో మిశ్రమ రంగుల పెద్ద రెక్కల పక్షులు నీళ్ళ మధ్య ద్వీపాలుగా ఏర్పరచిన రాళ్ళ గుట్టలు మీద వాలి, మీటింగుల్లో మునిగి పోయి ఉన్నాయి!
మొత్తానికి అన్ని జీవాలూ, మనుషులతో సహా ఎవరి పనుల్లో వారు, ఎవరి లోకంలో వారు, బిజీబిజీ!
***
ఇక ఆ నడకలలో జనం విహరించే లోకాలు అనంతం!
ఎవరిది వారిదే, యునిక్యూ!
ఓహో 'యునీక్', అని ఊర్కోవాలా! అన్నన్ని అక్షరాలుంచడమెందుకో, పలకగూడదంటవేవిఁటో?!
ఈ తెల్లవాడి భాష అవళ ఈజీ ఇల్లెప్పా!
ఒక మలుపు తిరిగానో లేదో, ఒక సుందరి ఎవరో కాంభోజ సామ్రాజ్యపు మహారాణీ లాగా కాలుమీద కాలేసుకొని దర్జాగా కూచుని కనిపించింది.
ఎవరైనా వాళ్ళ వాళ్ళు ఫోటో తీస్తూన్నారేమోనని చూశాను. ఎవ్వరూ లేరక్కడ, ఆమె తాలూకు వారు.
ఆమె ఎటో చూస్తోంది. అస్సలు నడుస్తున్న వారినీ చూడటం లేదు. దృష్టి మొత్తం ఏదో దూర తీరాల వైపే అన్నట్టున్నది!
సరేలే, ఏ రాణి కలలు ఆమెవి అని, నా పాటికి నేను నడక సాగించాను.
నా వెనకాలే ఎవరో తమిళంలో స్టాకు మార్కెట్టు నాలెడ్జీ నంతా కుమ్మరించేస్తున్నాడు అవతల ఎవరికో ఫోన్లో! గొంతు కూడా పాపం చిన్నది కాదు.
"అదిల్లెడా మణీ, వెళియ వందుడు. అంద స్టాకులేందు. వేండా, that lousy stock, we have burnt our fingers enough, ఇల్లియా?' అంటున్నాడు పెద్దగా మొబైల్ లో!
"మీరందరూ కూడా వినండి, ఇక్కడొక మహా మార్కెట్ మేధావి మీ వెనుకే నడిచొస్తున్నాడు. కావాలంటే కొల్లగొట్టండి, జ్ఞానరత్నాలు వెదజల్లుతున్నాను. ఏరుకున్న వాళ్ళకు ఏరుకున్నన్ని", అన్నట్టున్న ధీమాతో!
పాపం పెద్దగా ఎవ్వరూ శ్రధ్ధాళువులు కనిపించినట్లు లేదు.
అతని స్టాకులే కాదు, ఊరికే పెంచిన జ్ఞానం కూడా అదేం ఖర్మమో, పాపం going down the drain! అనే అనిపించింది నాకు.
కాస్త ముందుకు వస్తునా, కాళ్ళు వత్తుకుంటూ, అబ్బా అమ్మా అనుకుంటూ కీళ్ళ నెప్పుల మీద మళయాళంలో మాట్లాడుకుంటున్న ముగ్గురమ్మలు కనబడ్డారో బల్లమీద.
ముగ్గురూ కాస్త భారీకాయాలే, పాపం ఎంత బాధలో ఉన్నారో, వెళ్ళేప్పుడు ఇళ్ళకు వారిని జాగ్రత్తగా చేర్చు ప్రభో అని ప్రార్థించాలనిపించింది.
చాను కూడా!
పరహితం కోరే మంచి వాణ్ణి చూశారూ, నేను మొదట్నుంచీ,!
ఐ కాంట్ హెల్ప్ హెల్పింగ్ అదుర్స్, యూనో!
ఇక నా రౌండు పూర్తవబోతుంటే తగిలిందో యువ బ్యాచ్. బ్యాచ్ అనగా ఇద్దరే ఇక్కడ!
ఏదైనా సందర్భాన్ని బట్టే కదూ!
వారెంత సన్నగా నవ్వుకుంటూ, చిన్నగా మాట్లాడుతున్నారో చూస్తే ఇదో కళ అనిపించక మానదు.
ఆ మాటలు ఆ ఉహూలు వారికైనా వినిపిషస్తున్నాయో లేదో, నాకైతే అనుమానమే!
"మధ్యలో పానకంలో పుడకలాగా నువ్వెవరివయ్యా, ఆ ఇద్దరి మధ్యా?! నీ కెందుకూ అనుమానమైనా, నమ్మక మైనా", అంటారా?!
కరెక్ట్, ఈ సారి మీరే కరెకట్టు!
వారి జోలి మనకేల,, యువగోల, స్నేహలీల!?
***
అరే ఒక రౌండైపోయిందే, గేటొచ్చేసింది.
బయటికి రాబోతుంటే, వాచ్మాన్ చూసి అడిగాడు,"ఏం సార్ ఈ మధ్య రావట్లేదు?" అని!
"ఏదీ ఆ మధ్య రిపేర్ ఏదో అన్నారు కదా, అందుకే కొన్ని రోజులు రాలేదు. ఇవాళే వచ్చా నిటువైపు, ఏం అయిందా రిపేర్", అడిగాను!
"చూస్తున్నారు కదా సార్, ఎక్కడిదక్కడే ఉన్నది. గోతులు తవ్వినరు పోయినరు ఇంక మళ్ళెప్పుడొస్తే అప్పుడే, సర్కార్ పని ఏం చెపుతం" అన్నాడతను ఏ భ్రమలూ లేని వాడి లాగా!
"నిజమే నిజమే, సర్కారంటే ఏనుగు కదూ, కదలటం కష్టమే", అంటూ నేను మాత్రం చకచకా బయటికి కదిలాను!
****
ఇవీ, మా పార్కులో ఆ పొద్దుటి వేళ, నే చూసిన నడక వరసలూ, సరసు పలుకులూ, నడకల్లో వరసలూ!
ఏంచేస్తాం, కనిపించేవి కళ్ళు చూస్తాయ్, వినిపించేవి చెవులు వింటాయ్, వేళ్ళు నొక్కిన టాబ్ లు అవి పలికించేస్తాయ్, ముద్రారాక్షసాలు మనం చూసుకుంటే!
నేనెవరినీ మధ్య?!
"నన్నాడిపోసి కోరాదు చూవె నవమోహనాంగీ" అని కాదూ జావళీ రత్నం!
అయినా అంటారా,"నెరుసులెన్నుటే ఇదీ", అని!?
సరే సర్దుకుంటా--
"నెరుసు లెన్నివారి యశము నాగశయనుడెరుగు
విశ్వదాభిరామ వినుర వేమ, కలిపి కొట్టర భీమ!", అన్నారా లేదా, వెనకటికి!
కనుక అదే అనుకుని సర్దుకుంటా, ఆదుర్దా ఏవీఁ లేదు!
మరుంటా!
మీరందరూ జాగ్రత్త సుమీ!