Menu Close
Kasi Viswanatham
పలుకుబడి కథలు
కాశీ విశ్వనాథం పట్రాయుడు

తలపాగా చుట్టడం రాక బుర్ర వంకర అన్నట్లు (సామెత కథ)

ఒకరోజు సాయంత్రం మురళి తన మనవడు జున్నుబాబుతో కలిసి సైకిల్‌కు బెల్ బిగించడానికి ఓ సైకిల్ దుకాణానికి వెళ్లాడు.

"బాబూ! ఈ సైకిల్‌కు బెల్ బిగించి పెట్టు" అన్నాడు మురళి.

పని కుర్రాడు చాలాసేపు ప్రయత్నించినా బెల్ బిగించలేక, "అయ్యా! ఈ స్క్రూ బాగోలేదు. అందుకే బిగించలేకపోతున్నాను." అన్నాడు.

అది విన్న దుకాణ యజమాని బెల్‌ను తీసుకుని రెండు నిమిషాల్లోనే చక్కగా బిగించాడు.

పని కుర్రాడి వైపు చూస్తూ, "పని రాకపోతే నేర్చుకో. అంతేగానీ వస్తువులను నిందించకు. తలపాగా చుట్టడం రాక బుర్ర వంకర అన్నట్లు నీ చేతకానితనాన్ని ఇతరుల మీదకు నెట్టొద్దు" అని మందలించాడు.

ఆ మాటలు జున్నుబాబుకు అర్థం కాలేదు.

ఇంటికి రాగానే, "తాతయ్యా! సైకిల్ బెల్‌కు తలపాగాకు సంబంధం ఏమిటి?" అని అడిగాడు.

మురళి చిరునవ్వుతో, "దాని వెనుక ఒక సరదా కథ ఉంది. విను" అంటూ చెప్పడం ప్రారంభించాడు.

అనగనగా వీరయ్య అనే వ్యక్తి ఒకసారి జాతరకు వెళ్లాడు. అక్కడ డబ్బులు తీసుకుని అందంగా తలపాగాలు చుట్టే దుకాణం కనిపించింది. తలపాగా చుట్టించుకున్నవారు ఫోటోలు కూడా తీయించుకుంటున్నారు.

వీరయ్య కూడా వరుసలో నిలబడ్డాడు.

అతని వంతు రాగానే ఓ పని కుర్రాడు తలపాగా చుట్టడం మొదలుపెట్టాడు.

"అయ్యా! తలను కాస్త నిటారుగా ఉంచండి" అన్నాడు.

వీరయ్య అలాగే ఉంచాడు.

అయినా తలపాగా సరిగా కుదరలేదు. మళ్లీ ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది.

విసుగెత్తిపోయిన ఆ కుర్రాడు, "అయ్యా! మీ బుర్ర వంకరగా ఉంది. అందుకే తలపాగా కుదరడం లేదు" అన్నాడు.

ఆ మాట విన్న దుకాణ యజమాని, "ఏంట్రా ఆ మాటలు? నీకు తలపాగా చుట్టడం సరిగా రాకపోతే నేర్చుకో. తలపాగా చుట్టడం రాక బుర్ర వంకర అంటావేం? నీ చేతకానితనాన్ని ఎదుటివారి మీదకు నెట్టకు" అని గట్టిగా మందలించి రెండు నిమిషాల్లోనే వీరయ్యకు అందంగా తలపాగా చుట్టాడు.

నాటి నుంచి తమ చేతకానితనానికి ఇతరులను లేదా పరిస్థితులను నిందించే వారిని చూసి ‘తలపాగా చుట్టడం రాక బుర్ర వంకర అన్నట్లు’ అనడం ఆనవాయితీ అయిందని చెప్పి మురళి కథ ముగించాడు.

"అంటే తాతయ్యా! ఏ పని రాకపోయినా నేర్చుకోవాలి. కానీ మన అసమర్థతను ఇతరుల మీద నెట్టకూడదు కదా!" అన్నాడు జున్నుబాబు.

"అవునురా! అదే 'తలపాగా చుట్టడం రాక బుర్ర వంకర అన్నట్లు' అనే సామెత చెప్పే గొప్ప నీతి" అని మురళి ప్రేమగా చెప్పాడు.

***********

రచయిత పరిచయం

Kasi Viswanathamనా పేరు కాశీ విశ్వనాథం పట్రాయుడు. నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడను. ప్రవృత్తి రీత్యా రచయితను. 300 కవితలు, 200 బాలగేయాలు, 50 సాంఘిక కథలు, 250 బాలల కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పిల్లలతో గడపడం, వారికి కథలు చెప్పడం, వారికి నచ్చిన కథలు రాయడం నాకు ఎంతో ఇష్టం. తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగించడానికి, తెలుగు భాష గొప్పతనం, జాతీయాలు, నుడికారాలు, సామెతలు గురించి నేటి తరం పిల్లలకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదే ఉద్దేశ్యంతో కొంతమంది రచయితలు ఇంతకు ముందు జాతీయాలు, సామెతలు వాటి పుట్టు పూర్వోత్తరాల గురించి రాశారు. అయితే నేను భాషోపాధ్యాయుల కోరిక మేరకు ఆ సామెతలను, జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగించారు అనే విషయాన్ని కథల రూపంలో అందిస్తున్నాను. వీటిని తరగతి గదుల్లో బోధించడానికి, ఉదాహరణలుగా చెప్పడానికి, జాతీయాలు, సామెతలు పిల్లల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఎంతగానో ఉపయోగ పడతాయి. నన్ను ప్రోత్సహించి, నా రచనలు విద్యార్థులకు, తెలుగు భాషాభిమానులకు చేరువయ్యేలా కృషి చేయాలని సంకల్పించిన సిరిమల్లె పత్రిక సంపాదకులు మధు బుడమగుంట గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను క్రింది బాక్స్ లో కామెంట్స్ రూపంలో తెలుప మనవి. – కాశీ విశ్వనాథం.

Posted in August 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *