2009 ప్రారంభంలో, ఆ ఏడాది జూలైలో చికాగోలో జరగబోయే TANA మహాసభల సావనీర్ కోసం ఒక కథ రాయమని నన్ను అడిగారు. ఆ మహాసభల థీమ్ – ‘సాంకేతిక వికాసం – సాంస్కృతిక విన్యాసం’.
వ్యాస రచనల పోటీలు హై స్కూల్ తోనే అంతమవ్వటంతో, ఇచ్చిన థీమ్ మీద వ్రాయమనడం చాలా రోజుల తరువాత, ఈ కథ తో పునరావృతం అయ్యింది.
ప్రతి కొత్త కథ నాకు కొత్త పుస్తకాలు చదవడానికి, కొత్త విషయాలు తవ్వి తీయడానికి ఒక సాకు. కొంతకాలం ఆ ఆలోచనలన్నీ మనసులో నృత్యం చేస్తూ తిరుగుతాయి. ఒక దశలో అవి వేళ్ల మీదికి చేరి కీబోర్డు మీద పడతాయి. కానీ ఆ కథలకు ప్రేరణ జీవితంలో అనుకోకుండా తటస్థ పడిన ఘటనలే.
ఈ ఆహ్వానం, దానితో పాటు ఇచ్చిన శీర్షిక, నన్ను అప్పట్లో వస్తున్న కొత్త టెక్నాలజీల వైపు నెట్టింది. అప్పుడప్పుడే , ట్విట్టర్ అనే పక్షి, గూటి దాటి బయటికి రావడం మొదలుపెడుతోంది. దాని సంగతేమిటో తెలుసుకోవాలని నేనూ ఆ ట్విట్టర్ సముదాయంలో చేరాను.
కొద్ది రోజుల్లోనే దాని సామర్థ్యం అర్థమైంది. వార్తలను క్షణాల్లో వ్యాపింపజేయగలదని, ప్రముఖులకు అది ఒక శక్తివంతమైన వేదిక అవుతుందని ఊహించాను. కానీ ప్రజాభిప్రాయాలను మలచగల శక్తి దానిలో ఉందని మాత్రం అప్పుడు గ్రహించలేదు. తర్వాతి సంవత్సరాల్లో అది ప్రభుత్వాలనే కదిలించే స్థాయికి వెళ్లింది.
తరువాత నాకు అవగతమైన విషయం, ఈ కథ పుణ్యమానని, ట్విట్టర్ లో ముందుగా చేరిన వాళ్ళలో నేనూ ఒకడయ్యాను. ఎంత ముందంటే, ఎలాన్ మస్క్ కంటే చాలా ముందే ‘X’ ను ఉపయోగించేశాను.
నా బాధ ఒక్కటే. తర్వాత ట్విట్టర్ అమ్మకానికి వచ్చినప్పుడు దాన్ని కొనడానికి బిడ్ వేయలేకపోయాను. అంత డబ్బు సంపాదించడానికి ఈ కథలు వ్రాయడం సరైన వృత్తి కాదేమో!
ఈ సందర్భంలో నేను అనుకోకుండా చేసిన పని, నా మిత్రుడు, సహ రచయిత, 'అనామకుడు’ నా కథల సంకలనం చదివి చెప్పినప్పుడు కానీ తెలియలేదు.
‘కథలలో అక్కడ ఉండే సౌకర్యాలూ, అవి వాడుకునే విధానాలూ చాలా వివరంగా ఉంటాయి. అవి చదువుతున్నప్పుడు పాఠకుడు తనే అక్కడ ఉన్నట్లు అనుకునే అవకాశం ఉంటుంది.
ఈ వివరణల వల్ల మరో ఉపయోగం ఉండవచ్చు. తన కథల్లో పేజర్ల గురించీ, బ్లాక్ బెర్రీ గురించీ, ఐఫోన్ల గురించీ, ఐపేడ్ల గురించీ రాశాడు భాస్కర్. ఆ కథలు ప్రచురితమైన సంవత్సరాలతో పాటు ఆ గేడ్జట్ల గురించి చదువుతోంటే ప్రపంచంలో టెక్నాలజీలో వచ్చిన మార్పు తెలుస్తోంది.'
బహుశా తానా వారిచ్చిన శీర్షిక వల్ల, ఈ కథలో టెక్నాలజీ కూడా ఒక పాత్రలా ఒదిగిపోవలసి వచ్చింది. టెక్నాలజీ తో ఒక గొడవుంది. తొందరలోనే వాడుకలోనుంచి తప్పుకుంటాయి - బ్లాక్ బెర్రీ లాగా. కానీ ఈ కథలో కథానాయకి మానవ సంబంధాలు - ఆవిడ, ఆవిడతో బాటు ఈ కథ, టెక్నాలజీ కంటే ఎక్కువ రోజులే బ్రతుకుతాయి అని రచయితగా నా ఆశ, నమ్మకము.
ట్వీట్... ట్వీట్...
‘అలోహా! మర్రిచెట్లున్న రోడ్డు మీదున్న హోటల్ బాల్కనీలో కూర్చుని ఎదురుగా ఉన్న నీలాకాశం, అంతకన్నా నీలంగా ఉన్న సముద్రాన్ని చూస్తున్నాను... IASH’ అని సత్యభామ వేళ్ళు ఐఫోన్ మీద నాట్యం చేసాయి.
సన్నగా నాజూగ్గా ఉన్న వేళ్ళు. చక్కగా మానిక్యూరు చేయబడ్డ గోళ్ళు. వాటి అందం ఇంకొంచెం పెంచే విధంగా పూసిన నేచురల్ నెయిల్ పాలిష్... రామ్ పెళ్ళిచూపుల్లో చూసి పొంగి పోయిన అందాలలో అవీ ముఖ్యమైనవే. కాని ఇప్పుడు బ్లేక్బెర్రీ గొడవల్లో అవేవీ కనపడటంలేదు రామ్‌కి.
సత్యనారాయణ పి పి... బ్లేక్బెర్రీ పైన వేగంగా కదులుతున్న రామ్ బొటనవేలు ఒక్క క్షణం ఆగింది. స్పాం మెయిల్ అయి ఉంటుందిలే... అన్ని రకాల పేర్లు పెట్టి ఈరోజుల్లో స్పాం చేయడం మామూలే అని తరువాతి మెసేజికి కదిలిపోయాడు రామ్.
రామ్ ముఖం తెగ సీరియస్‌గా ఉంది. ఈ ప్రపంచంలో భూభారమంతా తన భుజస్కంధాల పైనే వేసుకుని తిరుగుతున్న అట్లాస్ ముఖంలా ఉంది.
హవాయి బిగ్ ఐలాండ్‌లోని హీలోలో ఉన్నారు. చిన్న ఊరే హీలో. అసలు మొత్తం ద్వీపమే చిన్నది. ఒక్క రోజులో మూడు చక్కర్లు వేసేయవచ్చు. చుట్టుకొలత ఓ 300 మైళ్ళు ఉంటుందేమో, ఉన్న ద్వీపాలలో ఇదే పెద్దది. మిగిలినవి మరీ చిన్నవి. భామ పోరు భరించలేక రామ్ చాలారోజుల తరువాత వెకేషన్ తీసుకొన్నాడు. అన్ని ఏర్పాట్లు భామే చూసుకుంది. తనకి తెగ ఫ్రెండ్స్, తన పనులన్నీ తనే ఫ్రెండ్స్ సహాయంతో నిమిషాల మీద చేయించేసుకుంటుంది. ఒక ఫ్రెండ్ ట్రావెల్ ఏజెన్సీలో పని చేస్తుంది. కాబట్టి మంచి డీల్ చూసి అన్ని సదుపాయాలు ఉన్న పేకేజీ అతి చౌక ధరలో కొనిపెట్టింది. వెకేషన్‌కి బయలుదేరే ముందు ఓ చిన్న గొడవ జరిగింది. బ్లేక్ బెర్రీ ఇంట్లోనే వదిలి రావాలని భామ పట్టు. అసలు తను వెకేషన్‌కు ఒప్పుకుందే బ్లేక్ బెర్రీ ఉండడం వల్లేనని రామ్. నాకు ఇంటర్నెట్ కావాల్సిందే, న్యూస్ చూడందే ఉండలేను అన్నాడు రామ్. దానికి నా ఐఫోన్ ఉంది కదా, నీకు ఆ ఆఫీసు పని, ఆ బ్లేక్బెర్రీలో చూడందే నిద్రపట్టదు. అది చూసిన తరువాత కూడా నిద్ర పట్టదని భామ వాపోయింది. రామ్‌ని బ్లేక్బెర్రీ అని ఏడిపిస్తుంది. కాని భామకు కూడా ఐఫోన్ బాగా అలవాటు అయ్యింది. రామ్ దొరికాడంటే ఒక నిమిషం వదలకుండా రామ్ కళ్ళల్లో కళ్ళు పెట్టి కబుర్లు చెబుతూ ఉండడం భామకు అత్యంత ఇష్టమైన పని. అలా వీలు కానప్పుడు తన ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వారితోనైనా కబుర్లు వేసుకోవడం ఆనందం.
రామ్ గమనించిన విషయం, భామ అంటే ఎందుకో తెగ పడిచస్తారు జనం. భామతో ఒకసారి పరిచయం అయారంటే పైడ్పైపర్ వెనక ఎలుకలులాగ మంత్రముగ్ధులై ఎక్కడికైనా ఫాలో అయిపోతారు. ఆ విషయం అక్షరాలా నిజం అని నిరూపించేందుకే అన్నట్లు, ఈ మధ్యనే ఓ కొత్త సైట్లో అకౌంట్ ఓపెన్ చేసింది భామ. ట్విట్టర్ డాట్‌కాంలో చేరిన మొదటి సభ్యులలో భామను కూడా జత చేయవచ్చేమో. ఓ 140 అక్షరాలలో తను ఏమి చేస్తుందో చెప్పడం, అది వినడానికి పొలోమని భామ ఫ్రెండ్స్ అందరూ ఫాలో అవ్వడం, వారి కబుర్లు మళ్లీ అదే 140 అక్షరాల పరిధిలో చెప్పుకోవడం... భామ ఈజ్ హేవింగ్ ఆ బ్లాస్ట్స్ విత్ హర్ ఫ్రెండ్స్.
‘‘మరి బయలుదేరుదామా, చాలా సైట్ సీయింగ్ ఉంది కదా’’, అంది భామ కారు తాళంచెవులు, హోటల్ డోర్ కీ కార్డు చేతిలోకి తీసుకొంటూ.
‘‘సరే...’’ బ్లేక్బెర్రీని అతి కష్టం మీద బెల్టుకున్న క్లిప్పుకు తగిలించుకుని రామ్ భామను అనుసరించాడు.
‘క్రేటర్లు, గంధకం వాసనతో భూమి లోతుల్లో నుంచి వస్తున్న ఆవిర్లు... నేషనల్ వాల్కనో పార్క్‌లో IASH’ మరో ట్వీట్ పంపించేసింది భామ.
భామ ట్వీట్ రామ్ బ్లేక్బెర్రీలో వచ్చేరికి, తను చూస్తున్న మెయిళ్ళు ఆపి, ‘‘నీ గుంపుతో మాట్లాడటం ఆపలేదా... నీతో పాటు వెరైజన్ యాడ్‌లాగా ఓ వందమంది మన వెకేషన్ ఫాలో అవుతున్నట్టుంది’’, అన్నాడు రామ్.
‘‘మరేం చేయమంటావ్... నీవు ఆ ఆఫీసు పనిని వదలకుండా మన వెకేషన్‌కు తెస్తే’’ అంది భామ కొంటెగా.
‘‘ఈ IASH ఏంటి... ప్రతిసారి వాటితో నీ ట్వీట్ సందేశాలు ముగిస్తావు’’
‘‘అమ్మా... ఆశ దోశ చెప్పానుగా... నీ బ్లేక్బెర్రీ మూసి... నా హాన్డోవర్ చేసి... నాతో నువ్వు 100% టైమ్ గడుపు... నీకు IASH అంటే ఏమిటో చెప్తా’’.
‘‘ఏం చేయమంటావు భామ... ఇదిగో చూడు ఆ లిండా... రాత్రి ఒంటిగంటకు మెయిల్ పంపించింది. ఆవిడ రాత్రి అంతా మేల్కొని పని చేస్తున్నట్లు.... అందరు ఎగ్జిక్యూటివ్లకీ కాపీ చేసింది. ఇదిగో ఈ ట్రిక్కులు ఉపయోగించే పైకి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు కొట్టేస్తున్నది... నేనేమో గొడ్డు చాకిరీ చేసి కూడా ఎక్కడి గొంగళి అక్కడే ఉన్నట్లున్నాను’’, అని వాపోయాడు రామ్.
రామ్ మనస్సులో ఉన్న అలజడి, చూస్తున్న అగ్నిపర్వతాలకి, లావా ప్రవాహాలకి తక్కువేమీకాదు. తన యాంబిషన్కు తగినట్టు తను ముందుకు పోలేకపోవడం రామ్ కంటికి నిద్ర, మనస్సుకు శాంతి లేకుండా చేసాయి.
‘‘ఎప్పుడూ నీ ఆఫీసు పాలిటిక్స్ గొడవలే బాబు... ఎంత జాలిగా చెప్పినా IASH అంటే ఏమిటో చెప్పను. బ్లేక్బెర్రీ నా చేతికి ఇచ్చి నన్ను నమ్ము... నీ సమస్యలన్నీ తీరిపోతాయి. IASH మిస్టరీతో పాటు’’, మళ్ళీ గలగల నవ్వుతూ అంది భామ.
‘‘ఏం నువ్వు మాత్రం ఆ ఐఫోన్ వదలకుండా తిరగటం లేదా’’.
‘‘ఓస్... అదా నీ అక్కసు. నువ్వు ఆ బ్లేక్బెర్రీ వదిలి ఉండు. నేను ఈ ఐఫోన్‌ను వెంటనే తగలేస్తాను. అయినా నేను నాకేదైనా అవసరం అనుకున్నప్పుడు మాత్రమే ఐఫోన్ వాడుతున్నాను. కాని నీవు అవసరం ఉన్నా లేకున్నా ప్రతి ఐదు నిమిషాలకు దాన్ని ఓసారి చూసి బెంబేలు ఎత్తిపోవడం లేదు?’’
రామ్‌కు భామ మాటల్లో నిజం ఉందని తెలుసు. అసలు తనకి ఈ వెకేషన్ రావాలని లేదు. తను పని బాగా చేయాలి, కెరీర్లో రాకెట్టులాగా దూసుకెళ్ళాలి.... ఎన్ని కలలు.
క్రేటర్లు, లావా సముద్రంలో పారుతుండడము, అక్కడి నుంచి లావా ట్యూబ్స్ల దగ్గరికి భామే తిప్పింది కార్లో. రామ్ భామ మాటలు పరధ్యానంగా వింటూ, ఆఫీసు గురించే ఆలోచిస్తున్నాడు. అంతవరకు ఏమాత్రం చెట్లు, చేమలు లేకుండా... ఏదో చంద్రగ్రహణం పై తిరుగుతున్నట్లున్న ప్రదేశం... లావా ట్యూబ్స్ దగ్గరికి వచ్చేసరికి చెట్లతో, పక్షుల కిలకిలా రావాలతో అందంగా అనిపించింది. అంత ఆలోచనలో ఉన్న రామ్ కూడా లోయలోకి దిగి, లావా ప్రవాహం వల్ల కొండలో ఏర్పడ్డ సొరంగాలను వాటి సోయగాలను భామను అనుసరిస్తూ చూడసాగాడు. అక్కడ కొంచెం చీకటిగా ఉండడం, సిగ్నల్ కూడా అందుబాటులో లేకపోవడంతో అక్కడ బ్లేక్బెర్రీలో చూడటం కష్టమే. వెంటనే కారు దగ్గరికి పోయి బ్లేక్ బెర్రిలో మెసేజ్‌లు చూడాలనుకున్నాడు రామ్. లిండా పనిచేస్తున్న తీరు గురించి రామ్‌కు గుబులుగానే ఉంది.
‘అంచెలంచెలుగా శాంతంగా పారుతున్న ఉమాఉమాజలపాతం ఉవ్వెత్తున ఉప్పొంగి గలగల దూకుతున్న అకాఅకా IASH’
భామ పంపిన సరికొత్త ట్వీట్‌ను చదివిన రామ్‌కు భామ జ్ఞాపకాలు ఎదురుగా ఉన్నా కదిలాయి. జలపాతం, నీటిసవ్వడి తనకు భామ గొంతునే గుర్తుకు తెప్పిస్తాయి. పెళ్లి కుదిరిన తరువాత భామే తనకు ఫోన్ చేసి మాట్లాడింది. ఫోన్లో భామ గొంతులోని తీయదనం, కొంటెతనం, ఆప్యాయత, ప్రేమ అన్నీ సర్‌ప్రైజ్‌లే. పాటలు కూడా అంత తీయగా పాడుతుంది. అవీ పాతపాటలైతే మరీని. మాట్లాడినప్పుడు ఎప్పుడూ కూనిరాగాలే. చెక్కుచెదరని ఆ కొంటెనవ్వుతో పాటు తన కోసమే ఆ నవ్వు అని రామ్‌కు తెలుసు. నవ్వులలో కూడా అన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయని భామతో పెళ్ళయిన తరువాతే తెలసింది రామ్‌కు. ఉమా ఉమాజలపాతం ఓ బొటానికల్ గార్డెన్ మధ్యలో ఉంది. త్రోవకొంచెం ఎగుడుదిగుడుగానే ఉంది. కాని జలపాతం ఏదో సినిమా సెట్టింగ్‌లాగా ఉంది. నిజంగా ప్రకృతి అంత అందంగా ఉంటుంది అంటే నమ్మబుద్ధి కాలేదు భామకు. రామ్‌కు అవన్నీ పట్టలేదు. కారు పార్కింగ్‌లో ఆపీ ఆపకుండానే అప్రయత్నంగా బ్లేక్బెర్రీ మరోసారి చూసుకున్నాడు. ఆకాఆకా జలపాతం లోయలో ఓ నేషనల్ పార్క్ ఉంది. త్రోవంతా అడివిలో పెద్ద చెట్ల మధ్య గుబాళించిన ఆర్కిడ్ పుష్పాల క్రిందుగా అలా వెళితే సడన్‌గా ఎదురుగా అకాఅకా జలపాతం ప్రత్యక్షం. ఒకేసారి ఓ 400 అడుగుల ఎత్తు నుంచి నీళ్ళు దూకుతున్నాయి. ఆ నీళ్ళ తుంపర్లలో ఇంద్రధనుస్సు కనబడుతోంది. చుట్టూ అంతా పచ్చదనం... అక్కడక్కడ ఆ అందానికి దిష్టి చుక్కలులాగా ఆర్కిడ్, ఇతర వైల్డ్ వూవులు.
అలానే నిలచి తన్మయత్వంలో మునిగిపోయింది భామ. రామ్ చేయి పట్టి లాగితే కాని అక్కడ నుంచి కదలలేదు భామ.
‘గ్రేసి చేసిన కోనా కాఫీ తాగుతున్నాం. మంచి సినిమా లాంటి కాఫీ... IASH’ కైలువ కోనా బిగ్ ఐలాండ్‌లో ఉన్న పెద్ద నగరం. అట్లాంటిస్లో సబ్‌మెరైన్‌లో తిరిగి సముద్రంలోని కోరల్ రీఫ్‌లు, అక్కడ తిరుగుతున్న రకరకాల అందమైన చేపలను చూడడం ఒక కొత్త అనుభవమే. ఏదో లోకంలో ఆలోచిస్తున్న రామ్‌ను లాగి అక్కడ ఓ కీప్సేక్ ఫోటో కూడా తీసుకుంది భామ. సమయం గడిచేకొద్దీ రామ్ రెస్ట్‌లెస్ అవుతున్నాడు. ఏదో పోగొట్టుకున్నట్లు చూపులు, అసహనం. సముద్రంలో ఓ 100 అడుగుల లోపల కూడా... కిటికీలో నుంచి కనబడే అందమైన చేపలు, సీనరీ చూసే బదులు బ్లేక్బెర్రీ లోపల మరోసారి ఏదో వెదుకుతున్నాడు. భామ, అక్కడ చూడు... ఇక్కడ చూడు... అని రామ్‌ను పీకుతూనే ఉంది. సముద్రం నుంచి బయటకు వచ్చి ఒడ్డున ఉన్న షాపులను చూస్తూ తిరుగుతుంటే, గ్రేసీ కన్పించింది.
ఓ చిన్న కొట్టు... మన బడ్డీకొట్టు లాగానే ఉంది. బయట కొన్ని కుర్చీలు. కాఫీ పాట్లలో మరుగుతున్న రకరకాల కాఫీలు. అన్నీ ఈ కోనా ప్రాంతంలో పండిన కాఫీ గింజల నుంచి చేసినవే. కాఫీ ఫ్రీనే. భామ అక్కడ కాఫీ తీసుకుని గ్రేసీతో కబుర్లు వేసుకుంది. రామ్ అదే అదనుగా బ్లేక్బెర్రీ తీసి ఏదో టైపు చేయడం మొదలెట్టాడు. గ్రేసీ మెయిన్ లాండ్లో ఉంటుంది. ప్రతి సంవత్సరం ఆరునెలలు ఇలా కోనా వచ్చి పార్ట్‌టైమ్ జాబ్‌లా కాఫీ షాప్‌లో కాఫీ గింజలు అమ్ముతుంది. కొద్ది క్షణాలలో గ్రేసీతో బాగా క్లోజ్ అయిపోయింది భామ. గ్రేసీ కూడా భామతో ఆప్యాయంగా మాట్లాడడం మొదలెట్టింది. అలా ఓ అరగంట కబుర్లు, కాఫీ అయ్యాక, భామ తనకు నచ్చిన కాఫీ పేకెట్లు, తన స్నేహితులకని మరికొన్ని పేకెట్లు కొని లేచింది. రామ్ ఇంకా టైపు చేస్తూనే ఉన్నాడు.
భామ, ‘‘రామ్ ఇది టూమచ్... నీవు వెకేషన్ మీద ఉన్నా ఈ ఆఫీసు పనేమిటి’’, అంది.
‘‘భామ ఐదే నిమిషాలు. ఈ నోటు అయిపోవచ్చింది. సెలవులో ఉన్నా... ఇది ఇంపార్టెంట్. నా ఇన్పుట్స్ అవసరమే’’, అన్నాడు రామ్.
‘‘నువ్వు సెలవులో ఉన్నావు కాబట్టి నీ నుంచి ఏ ఇన్పుట్స్ ఆశించరు మహానుభావా’’, అంది భామ ఉడికిస్తూ.
‘‘నీకు లిండా సంగతి తెలీదు. ఇలాంటి సమయాల్లోనే బాగా డామినేట్ చేసేస్తుంది...’’ అన్నాడు రామ్. ఇక ఆయనను మార్చడం కష్టమని గ్రేసీతో మరో పది నిమిషాలు గడిపి వీడ్కోలు తీసుకుంది భామ.
అప్పుడప్పుడు ఫ్రెండ్స్ కూడా భామకు కాల్చేసి మాట్లాడుతున్నారు. భామకు రామ్ వెంట అలా కోనా వీధులలో సముద్రతీరం వెంట నడవడం సరదాగా సంతోషంగా ఉంది.
‘‘అచ్చం మద్రాస్‌లో మనం ఉన్న బీసెంట్నగర్లా ఉంది కదండి. ఇదిగో ఈ పురాతన చర్చ్, మన వేలంక్కని చర్చ్లాగానే జనాలను బాగా ఆకర్షిస్తున్నది. ఈ కూరల బజార్ మన ఊర్లో ఉన్న బజారులాగానే ఉంది. ఈ బొప్పాయి పండ్లు, ఈ పూలు అన్నీ మనదేశాన్ని గుర్తు తెస్తున్నాయి.’’ అలా ఓ మూడు గంటలు కోనాలో మూడు క్షణాలలాగా గడిచిపోయాయి.
ఇంకా రెండే ప్రదేశాలు చూడాలి. వాటిని చూసి తిరిగి హీలోవెళ్ళితే ఈ ద్వీపం అంతా ఓ రౌండ్ వేసినట్లే. పూనాలూ లోని బ్లేక్ సాండ్ బీచ్ గురించి చదివింది. కాని బీచ్ నల్లగా ఉండటం ఎలా అబ్బా అనుకుంది భామ. నిజంగా నల్లగానే ఉంది ఆ ఇసుక. చేతిలోకి ఇసుకను తీసుకొని చూసింది.
‘‘రామ్ ఇసుక చూసావా... ఎలా నల్లగా ఉందో కెన్ యూబిలీవ్ ఇట్’’ అంది భామ.
‘‘మన సైడు నల్లరేగడి భూములను చూసాం కదా, అలాగే ఇది...’’ అన్నాడు రామ్.
ఒక్క క్షణం అంత ఉత్సాహంలో నీళ్ళు పోసాడనిపించింది. కాని రామ్ చెప్పినదానిలో అతిశయోక్తి లేదు. కాని తను ఎప్పుడు నల్ల ఇసుక ఉన్న బీచ్‌ని చూడలేదు. భామ ఆ బీచి, సముద్రం నీటి అలలను చూడడం, కెమెరాలో బంధించడంలో పడిపోయింది. వాతావరణం సడన్‌గా మారింది. మేఘాలు కమ్ముకున్నాయి. దానికితోడు బీచ్ నల్లదనం వల్ల పగలే బాగా కాంతి తగ్గినట్లు కొంచెం మసకచీకటి పడినట్లు అనిపించింది. రామ్ బ్లేక్ బెర్రీ వైపు చేయి చాస్తుండగానే అది మ్రోగింది. భామకు ఫోన్లు రావడం మామూలే. తనకెవరు చేస్తున్నారబ్బా అని చూస్తే... తనకు తెలియని నెంబర్.
‘‘ఈజ్ దట్ రామ్?’’
‘‘ఎస్ ప్లీజ్’’ అన్నాడు రామ్.
‘‘ఐ యాం స్పీకింగ్ ఫ్రం ఎమెర్జెన్సీ హాస్పిటల్ యువర్ డాటర్ బిందు హాజ్ బీన్ అడ్మిటెడ్ హియర్’’.
రామ్‌కు కాళ్ళు చేతులు ఆడలేదు. ‘‘వ్హాట్ వ్హాట్’’ అంటూ ప్రశ్నలు వేయసాగాడు. రామ్ ముఖంలో ఆదుర్దా, చెమటలు పట్టడం, బిందు ప్రసక్తి రావడంతో భామకు కూడా ఆదుర్దాగా అనిపించి. రామ్‌ను ఏంటి అని కనుసైగలతో అడగసాగింది. బిందు రామ్, భామల ఓన్లీ కిడ్. కాలేజీలో డార్మ్‌లో ఉండి చదువుకుంటున్నది. రామ్ వల్ల కాలేదు. కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా భామ చేతికి బ్లేక్బెర్రీని అందజేసాడు. భామ ఫోనులో మాట్లాడసాగింది. నెమ్మదిగా ప్రశ్నలు అడిగి, తనకు కావలసిన సమాధానాలు తెలుసుకోవడానికి ప్రయత్నించింది. అన్నీ దొరకలేదని భామ ముఖం చూస్తూనే తెలిసింది.
‘‘రామ్ లెటజ్ గో బ్యాక్’’ అంటూ కారువైపు దారి తీసింది భామ. అలానే నడుస్తూ... తన ఐఫోన్లో... ‘బిందు ఇన్ ఎమర్జెన్సీ. ఐ యాం వరీడ్...’ అని ఒక ట్వీట్ టైపు చేసి తన స్నేహితులతో పంచుకుంది.
కారులో కూర్చున్న రామ్‌కు మెదడులో బిందు తప్పితే మరే ఆలోచనలు లేవు. ఎంత ముద్దుగా పెంచాం. బిందు చిన్న నాటి సంగతులన్నీ గుర్తుకు రాసాగాయి. అవే విషయాలు భామతో మాట్లాడసాగాడు. భామ కూడా మాట్లాడుతూ కార్ డ్రైవ్ చేస్తున్నది. రామ్‌కు ఒక్క క్షణం తన వారంతా గుర్తుకు రాసాగారు. నాన్న ఈ మధ్యనే ఓ ఆరునెలలు తన దగ్గరకు వచ్చి ఉన్నారు. ఆఫీసు గొడవల్లో ఆయనతో సమయం గడపలేకపోయానని ఎందుకో చివుక్కుమనిపించింది రామ్‌కు.
బ్లేక్బెర్రీలో ప్రొద్దున చూసిన సత్యనారాయణ మెయిలు గుర్తు కొచ్చింది. నాన్న నిజంగానే వ్రాసారా. తనకు కంప్యూటర్ తెలీదే. అయినా ఈ బాధలో ఎందుకో ఆ మెయిల్ చూడాలనిపించింది. భామ ఆశ్చర్యంగా చూస్తుండగా బ్లేక్బెర్రీ తీసి సత్యనారాయణ మెయిల్ ఓపెన్ చేసాడు రామ్.
‘రామ్ కన్నా’
ఈ మెయిల్ చూసి ఆశ్చర్యపడతావనుకుంటాను. నీ దగ్గరకు వచ్చిన్పుడు భామ నాకు కంప్యూటర్లో వార్తలు చదవడం, లెటర్స్ వ్రాయడం నేర్పింది. అందుకే ఆరునెలలు బాగా గడిచిపోయాయి. ఇండియాలోని విషయాలను కాని, నా స్నేహితుల నుండి విషయాలు కాని మిస్ కాలేదు.
నీవు జీవితంలో ఇంత పైకి రావడం, భామతో బిందును పెంచడంలో నీకాపురం సాఫీగా జరిగిపోవడం నాకెంతో సంతోషం. కాని నీవు మరీ పని తొందర్లో పడిపోయి జీవితాన్ని అనుభవించడం లేదేమో అనిపిస్తున్నది. భామను చూడు లెక్కలేనంత మంది ప్రాణమిచ్చే ఫ్రెండ్స్ ఉన్నారు. ఎప్పుడూ గలగలమంటూ ప్రతి నిమిషం ఉల్లాసంగా గడుపుతుంది. తనచుట్టూ ఉన్నవారికి అలానే అనిపించేటట్లు చేస్తుంది. తనకంతమంది ఫాలోయర్స్ ఉండటం దేవుడిచ్చిన వరమే కావచ్చు. కాని నీవు కూడా అలానే ఉంటే మీ జీవితం మరింత ఆనందంగా ఉంటుందేమో అనిపిస్తుంది. భామ కూడా నీలానే కంప్యూటర్లు, గేడ్జెట్స్ ఉపయోగిస్తుంది. కాని అవి ఆవిడ జీవితానికి ఇంకొంచెం గొప్పగా బ్రతకడానికి సాధనాలుగా ఉన్నాయనిపిస్తుంది. నీవు ఆ బ్లేక్బెర్రీని పట్టుకొని నీ ఆరోగ్యం పాడు చేసుకొంటున్నావేమో అనిపిస్తున్నది, నాకు. అసలు భామలేకుంటే నేను ఆరునెలలు కాదు, ఆరురోజులు కూడా ఉండలేకపోయేవాడిని. తెగ బోరు కొట్టేదేమో... అగైన్ ఆరోగ్యం జాగ్రత్త నాన్న. పని కొంచెం తగ్గించి సంతోషంగా ఉండు. నీవు కష్టపడుతుంటే ఇప్పటికీ నా మనస్సు ఊరుకోలేదు. అందుకే ఈ ఉత్తరం వ్రాస్తున్నా…
ప్రేమతో
నీ నాన్న.
రామ్‌కు కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
‘‘భామా, బిందుకు ఏమి ప్రాబ్లెం ఉండదు కదా?’’ రామ్ భామను మరోసారి అడిగాడు. ఇలాంటి సమయాలలో తన బ్రెయిన్ డెడ్ అయినట్లనిపిస్తుంది రామ్‌కు. ఎవ్వరు గుర్తుకు రావడం లేదు. పని గురించి అస్సలు ఆలోచనలు లేవు. అన్ని ఆలోచనలు బిందు గురించే.
పూహూను ఓహో అను నేషనల్ పార్క్‌కు వచ్చారు. కమేహ మేహ హవాయిని పరిపాలించిన రాజులలో గొప్పవాడు అతని గురించి, హవాయి ఆచారాల గురించి అక్కడక్కడ ఎగ్జిబిట్స్ ఉన్నాయి. భామకు చాలా ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. ట్వీట్స్ కూడా వస్తున్నాయి.
కారు దిగి ఫోన్లో మాట్లాడడం అయిన తరువాత భామ రామ్ చేయి పట్టుకొని, ‘‘మంచి న్యూస్ అందింది. ఇప్పుడే సమీర ఫోన్ చేసింది. బిందుకు సీరియస్ ఏమీ కాదట. తను నా ట్వీట్ చూసి వెంటనే హాస్పిటల్‌కు పరిగెత్తింది. అక్కడికి అప్పటికే కుమారి, జలజ కూడా వచ్చారట. ఏదో తిన్నది అరిగినట్లు లేదు. కడుపునొప్పి అంటే ఎమర్జెన్సీలో చేర్చుకున్నారు. ఇప్పుడు బాగానే ఉంది బిందు అని చెప్పారు. మనల్ని కంగారు పడొద్దని, ట్రిప్ మామూలుగానే ముగించుకు రమ్మని చెప్పారు’’. అంది భామ.
ట్రిప్ ఎలాగూ అయిపోవచ్చింది. ఇదివరకే ఓవాహు, మావి ద్వీపాలను చూసేసారు. ఇక మిగిలింది ఇదే రేపు ఎలాగూ తిరుగు ప్రయాణానికి టికెట్లు ఉన్నాయి.
రామ్‌కు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. అలానే నాన్న వ్రాసిన ఉత్తరం గుర్తుకొచ్చి భామకు చదివి విన్పించాడు రామ్. భామ అందంగా నవ్వింది. తన నవ్వు ఎంత బాగుంటుంది. ఈ మధ్య దాన్ని గమనించడం లేదనుకున్నాడు రామ్.
‘‘భామ, నాన్నను ఎంత బాగా చూసుకున్నావు. నేను ఆయనతో గడపడానికి తీరిక చేసుకోలేకపోయాను. నాన్న నన్ను క్షమిస్తారా?’’
‘‘మామగారికి మీ గురించి తెలియకపోవడమేమిటి? ఇక నా సంగతి అంటారా... నాకు మనుషులు కావాలి. మామగారు రావడం నాకు ఒక పండుగే. దినాలు క్షణాలులాగ గడిచి పోయాయి. మా ఫ్రెండ్స్కంతా కూడా మామగారు అంకుల్ అయిపోయారు’’ అంటూ రామ్‌కు తెలియని, వాళ్ళ నాన్న గురించిన చాలా విషయాలు, భామ చెప్పసాగింది.
రామ్ చూపులు అప్రయత్నంగా అక్కడున్న డిస్ప్లే బోర్డు మీద పడ్డాయి. హవాయి ఆచారం ప్రకారం ఇదో నిర్ణీతమైన పవిత్ర ప్రదేశం. మరణదండన విధించిన వారు కూడా ఈ ప్రదేశం చేరుకుంటే వారిని క్షమించి విడిచి పెట్టేస్తారు.
రామ్ మనస్సు కూడా పీస్‌ఫుల్‌గా అనిపించింది.
రామ్, భామలు ఓ కొఒ్బరిచెట్టుకు ఆనుకొని ఎదురుగా సముద్రంలో వస్తున్న అలలను చూస్తున్నారు.
‘‘రామ్ నీవు బ్లేక్బెర్రీ చూడకుండా గంటపైగా ఉన్నావు తెలుసా’’, అంది కొంటెగా భామ.
నిజంగానా అన్నట్టు చూసాడు రామ్.
బ్లేక్బెర్రీని తీసి రామ్ భామవైపు చాచి, ‘‘సరే ఈ బ్లేక్ బెర్రీ తీసుకో. ఇక మిగిలిన ఒక రోజైనా వెకేషన్లాగా గడుపుతా. ఇంతకీ IASH అంటే ఏమిటి...’’
‘‘నమ్మలేకున్నాను రామ్. ఐ యాం సో హ్యాపీ’’, అంది భామ బ్లేక్బెర్రీని తీసుకొని తన పర్సులో పెట్టుకుంటూ.
‘‘అది సరే, నీవు హ్యాపీగా లేనిదెప్పుడు. వాట్ ఈజ్ IASH’’
‘‘అదా చెప్పానుగా ఐ యాం సో హ్యాపీ’’, అంది మళ్ళీ భామ.
రామ్‌కు ఒక్క క్షణం బల్బ్ వెలిగింది. భామ భుజాలపై చేయి వేసి ఆప్యాయంగా నొక్కి దగ్గరకు లాక్కున్నాడు. ఎదురుగా సూర్యుడు అస్తమించడానికి తయారవుతూ ఆకాశంలో రంగులు పూస్తూ తన చిత్రకళను చూసేవారికి చూపెడుతున్నాడు. భామ రామ్‌లు ఆ ప్రదర్శనలు తిలకించడంలో మునిగిపోయారు.
భామ ఐఫోన్ తీసి హవాయి ట్రిప్ చివరి ట్వీట్‌ను పంపించింది.
‘‘మహాలో మహాలో మహాలో’’
(అలోహా - గుడ్ మార్నింగ్, సుస్వాగతం, గుడ్ బై, మహాలో - ధన్యవాదాలు, ట్విట్టర్ డాట్కం - మైక్రో బ్లాగ్గింగ్ సైటు)
‘తెలుగుపలుకు’, తానా (TANA) సమావేశాల ప్రత్యేక సంచిక (2009)