Menu Close
వెంపటి హేమ
అగ్నిపథం
(భారతీయ యోధుల సమర గాధ - క్లుప్తంగా)
వెంపటి హేమ

అమ్మా! అనుమతి నిమ్ము; భారత సేనలోచేరి
శిక్షణ పొందగ అనుమతి నిచ్చి నన్నాశీర్వదించు.
ఆకతాయి నైన నేను "ఆర్మీ"లో చేరి, శిక్షణ పొంది
ఆదర్శ పురుషుడినీ, అసమాన వీరుడినీ ఔతాను,
అస్త్రశస్త్రాల నలవోకగా వాడటం నేర్చుకుంటాను.
పొరుగువాడు సేనతో మనపైకి దండెత్తి వచ్చిన నాడు
మాతృభూమి రక్షణకై ముందు వరుసలో నే నుంటా!
అసమాన శౌర్యంతో శత్రువులను చీల్చి చెండాడుతా,
రణరంగంలో వీరవిహారం చేసి విజయ పతాక నెగుర వేస్తా!
అడవి మొక్కలా పెరిగిన నాకు సరైన రహదారి ఇదేనమ్మా!
క్రమశిక్షణ నేర్పి, తీర్చిదిద్ది ఉద్యాన శోభ నిస్తుందిది నాకు.
స్వదేశ రక్షణకై రణరంగంలో పోరాడుతూ మరణించినా,
అదీ మనకు మంచిదే ఔవుతుందని అర్థం చేసుకో అమ్మా!
భూమిపై కీర్తి, స్వర్గంలో శాశ్వత వసతి కలిగి నేను సుఖిస్తా.
"అమర జవా"నన్న విస్తృత ఖ్యాతి దక్కుతుందమ్మా నాకు.
"జై జవాన్" అంటూ జనమంతా ప్రేమను నాకు నివాళులిస్తారు
నీ కన్నీరు తుడిచి, వీరమాతవని నిన్నెంతో కొనియాడుతారు!
అమ్మా! విచారమొద్దు, నా జన్మ ధన్యమయిందని తెలుసుకో!
నన్ను కనిపెంచిన నీ కష్టం ఫలించి, నీ జన్మా భవ్యమౌతుంది.
సమరభూమిలో హోరాహోరీ పోరాటం చేస్తూ నేను చనిపోతే
నా పార్థివ దేహాన్నిపెట్టెలో ఉంచి నీ దగ్గరకి తీసుకుని వస్తారు,
సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు అంతా కలిసి జరిపిస్తారు,
నా రాకను తెలుప స్వర్గం వైపు గురిపెట్టి తుపాకులు పేలుస్తారు!
ఇకపై, నీ పుత్రుడు సాధించిన విజయాల జ్ఞాపికలన్నీ నీవౌతాయి,
నాకు బదులుగా నీ చెంత అవన్నీ నిలిచి ఉంటాయిలే ఎప్పటికీ!
మనసుకైన గాయాలకు మందు అయ్యేది కదిలిపోయే కాలమే కదా!
కాలక్రమంలో నా తలపులు నీలో నిండైన గర్వాన్ని ప్రేరేపిస్తాయి.
వీర జవాన్ తల్లివైనందుకు విర్రవీగే రోజు నీకొస్తుందమ్మా ఒకనాడు!
పుట్టలో పుట్టిన చెద పురుగు లాంటి వాడు కాకూడదు నీ తనయుడు,
పరిరక్షణకై ప్రాణమొడ్డి పోరాడే మహావీరుడు అవ్వాలి!
అమ్మా! భారతసేనలో చేరగా అనుమతి నిచ్చి ఆశీర్వదించు నన్ను!

***

స్వతంత్ర వీర భారతం!

రత్న గర్భ కావడమే భారతమాత చేసిన తప్పు కాబోలు! ఎప్పటి కప్పుడు, భారతదేశం, ఎందరెందరో సరిహద్దులు దాటి వచ్చిన విదేశీయుల దండయాత్రలకు గురౌతూనే ఉంది. వారు మన దేశాన్ని ఆక్రమించి, మన సంపదను కొల్లగొట్టుకుపోవడమే కాకుండా, మన సనాతన సంస్కృతిని కూడాs అతలాకుతలం చేసేశారు. వారిలో మనకు బాగా తెలిసిన వారు, 1. రోమన్లు, 2. ముస్లింలు, 3. బ్రిటిష్ వారు. వారివల్ల మన సంస్కృతీ సాంప్రదాయాలు నెమ్మదిగా చెదలుపట్టిపోయాయి.

రోమన్లు మన దేశాన్ని ఎక్కువ కాలం పాలించలేదు. ఆపై కొంత కాలం తర్వాత ఎడారి దేశీయులైన ముస్లింలు మన దేశంపై దండెత్తి వచ్చారు. వారు ఎన్నెన్నో కుట్రలు, కుతంత్రాలతో మన దేశ ప్రభువులను ఓడించి, రాజ్యాలను చేజిక్కించుకుని, నయానా భయానా భారతీయుల్ని ముస్లింలుగా మార్చి, మహిళలను చెరబట్టి, దేవాలయాలను కూల్చి ఆ శిథిలాలపై మసీదులు కట్టి, దేశాన్ని నానా భీభత్సం చేశారు. అలా వాళ్ళు ఇఛ్ఛారాజ్యంగా చాలా రోజులు భరతావనిని పాలించారు. భారతీయులను చాలామందిని, భయపెట్టి మతం మార్చి, ఎదిరించినవారిని క్రూరంగా చంపి, భారతదేశంలో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.

తదుపరి కాలంలో "ఈస్ట్ ఇండియా కంపెనీ" అన్న పేరుతో వ్యాపారం వంకపెట్టుకుని మన దేశం వచ్చారు బ్రిటీష్ వారు. అనతి కాలంలోనే, ఏకులా వచ్చిన వారు మేకై కూర్చున్నారు. 'డివైడ్ అండ్ రూల్" అన్న వాళ్ళ నిప్పుచ్చరపు పాలసీని ఉపయోగించి భారత్ ని పాలిస్తున్న రాజుల మధ్య చిచ్చు రగిలించి, వారిలో వారికి తంపులు పెట్టి, మధ్యలో దూరి కుటిలనీతితో వారిమధ్య యుద్ధాలకు కారణమై, ఒకరి పక్షాన చేరి, వారిని గెలిపించి, కొంత రాజ్యాన్ని వారి నుండి, తమ సహకారానికి బహుమానంగా పుచ్చుకోవడం మొదలు పెట్టారు. అలా కాలక్రమంలో భారతదేశంలో శక్తివంతమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకుని స్థిరపడ్డారు. కాలక్రమంలో వాళ్ళ కుటిల నీతికి లొంగి రాజులందరూ బ్రిటిష్ వారికి సామంతులుగా మారిపోయారు. దానికి ముఖ్యమైన కారణం ఆ రాజుల మధ్య ఐకమత్యం లేకపోవడమే - అంటారు చరిత్ర కారులు.

ఒక్క భారత్ మాత్రమే కాదు, బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం పేరుతో వెళ్లి, “డివైడ్ అండ్ రూల్” అన్న తమ పాలసీని ఉపయోగించి కుశ్చితాలతో, కుతంత్రాలతో మొత్తం ప్రపంచాన్ని ఆక్రమించి, అందరి సంపదను దోచుకుని, “రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం” అన్న పౌరుష నామంతో కొన్నాళ్లపాటు ఒక వెలుగు వెలిగి విర్రవీగారన్నది చరిత్ర చెపుతున్న సత్యం.

వీళ్ళు కూడా భారతీయమైన సంపదను మాత్రమే కాకుండా, భారత సంస్కృతీ సంస్కారాలను కూడా సర్వనాశనం చేశారు. ఎందరినో హిందువులను మతం మార్చారు. విద్యా, విజ్ఞానాల్ని కొల్లగొట్టారు. భారతీయ విజ్ఞాన నిక్షేపాలైన ప్రాచీన గ్రంధాలయాలను తగులబెట్టారు. భారతీయ కళలలో ప్రతిభావంతులైన వారిని ఊచకోత కోశారు. సర్వసంపన్నమైన భారత దేశంలోని సంపదను తమ దేశానికి తరలించి భారతదేశంలో కరువును సృష్టించారు. బెంగాల్ లో వచ్చిన భయంకర కరువుకు వీరి దోపిడీయే కారణమయ్యింది. క్రైస్తవ మిషనరీలు ఒక చేతిలో రొట్టెను, మరొకచేతితో బైబిల్ను పట్టుకుని, కరువుబారినపడి ఆకలితో అల్లాడుతున్న భారతీయుల నెందరినో క్రైస్తవంలోకి మార్చారు. ఇలా బ్రిటిష్ వారు చాలా కాలం భారతదేశాన్ని పరిపాలించారు.

***

1857 మే 10వ తారీఖున భారతీయ సిపాయిలు, అప్పటి పాలకులైన బ్రిటిషువారిపై తిరుగుబాటు చేశారు. కారణం - మన వారిని ఆంగ్లేయులు బొత్తిగా చిన్నచూపు చూడడమే! సాటి బ్రిటిష్ వారి కన్నా భారతీయులకు ఎక్కువ పనిచెప్పి తక్కువ వేతనం ఇచ్చేవారు, అంతే కాదు, భారత సిపాయిలను గౌరవంగా చూసేవారు కాదు. అదీకాక, కొత్తగా వచ్చిన తుపాకీల తాలూకు తూటాలకు పందుల కొవ్వు, లేదా గోవుల కొవ్వు వాడేవారు. ఆ రోజుల్లో తూటాలను సిపాయిలు నోటితో కొరికి తుపాకీలో ఉంచవలసి ఉండేది. అది భారతీయ సైనికులకు ఎవరికీ నచ్చలేదు. భారతీయులైన హిందువులకు గోవు పవిత్రమైనది, తల్లి వంటిది. ఇకపోతే ముస్లింలకు పంది ఏహ్యమైనది. మేము అలా కొరకలేమన్నారు భారత్ సిపాయిలు. తప్పదన్నారు ఆంగ్లేయులు. అంతవరకు నిద్రాణంగా ఉన్న భారతసేన మేల్కొని తమ నిరసనను తెలియజేస్తూ బ్రిటిష్ వారిపైన తిరగబడింది. భారత చరిత్రలో చెప్పబడిన "సిపాయిల తిరుగుబాటు" ఇదే!

భారత సేనలోని ఇరువర్గాల సిపాయిలు ఆంగ్లేయులపై తిరుగుబాటు చేశారు. వివిధ కారణాలవల్ల బ్రిటిష్ ప్రభుత్వం పట్ల విముఖులైన మరి కొందరు సంస్థానాధీశులు, గౌరవనీయులైన పెద్దలు కూడా భారత సిపాయీలకు సహకరించారు. వీరిలో ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియాతోపే, నానా సాహెబ్, మాన్సింగ్, బహదూర్ షా జఫర్ వంటి ప్రముఖులు కొందరు ఉన్నారు. ఈ సమయంలోనే భారతీయుల హృదయాల్లో స్వతంత్రేచ్ఛ పుట్టుకొచ్చింది. భారతీయ సిపాయిలు బ్రిటిషువారిని ధైర్యంగా ఎదిరించారు. ఈ యుద్ధం ఒక సంవత్సరం పైగా సాగింది. చివరకు భారతీయులు ఆంగ్లేయుల చేతిలో ఓడిపోయారు. దీంతో మరికొన్ని రాజ్యాలు బ్రిటిష్ వారి అధీనమయ్యాయి. ఈ తిరుగుబాటుకి పర్యవసానంగా ఈస్టిండియా కంపెనీ రద్దయ్యి, సూటిగా బ్రిటిష్ వారి పాలన భారతావనిలో మొదలయ్యింది. బ్రిటిష్ పాలకులు, ఎందరో భారత స్వతంత్ర సమర వీరుల్ని దోషులుగా నిర్ణయించి, వారిని నిర్దాక్షిణ్యంగా ఉరితీశారు. మరెందరినో భయంకరమైన జైళ్లలో ఉంచారు. అక్కడితో భారతీయుల స్వాతంత్రేచ్ఛ కొన్నాళ్ళపాటు అజ్ఞాతంగా ఉండిపోయింది.

రణ విశ్లేషకులు ఈ సిపాయిల తిరుగుబాటునే తొలి భారత స్వతంత్ర సమరంగా పేర్కొన్నారు! ఆ తిరుగుబాటుతోనే భారతీయుల హృదయాలలో స్వతంత్ర కాంక్ష పుట్టి, వేగంగా పెరగ సాగింది. ఆ కారణంగానే చరిత్రకారులు సిపాయిల తిరుగుబాటుని "తొలి భారత స్వతంత్ర సమరం"గా పేర్కొన్నారు.

***

ఆ తర్వాత కొంతకాలానికి కొందరు భారతీయ యువకులు బ్రిటిష్ పాలనను నిరసిస్తూ ఉద్యమించడానికి పూనుకున్నారు. కొన్నాళ్లపాటు "చాపకింద నీరులా" గుట్టుగా సాగిన ఈ ఉద్యమం క్రమంగా శక్తి పుంజుకుని, విజృంభించి వీర విహారం చేసింది.

ఈ స్వతంత్రం కొరకు చేసిన పోరాటం విషయంలో తొలినాళ్ళలో బెంగాలీలు ఎక్కువమంది స్పందించారు. ఆ సమయంలో బంకించంద్ర ఛటర్జీ (చటోపాధ్యాయ) "తొలి స్వతంత్ర సమరం" (భారత సిపాయీల తిరుగూబాటు) ఆధారంగా చేసుకుని 1882లో రాసిన "ఆనందమఠ్" అన్న నవల భారతీయులలో అప్పటికే రగులుతున్న స్వాతంత్రేచ్ఛను జ్వలింపజేసింది. భారతదేశ ప్రజలలో అప్పటికే మొలకెత్తి ఉన్న స్వతంత్ర బీజాలను అతి శీఘ్రంగా పెరిగి మహా వృక్షాలుగా విస్తరించేందుకు దోహదం చేసింది ఈనవల.

"వందే మాతరం, సుజలాం సుఫలాం ..." అంటూ, మన మాతృదేశాన్ని కీర్తిస్తూ రాయబడిన పాట బంకించంద్ర చటర్జీ రాసిన ఆనందమఠ్ నవల లోనిదే! ఈ నవల చాలా భారతీయ భాషలలోకి అనువదించబడి, భారతీయులందరికి అందుబాటులోకి వచ్చింది. అది, ఆ సేతు శీతనగ పర్యంతం ఉన్న భారతీయులలో స్వతంత్ర భారతం కావాలన్న కోరికను మరింతగా పెంచి, పోషించింది. అనతికాలంలోనే భారతీయులందరూ మేల్కొన్నారు. ఆపై వారిలో ఉన్న స్వతంత్రేఛ్ఛ ఒక గొప్ప ఉద్యమంగా రూపు దిద్దుకుంది. "వందే మాతరం" అన్న నినాదం భారతీయుల "ఉద్యమ కేక" (వార్ క్రై)గా మారింది. హిందువులు, ముస్లింలు అన్న భేదం లేకుండా యావద్భారతీయులు ఏక కంఠంతో, "వందే మాతరం" అని గట్టిగా కేకపెడుతూ బ్రిటిష్ వారిని రకరకాలుగా ఎదిరించడం మొదలుపెట్టారు. కొందరు ఆంగ్లేయులు చంపబడ్డారు. కొన్ని ఆస్తులను తగులబెట్టారు. అధికారబలం ఉన్న ఆంగ్లేయులు భారతీయుల్ని ఎందరినో మట్టుపెట్టారు, మరెందరినో అండమాన్ జైలుకి తరలించి, భయంకరమైన జైళ్లలో ఉంచి రకరకాలుగా హింసించారు.

దాదా బాయ్ నౌరోజీకి, ఒక గొప్ప ఆలోచన వచ్చింది - ఎవరిదారిన వారుగా కాకుండా అందరూ ఒక కూటమిగా ఉండి పోరాడితే బాగుంటుందన్న ఆలోచన రావడంతో , ఆయన సమర్థులైన కొందరిని కూడగట్టుకుని, 1885 డిసెంబర్ 28 న బొంబాయ్ (ముంబాయ్)లో ఒక గొప్ప సమావేశాన్ని ఏర్పరచి, జనాలను సంఘటితపరచి దానికి "ఇండియన్ నేషనల్ కాంగ్రెస్" అన్న పేరుని స్థిరపరచారు. "వందేమాతరం" అన్నది వారి "వార్ క్రై " అయ్యింది. చూస్తూండగా స్వాతంత్రోద్యమం ఊపందుకుంది. అప్పట్లో, హిందువులు, ముస్లింలు కలివిడిగా ఉండి, కలిసికట్టుగా స్వతంత్రం కోసం బ్రిటిషువారితో పోరాడేవారు. బ్రిటిష్ వారి పాలన ఎడల నిరసనను తెలుపుతూ రకరకాలైన చర్యలకు పాల్పడేవారు. అధికారబలంతో ఆంగ్లేయులు భారతీయుల్ని ఎందరినో హింసించినా భారతీయలు వెనుకంజ వెయ్యలేదు, ఉద్యమాన్ని ఆపలేదు. బాలగంగాధర్ తిలక్, లాలా లజపతిరాయ్ మొదలైన వారందరూ ఆ పార్టీలో వారే. కాలక్రమంలో ఆ పార్టీయే కాంగ్రెస్ పార్టీగా రూపుదిద్దుకుంది.

ఆ సమయంలో లార్డు కర్జన్ మన దేశానికి వైశ్రాయిగా వచ్చాడు. అతడు ఇండియాలోని పరిస్థితులను నిశితంగా గమనించాడు. భారతీయుల ఐకమత్యం చూడగానే అతనికి కన్ను కుట్టింది. మతం పేరుతో ఇరుపక్షాల వారి మధ్యనున్న ఐకమత్యాన్ని కనుక రూపుమాపితే, వాళ్ళు వేరుపడి , ఒకరినొకరు నిరసించుకొని బలహీనులౌతారనీ, ఆపై తాము యధేచ్చగా భారత దేశాన్ని పరిపాలించ వచ్చుననీ భావించాడు. హిందువులు ముస్లింల మధ్య విభేదాలు సృష్టించి వారిని రెండుగా విభజించే ప్లాన్ వేశాడు. తమకు ఎంతగానో కలిసివచ్చిన "డివైడ్ అండ్ రూల్" పాలసీని అక్షరాలా అమలుపరచాలనుకున్నాడు. ఇరు పక్షాల మధ్య చిచ్చురగిలిస్తే చాలు, వాళ్ళూ వాళ్ళూ కొట్టుకుంటూ, తమ జోలికి రావడం మానేస్తారని భావించాడు. దానికై ఒక గొప్ప పధకం వేశాడు వైశ్రాయి లార్డు కర్జన్.

అప్పటి రోజుల్లో బెంగాల్ రాష్ట్రం చాలా పెద్దదిగా, విశాలంగా విస్తరించి ఉండేది. "పాలనా సౌకర్యం కోసం" అనే సాకుతో దానిని 1905లో తూరుపు బెంగాల్, పశ్చిమ బెంగాల్ అంటూ రెండు భాగాలుగా విభజించాడు వైశ్రాయి కర్జన్. దానివల్ల ముస్లింలు ఎక్కువగా ఉన్న తూర్పు బెంగాల్ ఒక ప్రత్యేక ముస్లిం రాష్ట్రం అయ్యింది. అక్కడితో ముస్లింలు కాంగ్రెస్ నుండి వేరుపడి, 1906లో తమకై ప్రత్యేకంగా "ముస్లిమ్ లీగ్" అనే వేరొక పార్టీని ఏర్పరచుకున్నారు. వారిని ఒరవడిగా తీసుకుని పడమటి దిక్కున ఉన్న ముస్లింలు కూడా విజృంభించి, లేనిపోని పేచీలకు దిగారు. అక్కడితో, అంతవరకూ ఉన్న ఐకమత్యభావన నశించి, ముస్లింలలో "మీరు వేరు, మేమువేరు - అన్న వేర్పాటు భావం చోటుచేసుకుంది.

హిందువులు ముస్లింలను తమకు దాయాదులుగా భావిస్తే, ముస్లిములు మాత్రం హిందువుల్ని తమ శత్రువులు గా భావించసాగారు. దానితో ఇరుపక్షాలమధ్య చిన్నచిన్న పేచీలు మొదలయ్యాయి. అంతవరకూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జిన్నా 1913లో ముస్లిం లీగ్ లో చేరిపోయి ఆ పార్టీకి నాయకుడయ్యాడు.

***

1920 లో సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకు తిరిగి వచ్చిన గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన చెప్పిన సత్యాగ్రహ ఉద్యమం చాలామంది కాంగ్రెస్ మెంబర్లకు నచ్చడంతో, అంతవరకూ కాంగ్రేస్ కు లీడరుగా ఉన్న సుభాశ్ చంద్రబోస్ పార్టీని విడిచి వెళ్లిపోయాడు. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి లీడర్ అయ్యాడు.

కాంగ్రెస్ నుండి విడిపోయిన సుభాశ్ చంద్రబోస్ "ఆజాద్ హింద్ ఫౌజ్" అన్నపేరుతో స్వతంత్ర భారత సేనను ఏర్పరచి, బ్రిటిష్ వారితో యుద్ధం చేయాలనుకున్నాడు. కొందరు భారతీయులు ఆ సేనలో చేరారు. "శత్రువులకు శత్రువు మనకి మిత్రుడు" అన్న చాణక్య నీతి ప్రకారం బోస్ - జపాన్, జర్మనీలను తనకు మిత్రదేశాలుగా భావించి, వారి సహాయాన్ని కోరాడు.

గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా మూమెంట్, సహాయ నిరాకరణోద్యమం లాంటి ఎన్నో ఉద్యమాల ద్వారా ఆంగ్లేయులను పరిపరి విధాలుగా విసిగించి, మీరు మా దేశం విడిచి వెళ్లిపొమ్మని చెప్పడం జరిగింది. గాంధీ ప్రేరణతో సత్యాగ్రహం దేశవ్యాప్తంగా సాగింది. ఉద్యమించిన భారతీయుల్ని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసి జైళ్లలో ఉంచి, వారిని ఎన్నెన్నో చిత్రహింసలు పెట్టింది. ఎంత బాధలు పెట్టినా ఉద్యమకారులు వెనకడుగు వెయ్యలేదు.

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో తమకి మనస్ఫూర్తిగా సహాయపడవలసిందిగా భారతీయ సిపాయీలను ఒప్పించమని గాంధీని కోరారు బ్రిటిష్ వారు. ఆయన వారితో, తమకి యుద్దానంతరం స్వతంత్రం ఇచ్చి, బ్రిటిష్ వారు భారత్ నుండి వెళ్ళిపోయే మాటైతే అలా చేస్తాను - అని గాంధీ అన్నారని ఒక ప్రధ వాడుకలో ఉంది.

గాంధీ ఇచ్చిన ప్రోత్సాహంతో భారత సిపాయిలు "ఫ్రంట్ లైన్ సోల్జర్స్" గా, రెండవ ప్రపంచయుధ్ధ సమయంలో బ్రిటిష్ వారి తరఫున శత్రువులతో హోరాహోరీ పోరాడారు. ఆ యుద్ధంలో చాలామంది భారత సిపాయిలు మరణించారు, ఎంతోమంది జపాన్ వారికి బందీలైనారు. మొత్తం మీద ఇంగ్లీషువారు యుద్ధంలో గెలిచారు. జర్మనీ, జపాన్ దేశాలు ఓడిపోయాయి. కానీ, వందలకొలది భారత సిపాయిలు జపాన్ వారికి బందీలుగా ఉన్నారన్న విషయం యుద్ధానంతరం బ్రిటిష్ వారు పట్టించుకోలేదు. అది ఆ సిపాయీలకు చాలా బాధ కలిగించింది. వారిలో బ్రిటిష్ వారిపై పూర్తిగా ఏవగింపు కలిగింది.

జపాన్ ని అణు బాంబులతో నాశనం చేసింది అమెరికా. రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంగ్లాండులో జరిగిన ఎన్నికల్లో చర్చిల్ ని ఓడించి, అట్లీ బ్రిటిష్ సామ్రాజ్యానికి ప్రధాన మంత్రి అయ్యాడు.

జపాన్ వారు తమవద్ద బందీలుగా ఉన్న భారత యుద్ధఖైదీలను సుభాశ్ చంద్ర బోస్ కి అప్చగించారు. వారందరూ యుద్ధవిద్యలో నిష్ణాతులైన సిపాయీలు. వారి నందరిని నేతాజీ తన "ఆజాద్ హింద్ ఫౌజ్" లో చేర్చుకున్నాడు.

నేతాజీ తన ఫౌజ్ లో ముఖ్యులైన వారిని ముగ్గురిని ఎంచి, ఇండియాని పాలిస్తున్న బ్రిటిష్ పాలకులవద్దకు రాయబారానికి పంపాడు. వారు, బ్రిటిష్ పాలకులకు తమ యజమాని మాటగా, "మర్యాదగా మీరు మా దేశాన్ని విడిచి వెళ్లిపోండి, లేదా మేము మీతో యుద్ధం చేస్తాము" అని చెప్పారు. వెంటనే ఆ రాయబారులను బంధించి, బ్రిటీషువారు గొప్పగా ఆ విషయాన్ని న్యూస్ పేపర్లకు ఇచ్చి పబ్లిష్ చేయించారు. అక్కడితో, అంతవరకూ కొంత అజ్ఞాతంగా ఉన్న "ఆజాద్ హింద్ ఫౌజ్" గురించి భారతదేశమంతా తెలిసిపోయింది. అప్పటి వరకూ నిద్రావస్థలో ఉన్నవారు కూడా "జై హింద్" అంటూ లేచారు. అంతేకాదు, భారతీయులైన సైనికులలో కూడా విప్లవం వచ్చే సూచనలు కనిపించసాగాయి. భారతీయులందరూ జయజయ ధ్వానాలతో అజాద్ హింద్ ఫౌజ్ ను మనఃస్పూర్తిగా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడితో అట్లీకి తెలిసిపోయింది - ఇక ఈ గడ్డపై తమకి నూకలు దొరకబోవని. ఆయన, భారత్ కి స్వతంత్రం త్వరలోనే ఇచ్చేస్తున్నామని ప్రకటించక తప్పలేదు. దానికి ఋజువుగా 1946లో రాజ్యాంగంలో భారతీయులకు చోటునిచ్చారు.

***

భారతదేశంలోని ముస్లింలు, తమకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరారు. కానీ దానికి కాంగ్రెస్ నేతలు ఒప్పుకోలేదు. దానితో తూరుపున బెంగాల్ లోనూ, పశ్చిమాన పంజాబ్, సింధు రాష్ట్రాలలోనూ ఉన్న ముస్లిమ్స్ హిందువులను ద్వేషించడం మొదలుపెట్టారు.

భారతదేశానికి తూరుపువైపున, పశ్చిమానా ఉన్న ముస్లింలు చెలరేగి, ఏ పాపం ఎరుగని సామాన్య ప్రజలైన హిందువులను ఊచకోత కోశారు. రక్తం ఏరులై ప్రవహించింది. ఎటుచూసినా హాహాకారాలే వినిపించసాగాయి. దుష్ట బుధ్ధులైన ముస్లిమ్ లు హిందువులపైన పగబట్టి సామూహిక హత్యలు, మానభంగాలు, లూటీలు, ఆస్తుల దహనాలు చెయ్యడంతోపాటుగా గుడులను కూడా ధ్వంసం చేశారు. ఆడవాళ్ళని బలవంతంగా ఎత్తుకుపోవడం మొదలైన దుశ్చర్యలకు, క్రూరమైన హింసలకు పాల్పడ్డారు. ఏమాత్రం సన్నద్ధంగా లేని శాంతి కాములైన హిందువులు ఎందరో బలిపశువులయ్యారు.

చివరకు ఆంగ్లేయుల మద్దతుతో ఇరుపక్షాల వారు రాజీకి వచ్చారు. ముస్లిమ్స్ మెజారిటీగా ఉన్న ప్రదేశాలు ముస్లిం దేశాలుగా విభజించారు. జనాభా లెఖ్ఖల ప్రకారం దేశం మూడు ముక్కలు చేయబడింది. ఆ విధంగా అఖండ భారతదేశం కొంత భాగం తూరుపు పాకిస్థాన్ గా, మరికొంత భాగం పశ్చిమ పాకిస్థాన్ గా మారిపోయాయి. బ్రిటిష్ ప్రభుత్వం వాటి సరిహద్దులను నిర్ణయించింది. భారత్ నుండి కొందరు ముస్లిములు సంతోషంగా పాకిస్థాన్ కి తరలిపోతే, మరి కొందరు భారత్ లోనే ఉండిపోయారు.

ఇక తప్పనిసరిగా, ముస్లిముల దాష్టీకాన్ని భరించలేక పాకిస్థాన్ లో ఉన్న హిందువులు ఎందరో తమ ఆస్తి పాస్తుల్ని విడిచి, కట్టుబట్టలతో, ప్రాణాలు అరచేతిలో ఉంచుకుని పారిపోయి భారత్ రావలసి వచ్చింది. ఆ సమయంలో ఎందరో హిందువులు మరణించారు. మరి ఎందరో నిరాశ్రయులయ్యారు. ఎన్నెన్నో కుటుంబాలు విఛ్ఛిన్నమయ్యాయి. ఇంక నిర్వాసితులకు లెక్కేలేదు. ముఖ్యంగా ఎందరో హిందూస్త్రీలు అనాధలై బలవంతపు మతమార్పిడులకు, మానభంగాలకు నిర్దాక్షిణ్యంగా గురయ్యారు. మరెందరో వనితలు, తమకు జరిగిన అవమానం భరించలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

***

లార్డ్ మౌంట్ బాటెన్ భారత విభజన సమయంలో ఇండియాకి వైశ్రాయ్ గా నియమితుడయ్యాడు. విభజన తరువాత కూడా ఆయన ఒక సంవత్సరంపాటు భారత్ కి గవర్నర్ జనరల్ గా ఉన్నాడు. 1947 ఆగస్టు 15 న భారత్ కి బ్రిటిష్ పాలన పోయి స్వతంత్రం వచ్చింది. కాని అఖండ భారతదేశం మూడు ముక్కలు అయ్యింది! తమ వంతు భూభాగానికి "పాకిస్థాన్" (పవిత్రదేశం) అని పేరు పెట్టుకున్నారు ముస్లిములు! ఈ విభజన భారతీయుల కెవరికీ నచ్చలేదు. కానీ తప్పలేదు.

***

1947 ఆగస్ట్ 14 అర్ధ రాత్రి, సరిగా గడియారం ముళ్ళు పన్నెండును దాటి, పదిహేనవ తేదీలో ప్రవేశించగానే ఫిరంగులు మ్రోగాయి. బ్రిటీషర్ల జండా ఐన "యూనియన్ జాక్" క్రిందకు జారగా, ఎర్రకోటపై భారత జాతీయ త్రివర్ణ పతాకం గాలికి రెపరెపలాడుతూ ఎగరసాగింది. స్వతంత్ర సమరంలో నిహతులైన వారిని తలుచుకుని ఒక కంట తడితో, మరొక కంట ఆనందంతో భారతీయులు ఆ జండాకు వినమృలై వందనం చేశారు. జనగణమన పాడారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఊరూరా త్రివర్ణ పతాకను ఎగురవేసి పండుగ చేసుకున్నారు. ఎందరెందరో స్వతంత్ర సమర యోధుల త్యాగఫలంగా భారత్ స్వతంత్ర దేశమయ్యింది.

***

బ్రిటిష్ వాళ్ళు, మన దేశ సంపదనీ, సంస్కృతినీ దోచుకున్నది చాలక; భారతీయులైన హిందూ, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించి, రక్తపుటేరులు పారించి అఖండ భారత దేశాన్ని మూడు ముక్కలయ్యేలా విభజన చేసి మరీ దేశాన్ని వదలి వెళ్లారు. జనాభా లెక్కల ప్రకారం ఈ విభజన జరిగింది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రదేశం పాకిస్థాన్ గా మారింది. హిందువులు ఎక్కువమంది ఉన్న ప్రదేశం భారత్ అయ్యింది. భారత దేశంలో ముస్లిములు, ముస్లిం దేశాలైన ఉభయ పాకిస్థాన్లలో ఉన్న హిందువులు మైనారిటీలు అయ్యారు.

ఆ రోజుల్లో, అఖండ భారత ఉపఖండంలో చిన్నచిన్న సంస్థానాలు ఎన్నో ఉండేవి. బ్రిటిష్ వారు, ఆ సంస్థానాధీశులతో, “మీరు, మీకు నచ్చిన భూభాగం - భారత్ లేదా పాకిస్థాన్లలో - దేనిలోనైనా సరే విలీనం కావచ్చు; లేదా, స్వతంత్ర ప్రతిపత్తితో ఉండాలనుకుంటే ఉండిపోనూవచ్చు” అని, ఆయా సంస్థానాధీశులకు తెలియజేశారు. కొన్ని సంస్థానాలు పాకిస్థాన్లో చేరితే, చాలా సంస్థానాలు భారత్ లో విలీనమయ్యాయి. ఇద్దరు ముగ్గురు మాత్రం తాము స్వతంత్రంగానే ఉంటాము - అన్నారు. అలా అన్నవారిలో కాశ్మీర్ రాజైన, రాజా హరిసింగ్ ఒకరు. రాజా హరిసింగ్ తన రాజ్యాన్ని తానే పరిపాలించుకోవాలనుకున్నాడు. కానీ, అలా సాగింది కొద్ది రోజులు మాత్రమే!

ఎత్తైన హిమపర్వత శ్రేణులు, దట్టమైన అడవులూ, నిర్మలమైన నీటితో నిండుగా ఉన్న సరస్సులు, వేగంగా ప్రవహించే నదులు, మరెన్నో సెలయేరులు, కొండలపైనుండి వయ్యారంగా కిందకు దుముకుతున్న సుందర జలపాతాలు కలిగి, కనువిందైన ప్రకృతి సౌందర్యంతో అలరారుతూ, భూతల స్వర్గం - అనిపించే కాశ్మీర్ పై పాకిస్థాన్ కన్నుపడింది. ఎలాగైనా కాశ్మీరుని పాకిస్థాన్లో కలుపుకోవాలని నిర్ణయించుకుని, ఒక దారుణమైన కుట్ర పన్నారు పాకిస్థాన్ పాలకులు.

కొందరు ఉగ్రవాదులను, మరికొందరు మూర్ఖులైన కొండజాతి వాళ్ళని పురిగొల్పి, రెచ్చగొట్టి కాశ్మీర్లో అడుగడుగునా తీవ్రమైన ఘర్షణలు సృష్టించారు. అది చాలదని, హరిసింగ్ పైన యుద్ధాన్ని కూడా ప్రకటించింది పాకిస్థాన్ ప్రభుత్వం. అల్లకల్లోలంగా ఉన్న తన రాజ్యాన్ని, తన రాజ్యం పైన విరుచుకు పడనున్న యుద్ధాన్ని గమనించి అధైర్యపడ్డ రాజా హరిసింగ్ భారత్ ని శరణు కోరాడు. భారత్ కనుక పాకీలను తన రాజ్యం నుండి తరిమి కొట్టినట్లైతే, తాను భారత్ లో తన రాజ్యాన్ని విలీనం చేస్తానని మాట ఇచ్చాడు. అప్పట్లో హోమ్ మంత్రియైన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ ప్రోద్బలంతో భారత సేనలు హరిసింగ్ కి వత్తాసుగా కాశ్మీర్ వచ్చి, పాక్ సేనలతో హోరాహోరీ పోరుకి తలపడ్డాయి.

***

1947 అక్టోబర్లో భారత్ - పాకిస్థాన్ ల మధ్య తొలి యుద్ధం మొదలయ్యింది. స్వతంత్రం వచ్చిన కొద్ది రోజులకే కాశ్మీరును ముష్కర మూకలనుండి కాపాడడం కోసం భారత్, పాకిస్థాన్ తో యుద్ధం చెయ్యక తప్పలేదు. కాశ్మీర్లో పాకిస్థాన్ సృష్టిస్తున్న అరాచకాలను, అల్లకల్లోలాన్ని అణచివేయడం కోసం, కాశ్మీర్ రాజైన హరిసింగ్ పక్షాన, ఆయన కోరిన మేరకు పాకిస్థాన్ తో పోరాడాయి భారతసేనలు. అలా 22 అక్టోబర్ 1947న పాకిస్తాన్ భారత్ ల మధ్య తొలి యుద్ధం మొదలయ్యింది! అప్పటికి భారత్ కు స్వతంత్రం వచ్చి కొద్ధి నెలలు మాత్రమే అయ్యింది.

★★★ సశేషం ★★★

Posted in August 2026, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *