సంధ్యా సమయం... చీకటి, వెల్తురు గెలుపు ఎవరిదని పోటీ పడుతున్న వేళ…
ఎవరు గెలిస్తే వారి వైపుకు చేరాలనుకుంటూ, చల్లచల్లగా చిరుగాలి ముందుకు సాగుతున్న సమయం. ఆ వేళలో పరుగు పరుగున పోలీస్ స్టేషన్ వైపుకు వచ్చి, ముందున్న నాలుగు మెట్లూ ఎక్కబోయింది లత.
“ఏయ్ ఆగు!” గద్దిస్తూ అడ్డగించాడు కాపలాగా ఉన్న రక్షకభటుడు.
“నేను అర్జెంట్ గా లోపలి వెళ్ళాలి” అంది లత.
''నిన్ను లోపలి రానివ్వను.''
''ఎందుకు రానివ్వవు?''
''నువ్వు జనంలోకి రావడం ఎవ్వరికీ ఇష్టం లేదు. బయటకి నడు!'' మొరటుగా అన్నాడు పోలీస్.
''నాకు ఆ సంగతి తెలుసు కానీ నేను తప్పనిసరిగా వచ్చాను'' అంది లత.
''భిక్షం ఎత్తుకునే వ్యక్తిగా వచ్చావా? భయపెట్టి డబ్బు గుంజుకుంటూ ఏ దొమ్మీలోనో ఇరుక్కుని రక్షించమని అడగడానికి వచ్చావా?'' వ్యంగ్యంగా మాట్లాడుతూ, వెకిలిగా చూస్తూ అన్నాడు పోలీసు.
''అమ్మగా వచ్చాను'' నెమ్మదిగా దృఢంగా అంది లత.
''ఏ... మి...టీ?!''
''అవును! అమ్మగానే వచ్చాను. నా బిడ్డకి జరిగిన అన్యాయం గురించి చెప్పుకుని న్యాయం చెయ్యమని అడగడానికి వచ్చాను.''
''నువ్వు అమ్మవేంట్రా కొజ్జాగా? నడు బయటకి!'' పగలబడి నవ్వుతూ అన్నాడు పోలీసు.
లత ముందడుగేయబోవడం చూసి, ఆమె భుజం పట్టి విసురుగా వెనక్కి లాగబోయాడు. లత కోపంగా చూస్తూ అతని భుజం గుచ్చి, బలంగా పట్టుకుని మరింత విసురుగా పక్కకి తోసి ముందుకు దూసుకుపోయింది లత.
''అడుక్కోడానికి వేళాపాళా ఉండదా?'' వెనకనుండి గట్టిగా అన్నాడు భుజం తడుముకుంటూ పోలీసు.
''అడుక్కోడానికి వేళాపాళా ఉంటుంది కానీ, సమస్యతో పోలీస్ స్టేషన్‌కి పరుగున రావడానికి వేళాపాళా ఉండక్కరలేదు కదా!'' హుంకరిస్తున్నట్టు అంది లోపలికి చేరిన లత.
పెద్ద పెద్ద అడుగులేస్తూ లోపలికి వచ్చిన లతని చూసి, ''వీడిని లోపలి ఎందుకు రానిచ్చావు?” అని పోలీసుని ఉద్దేశించి గట్టిగా అడిగాడు ఎస్ ఐ.
''తోసుకుంటూ వచ్చాడు సర్. పైగా హిజ్రాలా రాలేదు, అమ్మగా వచ్చాను అంటున్నాడు.''
''నువ్వు అమ్మవేంటి? అసలు నువ్వు అమ్మవెలా అవుతావు? నవమాసాలూ మోసావా? నెప్పులు పడి కన్నావా? అసలు కనగలవా?'' లతని పైనుండి కిందకి వెక్కిరింతగా చూస్తూ అడిగాడు ఎస్ఐ.
''భగవంతుడు నాకు ఆడ మనసిచ్చాడు. ఆ మనసు నిండా ప్రేమను నింపాడు. ఆ ప్రేమ మాతృప్రేమ. పసిపాపలను చూడగానే హృదయం ఉప్పొంగిపోతుంది. వారి ఆటపాటలు చూస్తుంటే చెప్పలేనంత ఆనందం కలుగుతుంది.
ఆడదానిగా మారినా శిశువుకు జన్మ ఇవ్వలేని నా అసహాయతకి ఎప్పుడూ బాధ కలుగుతూ ఉండేది. అమ్మ కాలేనన్న విషయం నన్ను నిత్యం కన్నీళ్లు పెట్టించేది. అన్నకీ, వదినకి పాప పుట్టినప్పుడు నేను దగ్గరుండి మంత్రసాని పని, ఆయా పనీ అన్నీ చూసుకున్నాను. డెలివరీ అయిన వారానికి ధనుర్వాతం లాంటి జబ్బేదో వచ్చి, మా వదిన పోయింది. ఆమె చనిపోయాక అన్న బిడ్డని నా కన్నబిడ్డగా సాకుతూ వచ్చాను. అన్న మళ్ళీ పెళ్లి చేసుకోడంతో, కళ్ళు విప్పని ఆ కూనకి తల్లిగా మారి, ఆ పాపకి అమ్మా నాన్నా నేనే అయి, పెంచుతున్నాను.”
''ఆ సోదంతా నాకెందుకు చెప్తున్నావు? పోలీస్ స్టేషన్‌కి రావడమే కాక నీ పురాణమంతా వెళ్లగక్కుతున్నావేంటి? ముందు బయటకి నడు!'' హుంకరించాడు ఎస్సై.
''నేను నీతో ముచ్చట్లాడడానికి రాలేదు. కంప్లైంట్ చెయ్యడానికి వచ్చాను.''
''ఏమని కంప్లైంట్ చేస్తావు? నకిలీ హిజ్రాలు మీ సంపాదన లాక్కుంటున్నారనా?''
''కాదు కాదు'' గట్టిగా అరిచింది లత.
“ఏయ్ అరవకు. నువ్వు రావడమే ఒక న్యూసెన్స్‌గా ఉంటె నీ అరుపులు ఇంకా న్యూసెన్స్‌గా ఉన్నాయి.''
లత కళ్ళల్లోంచి టపటపా కన్నీళ్లు రాలిపడ్డాయి. నా బిడ్డని... చిన్నారి తల్లిని మా ఇంటి ఓనర్ ముసలి చచ్చినాడు రేప్ చేసాడు. ఐదేళ్లయినా లేని నా బిడ్డ షాక్‌తో పడి ఉంది.” నేలమీద చతికిలబడి బావురుమంది లత. గుండెలవిసిపోయేలా ఏడుస్తున్న ఆమెని ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు పోలీసువాళ్ళు.
ఎస్సై ముందుగా తేరుకుని, ''ఛీఛీ! చీడలా పట్టుకున్నావు. ఫో బయటకి ఫో! మగ, ఆడ కాని మధ్యజాతి మనిషివి నువ్వు. మగవాళ్లమీద నిత్యం పడే సిగ్గులేని కొజ్జాజాతి మనిషివి. నీకు నీతీజాతీ లేదు. నువ్వు సాకే బిడ్డ కూడా నిన్ను చూసి నేర్చుకునేది అదే. నీ చుట్టూ ఉండేవాళ్ళు కూడా అందుకే చొరవగా చిన్నపిల్ల అని చూడకుండా చెయ్యి వెయ్యడం మొదలుకుని చెరచడం దాకా చేస్తారు. అందులో ఆశ్చర్యం ఏముంది? ఇంతోటి దానికి కేసులు పెట్టడం ఎందుకు?'' అన్నాడు చీదరగా చూస్తూ.
''దయచేసి అలా మాట్లాడకండి. ముక్కుపచ్చలారని నా బిడ్డకి జరిగిన అన్యాయం గురించి చెప్పి దోషిని శిక్షించమని కొంగుచాచి వేడుకోడానికి వచ్చాను. వాడిని జైల్లోకి తోసి, నా బిడ్డకి న్యాయం చెయ్యండి సారూ!''
''నడు! బయటకి నడు! ఇప్పటికే మా పోలీస్ స్టేషన్‌లో సాల్వ్ కాని కేసులు బోలెడు ఉన్నాయి. వాటితోటే చస్తుంటే అర్థం పర్థం లేని నీ కేసు గోల ఒకటా? నడు! బయటకి నడు! వెంటనే ఈ నసని రోడ్డు మీదకి ఈడ్చేయ్యండి!'' అరుస్తూ చెప్పాడు ఎస్సై.
''సర్! మీరు రాయమంటే విపులంగా జరిగినదంతా రాసిస్తాను. వేలిముద్ర వేసే స్థాయిలో నేను లేను. మీరు కేసు ఫైల్ చేసి దోషిని శిక్షించి నాకు న్యాయం చెయ్యండి సర్, మీ కాళ్ళు పట్టుకుంటాను'' అంది ఏడుస్తూ లత.
లతను నిర్దాక్షిణ్యంగా బయటకి తోసేశారు. ఆమెకు విపరీతమైన దుఃఖం వచ్చింది. ఎందుకు సమాజానికి తామంటే ఇంత చిన్నచూపు?
పదేళ్లవయసు నుండే తన మనసు, శరీరం ఆడదానిగా ఆలోచించడం, స్పందించడం ప్రారంభించాయి. ఆ విషయాన్ని సమాజం ముందు పెట్టడానికి ఆపసోపాలు పడడం, ఛీత్కారాలు ఎదుర్కోవడం, మగనుండి ఆడగా మారడానికి వ్యయప్రయాసలకు ఓర్చుకోడం అన్నీ చాలా కష్టపెట్టినా ఇవాళ్టి కష్టం ముందు అవన్నీ చాలా చిన్నవిగా అయ్యాయి కదా అనుకుంది లత.
మోసాలకూ, మానభంగాలకూ, దోపిడీలకు, దౌర్జన్యాలకూ తాము గురి అవుతున్న విషయాన్ని గ్రహించరెందుకు? అటు మగవారి నుండి, ఇటు ఆడవారినుండి తాము సమస్యలను నిత్యం ఎదుర్కొంటున్నామని అర్థం చేసుకునే యత్నం చేయరెందుకు? మనవరాలి ఈడు ఉన్న చిన్నారి పాపని చాక్లెట్ ఇస్తానని తీసుకుని వెళ్లి మానభంగం చేసిన ఆ 70 ఏళ్ళు పైబడినవాడిని శిక్షించి మరొక తప్పు చెయ్యకుండా చూసే ఆలోచన చేయరెందుకు?
నర్సరీ చదివే పాప స్కూల్ నుండి ఇంటికి వచ్చాక, ఇంటి ముందు ఆడుకుంటోందని తాను గబగబా దానికి అన్నం వండి పెడదామని అనుకోడం ఈలోగా ఊహించని రీతిలో ఈ ఘాతుకం జరగడం ఎంత ఘోరం? వేడివేడిగా పాపకి పూరీలు తినిపిద్దామని బయటకి వచ్చిన తను ఏమి చూసింది? స్పృహలో ఉందో లేదో తెలియని స్థితిలో ‘అమ్మా!’ అని తనని పిలిచి ఏడ్చే స్థాయిలో లేని పాపని చూసేసరికి తనకి గుండె పిండినట్లయ్యింది.
“ఏమైంది తల్లీ?” అని అడిగిన తనతో భయంగా చూస్తూ, “తాత, తాత!” అంటూ ఒంటిమీది రక్కులను, కొరికిన ప్రాంతాలను చూపి బెదురుతూ ఉన్న పసిదాన్ని చూసి ప్రాణం పోయినట్లయ్యింది. తన హిజ్రా మిత్రులను పాప దగ్గర కాపలా ఉంచి తలుపు వేసుకుని కూర్చోమని “పాప జాగ్రత్త!” అని జాగ్రత్తలు చెప్పి, తాను ఇలా వచ్చింది.
కానీ జరిగినదేమిటి? తనకి ఒరిగిన న్యాయం ఏమిటి? స్త్రీ పురుషులేనా మనుషులు? నపుంసకులు మనుషులు కారా? వాళ్లకి, వాళ్ళ తాలూకు వారికి న్యాయం చేసే పని సభ్యసమాజం చెయ్యదా? తమ కష్టాలు చూసి ఎవ్వరూ స్పందించరా?
అసలు మానభంగం చెయ్యడం అనేది దారుణమైన విషయం. చిన్నపిల్లలని బలాత్కరించడం మరింత అన్యాయం. ఈ అనాగరిక ప్రవర్తనను గూర్చి మాట్లాడడానికి కూడా కన్నవారు ఈ కాలంలో కూడా భయపడుతున్నారు.
తమ పరువు, పిల్లల భవితలను దృష్టిలో పెట్టుకుని కంప్లైంట్ చేయడంలేదు. తనలాంటివారు కంప్లైంట్ చెయ్యడానికి ముందుకు వచ్చినా పట్టించుకోవడం లేదు.
కేస్ ఫైల్ చెయ్యడానికి వచ్చిన తనని ‘చెక్కగాడు కొజ్జాగాడు’ అన్నా పట్టించుకోదు తాను. తన పాపకి న్యాయం జరగాలి అని మాత్రమే కోరుకుంటుంది.
సమాజం తనలాంటివారిని ఏ విషయంలోనూ ముందడుగు వెయ్యనివ్వనందుకు బాధ కలుగుతోంది.
పోలీస్ స్టేషన్‌కి వచ్చినది హిజ్రా అయినా, నేరస్తులైనా, ఒళ్ళమ్ముకునే వ్యక్తి అయినా వారికి న్యాయం చెయ్యడానికే కదా రక్షకభటులు ఉన్నది! కేసు గురించి వినకుండా తోసేయడం ఎంత అమానుషం?
నేటి పరిస్థితులను చూసి పరితాపం కలుగుతోంది. ఎన్ని పెండింగ్ కేసులు ఉన్నా ఇలాంటి అనాగరిక వ్యక్తులను శిక్షించే యత్నం అయినా చెయ్యని రక్షకనిలయం మీద న్యాయవ్యవస్థ మీదా విరక్తి కలుగుతోంది.
చట్టాలు ప్రజల సహకారం కోసం ఏర్పరచిన వాటిని ప్రజల దృష్టికి తీసుకు రావడం అన్యాయాలను అరికట్టేందుకు నడుములు బిగించడం మానేసి సొల్లు అంశాలకి సినీసంగతులకూ ప్రాధాన్యం ఇస్తున్న మీడియామీద గొంతుదాకా కోపం వస్తోంది.
తాను ఇప్పుడు ఏమి చెయ్యాలి? పోలీసులు కేసు ఫైల్ చేసుకోకపోతే తన పాపకి ఎలా న్యాయం చెయ్యాలి? ఎవరిని ఆశ్రయించాలి? ఆలోచిస్తూ నిలబడిపోయింది ఒక్క క్షణం.
తన గురువు ఒకసారి చెప్పింది కదూ, ఇంటికి దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ న్యాయం చెయ్యకపోతే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దగ్గరికి వెళ్లి మొరపెట్టుకోవచ్చని, సెక్షన్ 154 (3) ఆఫ్ సీపీసీ అందుకు సహకరిస్తుందని... ఆ మాట గుర్తు పెట్టుకోడం మంచిదయ్యింది అనుకుంటూ నడక సాగించింది. కింద పోలీసులే పట్టించుకోనప్పుడు పై అధికారి పట్టించుకుంటాడా? అసలతన్ని ఎక్కడ, ఎలా కలుసుకోవాలి? అనుకుంటూ నడక వేగం పెంచింది.
గబగబా పక్కనున్న పుస్తకాల షాప్ కి వెళ్లి ఒక పెన్ను, లాంగ్ నోట్ బుక్కు కొని, రోడ్డు పక్కనున్న ఫుట్‌పాత్ మీద చతికిలబడి, తన మనోవేదనను అచ్చతెలుగులో అక్షర రూపంలో వివరించింది లత. ఇది ఆయనకిచ్చి, శరణు వేడాలనుకుంది.
“ఎస్పీ ఉండే ఆఫీస్ ఎక్కడ?” అని షాపుల వాళ్ళని అడిగింది.
కన్ను గీటుతూ, “ఏమిటి కథ?” అని అడిగాడొకడు. వంకర చూపు చూసాడు ఇంకొకడు. ఒంటి మీద చెయ్యి వెయ్యాలని చూసాడు మరొకడు. ఎట్టకేలకు ఒక మంచివాడు దారి చెప్పడంతో ఆటోని పిలిచి ఎక్కింది.
గురువుకి ఫోన్ చేసి, పాప ఎలా ఉందో కనుక్కుంది. పాపకి వేడిపాలు, కార్న్ ఫ్లేక్స్ ఇచ్చి పడుకోబెట్టమని, ఒళ్ళు తుడిచి, బట్టలు మార్చడంలాంటివి చెయ్యవద్దని చెప్పింది. తాను పోలీస్ స్టేషన్‌లో అవమానాన్ని ఎదుర్కొందని, తన బాధని వినకుండా, మొగా ఆడా కాని మూడోమనిషిగా మాత్రమే చూసారని, కనీసం చిన్నపాపకి జరిగిన అన్యాయం గురించైనా స్పందించలేదని అందుకే లెటర్ రాసి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దగ్గరికి తీసుకు వెళ్తున్నానని చెప్పింది.
''లతా ముందు ఆటో ఆపు. అటు వెళ్ళకు!” అరిచి చెప్పింది గురువు.
''ఎందుకు ఆపాలి ఆటోని?'' ఆశ్చర్యంగా అడిగింది లత.
''పోలీస్ స్టేషన్లో నీకు కొద్దిగానైనా న్యాయం జరిగిందా చెప్పు?'' అడిగింది గురువు.
''లేదు లేదు'' అంది లత.
''ఎస్పీ దగ్గర మాత్రం న్యాయం జరుగుతుందని అనుకుంటున్నావా?''
''దేముడిని ప్రార్థిస్తూ వెళ్తే న్యాయం జరుగుతుందని ఆశ పడుతూ వెళ్తున్నాను'' అంది లత.
''నీకు ఆశ ఉందేమో కానీ నాకు మాత్రం మనకి న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. ఆలస్యం చేస్తే, పాప ఒంటి మీదున్న రేప్ చేసిన ఆనవాళ్లు పోవచ్చు. వాటి సాక్ష్యం లేకుండా ముసలాడి శిక్ష పడదు. అసలు మనమొక దెబ్బవేస్తేనే చచ్చే ముసలాడిని ఏమీ చెయ్యకుండా మనము వదిలేయడానికి కారణం న్యాయదేవతని నమ్ముకోడమే. సాక్ష్యాలు మనం చూపించలేకపోతే తిమ్మిని బమ్మి చేసి వాడికి శిక్ష పడకుండా తప్పించుకుంటాడు. అందుకని ఆలస్యం చెయ్యకుండా మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళు. ఆయన కోర్ట్ కి దగ్గరగా ఉన్న గుడికి మనం చాలా సార్లు వెళ్లాం గుర్తుందా?''
''గుర్తుంది గుర్తుంది. బాబూ, ఆటో దారి మళ్ళించు!” అరిచినట్టు అని, దారి చెప్పింది లత.
''అక్కడ మనకి న్యాయం జరుగుతుందనే నేను అనుకుంటున్నాను లతా. 98% చెడ్డవాళ్ళు ఉంటారు నిజమే కానీ రెండు శాతం మంది మంచి వాళ్ళు కూడా ఉంటారని గుర్తుంచుకో. ఆగకు. న్యాయం చిక్కేదాకా ఆగకుండా ముందుకు పో''
ఆటో దారి మళ్లింది. లతలో నిరాశావాదం పోయి ఆశావాదం చిగురించింది. గమ్యం చేరేదాకా ఆటో ఆగదు. న్యాయం జరిగేదాకా లత సమస్యని వదిలిపెట్టదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎందరు ఎద్దేవా చేసినా బిడ్డకి న్యాయం జరిపించేదాకా ఆ తల్లి నిద్రపోదు. అమ్మంటే ఆకలి తీర్చేది, ఆటలాడించేది, నిద్రపుచ్చేది మాత్రమే కాదని అవసరమైతే ఆడపులిలా చెలరేగి తన బిడ్డకి అన్యాయం చేసినవాడి అంతు చూసేదే అమ్మ అని సభ్యసమాజానికి తన చేతల ద్వారా నిరూపించబోయే నవచైతన్యంలా ముందుకు సాగిపోయింది లత.