మొదటి భాగం
స్వర్గంలో ఇంద్ర సభ చర్చించే విషయం - భూమి మీద జీవితం అసహ్యకరమైనది. తుఛ్ఛమైన చీము, రక్తంతో కూడుకుని రోగాలతో ఉన్నా అదే ఆనందం అనుకుంటూ బతకడం, ఆస్తులు కూడబెట్టుకోవడమూను. కళావతి అనే ఒక అప్సరస చెప్పింది, “స్వర్గంలో కన్నా భూమ్మీద జీవితమే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. భూమి మీద మంచి కార్యాలు చేయడం వల్లే కదా ఇలా దేవతలం అయ్యాం? భూమి మీద అయితే పాపం కానీ పుణ్యం కానీ చేయడానికైనా ఎంచుకునే అధికారం ఉంది. రకరకాల పాప పుణ్యాలు చేసి, మిగతా వారికి సహాయపడుతూ ఏ ఒక్కరోజూ ఒకేలాగ లేకుండా ఆనందిచవచ్చు….”
కోపంతో మొహం ఎర్రబడుతుంటే ఇంద్రుడన్నాడు, “కళావతీ, నువ్వేం మాట్లాడుతున్నావో స్పృహ ఉందా?”
“…నేను అన్నది తప్పా? ఈ స్వర్గలోకంలో మన పుణ్యం అవ్వగానే మళ్ళీ భూమ్మీదకే జేరాల్సి రావచ్చు. ఎప్పుడూ బాధ అనుభవించనివాడికి ఆనందం అంటే తెలియదు కదా? ఇక్కడ ప్రతీరోజూ ఆనందంగా ఉండడం వల్ల అది అలవాటైపోయి విసుగు ఎత్తవచ్చు; కానీ భూమి మీద జీవితం రోగాలతో కూడుకున్నాఅక్కడే మానవుడికి మరింత స్వేఛ్ఛ ఉంది తనకి కావాల్సినవి ఎంచుకోవడానికి. అదీగాక భూమి మీద పడ్డాకే ఆత్మజ్ఞానానికి దారి తెలియడం, దాని శోధనా సాధించగలిగేది...”
కోపం వచ్చిన ఇంద్రుడు వెంఠనే శపించాడు కళావతిని, “భూమ్మీద బతుకే అంత బావుంటుందన్నావు కనక మనిషిగా మానవ జన్మ ఎత్తు అయితే. అలా అష్టకష్టాలు అనుభవించాక అప్పుడు వెనక్కి వద్దువుగాని.”
“… అయ్యో, సభలో అందరూ మాట్లాడుతున్నట్టే నేను కూడా మనసులో మాట చెప్పాను. శాపం ఎలాగా ఇచ్చేసారు కనక రోజులో సగ భాగం ఇక్కడ స్వర్గంలో, రాత్రి భూమి మీదా ఉండేలాగ ఏర్పాటు చేయగలరా? నేను భూమ్మీద ప్రత్యక్షంగా అనుభవించే కష్ట సుఖాలూ, విశేషాలు ఎప్పటికప్పుడు మీకు చెప్తూ ఉంటాను,” కళ్ళలో నీరు తిరుగుతుండగా అడిగింది కళావతి.
“సరే అలాగే కానీయ్“
***
ఊరి చివర పాడుబడిన గుడి ప్రాంగణంలో జూదం జరుగుతోంది చాలాసేపటి నుండీ. కొత్తగా వచ్చిన ఎవరో కుర్రాడు ఆటలో కూర్చోబోతూంటే ఒక పెద్దాయన అడిగేడు, “అబ్బాయ్ ఇక్కడ జూదం ఆడ్డానికి రెండు, మూడు షరతులున్నాయి. “మొదటిది, నువ్వు ఓడిపోతే డబ్బు వెంఠనే ఉన్నది ఉన్నట్టూ చెల్లించాలి. రెండోది, నీ దగ్గిర డబ్బులేకపోతే ‘నేను ఆటలోంచి తప్పుకుంటున్నా’ అని ఆటకి ముందే చెప్పాలి. అలా చెప్పకపోతే నువ్వు ఆటలో ఉన్నట్టే లెక్క, ఆట ఆడకపోయినా. మూడోది, ఓడిపోయినప్పుడు డబ్బులు చెల్లించకపోతే నీ శరీరాన్ని ఈ రంపంతో కోస్తారు ఇక్కడ గెల్చినవాళ్ళు,” అక్కడే రక్తం ఓడుతున్న పదునైన అంచులు గల రంపం చూపిస్తూ అన్నాడు పెద్దాయన.
కుర్రాడికి వళ్ళు జలదరించినా చెప్పేడు, “సరే, మూడు షరతులకీ నేను వప్పుకుంటున్నా.”
దాదాపు రాత్రి రెండో ఝాము కావస్తూంటే ఆట కట్టిపెట్టి లేచారందరూ. ఆటలో ఒక్కడు తప్ప అందరూ గెల్చినట్టే. గెల్చినవాళ్లందరూ జాలి వల్ల కాబోలు తలో కాసూ ఓడిపోయినవాడి చేతిలో పెట్టి ఇళ్ళకి బయల్దేరేరు. మొత్తం అన్నీ ఓడిపోయిన పెద్దమనిషి తనకి అందరూ ఇచ్చిన డబ్బు ఎంత ఉందో లెక్కకూడా పెట్టుకోకుండా జేబులో పెట్టుకుని నవ్వుకుంటూ కులాసాగా ఊరికేసి నడుచుకుంటూ వెళ్ళిపోయేడు.
ఆరోజు ఆటలో కొత్తగా జేరిన కుర్రాడు ఇదంతా చూసి ముందు తనకి ఆటలో షరతులు చెప్పిన పెద్దాయనని అడిగేడు, “ఆయనెవరండీ, అంతా పోగొట్టుకున్నా ఏమీ దుఃఖం అదీ లేదు. మనం ఇచ్చిన తలో కాసూ జేబులో పెట్టుకుని అదే పోయాడు?”
పెద్దాయన నవ్వి చెప్పాడు, “వాడి పేరు ఠింఠాకరాళుడు. ఏ రోజుకీ ఒక్క కాసు దాచుకోడు. ఏదైనా ఉంటే ఆడడం, లేదా ఎక్కడ వచ్చిన డబ్బు అక్కడ ఆటలో పోగొట్టుకోవడం. వాడికి పిల్లా, జెల్లా, కుటుంబం అంటూ ఏమీ లేదు. ఇప్పుడు మనం ఇచ్చిన డబ్బుతో పోయి కాస్త గోధుమ పిండి కొనుక్కుని వాటితో, దొరికిన నీరు కలిపి ముద్దలు చేసి ఆ ముద్దలని ఈ ఉజ్జయినీ నగరం ఊరి చివర శ్మశానంలో చితిమంటల్లో కాల్చుకుని రొట్టెలు చేసుకుంటాడు. అవి పట్టుకుపోయి మహాకాలుడి గుడిలో నేతి దీపాలలో ఉన్న నెయ్యి వాటికి పూసుకుని తిని అక్కడే తలకింద చేయి పెట్టుకుని పడుకుంటాడు. అదే వాడికి తెల్సిన పని. మనతో రోజూ ఆడి అన్నీ పోగొట్టుకుంటాడు కనకా, వాడికెవరూ లేరని జాలితోనూ రోజూ ఆట అయిపోయాక చివరిలో ఇలా ఒక కాసో, రెండు కాసులో ఇస్తూ ఉంటాం.”
సమాధానం విన్న కుర్రాడు నోరు వెళ్ళబెట్టాడు, చితిమీద రొట్టెలు కాల్చుకోవడం, మహాకాలుడి గుడిలో నేతిదీపాల మీద నేయి ఆ రొట్టెలమీద రాసుకోవడం అనేది వినగానే. కొంచెం వెన్ను వణుకుతుంటే అడిగాడు, “ఇటువంటివారికి భూత, పిశాచ, ప్రేత శక్తులు ఉంటాయేమో, మీకు భయంలేదా ఈయనతో ఆడటానికి?”
“అబ్బే, ఠింఠాకరాళుడు అటువంటివాడు కాదు. మహాకాలుడి భక్తుడు. ఎవరికీ అపకారం చేసే మనిషి కాదు.”
***
మహాకాలుడి గుడిలో పడుకున్న ఠింఠాకరాళుడికి ఏ ఝాము రాత్రో మెలుకువ వచ్చింది. అడుగుల చప్పుడు లేదు కానీ గుడిలో గోడమీద సప్తమాతృకల విగ్రహాలు అటూ ఇటూ కదులుతున్నాయి. ఠింఠాకరాళుడు అలాగే కదలకుండా పడుకుని కుతూహలంగా చూడబోయేడు ఈ కదిలే విగ్రహాల సంగతి.
ఓ గంటా రెండు గంటల తర్వాత ఆ కదలడం అగిపోయింది. ఇదంతా చూసిన ఠింఠాకరాళుడికి దివ్యమైన ఆలోచన వచ్చింది తూర్పు ఉదయించగానే. ఆ రోజుకి ఊరి చివర శ్మశానంలో జరిగే జూదానికి వెళ్ళకుండా రోజంతా మహాకాలుడి గుడిలోనే గడిపి రాత్రికి ఏం చేయాలో ఆలోచించాడు. రోజూ తాను జూదం ఆడే చోట మహా గెలిస్తే ఓ వందో, రెండు వందలు గెలవొచ్చు కానీ అవి మర్నాటికి ఆటలో ఎలాగా పోతాయి. తనతో ఆడేవాళ్ళు తనలాంటి వాళ్ళే. వాళ్లతో ఆడితే తానెప్పటికీ ధనవంతుడు కాలేడు. రాత్రి మహాకాలుడి గుడిలో సంచరించే ఈ సప్తమాత్రుకలని ఎలాగైనా ఆటలో దింపగలిగాడా, తాను ఎంతైనా ధనం సంపాదిందిచవచ్చు. అదీగాక ఈ దేవతల దగ్గిర అంతులేని ధనం ఉంటుంది కనక తానెప్పుడూ మరోసారి ఈ శ్మశానం లో ఊళ్ళోవాళ్లతో జూదం ఆడక్కర్లేదు. తానుగాని సప్త మాతృకల చేతిలో ఓడితే వాళ్లకి చెల్లించే డబ్బు తన దగ్గిరలేదని తప్పించుకోవచ్చు. ‘అమ్మా మీరు దేవతలు, నేను మీకు డబ్బిచ్చే అంత వాడినా?’ అని బతిమాలితే నవ్వేసి వదిలేయరా? మరీ పాకం ముదిరి పీకలమీదకి వస్తే పోయి ఆ మహాకాలుడి కాళ్ళే పట్టుకోవచ్చు. అయినా తాను ఓడినప్పటిమాట కదా?
ఈ ఆలోచన రాగానే ఆ రోజు ఠింఠాకరాళుడు అర్ధరాత్రి వరకూ గుడిలోనే పడుకున్నాడు. అర్ధరాత్రి మళ్ళీ సప్తమాత్రుకల విగ్రహాలు కదలడం మొదలవ్వగానే కరాళుడు లేచి పాచికలు చేత్తో తీసి చెప్పేడు అందరికీ వినబడేట్టుగా, “అమ్మలూ, నాతో పాచికలు ఆడండి, మా జూదగాళ్ళ షరతులు మీకు తెల్సినవే కదా?”
కదిలే సప్త మాత్రుకల విగ్రహాల లోంచి ఏ సమాధానమూ రాకపోయేసరికి మౌనం అర్ధాంగీకారం అనుకుని పాచికలు విసిరాడు కరాళుడు. మాత్రుకల దగ్గిర్నుంచి సమాధానం లేకపోయేసరికి మరోసారీ మరోసారీ పాచికలు అలా విసురుతూనే ఉన్నాడు తూర్పు తెల్లవారేదాకా. మాత్రుకల విగ్రహాలు కదులుతున్నంతసేపూ జూదం ఆట సాగుతూనే ఉంది. కరాళుడు నెగ్గుతూనే ఉన్నాడు అప్పుడప్పుడూ ఓడినా. పొద్దెక్కిన తర్వాత చూసుకుంటే కరాళుడి లెక్క ప్రకారం సప్త మాత్రుకలు వాడికి దాదాపు వెయ్యి రూకలు బాకీ. రెండోరోజు ఆట మొదలుపెట్టబోతూంటే ఈ బాకీ సంగతి తేల్చాలి. ఆలోచన చాలించి నిద్రకి ఉపక్రమించాడు.
మర్నాడు రాత్రి ఆట మొదలుపెట్టబోతూ కరాళుడు మాత్రుకలతో చెప్పేడు, ”నిన్నటి రోజు ఆట ప్రకారం మీరు ఓడినది డబ్బు ముందు ఇవ్వకపోతే ఆట ముందుకి జరగదు ఈవేళ.”
సప్త మాత్రుకలనుంచి ఏమీ సమాధానం రాలేదు కరాళుడికి మొదటిసారీ, రెండోసారీ ఆ తర్వాత అనేకానేక సార్లు అడిగినా సరే. చాలాసార్లు అడిగి విసిగిపోయిన కరాళుడు జూదంలో వాడే షరతుల ప్రకారం రంపం బయటకి తీసాడు కదిలే సప్త మాత్రుకల విగ్రహాలని ధ్వంసం చేయడం కోసం. రంపం విగ్రహాలమీద పడీపడకుండానే బంగారు కాసులు గోడ పగుళ్ళలోంచి జారిపడ్డాయి. లెక్కపెట్టి చూసుకుంటే సరిగ్గా తనకి రావాల్సిన డబ్బులు వచ్చినట్టే; నవ్వుకున్నాడు కరాళుడు. ఆ రోజునుండి కరాళుడు మొదట సప్త మాత్రుకలతో జూదం ఆడడానికి, వాళ్ళిచ్చే బంగారు కాసులు జేబులో పెట్టుకుని ఆ తర్వాత శ్మశానంలో ఆ కాసులు మిగతా వాళ్ళతో ఆడిన జూదంలో పోగుట్టుకోవడానికీ అలవాటుపడ్డాడు.
కొన్ని రోజులు ఈ కధ నడిచాక సప్త మాత్రుకలకి మనసులో అలజడి ప్రారంభమైంది. ఈ కరాళుడి జూదానికి రోజూ ఊరికే బంగారు కాసులు ఇవ్వడం ఎలా? పోనీ ఇచ్చినా వీడు వాటిని జూదంలో మిగతావాళ్లకి పోగొట్టుకుంటున్నాడు కదా? ఇలా అయితే తాము జూదాన్ని ప్రోత్సాహించడం అవుతోంది. అలాగని వీడికి బంగారు కాసులు ఇవ్వొద్దు అనుకుంటే రంపంతో తమని కోయడానికి తయారౌతున్నాడు. తమ విగ్రహాలు ధ్వంసం అయితే ఇక్కడ ఉజ్జయినీ లో వెలిసిన మహాకాలుణ్ణి, అమ్మవారిని ఈ గుడిలో కొలుచుకోవడం అసంభవం. ఈ రంపంతో కోయడం అనే షరతు ఏమిటసలు? దారి తెలియని స్థితిలో గుడిలో ఉండే చాముండేశ్వరీ అమ్మవారి దగ్గిరకి వెళ్ళి మొరపెట్టుకునేసరికి ఆవిడ నవ్వుతూ చెప్పింది ఈ షరతుల సంగతి. “వీడి బారినుంచి తప్పించుకోవడానికి ఒకే దారి ఉంది. వాడు పాచికలు విసిరే సమయానికి ‘మేము ఆటలోంచి తప్పుకుంటున్నాం’ అని చెప్పేయడమే. అలా మొదటి షరతు ఎప్పుడైతే పాటిస్తారో అప్పుడు కరాళుడు మిమ్మల్ని ఏమీ చేయలేడు.”
మర్నాడు ఠింఠాకరాళుడు మరోసారి సప్తమాత్రుకలముందు పాచికలు వేయబోయే సరికి అవి మాట్లాడుతున్నాయా అన్నట్టూ మాట వినబడింది, “మేము ఆటలోంచి తప్పుకుంటున్నాం.”
నివ్వెరపోయిన కరాళుడికి కాళ్ళూ చేతులూ ఆడలేదు. ఏ రోజుకా రోజు ఏమీ కష్టపడకుండా బంగారు కాసులు సంపాదించి వాటితో మరోచోట జూదం ఆడుకోవచ్చనుకున్న కరాళుడికి ఏమి చేయాలో తోచలేదు. కాసేపు కిందామీదా పడ్డాక కరాళుడికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది.
ఆ ఆలోచనప్రకారం తిన్నగా గర్భగుడిలోకి పోయి త్రిలోకాధిపతి అయిన మహాకాలుడి ముందు పాచికలు వేసి ఆయననే జూదం ఆడ్డానికి అహ్వానించాడు ఠింఠాకరాళుడు.
ఠింఠాకరాళుడి జీవితం, తన గుడిలో పడుకోవడం, తనమీద భక్తీ, ఓ సారి సప్తమాత్రుకలతో పందెం వేసి డబ్బు గెల్చుకున్నాక రోజూ వాళ్లని ఆహ్వానించడం, వాళ్లకి అమ్మవారు ఏం చేయాలో చెప్పడం - ప్రతీరోజూ జరిగే ఈ తతంగం చూసిన మహాకాలుడు వెంఠనే నవ్వుతూ చెప్పేడు “నేను ఆటలోంచి తప్పుకుంటున్నా.”
హాతాశుడైన కరాళుడి మనసులోంచి అమితమైన వ్యధ తన్నుకొచ్చింది. ఇంతటి భక్తుడినైన నన్నే మహాకాలుడు వదిలేస్తే తాను బతికేదెలా? వెంఠనే సాష్టాంగపడి అన్నాడు కరాళుడు “స్వామీ, త్రిలోకాధిపతివి, ముంగిట్లో కామధేనువూ, కల్పవృక్షం ఉంచుకుని నాతో జూదం ఆడడానికి ఆటలోంచి తప్పుకునేంత లోభివైపోయావా? మరి నేను ఇంక బతికేదెలా?”
ఆషుతోషుడైన మహాకాలుడికి జాలి వేసింది కరాళుడి పరిస్థితికి. తన భక్తుడైన ఈ కరాళుడికి మంచి తెలివితేటలు ఉన్నా జూదం, మోసం తప్ప మరో విషయం తెలియదు. తానే వీణ్ణి ఎలాగో ఒకలాగ దారిలో పెట్టాలి. కరాళుడితో చెప్పేడు, “ఒరే, నువ్వింక ఇక్కడ కానీ మరెక్కడా కాని జూదం ఆడనని ప్రమాణం చేసి ఇక్కడే గుడిలో ఉండిపో, నీకో అద్భుతమైన భార్యని చూసి సరైన దారిలో జీవించే మార్గం చూస్తాను, నీ అవసరాలన్నీ తీరుతాయి, ఇష్టమేనా?”
మహాకాలుడిలా తన అవసరాలన్నీ తీరుస్తానని మాట ఇవ్వగానే ఠింఠాకరాళుడు అక్కడికక్కడే ప్రమాణం చేసాక మళ్ళీ ఏనాడూ పాచికలు వేయలేడానికి పూనుకోలేదు ఉజ్జయినీ నగరంలో కాని మరెక్కడా కానీ.
***
కొన్నాళ్ళు గడిచాక, అర్ధరాత్రి గుడిలో పడుకున్న ఠింఠాకరాళుడికి మహాకాలుడి పిలుపు విని మెలుకువ వచ్చింది, “ఒరే, ఉజ్జయినీలో ఫలానా సరస్సు దగ్గిరకి వెంఠనే వెళ్ళు. అక్కడికి కొంతమంది అమ్మాయిలు స్నానం చేయడానికి వస్తున్నారు. వాళ్ళని సరస్సులోకి దిగనిచ్చి, వాళ్ళ బట్టలన్ని ఎత్తుకు పోయి చెట్టుమీద కూర్చో. వాళ్ల స్నానం అయ్యాక బట్టలు ఇవ్వమంటే వాళ్ళలో ఒకావిడని నీకు భార్యగా ఇవ్వడానికి ఒప్పుకుంటే మాత్రమే ఇస్తానని చెప్పు. అలా నీకో భార్య లభించబోతోంది. ఆ తర్వాత ఇల్లూ కుటుంబం, కావాల్సిన డబ్బు అవన్నీ ఆవిడే చూసుకుంటుంది.”
మహాకాలుడి మాట పూర్తౌతుండగానే ఠింఠాకరాళుడు ఆలయంలోంచి బయటకి పరుగెత్తాడు.
అమ్మాయిలు స్నానంకోసం దిగడంతోటే వాళ్ల బట్టలతో అక్కడే ఉన్న చెట్టెక్కాడు కరాళుడు. మరో గంటకి నీటిలోంచి బయటకొచ్చిన వీళ్ళకి బట్టలకోసం కరాళుడి కాళ్ళు పట్టుకోవడం తప్ప మరో దారి లేకపోయేసరికి వాడు అందరిలోకీ అందమైన ఒకావిడకేసి చూపిస్తూ చెప్పేడు, “మీలో అందమైన ఆ అమ్మాయిని నాకు భార్యగా ఇస్తే మాత్రమే మీ బట్టలు అందుతాయి. లేదా మీ ఇష్టం. రాత్రి అంతా మహాకాలుడి సన్నిధిలో ఇలా మెలుకువగా ఉండడం నాకు అలవాటే.”
పెద్ద గొడవలేకుండా అమ్మాయిలందరూ ఒప్పుకోవడం కరాళుడికి వింతగా అనిపించి అడిగాడు, “అంత సులభంగా ఎలా ఒప్పుకున్నారు నేను అడిగిన దానికి? ఇది నన్ను ఇక్కడకి పంపించిన మహాకాలుడి ప్రభావమేనా?”
“మేము స్వర్గంలో నాట్యం చేసే అప్సరసలం. మాలో నువ్వు ఎంచుకున్నావిడ పేరు కళావతి. ఆవిడకి భూమి మీద మనిషి జన్మ ఎత్తమని ఇంద్రుడు ఈ మధ్యే శాపం ఇచ్చాడు. నువ్వు చెప్పినదాని ప్రకారం మహాకాలుడు నిన్నే ఆవిడకి భర్తగా నిర్ణయించినట్టుంది. అందువల్ల ఆవిడ నీ భార్య అవడం తగినది. అంతకన్నా ఇంకేం కావాలి?”
***
కళావతితో పెళ్ళైపోయిన ఠింఠాకరాళుడికి ఇప్పుడు దేనికీ కొరతన్నది లేదు. అయితే తాను కరాళుణ్ణి పెళ్ళి చేసుకోవడానికి ముందు కళావతి పెట్టిన నిబంధన ఒకటి ఉంది. భూమిమీద పొద్దున్న సమయంలో ఆవిడ స్వర్గానికి వెళ్తుంది. రాత్రి అయ్యేసరికి వెనక్కి వచ్చేసి ఆ రోజు స్వర్గంలో జరిగిన విశేషాలు కరాళుడికి చెప్తూ ఉంటుంది. కరాళుడికి తెలియని/కళావతి చెప్పని మరో విషయం, ఆవిడ భూమి మీద అనుభవించిన, గమనించిన ప్రతీ విషయం అక్కడ స్వర్గంలో ఇంద్రుడికి చెప్తోంది.
కళావతి పెట్టిన ఈ నిబంధనకి అసలు ఏమీ అడ్డు చెప్పే పని లేకపోయింది కరాళుడికి. తనకి కావాల్సినవన్నీ కళావతి అమర్చిపెడుతుంది. ఇల్లూ వాకిలీ అన్నీ చూసుకునేది ఆవిడే. తనకి పనే లేదు ఊరిమీద తిరగడం తప్ప. ఆవిడ పొద్దున్నే స్వర్గానికి వెళ్ళగానే కరాళుడు ఊరిమీదపడి ఇష్టం వచ్చినచోట తిరుగుతాడు ఉజ్జయిని లో. సాయంత్రం ఇంటికొచ్చాక కళావతి చెప్పే స్వర్గంలో విశేషాలూ అవీ విన్నాక పడకమీద స్వర్గ సుఖం అనుభవిస్తాడు. అంతకన్నా ఏం కావాలి తనకి? మహాకాలుడి కృప వల్లే ఇవన్నీ తనకి అమరాయి. ప్రతీరోజూ ఆయన్ని క్రమం తప్పకుండా స్మరించుకోవడం ఒకటే తాను చేయాల్సినది.
రోజులు ఇలా గడుస్తూంటే ఉజ్జయినిలో పగలల్లా వీధుల్లో తిరుగుతున్న కరాళుడికి మనుషులూ జంతువులతో పాటు అనేకానేక వింతలు కనబడుతున్నాయి. వాటిలో రోజూ విధిగా కనబడే ఒక మేకా, కుక్కలా ప్రవర్తించే ఎవరినీ కరవని సింహం, జంతువుల్లా ప్రవర్తించే మనుషులూ కనబడుతున్నారు. ఈ వింతలన్నింటినీ కరాళుడు కళావతికి చెప్తూనే ఉన్నాడు. కళావతి అటు స్వర్గంలోనూ, ఇటు భూమిమీదా జీవితం గడుపుతోంది. కరాళుడికి భార్య చెప్పే విశేషాలతో, ఆవిడతో గడిపే రాత్రులతో జీవితం ఎక్కడా వంక పెట్టడానికి లేదు. అటు కళావతీ బాగానే ఉన్నట్టుంది.
ఓ రోజు పొద్దున్నే స్వర్గానికి వెళ్లబోతూ కళావతి చెప్పింది, “ఈ రోజు రంభ ఒక ప్రత్యేకమైన నాట్యం చేయబోతోందిట, అందువల్ల అది పూర్తయ్యేదాకా నేను అక్కడనుంచి రావడానికి కుదరదు. కొంచెం ఆలశ్యం అవుతుంది వచ్చేసరికి, బెంగపెట్టుకోకు నా గురించి.”
కరాళుడు వెంఠనే భార్య చేయి పట్టేసుకుని వదలకుండా అన్నాడు, “ఎన్నాళ్లనుంచో నిన్ను అడుగుదామని అనుకుంటున్నాను, నాకు స్వర్గంలో జరిగే ఈ నాట్యం చూడాలని ఉంది. నన్ను కూడా ఏదో విధంగా తీసుకెళ్ళు.”
ఈ అసంభవమైన కోరిక విన్న కళావతి అదిరిపడి చెప్పింది, “నేను నిన్ను తీసుకెళ్తే చూసిన ఇంద్రుడికి కోపం వస్తే ఏమౌతుందో తెలుసా? మన ఇద్దర్నీ కూడా శపిస్తాడు. ఇప్పటికే నాకో శాపం ఉంది. మళ్ళీ మరొకటా?”
“నువ్వు ఏ విధంగానైనా నన్ను ఈ రోజు తీసుకెళ్ళవల్సిందే లేకపోతే నిన్ను వదిలేది లేదు,” కరాళుడు పట్టు వదలకుండా చెప్పాడు స్థిరంగా.
ఇద్దరూ అటూ ఇటూ వాదులాడుకున్నాక మొత్తానికి కళావతే మెట్టు కిందకి దిగి రావాల్సి వచ్చింది, తాను కరాళుడి చేతిలోంచి మాయమై వెళ్ళిపోగలదైనప్పటికీ. దీనికి రెండు కారణాలు – మొదటిది ఠింఠాకరాళుణ్ణి తనకి భర్తగా చూపించినది మహాకాలుడు, ఆయనకి కోపం తెప్పించడం మంచిది కాదు. రెండోది ఠింఠాకరాళుడి వల్లే తనకి ఇంద్రుడిచ్చిన శాపం పూర్తౌతుంది. అయితే ఠింఠాకరాళుడు అనుకున్నది వేరు – కళావతికి తనమీద ప్రేమ వల్లే మెట్టు దిగివచ్చింది. ఏదైతేనేం మొత్తానికి ఇద్దరికీ ఈ విషయంలో కుదిరిన సయోధ్య ప్రకారం కళావతి కరాళుణ్ణి పువ్వుగా మార్చి తలకొప్పులో ధరించి స్వర్గానికి వెళ్తుంది. అక్కడ కరాళుడు అన్నీ చూడగలడు కానీ నోరు విప్పలేడు, మనిషిగా మారలేడు. అంటే చూపు తప్ప మరోటి ఉండదు. అలా చూసినది మనసులో గుర్తుంటుంది. అది కుదరకపోతే కరాళుడికీ కళావతికీ సంబంధం చెల్లిపోయినట్టే.
కళావతి పెట్టిన నియమాలకి చచ్చినట్టూ ఒప్పుకున్నాడు ఠింఠాకరాళుడు. ఒప్పుకోక ఏం చేస్తాడు?
కళావతి ఇంద్రసభ అంతా తిరుగుతూంటే ఠింఠాకరాళుడు అన్నీ చూసాడు. తర్వాత ప్రత్యేకమైన రంభ నాట్యం ప్రారంభమైంది. అది ఎంతకాలం జరిగిందో కూడా తెలియనట్టూ సమయం గడిచిపోయింది. ఠింఠాకరాళుడికి మనసంతా కృతజ్ఞతతో నిండిపోయింది, కళావతి చేసిన పనికి; తనని స్వర్గానికి తీసుకురావడంలో ఆవిడ తీసుకున్న చొరవకీ, ధైర్యానికీను. కళావతి వెనక్కి వచ్చేస్తున్నప్పుడు ఇంకా స్వర్గంలో విశేషాలు కళ్ళార్పకుండా చూస్తున్న కరాళుడికి నాట్యం చేసే ఓ మేక కనిపించింది. అదిరిపడి మళ్ళీ చూసేసరికి తెల్సిన విషయం, ఆ మేకని తాను చాలాసార్లు ఉజ్జయినిలో వీధుల్లో చూసాడు, అయితే ఆ మేక స్వర్గానికి ఎలా వచ్చింది? తానైతే కళావతితో వచ్చాడు, కానీ వీధుల్లో తిరిగే మేక స్వర్గంలోకా? భూమ్మీదకి వెళ్ళగానే దీని సంగతి తేల్చాలి. ఆ తర్వాత ఏమి జరిగిందో తెలిసేసరికి కరాళుడు ఉజ్జయినిలో తన ఇంట్లో మంచం మీద పడుకుని ఉన్నాడు, కళావతి వెచ్చటి కౌగిట్లో.