మానసిక శక్తి
ఆమధ్య ఒక స్నేహితురాలిని కలిసాను. ఎప్పుడూ వుండేలాగా కాకుండా చాలా నిరుత్సాహంగా కనిపించింది. 'అలా వున్నావేం? ఆరోగ్యం బాగానే వుందా?' అని అడిగాను. 'ఆరోగ్యం బాగానే వుంది. మనసే బాగాలేదు' అంది. ఇంతకీ ఆవిడ మనసు బాగా లేకపోవడానికి కారణం ఏమిటంటే వారి కుటుంబం ముందుగా వేసుకున్న ప్లాను ప్రకారం ఇండియాకి వెళ్ళటం కుదరకపోవడం వలన అదివరకే కొన్న టికెట్లు కాన్సిలు చెయ్యాల్సివచ్చిందిట. ఆ ఆశాభంగానికి ఆమె చాలా బాధపడుతోందిట. నాకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు. ఆశాభంగం, అవును, నేను అర్ధం చేసుకుంటాను. కానీ దానిలో మరీ అంతగా డీలాపడి, జీవితంలో అన్నీ కోల్పోయినంతగా బాధపడాల్సినదేముంది? ఇలా ఎక్కడికన్నా వెళ్ళాలని అన్ని ప్రయత్నాలు చేసుకున్న తర్వాత ఏవో కారణాల వలన ఆ ప్రయత్నాలన్నీ మానుకోవాల్సిరావటం చాలామందికి చాలాసార్లు జరిగే విషయమే! దీనిలో ఆశాభంగం వుంటుంది కానీ అంతగా నిస్పృహ చెందాల్సినదేమీ వుండకూడదు. వీలు చూసుకుని మళ్ళీ వెళతాము కదా! నాకు ఆమెను చూస్తే ఒకరకంగా కొంచెం జాలి కలిగింది. నిజమైన పెద్ద విషమ సమస్యలు తెలియనివారు ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఇలాగే తలకిందులైపోతూ వుంటారు అనిపించింది. అడక్కుండానే, లేక అడిగిన వెంటనే కోరికలు తీరిపోవటం అలవాటయిన తర్వాత ఒక్కసారి చాలా చిన్న కోరిక తీరకపోయినా, లేదా ఏదన్నా అడ్డం వచ్చి కొంచెం ఆలస్యమయినా సరే, ఇలాగే వుంటుంది ఎవరికైనా. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తోందంటే శారీరకంగా ఎలా వున్నా మానసికంగా మాత్రం వారు అంత బలహీనులన్నమాట. చిన్న గాలి వీస్తేనే అల్లల్లాడే పల్చటి ఆకుల్లాంటి వారన్నమాట.
ఎప్పుడూ అనారోగ్యంపాలవకుండా శరీరం దృఢంగా వుంటే మనం వారిని శారీరకంగా శక్తివంతులు అని అంటాము. మరి మానసికంగా శక్తివంతులు అని ఎవరిని అంటాము? అసలు మానసికశక్తి అంటే ఏమిటి? అది ఎలా వుంటుంది? ఎలా వస్తుంది?
మానసికశక్తి అంటే అసలు మానసిక జబ్బులేవి రాకుండా వుండటం కాదు. భావోద్వేగాలను సరిగ్గా నియంత్రణలో పెట్టుకుని, జీవితంలో వచ్చే ఎగుడుదిగుడులను ధైర్యంగా అధిగమించి, ఒకవేళ కింద పడి దెబ్బలు తిన్నా కూడా ఆగిపోకుండా మళ్ళీ పైకి లేచి గమ్యాలను చేరగలగడమే మానసికశక్తి అంటే.
ఆత్మవిశ్వాసం మానసికశక్తికి మొదటి సోపానం. ఎందుకంటే ఆత్మవిశ్వాసంతో మెదడులో సంకల్పమేముంటే శరీరం దాన్నే సాధిస్తాను అంటుంది. అందుకే మీ మెదడులో ఏముంటే మీరు చివరికి అలాగే తయారవుతారు అని మహా యోగి బుద్ధుడు అన్నాడు. మనమీద మనకే నమ్మకం లేకపోతే మన మానసికశక్తి మరి తడబడకుండా ముందుకి అడుగు ఎలా వేస్తుంది అని అనుకోవటంలో తప్పేమీ లేదు సుమా! అందుకే బయట శక్తుల కంటే మన మనసుకే మనమీద ఎక్కువ శక్తి వుంటుందని, అది గ్రహించిననాడే మనం నిజమైన శక్తివంతులమవుతామని Marcus Aurelius అనే ఒక రోమను చక్రవర్తి, తత్వవేత్త అన్నారు.
ఈ మానసికశక్తి చాలా బలం కలది. కష్టాలను తట్టుకుని జీవితంలో ముందుకు సాగిపోయే బలాన్ని ఈ మానసికశక్తే ఇస్తుంది. సుఖదుఃఖాలని సమదృష్టితో చూసే గొప్ప సమవర్తిత్వాన్ని కూడా ఈ మానసికశక్తే ఇస్తుంది. స్థితిస్థాపకత, అంటే resilience కూడా మానసికశక్తికి ఇంకో గొప్ప లక్షణం. ఆశాభంగాలకి నిరాశ చెందకుండా కొత్త ఉత్సాహంతో మన ప్రయత్నాలను మళ్ళీ కొనసాగించగలగటం మానసికశక్తిగాక ఇంకేమిటి? మనం అనుకున్నవన్నీ జరగవు. కానీ ఎందుకు జరగలేదో తెలుసుకుని తమ తప్పులను సవరించుకుని జరగనివాటిని కూడా జరిగేలా చేసుకోవటమే మానసికశక్తి అంటే. అసలు మొదటిసారి కాదు, రెండోసారి కూడా కాదు, మూడోసారి, ఐదోసారి, పదోసారి ఒక మనిషి ఏదన్నా సాధించాలంటే ఎలా ప్రయత్నిస్తాడు అన్నదే వారి మానసికశక్తి ఎంత బలమైనదో ఋజువుచేస్తుంది. వ్యక్తిగతంగా నా సంగతి చెప్పాలంటే నాకు ఎప్పుడూ ఏ పని కూడా మొదటి ప్రయత్నంలో విజయవంతం కానేకాదు. చిన్న, పెద్ద, తేలిక, కఠినం అన్న తేడా లేదు, అన్నీ అంతే! పదేపదే ప్రయత్నం చేసిన తర్వాత కూడా కొన్ని అసలు అవనే అవవు. ఆఖరికి పని వుండి ఎవరికన్నా ఫోను చేస్తే కూడా మొదటి ప్రయత్నంలో వారు ఖచ్చితంగా దొరకరు. ఇదేం జాతకం భగవంతుడా అని నేను కూడా బెంగగా అనుకుంటూనేవుంటాను. కానీ ప్రయత్నాలు మాత్రం ఆపను. ఆపేస్తే అప్పుడింక ఖచ్చితంగా ఆ పని ఎప్పటికీ అవదు కదా!
కొంతమంది స్వీయజాలి, అంటే self-pity తో బాధపడుతూవుంటారు. ఏదన్నా పని సరిగా జరగకపోతే వెయ్యి కారణాలు వెతికి, ఏమిటో, వాళ్ళమీద వాళ్ళే జాలి పడిపోతూవుంటారు. అంటే ఆ పని అవకపోవటానికి ఈ ప్రపంచంలో వున్న ఆటంకాలన్నీ కారణమే! లేకపోతే వారి దురదృష్టం కారణం. అంతేకానీ తాము, తమ అశక్తత, తమ ప్రయత్నాల లోపం మాత్రం కాదు. అదన్నమాట వారి వుద్దేశం. అంతేకాదు, వారి అపజయాలకి ఇతరులు కూడా అయ్యో పాపం అనాలి, వారిమీద జాలి కురిపించాలి. అప్పుడే వారికి మనశ్శాంతి. కానీ ఇలాంటి ఆలోచన చాలా అపాయకరమైనది. ఎందుకంటే ఇది మనిషిని తన తప్పులు సవరించుకుని సరైన మార్గంలో నడవటానికి అడ్డుపడుతుంది. అలా కాకుండా వారే తమ మానసికశక్తిని వాడుకుంటే తమ తప్పులను గుర్తించటం, ధైర్యంగా స్వీకరించటమే కాకుండా వాటిని ఇంక మళ్ళీ చేయకుండా కూడా జాగ్రత్త పడవచ్చు. ఇతరుల దగ్గర నుండి జాలి కాదు, ప్రశంసలను పొందవచ్చు..
కష్టాలని ఎదుర్కొంటున్నపుడు మనం వ్యధ చెందుతాము కానీ అవి మనకు తెలీకుండానే మనకు కొన్ని సహాయాలు చేస్తాయి. నిప్పులో కాలిన బంగారం ఇంకా ఎక్కువగా మెరుస్తుంది అన్నట్లుగా కష్టాల్లో రాటుతేలిన మనుషులు వాళ్ళకు తెలీకుండానే చాలా మానసికశక్తిని సంపాదిస్తారు. అందుకే కష్టాలు దాటుకుని వచ్చినవారిలో వున్న నిదానం, సహనం, పరిపక్వత, ఆలోచనాశక్తి మనం వేరేవారిలో చూడలేము. నేను ముందు చెప్పిన నా స్నేహితురాలు ఈ వేరే కోవలోకి చెందినదే! అసలైన కష్టాలంటే ఏమిటో తెలీక, చిన్నచిన్న ఆశాభంగాలకే తలకిందులైపోయి, ఇంక జీవితంలో ఏదీ మిగలలేదన్నట్లు నిరాశ, నిస్పృహల పాలవడం మరి ఆ లక్షణమే కదా! అందుకే కష్టాలు మనిషికి, మనసుకి పరిపక్వతని, అంటే maturity ని ఇస్తాయి. మానసికశక్తిని పెంచుతాయి. జీవితంలో ఎలాంటి కష్టాలనైనా తట్టుకునే మానసికధారుణ్యాన్ని ఇస్తాయి. అందుకే Michael Jordon అనే ఒక ప్రసిద్ధ అమెరికన్ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు, నిజమైన శక్తి విజయాలలో నుండి కాదు, కష్టాలు, పోరాటల్లోంచి మాత్రమే వస్తుంది అని అన్నారు. Bruce Lee అనే ఒక సాంప్రదాయ జపనీస్/చైనీస్ వారి పోరాట మరియు ఆత్మరక్షణ క్రీడాకారుడు ఇంకో మెట్టు పైకి వెళ్లి ఎప్పుడూ కూడా సరళమైన జీవితం కోసం ప్రార్ధించకండి, కష్టమైన జీవితాన్ని ఎదుర్కొనే శక్తి కొరకు ప్రార్ధించండి అని అన్నారు. ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే కష్టాలు కూడా మనిషిని మానసికంగా బలవంతుడిని చేస్తాయి అని చెప్పడమే నా వుద్దేశం. అందుకే కష్టాలు కలకాలం వుండవు, కానీ కష్టాలను తట్టుకొని రాయిలాగా నిలబడే మనుషులు మాత్రం చిరకాలం వుండిపోతారు అని Robert Schutler అనే Indianapolis లోని ఒక Business Management ప్రొఫెసర్ అన్నారు.
మానవుడు సాంఘిక వ్యక్తి. అంటే నలుగురి మధ్య వుంటూ, నలుగురితో కలిసిమెలిసి వుంటున్నపుడే అతని శక్తి పెరుగుతుంది. పదిమంది నా వెనకాల వున్నారు, అవసరమైతే నాకు తప్పకుండా తోడవుతారు అన్న భావనే అసలు మనిషికి చాలా మానసికశక్తిని ఇస్తుంది. అందుకని అందరితో సంబంధబాంధవ్యాలు ఎప్పుడూ చక్కగా కాపాడుకుంటూవుండాలి. మళ్ళీ దీనికి కూడా మానసికశక్తి కావాలి. ఎందుకంటే, అప్పుడప్పుడు మనకు నచ్చని గుణాలు ఎదుటివారిలో ఉండచ్చు. అలాగే ఎప్పుడైనా మనకి నచ్చని మాటలు వారు అనచ్చు. మరి స్నేహంలో వాటిని తోసిరాజంటూ, మంచిని మాత్రం తీసుకుని, ముందుకి సాగకపోతే ఇంక స్నేహాలు నిలవవు. అవునా? మరి దీనికి కూడా మానసికశక్తి, సహనాలు కావాలి.
సరైన దృక్పధంతో జీవితంలో ముందుకు సాగే మనిషిని వారు గమ్యం చేరుకోకుండా ఎవ్వరూ ఆపలేరు, అలాగే అనుచితమైన దృక్పధంతో పయనించే మనిషిని గమ్యం చేరుకునేలాగా చేయడం కూడా ఎవరి వశంలోనూ వుండదు అని Thomas Jefferson అనే అమెరికా మాజీ అధ్యక్షుడు అన్నారు. ఇలాంటి సరైన ఆలోచనాశక్తిని మానసికశక్తే ఇస్తుంది.
ఏదన్నా మన చేతిలోంచి జారిపోయినపుడు ఆ బాధను దాచుకోవటం లేదా పైకి ఏమి జరగనట్లు నటించటంలో మాత్రమే కాదు, ఆ వ్యతిరేక పరిస్థితులలో ఎలా ఇమిడిపోయి, ఎలా ఏటికి ఎదురీదుతామో, మునుపటికంటే వేయింతలు ఎక్కువ శక్తివంతంగా ఎలా బయటపడతామో అదే మన మానసికశక్తిని నిరూపిస్తుంది.
మానసికశక్తి వున్నవారు ఏవన్నా కష్టాలు వచ్చినపుడు ఏదో ప్రమాదం ముంచుకొచ్చింది అని భయపడరు, అది ఒక సవాలులాగా, ఛాలెంజ్ లాగా తీసుకుంటారు. ప్రత్యక్షంగాకానీ పరోక్షంగాకానీ వచ్చే అనేక ఒత్తిడులను భయబాధలతో కాకుండా నిశ్చల, సంకల్ప, వుత్సాహాలతో ఎదుర్కొంటారు. శారీరకంగా, మానసికంగా ఎప్పటినుండో దానికోసమే సిద్ధమవుతున్నట్లు ధృఢంగా వుంటారు. ఇంకో విషయం. మానసికంగా ధృఢంగా వున్నవారు తాము ఏది చేసినా దానిలో ప్రామాణికత, అంటే authenticity వుండాలని కృషి చేస్తారు కానీ ఇతరుల స్వీకారం, అంటే approval లభించాలని తాపత్రయపడరు. వాళ్ళకి నచ్చాలి, వీళ్ళు ఆమోదముద్ర వేయాలి అని వాళ్ళు కాలాన్ని వ్యర్థం చెయ్యరు. ఎవరికీ భయపడకుండా, దేనికి లొంగకుండా వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేసేస్తారు. అంతే.
మానసికశక్తి వున్నవారు చేసే ఇంకో పని ఏమిటంటే తమని ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోకపోవటం. ఎందుకంటే మానవ స్వభావం ఎలా వుంటుందంటే మనం ఎప్పుడూ మనకి తెలీకుండానే మన బలహీనతల్ని ఎదుటివారి ధృఢత్వాలతో పోల్చుకుని వ్యర్ధంగా ఆత్మన్యూనతని అనుభవిస్తుంటాం. అసలు ఆమాటకొస్తే ఆత్మవిశ్వాసం, మానసిక శక్తి వున్నవారు అసలు ఇతరులతో ఈ పోలికల జోలికే వెళ్ళరు. తమ నిన్నటి రూపాన్ని ఇవాళ్టి రూపంతో పోల్చుకుని తమని తాము ఎలా మెరుగుపరుచుకోవాలి అని మాత్రం ఆలోచిస్తారు. అంతే!
మనందరికీ తెలుసు, మనిషి మంచి, చెడుల మిశ్రమం అని. కానీ మానసికంగా ధృఢంగా వున్నవారు వారిలో ఎప్పుడన్నా ఏమన్నా చెడుభావాలు రేగినా వాటిని ఎప్పటికప్పుడే తమ వాదనతో, విచక్షణతో అణచేస్తారు, అంతేకానీ వాటికీ ఏమాత్రమూ లొంగరు. ఒకవేళ ఎప్పుడన్నా వారివలన ఏదన్నా అనుకోనిది జరిగితే దైర్యంగా దాని పూచీ వహిస్తారు, మంచో, చెడో, దాని పర్యవసానాన్ని ఎదుర్కొంటారు. అంతేకానీ జరిగినదానిలో తమ తప్పేది లేదని, ఇతరులమీద నెపాన్ని తొయ్యరు. అంతేకాదు, తమ తప్పులు సవరిస్తూ ఎవరన్నా ఏదన్నా రెండు మాటలు చెప్తే వారిమీద కోపం, చికాకు తెచ్చుకోకుండా వారి సద్విమర్శనలను గొప్ప మానసికశక్తి తో స్వీకరిస్తారు. వాటిని ఆచరణలో పెట్టి సమగ్రత, అంటే perfection సాధించటానికి ప్రయత్నిస్తారు.
అలాగే ప్రతి మనిషిలోనూ సామర్ధ్యాలతో పాటు బలహీనతలు కూడా వుంటాయి. కానీ మానసికంగా శక్తివంతమైనవారు తమ భయాలు, బలహీనతల మీద పని చేసి వాటిమీద విజయాన్ని సాధించటానికి ప్రయత్నం చేస్తారు. ధైర్యం, సాహసం అంటే భయం లేకపోవటం కాదు, తమకి వున్న భయాన్ని జయించటమే అని Nelson Mandela, South Africa 1st democratic president, అన్నారు. అలాగే తమ సామర్ధ్యాలను ఇంకా ఎక్కువ చేసుకోవటానికి, మెల్లగా తమ బలహీనతల్ని కూడా తమ సామర్ధ్యాలుగా మార్చుకోవటానికి ప్రయత్నిస్తారు. అందుకే మానసికధృఢత్వం విజయానికి చాలా అవసరమైనదని Vince Lombardi అనే ఒక అమెరికను football coach అన్నారు. మనందరం దీనికి అంగీకరిస్తాం కదా!
మానసికశక్తి వున్నవారిలో ఇంకో గొప్ప గుణం వుంటుంది. మనందిరికీ మంధర, కైకేయి కథ గుర్తుంది కదూ! ఎంత మంచివారి మనసునైనా కలుషితం చేయటానికి రెండు విషపు మాటలు చాలు. కానీ మానసికంగా బలమైనవారు చెప్పుడుమాటల ప్రభావం వారిమీద కొంచెమైనా పడనివ్వరు. వారు ఇతరుల ఆలోచనల ప్రకారం కాకుండా తమ సొంతబుద్ధితో అలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కైకేయి కూడా అలా చేసివుంటే అసలు రామాయణం కథ అక్కడితోనే సుఖాంతమయి వుండేది. కానీ రాక్షస సంహారం కోసం అలా జరగలేదు. కానీ మనం మాత్రం ఏ కారణజన్ములమూ కాదు కాబట్టి ఎటువంటి పెడ బోధనలకి లొంగకూడదు. అక్కడే మన మానసికశక్తి మనకు అక్కరకు వస్తుంది.
ఇదంతా చర్చిస్తూంటే నాకు ఏం అనిపిస్తోందంటే మానసికశక్తి ని పొందటానికి, పెంపొందించుకోవటానికి మూడు సూత్రాలను పాటించాలి. ఆలోచన, అనుభూతి, ఆచరణ. అంటే ముందు మన ఆత్మసాక్షితో, విచక్షణతో, నిజాయితీగా, వాస్తవితకు దగ్గరగా మంచిచెడు ఆలోచించడం, మనవైపు నుండి మాత్రమే కాకుండా ఇతరుల దృక్పధం ద్వారా కూడా విషయాలను అర్ధం చేసుకుని, ఆ సమయంలో వారెలాంటి అనుభూతిని పొందుతున్నారు అని ఆకళింపు చేసుకోవటానికి ప్రయత్నం జరపటం, ఆతర్వాత ధర్మమార్గంలో అందరికీ వుపయోగపడే గొప్ప పనులు చేయటానికి ప్రయత్న ప్రయాసాలు చేయటం, ఈ నిబంధనలను పాటిస్తే ఎవరి మానసికశక్తి అయినా సరే, తప్పకుండా పెరుగుతుంది అని నేను గాఢంగా నమ్ముతున్నాను.
సరే, ఇప్పటిదాకా మానసికశక్తి వున్నవాళ్ళు ఏం చేస్తారో మనం చర్చించుకున్నాం. మరి వాళ్ళు ఏం చెయ్యరో కూడా చూద్దాం. మానసికశక్తి వున్నవారు మనం పైన చెప్పుకున్నవాటన్నిటికి వ్యతిరేకంగా చేయకపోవటం అటుంచి ఇంకొన్ని పనులు కూడా చేయరు. ముందుగా అసలు వారు భూతకాలంలో జీవించరు. వర్తమానం గురించి ఆలోచించి, సరైన గట్టి ఆచరణ చూపిస్తేనే భావికాలం ప్రకాశవంతంగా వుంటుందని వారికి బాగా తెలుసు. ఆ ఆచరణకు ఎటువంటి మార్పులను స్వీకరించడానికైనా వారు సందేహించరు. వారు తమ నిర్ణయాల మీద హక్కులను ఇతరులకు వదలరు. తమ జీవితం, తమ సమస్యలు, తమ నిర్ణయాలు, వాటి మీద పూర్తి అధికారం తమదే! తమమీద అధికారాల్ని ఇతరుల చేతికిచ్చి వారికి బానిసలుగా మారరు. అంతేకాదు, వారు అందరినీ సంతోషపెట్టాలని కూడా తాపత్రయపడరు. ఎందుకంటే ఏపని అయినా సరిగ్గా చేయటం ముఖ్యం, అందరినీ సంతృప్తిపరచటం కాదు. అందుకే మానసికంగా బలమైనవారు తమ నిర్ణయాలు సరైనవే అని నమ్మినపుడు వాటివలన కొంతమందికి అసౌకర్యంగా వుంటుందని తెలిసినా వాటిని ఆచరణలో పెట్టడానికి ఏమీ వెనుకంజ వేయరు. మార్పుకు భయపడరు కాబట్టి risk తీసుకోవటానికి కూడా ఏమీ జంకరు. తెలిసో తెలియకో జరిగిపోయిన తప్పులలోంచి పాఠాలు నేర్చుకుంటారే తప్ప, చేసిన తప్పులనే మళ్ళీ మళ్ళీ పునరావృతం చెయ్యరు. వారు అపజయాలకి ఎలాగైతే భయపడి ఆగిపోరో, అలాగే ఇతరుల విజయాలకు కూడా ఈర్ష్య పడి వారి పతనాన్ని కోరుకోరు. ఇంకా ఎక్కువ పరిశ్రమ చేసి, వారిలాగానో లేక వారికంటే ఇంకా ఎక్కువగానో విజయాలు సాధించటానికి కృషి చేస్తారు. ఆ కృషి, కమ్మని ఫలితాలను ఇచ్చేవరకు తమ ప్రయత్నాలను, పరిశ్రమను ఆపకుండానే సహనంతో వేచివుంటారు. ఒకవేళ ఏకారణం చేతనైనా తాము ఆశించిన ఫలితాలు దొరక్కపోతే ఇంక ఈ ప్రపంచాన్నంతటినీ దానికి కారణంగా భావించి అందరిమీద ఏదో కక్ష సాధించాలి అన్నట్లుగా ప్రతీకార వాంఛతో రగిలిపోరు. ప్రశాంతంగా ఆత్మావలోచనం చేసుకుంటారు.
మనం మన మానసికస్థితిని బాగా నిర్వహిస్తే అది మన బాహాట ప్రవర్తనలో కూడా ప్రతిఫలిస్తుంది. అందుకని ముందు మానసికశక్తిని పెంచుకుంటేనే శారీరకశక్తి కూడా వస్తుంది. కానీ శారీరకశక్తి వుండి మానసికశక్తి లేకపోతే మాత్రం మనిషి ఏమీ చెయ్యలేడు. అందుకే శక్తి అన్నది మనిషికి శారీరక బలంలోంచి రాదు, అచంచలమైన ఆత్మబలంతో వస్తుంది అని మహాత్మా గాంధీ అన్నారు. ఆ విషయాన్ని ఆయన ఋజువు చేసి నిరూపించారు కూడా. ఏదో సామాన్యమైన ఖద్దరు ధోతి కట్టుకుని, పైన ఒక చిన్న అంగవస్త్రం మాత్రం వేసుకుని, చేతిలో ఒక చిన్న చేతికర్రను పట్టుకుని, బక్కపలచగా, అతి సామాన్యంగా కనిపించే అయన రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యాన్ని తన మానసికశక్తితో గడగడలాడించారు. అందుకే మనిషికి సంపూర్ణారోగ్యం కోసం శారీరక కండరాలు ఎంత అవసరమో మానసిక కండరాలు కూడా అంతే అవసరం. శారీరక ధృఢత్వం కోసం నిత్యం పరిశ్రమ చేస్తున్నట్లే మానసికధారుణ్యం కోసం నిరంతరం కృషి చేస్తూనేవుండాలి. ఇతరులకు మనమేదో tough అని, అంటే గట్టివారమని చూపించటం కోసం కాదు. మన కోసం, మన మనుగడ కోసం, మన కుటుంబ శ్రేయస్సు కోసం, మన చుట్టూవున్నవారికోసం, వారందరి అభివృద్ధి కోసం కూడా.
అసలు మనలను మనం తక్కువగా అంచనా వేసుకుంటాం కానీ మనం గట్టి నిర్ణయం తీసుకుంటే ఎంత కష్టమైన పనినన్నా చేయగలం. ఇంక ఈ మానసికశక్తిని సంపాదించలేమేమిటి? మీరు నమ్మినదానికంటే ధైర్యవంతులు, కనిపించేదానికంటే బలవంతులు, అనుకుంటున్నదానికంటే తెలివైనవారు, ఈ విషయం ఎప్పుడూ మరువకండి అని Christopher Robin అనే England కి చెందిన ఒక రచయిత అందుకే అన్నారు. కనుక గుర్తు పెట్టుకోండి, శారీరక శక్తి వున్నవారు ఎప్పుడైనా, ఎక్కడైనా ఓడిపోతారేమో, కానీ మానసికశక్తి వున్నవారు మాత్రం ఎప్పుడూ ఎవ్వరి చేతిలోనూ ఓడిపోరు. వారు సర్వకాల, సర్వ పరిస్థితులలోను విజేతలే! దానికి మూలం ముందు మనం మన స్వశక్తిని, మానసికశక్తిని గుర్తించాలి. దాన్ని ఇంకా ఇంకా ఎక్కువ చేసుకోవాలి. శారీరకంగా, మానసికంగా అత్యంత బలవంతులుగా తయారవాలి. బలవంతులైన పౌరులతోనే ఏ దేశమైనా బలమైనదిగా మారుతుంది. అవునా? ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్ అని మన గురజాడవారు అన్నారు కదా!
సరే, మీరు ఈ విషయాలన్నీ ఆలోచిస్తూవుండండి. నేను మాత్రం మరి ఇప్పటికి ఇంతటితో అపి మీ అందరి దగ్గర నుండి సెలవు తీసుకుంటాను. మళ్ళీ వచ్చే నెల ఇంకో మంచి విషయాన్ని వెంటబెట్టుకుని మీ ముందుకు వస్తాను. అంతదాకా సెలవు.