యక్షగానాలు
నూటికి నూరుపాళ్ళు తెలుగుదనం ఉట్టిపడే ప్రక్రియలలో యక్షగానం ప్రసిద్ధమైనది అని ప్రారంభించిన ఆరుద్ర, యక్షగానాలను లెక్కవేస్తే కొన్ని వేలు తేలుతాయి అన్నారు. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ అని ఈ మాటలవల్ల తేలుతున్నది.
యక్షగానానికి ఆ పేరు పెట్టినది మహాకవి శ్రీనాథుడని ఆరుద్ర తెల్పారు. శ్రీనాథుడు భీమఖండం లో దక్షవాటికను వర్ణిస్తూ ''కీర్తింతు రెద్దాని కీర్తి గంధర్వులు గాంధర్వమున యక్షగానసరణి'” (2-65) అన్నాడు. కాబట్టి శ్రీనాథుని జీవితకాలం (క్రీ.శ. 1370-1450) మధ్య యక్షగానాలు ఉంటాయని నికరంగా చెప్పవచ్చు అని అన్నాడు ఆరుద్ర. (స.ఆం.సా. పేజీ 1023). అయితే ఆరుద్ర మరొక విషయం కూడా ప్రస్తావించాడు.
‘పాల్కురికి సోమన కాలంలో అంటే శ్రీనాథుని పుట్టుకకు నూరు సంవత్సరాలకు ముందు పాల్కురికి సోమనాథుడు తన శివరాత్రి మహత్యంలో ఇలా వర్ణించాడు.’ అని ఆరుద్ర సోమన రచన తెల్పాడు.
భారతాధికథలు చీరమరుగుల - నారంగ బొమ్మల నాడించువారు
కడు నద్భుతంబుగా కంభమాత్రంబు - లడరంగ బొమ్మల నాడించువారు
ఆదట గంధర్వ యక్షవిధ్యాధ - రాదులై పాడెడు నాడెడువారు.
(పండితారాధ్య చరిత్ర, పర్గత. పుటలు 435, 436)
ఈ ద్విపదలను బట్టి యక్షపాత్రలు ధరించి ఆ కాలంలో ఆడుతూ పాడుతూ ఉండేవారని తెలుస్తున్నట్లు ఆరుద్ర తెల్పారు.
వేటూరి ప్రభాకర శాస్త్రి మాట ప్రకారం చూస్తె యక్షగానం కూడా బొమ్మలాట లాంటిదే. పాల్కురికి సోమన బసవ పురాణం లో ఉన్న దాని వల్ల దీనికి ‘గొండ్లి’ అనే పేరున్నట్లు తెలుస్తున్నది.
కోలాటమును బాత్ర గొండ్లి పీరణియు
గేళిక జోకయు లీల నటింప (బసవపురాణం-1 పుట 19)
ఈ పాత్ర గొండ్లి అన్నది బొమ్మలాటేనని పిల్లలమఱ్ఱి పినవీరభద్రుని రచనల వల్ల తెలుస్తున్నది. దుష్యంతుని యుద్ధ వర్ణనలో దీని ప్రస్తావన ఉంది.
దుష్యంతుని యుద్ధాన్ని వర్ణిస్తూ ఈ బొమ్మలాట ప్రసక్తి తెచ్చాడు. ఆ పద్యం
క్రవ్యాదుం బరిమార్చి యెంతయును నుగ్రంపశ్యుడై నిల్చి వా
యవ్యాస్త్రం బరివోసి యేయుటయును వాత్యావేగనిస్ఫూర్తినా
ర్తివ్యాహారము లుప్పతిల్లు నుడువీధిం గొండ్లియాడించెదై
త్యవ్యాధుల్ తెరబొమ్మలట్ల నిగుడం దా నాటకాడుంబలెన్. (శకుంతలాపరిణయము, 3-125)
తెరబొమ్మల పాత్రలతో గొండ్లి ఆడించే వారని పిల్లలమర్రి పిన వీరభద్రుని రచన వల్ల తెలుస్తున్నది. ఈ పాత్రల నాడించే వారిని గూర్చి పాల్కురికి సోమనాథుని ద్విపద వల్ల తెలుస్తున్నది. ఆ ఆడించేవారు గాంధర్వ, యక్ష, విద్యాధరులు. ఈ గాంధర్వులు గాంధర్వాన కీర్తించేది యక్షగానమే నని శ్రీనాథుని మాటల వలన తెలుస్తున్నది. అలాగే గొండ్లి తెరనాటకమని నాచనసోముని హరివంశం లో కూడా ఉన్నాడని ఆరుద్ర తెల్పారు. (ఉ.హరి.4-216).
“తెరలెత్తి సప్తసాగరములు పొరలంగ వరుణుండు గొండలి పరిఢవింప” (ఉత్తరహరివంశం, 4-216) అంటూ సోమన తెరల సంగతి తెల్పాడు అని ఆరుద్ర వ్రాశారు.
అలాగే బమ్మెర పోతన కూడా తెరమరుగున నాట్యాలు చేస్తారని కుంతీస్తవంలో ‘జవనిక మరువున నాట్యంబు సలుపు నటుని చందంబున’ అని ఉపమించాడు అని ఆరుద్ర తెల్పారు.
శ్రీనాథుడు నాలుగుసార్లు గొండ్లిని గూర్చి చెప్పాడని ఒకచోట బాగా వివరించాడని ఆరుద్ర తెల్పారు. గొండ్లిలో ఏమేమి ఉండాలో శ్రీనాథుడు తెల్పాడు.
తెరలు, పుష్పాంజలి, మద్దెల చప్పుళ్ళు, రంగస్థలం, నాట్యకత్తె ఉండాలని చెప్పాడు శ్రీనాథుడు తన కాశీఖండంలో అని దానిని గూర్చి తెల్పారు.
కొదమ మొగుళ్ళు దెరలును దడంబడబడు పలుదవడగండ్లు పుష్పాంజలులును నురుము చప్పుళ్ళు మర్దళధ్వనులుగా గగనరంగస్టలంబున గ్రొమ్మెరుంగు మెరుంగుబోడి గొండ్లి పరిఢవించె. (కాశీఖండం, 3-23)
శ్రీనాథుడు తన కాలంలో ఉన్న వృత్త బేధాలు కూడా గ్రంథస్థం చేశాడు. భీమఖండం లో కొన్ని విషయాలు చర్చించాడు. కుండలీ నృత్యాన్ని గొండ్లి అని పిలుస్తారని తెల్పాడు.
కాశీనగరంలో కర్పూరతిలక అనే వేశ్య రత్నలింగేశుని ఆస్థానంలో వివిధ మత భేదాలతో దేశీ మార్గ పద్దతులతో ఈ కుండలీ నృత్యాన్ని ఆడిందని శ్రీనాథుడు తెల్పాడు.
తన కాలంలో ఉండే నృత్య భేదాలను తెలుపుతూ భీమఖండంలో దాక్షారామ భీమేశ్వరుడు ముంగలి వాకిట నిండు పేరోలగం ఉండి ఆ వూరి సాని కూతురు ఆడే ‘కుండలి’ దండలానక, ప్రేరణీ, ప్రేంకణ, సింధుకంచుక, ధమాళీ, బేల, మత్తల్లీ, హల్గీనకాది నృత్యంబులు’ అవలోకిస్తాడట (భీమఖండం 2-108). ఈ కుండలినీ నృత్యాన్నే గోండ్లి అని దేశ్యంలో పులుస్తారు అని ఆరుద్ర తెల్పారు. ఈ విషయాన్ని మరింత విపులంగా వివరిస్తూ ఆరుద్ర ఇలా చెప్పారు.
“వృత్తభేదాన్ని గొండ్లి అని పిలుస్తూ కొన్నాళ్ళకు ఆ మాటను నాట్యుకత్తెకే పర్యాయపదంగా చేశారు. దేశిపద్ధతిలో ఈ నాట్యాన్ని పూర్వం జక్కులవారు చేసేవారు కాబోలు. ఆంధ్రదేశంలో అత్యంత ప్రాచీన కాలంలో నాగులు, యక్షులు ఉండేవారు. వీరిలో యక్షులే జక్కులవారు అయ్యారు. వాళ్ళ దేశి సంప్రదాయమే యక్షగానం కావచ్చు. క్రీశ. 1330లో ప్రాచీన చిత్రకవి పెద్దన తన లక్షణాన్ని సంగ్రహంలో యక్షగానాలలో ఉండే రగడభిదాలకు ఇలాగ తొలిసారి లక్షణం చెప్పాడు.
వృషభగతి త్రిపుడరేకం ఘ్రియుగమగు దుద నేడు లఘువులు తొలగజేయ
జంపె రేకునకు లక్షణము ద్విరదగతి యగుగొన నొక లఘు వశిందు మాన
రచ్చరే కగును దురగవల్గనముగతి మణి యేక తాలియౌ మధురగతిని
ఆటతాళమునమాత్ర అంఘి కిర్వదినాల్లు నాల్లిట విరతి పధ్నాలుగింట
నిలుచు నర్ధంబు నర్ధచండ్రికలు దీన
యక్షగానాదికృతులలో నార్యులిడిన
రగడ భేదంబు లివి యౌను రమ్యచర్య
యవిత నిజదాస సముదాయ యాంజనేయ (లక్షణసార సంగ్రహం, 2-141)
చిత్రకవి పెద్దన చెప్పిన ఈ లక్షణాన్నే కొద్ది మార్పులతో క్రీ.శ. 1656లో ఉన్న అప్పకవి కూడా చెప్పాడు (4-304). యక్షగానంలో యేయే రకాల పదాలు ఉంటాయో క్రీ.శ. 1600 ప్రాంతాల ఉండిన వార్ణకవి రాఘవయ్య తన లక్షణదీపికలో చెప్పాడు. క్రీ.శ. 1450కి ముందున్న కవులు యక్షగానపు అస్తిత్వాన్ని చెప్పారు. తరువాత వంద సంవత్సరాలకు క్రీ.శ. 1550లో ఉండిన లక్షణకర్ణలు యక్షగానాల లక్షణాన్ని చెప్పారు. ఈ మధ్యకాలంలో అంటే క్రీ.శ. 1485 నుంచి 1512 దాకా పాలించిన సాళువ నరసింహరాయల కాలంలో “నిశ్చయంగా ఇతడు యక్షగానం వ్రాశాడని' చెప్పుకోదగ్గ రచయిత కనబడుతున్నాడు. అతడే ప్రోలుగంటి చెన్నయమంత్రి.”
ప్రోలుగంటి చెన్నయ మంత్రి
తుంగభద్ర నదీతీరాన ప్రోలుగంటి పురం ఉందని అక్కడ చెన్నకేశవస్వామి దైవమని చెప్పి ఆరుద్ర, అది ఒక చిన్న సైజు రాజధాని అని దానిని విజయనగర సామ్రాజ్యాధిపతులు పాలిస్తుండేవారు అని చెప్పారు.
క్రీ.శ. 1422 నుంచి 1447 దాకా విజయనగరాన్ని పాలించిన ప్రాఢదేవరాయలు వద్ద ప్రోలుగంటి తిప్పయ దండనాథుడుగా ఉండేవాడు. ఇతడు పంపావిరూపాక్షునికి గోపురం, విర్ణలనాథునికి భోగమంటపం, మాల్యావంతంలోని రామచంద్రునికి ఘనకిరీటం, మతంగి వీరన్నకు కట్టాణి ముత్యాల కంఠమాల మొదలైన దానాలు చేసి వినుతి కెక్కారు.
తిప్పయ్య కు కొండయ్య, నాగన్న అని ఇద్దరు కుమారులు. ఈ ఇద్దరు విజయనగరం కొలువులో మంత్రులే. ఇందులో నాగన్నమంత్రికి ఒక కొడుకు పుట్టాడు. ఆ బిడ్డకు ప్రోలుగంటిపురంలోని ఆరాధ్యదైవం చెన్నకేశవస్వామి పేరు పెట్టారు. అతనిని చెన్న శౌరి, చెన్నయ మంత్రి అని పిలిచేవారు.