వీక్షణం-101 వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా, అత్యంత ఆసక్తిదాయకంగా జనవరి 10, 2021 న జరిగింది. ఈ సమావేశంలో శ్రీ మధు ప్రఖ్యా గారు "కర్ణాటక సంగీతంలో తెలుగు ఔన్నత్యం" అనే అంశం మీద ప్రధాన ప్రసంగం చేశారు.
మధుబాబు ప్రఖ్యా గారు, ప్రముఖ కవి, జ్యోతిశ్శాస్త్ర పండితులు, విఙ్ఞానవేత్త. మంత్రశక్తి అనే పుస్తకం రచించారు. టోరీ రేడియోలో 'సాధన' అనే కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మికతనూ, విఙ్ఞానాన్నీ శ్రోతలతో పంచుకుంటూ ఉంటారు.
మధు గారు ముందుగా కర్ణాటక సంగీతంలో మాండలిన్ వాయిద్యంలో తనకున్న ప్రవేశాన్ని వివరిస్తూ ఇటీవల వారు చేసిన హీలింగ్ మాండొలిన్ అనే కార్యక్రమాన్ని, ప్రముఖ మాండొలిన్ వాయిద్య కోవిదులైన మాండొలిన్ రాజేష్ గారితో కలిసి యూట్యూబ్ మాధ్యమంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల్ని తెలియపరిచారు.
తరువాత కర్ణాటక సంగీతంలో ప్రఖ్యాతి గాంచిన అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, పురందరదాసు మొ.న వాగేయకారుల్ని పరిచయం చేస్తూ ఇప్పటి కవుల్ని వాగ్గేయకారులు కమ్మని పిలుపునిచ్చారు. కవితాపటిమతో బాటూ ఏ కాస్త సంగీత జ్ఞానం కలిగి ఉన్నా పాటలు, గేయాలు రచించడం కష్టమైన పని కాదని వివరించారు. కర్ణాటక సంగీతంలో తెలుగు ఔన్నత్యాన్ని వివరిస్తూ త్యాగరాజు తెలుగులో రాయడం వెనుక ఉన్న భాషాభిమానాన్ని తెలియజేస్తూ "గిరిరాజ సుతా తనయ" అంటూ ఆయన వారి పితామహుల్ని తల్చుకోవడం వెనక కథని వివరించారు. ముత్తుస్వామి దీక్షితార్ భైరవుడు, కాంతిమతి వంటి దైవాలను స్తుతిస్తూ రాసిన గీతాలను, శ్యామశాస్త్రి, స్వాతి తిరునాళ్ గీతాల్ని ప్రస్తుతించేరు.
హిందుస్తానీ రాగాల్ని కూడా ప్రస్తుతిస్తూ తాన్ సేన్, హరిప్రసాద్ చౌరాసియా, అన్నపూర్ణాదేవి మొ.న గొప్ప సంగీతకారుల్ని పరిచయం చేసేరు. చక్రవాక రాగంలో పరిశోధనాత్మక ప్రెజెంటేషన్ ఇస్తూ, తోయవేగవాహిని అని ముత్తుస్వామి దీక్షితార్ ఈ రాగాన్ని పేర్కొనడం వెనుక విశేషాల్ని ఆసక్తిదాయకంగా వివరించారు. చివరగా రాగాలకు, జ్యోతిశాస్త్రానికి మధ్య సంబంధాన్ని సభకు పరిచయం చేస్తూ ముగించారు.
ఈ సందర్భంగా తరువాత జరిగిన చర్చలో శ్రీ సుభాష్ పెద్దు, శ్రీ కిరణ్ ప్రభ, శ్రీమతి అపర్ణ గునుపూడి, శ్రీమతి ఉదయలక్ష్మి , శ్రీఇక్బాల్, శ్రీ ప్రసాదరావు గోగినేని, శ్రీధర్ రెడ్డి మొ.న వారు పాల్గొనగా డా. కె.గీత ఈ రాగంలోని "రాధకు నీవేర ప్రాణం" గీతాన్ని ఆలపించారు.
ఆ తర్వాత జరిగిన కవి సమ్మేళనంలో శ్రీధర్ రెడ్డి గారు "ట్రంపు" అనే కవితను, దాలిరాజుగారు "నిరాశ్రయుల వేదన" కవితని, డా. కె.గీత "ఆకరిమాట "కవితను, బాలకృష్ణారెడ్డి గారు "అక్కడా-ఇక్కడా" కవితల్ని చదివి వినిపించారు. అపర్ణగారు అమ్మదొంగా అనే పాట ప్రేరణతో అదే స్వరాలతో రచించిన స్వీయగీతాన్ని ఆలపించారు.
తరువాత కిరణ్ ప్రభ గారి ఆధ్వర్యంలో జరిగిన సాహితీ క్విజ్ అందరినీ అమితంగా అలరించింది.
ఆద్యంతం ఎంతో ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సభలో స్థానిక ప్రముఖులు విశేషంగా పాల్గొని సభను జయప్రదం చేశారు.
వీక్షణం-101 వ సమావేశాన్ని "వీక్షణం" యూట్యూబు ఛానలులో ఇక్కడ చూడవచ్చు. https://youtu.be/F81f15bE5kk