Menu Close
ఆశా నిశాంతంలో...
-- సత్యం మందపాటి --

రాత్రి పడుకున్నాడే కానీ మధుకి నిద్ర పట్టలేదు. మంచం పక్కనే బల్ల మీద గడియారం చీకట్లో కూడా మెరుస్తున్న ఆకుపచ్చటి అక్షరాలతో, అర్ధరాత్రయింది.. ఒంటి గంటయింది.. రెండు గంటలయింది అని చూపిస్తూనే వుంది.

అతనికెప్పుడూ పదిన్నరకి పడుకోగానే, రెండు మూడు నిమిషాల్లో గాఢనిద్ర వచ్చేస్తుంది.

రోజూ వనజ అంటుంటుంది, ‘నువ్వెప్పుడూ పడుకున్న మరుక్షణం నిద్రపోతావు. నాకు అంత తొందరగా నిద్ర పట్టదు’ అని.

కానీ ఇవాళ అలా జరగటం లేదు. బహుశా కొన్ని రోజులుగా వార్తల్లో చూస్తున్న విషయాలు మరి కలత పెడుతున్నాయో, భయపెడుతున్నాయో! అతని ముఫై ఐదేళ్ళ జీవితంలో ఎన్నడూ కనీవినని వార్తలవి!

ఎక్కడో చైనాలో ఎవరో ఏదో తింటే, ఇన్ని వేల మైళ్ళ దూరంలో అమెరికాలో వున్న వాళ్ళకి కరోనా వైరస్ రావటమేమిటి? ఇలాటి ఎన్నో వైరసులు ఎన్నో దేశాలనించీ ఎప్పుడూ వస్తూనే వుంటాయి. అవి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటాయి. దానికెందుకింత రాధ్ధాంతం అనుకున్నాడు మధు కూడా చాలమందిలాగానే. కానీ తర్వాత దాదాపు అన్ని దేశాల్లోనూ, ఎన్నో లక్షల్లో ప్రజలకి ఈ కరోనా సోకటం, కొన్ని లక్షలమందికి ప్రాణాలు పోవటం చూశాక, ఈ కరోనా ఎంత పెద్ద మహమ్మారో అర్ధమయింది. అమెరికా దేశాధ్యక్షుడు ఇదేదో రాజకీయ నాయకులు చేస్తున్న కుట్ర అని కొట్టిపారేసి, అవసరమైన రక్షణలు ఏవీ అములుపరచకుండా మూర్ఘంగా, వేలల్లో చనిపోతున్న జనాభాని లక్షల్లోకి తీసుకువెళ్ళాడు. పది పదకొండు నెలలయేసరికీ, అమెరికా ఈ వైరస్ సోకినవారితోనూ, అది ఎక్కువై చనిపోయినవారితోనూ ప్రపంచంలోనే అగ్ర స్థానానికి వెళ్ళింది.

మధు వుండే ఆ వూళ్ళోనూ ఎంతోమందికి వచ్చింది. కాకపోతే డాక్టర్లని, శాస్త్రవేత్తలని నమ్మేవాళ్ళు, ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు వుంటున్నందువల్ల చాలవరకూ బాగానేవుంది. నోటికీ ముక్కుకీ మాస్కులు కట్టుకోవటం, నిత్యావసరాలు మాత్రమే షాపు నించీ ఇంటికి ఆర్డర్ చేయటం, ఎవరైనా ఎదురు పడితే, తప్పు చేసిన వాళ్ళలా కనీసం ఆరడుగుల దూరానికి తప్పించుకు పోవటం… ఇలాటివి ఎన్నో చేస్తున్నారు. మిత్రులతోనూ, ఇరుగూపొరుగూతోనూ కలివిడిగా వుండేవాళ్లు, ఈ కొవిడ్ ధర్మమా అని విడివిడిగా వుంటున్నారు.

వనజ మాత్రం మధుతో అంటుండేది, “నీకు చాదస్తం ఎక్కువయిపోయింది. ఇవన్నీ చేయాలా?” అని.

మొదట్లో అవేమీ పెద్ద ఇబ్బంది పెట్టలేదు కానీ, అప్పటికి పదకొండు నెలలయినా ఈ వైరస్ తగ్గుతున్న సూచనలెక్కడా కనపడకపోగా, రోజురోజుకీ విపరీతంగా పెరిగిపోతున్నది. బిజినెస్సులు మూతపడుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వాలు షాపులూ, హోటళ్లూ, స్కూళ్ళూ, పార్కులూ, బీచిలూ తెరవటంతో.. కనీవినీ ఎరుగనంతగా కరోనా విజృంభించింది. అది చూసి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఇంకా ఎక్కువ చేసుకున్నారు కూడాను.

మధు పనిచేసేది ఒక మాన్యుఫాక్ట్చ్యరింగ్ కంపెనీలో కనుక, రోజూ ఆఫీసుకి వెళ్ళక తప్పదు. అక్కడా అందరూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూనే వున్నారు. అయినా ఎవరి భయం వారిది.

౦                 ౦                 ౦

మధుకి ఆరోజు ప్రొద్దుటినించీ తుమ్ములు, ముక్కు దురదపెట్టటం మొదలుపెట్టాయి. ఎన్నడూ రాని తలనొప్పి విపరీతంగా వచ్చింది. గంట గంటకీ ఎక్కువవుతున్నదే కానీ తగ్గటం లేదు.

“నాకు ఈ కరోనా రాలేదు కదా” వనజతో అన్నాడు మధు భయం భయంగా.

“నీకు అన్నీ అనుమానాలే. అనుమానం పెనుభూతం అన్నారు. జలుబూ, తలనొప్పీ, దగ్గూ వస్తే అది కరోనా ఎలా అవుతుంది? అవి అందరికీ వచ్చేవే! ఇదిగో ఈ మాత్రలు వేసుకో. అదే తగ్గిపోతుంది” అంది రెండు మాత్రలు అతని చేతిలో పెడుతూ. అవే ఆలోచనలతో అతనికి నిద్ర పట్టటం లేదు. ఇటూ అటూ దొర్లుతున్నాడు.

“ఏం? నిద్రపట్టటం లేదా?” అంటూ వనజ అతని భుజం మీద చేయి వేసింది.

“ఏమిటి ఒళ్ళు కాలిపోతున్నది” అంటూ లేచి లైట్ వేసింది. టెంపరేచర్ చూసింది. నూట రెండు వుంది.

“ఎమర్జెన్సీని పిలు. ఎందుకైనా మంచిది” అన్నాడు మధు ఒళ్ళంతా చెమటలు పడుతుంటే. కొంచెం ఆయాసంగా కూడా వుంది. భారంగా వూపిరి పీలుస్తున్నాడు.

వనజకి గాబరా వేసి, వెంటనే ఎమర్జెన్సీకి ఫోన్ చేసింది. సరిగ్గా ఎనిమిది నిమిషాల్లో ఆంబులెన్స్ వచ్చింది. అక్కడే వాళ్ళ పరీక్షలు వాళ్ళు చేసి, అప్పటికప్పుడు హాస్పిటలుకి తీసుకువెళ్ళారు మధుని.

“నేనూ వెనుక కారులో రానా!” అడిగింది వనజ.

“వద్దు మేడమ్. అక్కడికెవరినీ రానివ్వటం లేదు. మీకే హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేస్తారు. ఒకవేళ ఆయనకి కరోనా పాజిటివ్ అయితే, మీ ఇంట్లో అందరూ పరీక్ష చేయించుకోవటం అవసరం. ఈ క్షణంనించే మీకు మీరే క్వారంటీన్ చేసుకోవటం మంచిది. కరోనా వచ్చిందని కాదు, ముందు జాగ్రత్త అవసరం కదూ!” అన్నాడు పారామెడిక్.

వనజకి కొద్దిగా భయం వేసింది కానీ, మధుకి కరోనా ఎలా వస్తుంది? అందరికన్నా కూడా ఎక్కువ జాగ్రత్త తీసుకుంటున్న మనిషి. రేపు ప్రొద్దుటికల్లా ఇంటికి వచ్చేస్తాడు అని ఒకటికి పదిసార్లు అనుకుంది.

ఆంబులెన్స్ వెళ్ళిపోయాక ఇంట్లోకి వస్తుంటే, ఆరేళ్ళ కొడుకూ, మూడేళ్ల కూతురూ భయం భయంగా అక్కడే నుంచుని చూస్తున్నారు. వాళ్ళని దగ్గరకు తీసుకుని, “నాన్న అన్ని పరీక్షలూ చేయించుకుని రేప్పొద్దున్నే ఇంటికి వచ్చేస్తారు. ఏమీ భయం లేదు” అన్నది వనజ, పిల్లల భుజాల మీద చేతులు వేసి లోపలికి తీసుకువెడుతూ.

౦                 ౦                 ౦

మామూలుగా కోవిడ్ పరీక్ష సంపూర్ణ ఫలితాలు రావటానికి కొంత సమయం పడుతుంది. కానీ ముందుగా చేసే కొన్ని రాపిడ్ పరీక్షల్లో మధుకి కోవిడ్ పాజిటివ్ అని అనిపించగానే, ఆ రాత్రికి రాత్రే అతన్ని ఒక గదికి తీసుకువెళ్ళారు. అక్కడ ఎక్కువగా కోవిడ్ సోకిన వారికే గదులు ఇవ్వటం వల్ల, డాక్టర్లూ, నర్సులూ అందరూ పూర్తిగా తలకీ చేతులకీ కావలసిన ముసుగులూ, తొడుగులూ వేసుకుని అంతరిక్షానికి వెడుతున్న వారిలా వున్నారు. గదిలో మధుని పడుకోబెట్టాక, అతనికి ఒక్క మాస్క్ మాత్రం వుంచి, ‘గదిలో ఎవరూ లేనప్పుడు ఇది తీసివేయచ్చు గానీ, మేమెవరమన్నా వచ్చినప్పుడు మాత్రం మాస్క్ పెట్టుకోవాలి” అని చెప్పింది నర్సు.

“నన్ను హాస్పిటల్లో ఎన్నాళ్ళు వుంచుతారు? మా ఇంటికి ఫోన్ చేసి చెప్పారా?” నర్సుని అడిగాడు మధు.

“ఇప్పుడే చెప్పారు. మీ ఇంట్లో వున్న వాళ్ళందరినీ ఇక్కడే హాస్పిటల్లో రేపు ప్రొద్దున్నే వచ్చి పరీక్ష చేయించుకోమని చెప్పాం” అని అతనికి బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ తక్కువగా వుందని, ముక్కుకీ ఆక్సిజన్ తగిలించి వెళ్ళిపోయింది నర్స్.

మధు మనసు మనసులో లేదు. ఇద్దరు పిల్లలూ, వనజా ఎంత భయపడుతున్నారో! వాళ్ళకి కరోనా సోకకుండా వుంటే బాగుంటుంది. తనకి తగ్గగానే ఇంటికి వెళ్ళి, వాళ్ళని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ తను చనిపోతే? వనజ చదువుకుని ఉద్యోగం చేస్తున్న మనిషే అయినా, తమ బాంక్ వ్యవహారాలూ, స్టాకులూ, డిపాజిట్లూ, కనీసం నెలవారీ బిల్లులు కట్టటంలాటివేవీ తెలుసుకోలేదు. తను ఎన్నిసార్లు  చెప్పబోయినా ఆవిడ ఉత్సాహం చూపించలేదు. పిల్లలు ఇంకా చిన్న పిల్లలు. వాళ్ళని పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యత ఒక్కత్తే ఎలా చేయగలదో.. అవన్నీ ఆలోచిస్తుంటే, ఆ గదిలో ఎంతో చలిగా వున్నా మధుకి ఒళ్ళంతా చెమటలు పట్టేసింది.

౦                 ౦                 ౦

శారీరకంగానూ, మానసికంగానూ అలసిపోయి వున్నాడేమో, మధు నిద్ర లేచేసరికీ ప్రొద్దున్న సమయం తొమ్మిదిన్నర గంటలు దాటింది. రాత్రి నర్సు ఎన్నోసార్లు అక్కడికి వచ్చినా అతనికి తెలియలేదు. ఎదురుగా గోడ మీద వున్న చిన్న బోర్డు మీద, తన పేరు, రూం నెంబర్, దాని క్రింద డాక్టర్ ఆర్నాల్డ్, నర్శ్ ఆశ అని వుంది.

ఈలోగా ‘గుడ్ మార్నింగ్’ అంటూ ఆ గదిలోకి వచ్చింది నర్స్. ఆమె చేతిలో ఒక షోల్డర్ బాగ్ వుంది. “నా పేరు ఆశ. మీ నర్సుని. ఇప్పుడే మీ ఆవిడా, పిల్లలు వచ్చి క్రింద లాబ్లో కరోనా టెస్ట్ చేయించుకుంటున్నారు. ఆవిడనే మీకు కావలసిన బట్టలూ, సెల్ ఫోనూ, పుస్తకాలూ తెమ్మని చెప్పాం. అదే ఈ సంచీ” అని ఒక పక్కగా పెట్టింది.

“వాళ్ళెలా వున్నారు? పరీక్ష అయిందా?” అడిగాడు మధు.

“లేదు. ఇంకా లాబ్ లోనే వున్నారు. పరీక్షా వివరాలు రావటానికి కొంచెం సమయం పడుతుంది. ఒక గంట ఆగి మీరే ఫోన్లో మీ భార్యని పిలవండి” అని, అతని వైటల్స్ తీసుకోవటం మొదలు పెట్టింది.

ఆమె ముఖానికి మాస్కుతో పాటు, ఫేస్ షీల్డ్, చేతులకి గ్లవ్స్ పెట్టుకుని వుంది. ఆమె పేరు చూసి అనుకున్నట్టుగా ఆమె భారతీయ సంతతి కాదు. నల్లమ్మాయి. తన ఆఫీసులో కూడా ఒక నల్లమ్మాయి పేరు అనిట, ఇంకో అమ్మాయి పేరు అశాంతి. అలాగే షకీర. మాయ. వనీటా. ఆఫ్రికన్ అమెరికన్ ఆడవారి పేర్లు కొన్ని అలాగే మన పేర్లకి దగ్గరగా వుంటాయి.

“పది దాటాక డాక్టర్ ఆర్నాల్డ్ వస్తారు. ఆయన వివరంగా మీతో మాట్లాడతారు. ఈలోగా మీరు బాత్రూముకి వెళ్ళాలంటే సహాయం చేస్తాను” అంది.

“లేదు. నేను వెళ్ళగలను” అన్నాడు మధు.

“మీరు బాత్రూముకి వెళ్ళేటప్పుడు ఈ స్టాండుని లాగుతూ తీసుకువెడితే, దీనికి పెట్టిన ఆక్సిజన్ సిలెండర్ మీతోనే వస్తుంది. అవసరమైతే పిలవండి” అని చెప్పి వెళ్ళిపోయింది ఆశ.

మధు బాత్రూములోనించీ వచ్చేసరికీ అక్కడ బ్రెక్ఫాస్ట్ సిధ్ధంగావుంది. తింటూనే వనజని సెల్ఫోన్లో పిలిచాడు. వెంటనే ఫోన్ అందుకుంది “మేము ముగ్గురం ఇప్పుడే కోవిడ్ టెస్ట్ చేయించుకుని కారులో ఇంటికి వెడుతున్నాం. రిజల్ట్ రెడీ అవగానే చెబుతారుట. ఇంతకీ నువ్వెలా వున్నావ్? డాక్టర్ ఏమన్నాడు? రాత్రి నిద్ర పట్టిందా?” ప్రశ్నల వర్షం కురిపించింది వనజ.

తను బాగానే వున్నాననీ, డాక్టర్ చూసి వెళ్ళాక ఇంకా వివరాలు చెబుతాననీ, జాగ్రత్తగా వుండమనీ చెబుతుంటే కారులో స్పీకర్ ఫోన్లో పిల్లలు కూడా మాట్లాడారు.

డాక్టర్ రావటం చూసి, “డాక్టర్ గారు వచ్చారు. మళ్ళీ మాట్లాడదాం. జాగ్రత్త” అని ఫోన్ పెట్టేశాడు మధు.

డాక్టర్ ఆర్నాల్డ్ అన్నాడు, “మీ టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. మీరు కరోనా పాజిటివ్ అని నిర్ధారణగా వచ్చింది. ఈ గదిలో మీరు పూర్తి ఐసొలేషన్లో వుంటారు. కరోనాకి మందూ, వాక్సీన్ అంటూ ఏమీలేవు ఇప్పుడు. కాకపోతే మీకు వున్న వేరు వేరు లక్షణాలను తగ్గించటానికి మాత్రమే మందులు ఇస్తాము. రెండు మూడు రోజులు చూసి, అప్పుడు నిర్ణయిద్దాం, ఇంకా ఏం చేయాలో, ఇంటికి వెళ్ళవచ్చో లేదో.. సరేనా?” అన్నాడు.

మధు కూడా కరోనా గురించి అంతకుముందే క్షుణ్ణంగా చాల చదివాడు.  అది ఎలా ఎక్కడ మొదలయిందో సరిగ్గా తెలియక పోయినా, ఎలా వ్యాపిస్తుందో, ఇంకా వాక్సిన్లూ, మందులూ లేకపోవటంతో ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని వివరంగా చదివాడు కనుక ఎక్కువ ప్రశ్నలు అడగలేదు.

డాక్టర్ వెళ్ళిపోయాక ఆలోచనలో పడ్డాడు. అసలు ఇది ఎంతో జాగ్రత్తగా వుంటున్న తనకెందుకు వచ్చింది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. తన ఎంతగానో ప్రేమించే వనజ పిల్లలూ, తను వెళ్ళిపోతే ఏమయిపోతారు? అదొక్కటే అతని మనసులో వున్న ఆలోచన.

ఆశ వచ్చింది, “ఎలా వున్నారు?” అంటూ. ఏవో మాత్రలు ఇచ్చింది.

“మీ పేరు ఆశ కదా. ఆశ అంటే మా భాషలో హోప్” అన్నాడు మధు.

ఆమె నవ్వింది. “ఈ కరోనా రోజుల్లో మనకి కావలసింది అదే.. హోప్” అన్నది.

“ఆశే కదా మనుష్యుల్ని నడిపించేది. ఆ ఆశని మాలో నిలబెడుతున్నది మీలాటి నర్సులూ, డాక్టర్లూ. మీ అందరికీ పాదాభివందనం చేయాలి” అన్నాడు మధు.

“అది మా వృత్తి ధర్మం కదూ! మేం చేయాల్సిన పని మేం చేస్తున్నాం” అంది ఆశ గలగలా నవ్వి.

“అయితేనేం? మీ ప్రాణాలకు తెగించి ఇక్కడ మీరు మానవ ధర్మంతో నిస్వార్ధంగా పని చేస్తున్నారు కదా”

“ప్రవహించే నది ఆ నీళ్ళను తను త్రాగకుండా అందరికీ పంచుతుంది. ఒక చెట్టు తన ఫలాలను తను తినకుండా అందరికీ పంచుతుంది. సూర్యుడు తన వెలుగుని తనే దాచుకోకుండా లోకాన్నంతటినీ దేదీప్యమానం చేస్తాడు. అది ప్రకృతి ధర్మం. మరి మనం కూడా ఆ ప్రకృతిలో భాగమే కదా! మనం కూడా మనకి తెలిసిన విద్యనీ, మనం అనుభవించే ఆ ప్రేమనీ ఇతరులతో పంచుకోవద్దూ!” అన్నది ఆశ.

అలా అంటున్నప్పుడు ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. మాస్క్, ఫేస్ షీల్డ్ పెట్టుకోవటం వల్ల ఆమె ముఖ కవళికలు మాత్రం తెలియటంలేదు. కానీ ఆమె బాగా చదువూ, సంస్కారమున్న వ్యక్తి అని తెలుస్తూనే వుంది. ఆమెని చూస్తుంటే ఎంతో గౌరవ భావం కలుగుతున్నది మధుకి.

“మీరు రోజూ ఇక్కడ మాలాటి వారి మధ్య ఎన్ని గంటలు వుంటారు?” అడిగాడు మధు.

“మామూలు రోజుల్లో అయితే రోజుకి ఎనిమిది గంటలు. ఈ కరోనా రోజుల్లో అలా చేయలేం. నేను మా ఇంటికి వెళ్ళి దాదాపు పది రోజులు అయింది. నేను ఇంటికి వెడితే అక్కడ మళ్ళీ క్వారంటీన్లో వుండాలి. మా ఆయనా, ఐదేళ్ళ కూతురూ, మా అత్తగారూ కూడా వున్నారు మా ఇంట్లో. వాళ్ళ క్షేమం కోసం ఇక్కడే వుంటున్నాను. కాకపోతే పన్నెండు గంటలు వరుసగా పనిచేసి, ఇంకో పన్నెండు గంటలు ఇక్కడే వెయిటింగ్ రూములో విశ్రాంతి. విశ్రాంతి అని పేరేగానీ, అవసరమయితే మధ్యలో పిలుస్తూనే వుంటారు, వెడుతూనే వుంటాను. త్వరలో ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు ఆగి మళ్ళీ వద్దామనుకుంటున్నాను. కానీ రోజూ ఇక్కడికి వచ్చే ఎంతోమంది రోగులని చూస్తుంటే, ఆరోజు అంత త్వరగా వచ్చేలా అనిపించటం లేదు” అంటూ మళ్ళీ నవ్వింది ఆశ.

ఆమె అలా నవ్వుతుంటే మధు మనసుకింత బాధలోనూ ఎంతో ఆహ్లాదంగా వుంటుంది.

౦                 ౦                 ౦

ఆరోజు మధ్యాహ్నానికి మధు పరిస్థితి విషమమయింది. ఉబ్బసంలా వచ్చి ఊపిరాడలేదు. జ్వరం కూడా నూట నాలుగు దాటింది. ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పీ ఎక్కువయాయి. కడుపులో కూడా ఏదోలా వుంది. లేస్తే కళ్ళు తిరుగుతున్నాయి. ఆశ డాక్టరుని పిలిచింది. ఆయన వచ్చి ఊపిరి అందటానికి నెబ్యులైజర్ కూడా పెట్టి, ఒక ఇంజక్షన్ ఇచ్చాడు.

మధు కళ్ళు మూసుకుని పడుకున్నాడు. అతని చేతులకి ఇంట్రావీనస్ ట్యూబులూ, ముఖం మీద ఆక్సిజన్ ట్యూబు, రెస్పిరేటర్, నెబ్యులైజర్ కనెక్షన్లూ.. అతని ముఖమే కనపడటం లేదు.

ఆరోజు సాయంత్రం వనజ ఫోన్ చేసింది. అక్కడే వున్న ఆశ ఫోన్ ఆన్ చేసి అతనికి దగ్గరగా పట్టుకున్నది. “నేనూ వనజని. మా అందరికీ కరోనా నెగటివ్ వచ్చింది. మాగురించి భయపడకు. నువ్వు బాగున్నావా?’ అని అడిగింది.

“బాగానే వున్నాను. ఇంకా మూడు నాలుగు రోజులు వుంచుతారేమో” అన్నాడు మధు.

“విడియో కాల్ చేయనా? పిల్లలు చూస్తామంటున్నారు”

“వద్దులే. ఒంటి నిండా ట్యూబులతో నన్ను చూస్తే భయపడతారు. కనెక్షన్ సరిగ్గా లేదని చెప్పు. వాళ్ళంటే నాకు ఎంతో ప్రేమ అని కూడా పిల్లలకు చెప్పు. ఐ లవ్ యూ టూ.. సో మచ్!” అన్నాడు మధు. అతనలా అంటున్నప్పుడు అతని మనసులోని బాధ గొంతులో తెలుస్తున్నది.

అతను కాసేపు మాట్లాడి బై చెప్పాక, ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెట్టి అన్నది ఆశ. “మనం ఎవరినైనా ప్రేమిస్తే, అలా ప్రేమిస్తున్నట్టు ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు చెప్పటం చాల అవసరం అని చదివాను ఎక్కడో. ప్రేమ కన్నా శక్తివంతమైనది ఈ ప్రపంచంలో ఏదీ లేదు అన్నాడు ఒక రచయిత”

ఆమెకి అన్ని ముసుగుల మధ్యా కనపడిందో లేదోగానీ, మధు చిన్నగా మందహాసం చేశాడు. ఆశ అలా వెళ్ళగానే, మధుకి కళ్ళు నెమ్మదిగా మూతలు పడ్డాయి.

౦                 ౦                 ౦

రెండు మూడు రోజులు గడిచాయి. మధు అలా మంచం మీద నీరసంగా పడుకునే వున్నాడు. అవసరానికి ఎవరో వచ్చి సహాయం చేస్తున్నారు, అతనితో మాట్లాడుతున్నారు కానీ, అతను అన్నీ నిద్రలో చేస్తున్నట్టు యాంత్రికంగా చేస్తున్నాడు. రోజూ హాస్పిటల్ నించీ నర్సింగ్ స్టేషన్ వారు అతని పరిస్థితి ఫోన్ చేసి వనజకు చెబుతూనే వున్నారు.

తర్వాత రోజు అతనికి కాస్త ఒళ్ళు తెలిసింది. అప్పుడే తెలతెల్లవారుతున్నది. అక్కడే వున్న ఆరెంజ్ జ్యూస్ త్రాగాడు. మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు.

నర్స్ వచ్చి ఐవీ మారుస్తుంటే మెళుకువ వచ్చింది. “గుడ్ మార్నింగ్” అంది నర్స్.

ఆమె ఆశ కాదు. ఇంకొక నర్సు. “నా పేరు కాథీ. బాగున్నారా?” అని అడిగింది.

బాగానే వున్నానని తల వూపాడు. “నర్స్ ఆశ ఇంటికి వెళ్ళిందా? పాపం. ఆమె రెండు వారాలనించీ ఇంట్లో అందర్నీ వదిలేసి ఇక్కడే వుంది” అన్నాడు నెమ్మదిగా.

ఆమె అంది. “లేదు. ఆశ చాల మంచి మనిషి. కరోనా ఆమెని కూడా విడిచి పెట్టలేదు. నిన్ననే తెలిసింది ఆమెకీ వచ్చిందని. ఇక్కడే నాలుగు గదుల తర్వాత గదిలో వుంది. ఆమె పరిస్థితి అంత బాగాలేదు”

“అయ్యో..” అన్నాడు మధు ఏమిటి ఇలా జరిగింది అని మనసులోనే బాధపడుతూ.

అతని ఆలోచనలన్నీ ఆశ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇదే హాస్పిటల్లో ఒక డాక్టర్, ఇద్దరు నర్సులూ ఈ కోవిడ్ వచ్చిన వారితో పని చేస్తూ చనిపోయారని టీవీలోనూ, పేపర్లలోనూ కూడా చూశాడు. ఆసుపత్రిల్లో పని చేశేవారు కానీ, ఆంబులెన్స్ ఉద్యోగులు కానీ, అగ్నిమాపక దళం వారు కానీ, దేశం తరఫున పోరాడే మిలటరీ వారు కానీ, ఇలాటి ఎన్నో ఇతర ఉద్యోగాల్లో వున్నవారు కానీ, తమ ప్రాణాలను కూడా లెఖ్క చేయకుండా, నిస్వార్ధంగా పని చేయటం చూస్తే హృదయం ఉప్పొంగి పోతుంది. వారి మానవత్వపు విలువలకీ, ఫలితం ఆశించని వారి సేవలకీ వారిని గౌరవంతో చూడటం, ధన్యవాదాలు చెప్పటం తప్ప, ఇంకేం చేయగలం అనుకున్నాడు మధు.

డాక్టర్ వచ్చి ఛూశాడు. “మీరు బాగా కోలుకుంటున్నారు. అన్ని వైటల్సూ బాగున్నాయి. ఇలాగే మీ ఆరోగ్యం రోజురోజుకీ మెరుగు పడుతుంటే, త్వరగా ఇంటికి పంపిస్తాం” అన్నాడు.

కాథీ తడిపిన తువ్వాలుతో అతని శరీరాన్ని శుభ్రపరిచింది. బ్రేక్ఫాస్ట్, కాఫీ ఇచ్చింది. అతను వనజతో మాట్లాడతానంటే ఫోన్ చేసి, అతనికి ఇచ్చింది. మధు వనజతోనూ, పిల్లలతోనూ చాలసేపు మాట్లాడాడు. త్వరలో ఇంటికి వస్తున్నానని సంతోషంగా చెప్పాడు.

ఆశ ఆరోగ్యం గురించి డాక్టరుతో సహా, తన గదికి వచ్చిన వారినందరినీ రోజూ అడుగుతూనే వున్నాడు మధు. అతనికి భోజనం తెచ్చి అక్కడ పెడుతున్న ఒకతన్ని అడిగినప్పుడు, అతను అడిగాడు “మీకు ఆశ ఎలా తెలుసు, స్నేహితులారా” అని.

అవును ఆశ తనకి ఏమవుతుంది? ఇక్కడ ఆవిడ ఉద్యోగం ఆవిడ చేస్తున్నది. మరి?

అదేనేమో మనిషికీ మనిషికీ మధ్య వున్న అనుబంధం. ఈ అనుబంధానికి ఎక్కడా అడ్డుగా దేశం, రంగు, కులం, మతం అనే అర్ధంపర్ధం లేని గీతలు వుండవు. అవి మనిషి తన స్వార్ధం కోసం గీసుకున్న గీతలు!

మధుకి పూర్తిగా తగ్గిపోయిందనీ, ఇక ఆరోజు సాయంత్రమే ఇంటికి పంపిస్తారనీ చెప్పారు.

“ఆశ తన ప్రాణానికి తెగించి నా ప్రాణాన్ని నిలబెట్టింది. ఇప్పుడు ఆమె ప్రాణం గాలిలో పెట్టిన దీపంలా అయింది. ఆమె తప్పక కోలుకుంటుంది.. కోలుకుంటుంది” అని ఒకసారి కాదు, ఎన్నోసార్లు అనుకున్నాడు మధు.

కాథీ వచ్చినప్పుడు ఆమెకి తను వ్రాసిన ఒక చిన్న కాగితం ఇచ్చి, ఆశకి ఇవ్వమన్నాడు.

దానిలో నాలుగే చిన్న చిన్న వాక్యాలు వ్రాశాడు.

“ఆశ మానవజీవితానికి శ్వాస. మానవాళికి శ్వాస ఆడాలంటే ఆశ చాల అవసరం. వెళ్ళవద్దు. త్వరగా కోలుకో” అని.

అతన్ని డిస్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తున్నప్పుడు, కాథీ అతనితో నెమ్మదిగా చెప్పింది.

“ఆశ మీతో చెప్పమంది. తన పిల్లల, భర్త కోసం మాత్రమే తను ఆరోగ్యంగా తిరిగిరావాలి అని కోరుకోవటం లేదు. మళ్లీ వచ్చి తన మానవ ధర్మాన్ని కొనసాగించాలని నా ఆశ!” అని.

**** సమాప్తం ****

Posted in February 2021, కథలు

14 Comments

  1. వేణు దశిగి

    కొరోనా సందర్భంలో మానవాళి “ఆశ గురించి సత్యం చెప్పారు!”

    • Satya Mandapati

      ధన్యవాదాలు వేణుగారు. మీ అభిప్రాయాలు నాకెంతో విలువైనవి.

  2. నరేంద్ర బాబు సింగూరు

    మనిషి ని నడిపించేది ఆశ. సమకాలీన కధ ను.. అద్భుతంగా చెప్పారు. .

    • Satya Mandapati

      ధన్యవాదాలు నరేంద్రబాబు గారు. అవును. ఆశ మనల్ని నడిపిస్తుంది. అంతేకాదు మనిషిగా పుట్టినందుకు, మనిషిగా బ్రతకటం కూడా అవసరం కదూ!

  3. Srini Prabhala

    చాలా బాగా రాసారు.. ప్రస్తుత పరిస్తుతులను అద్దం పట్టే కథ.👏👏. డాక్టర్లూ, నర్సులూ చేస్తున్న సేవ అమోఘం 🙏🙏

    • Satyam Mandapati

      ధన్యవాదాలు శ్రీనివాస్. ఇది నా హృదయంలోనించీ వచ్చిన కథ.

  4. Satyavani

    బావుందండీ. ఆశా గారి సేవా సంకల్ప బలం కొలుకునేలా చేస్తుందని నా ఆశ.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!