Menu Close
manusmrithi page title
రెండవ అధ్యాయము (ఒ)

విప్రుడు ఎలా ఆదర్శప్రాయునిగా ఉండాలి ?

కొయ్యతో తయారుచేసిన ఒక ఏనుగు, లేక చర్మంతో తయారుచేసిన ఒక జింక - అధ్యయనము చేయని ఒక విప్రుడు - ఈ మూడింటి మధ్య ఒక్క పేరులో తప్ప ఎలాంటి భేదమూ లేదు. స్త్రీల విషయంలో షంఢుడు (నపుంసకుడు) ఎలాగైతే వ్యర్థుడో  - అలాగే గౌర్గవి (గోవుకి గోవు) కూడా ఎలాంటి ఫలాన్ని(సంతానాన్ని) కలిగించలేదు. అయోగ్యుడికి చేసిన దానం ఎలాగైతే నిష్ఫలమో, అలాగే అనృచుడైన (అంటే వేదములను అధ్యయనం చేయని) విప్రుడు కూడా అఫలుడు (వ్యర్థుడు).

పద్ధతి తెలిసిన ఆచార్యుడు తన శిష్యులను హింసించి బాధపెట్టకుండా వారికి శ్రేయోమార్గాన్ని బోధించాలి. ధర్మశాస్త్రబద్ధుడైన గురువు ఎప్పుడూ శ్లక్ష్ణమైన (ఇంపైన తియ్యటి) మాటలనే ప్రయోగించాలి తప్ప పరుషంగా మాట్లాడకూడదు. ఎవని వాక్కు, మనస్సు పరిశుద్ధంగా ఉంటాయో, మరియు ఎవడు తన పరిశుద్ధతను నిరంతరం కాపాడుకుంటూ ఉంటాడో, ఆ విప్రుడు వేదాంతోపగతములైన (వేదాంతములో చెప్పబడిన) సర్వజ్ఞత్వము మొదలైన ఫలములన్నీ పొందుతాడు.

బాహ్య, అంతరంగ శౌచములను పాటిస్తూ, ఎవరైతే మనోవాక్కాయకర్మలలో పరిశుద్ధులై ఉంటారో, వారు సర్వజ్ఞత్వము, సర్వవ్యాప్తి పొంది, సర్వశక్తి సమన్వితులుగా వెలుగొందుతారనే విశ్వాసం సమాజంలో ఉత్తమ విలువలను పెంపొందించే ఉద్దేశంతో పాదుకొల్పబడినదే గానీ, ఆ విశ్వాసానికి ఎలాంటి శాస్త్రీయత లేదు.

తాను నొచ్చుకున్న సందర్భంలో కూడా ఇతరులు నొచ్చుకునే విధంగా అతడు మాట్లాడకూడదు. ఆలోచనలో కానీ, ఆచరణలో కానీ ఇతరులకు హానిని తలపెట్టరాదు. ఇతరులు భయపడే విధంగా వారితో కఠినంగా మాట్లాడరాదు. ఈ తరహా చర్యలన్నీ ఆ విప్రుడు స్వర్గం చేరడాన్ని ఆటంకపరచేవే కనుక ఇతరుల పట్ల అతడి ప్రవర్తన ఎప్పుడూ సంస్కారవంతంగానే ఉండాలి.

సమ్మానాద్బ్రాహ్మణో నిత్యముద్విజేత విషాదివ |
అమృతస్యేవ చాకాంక్షేదవమానస్య సర్వదా   || ( 2- 162)

ఒక విప్రుడు ఇతరులు చేసే సమ్మానమును  ఎప్పుడూ విషంలా భావించి, దానిని స్వీకరించడం పట్ల భయవిహ్వలునిగా ఉండాలి. ఇతరులు తనకు చేసే అవమానాలను మాత్రం ఎల్లప్పుడూ అమృతంలా భావించి, వాటిని ఓర్పుతో సహించాలి.

ఇతరులచేత అవమానం పొంది కూడా వారిపై పగబూనకుండా ఓర్పుతో ఉన్న విప్రుడు సుఖంగా నిద్రిస్తాడు. సుఖంగా లేస్తాడు. ఈ లోకంలో సుఖంగా తిరుగాడుతాడు. అతడిని అవమానపరచినవాడు మాత్రం ఆ పాపంతోనే నశిస్తాడు. తనను అవమానించిన వ్యక్తిని కూడా దయతో క్షమించి వదిలేయడం అలా క్షమించిన వ్యక్తికి మనశ్శాంతి నిస్తుందనేది నిజం. అయితే అలా ఒకసారి క్షమించబడిన వ్యక్తి పశ్చాత్తాపం చెంది తిరిగి ఆ తప్పు చేయకుండా ఉంటే పరవాలేదు. కానీ అతడు మళ్ళీ మళ్ళీ అలాంటి తప్పులే చేస్తూపోతే? అలాంటి సందర్భాలలో ఈ విధంగా పాపము చేసినవాడు తాను చేసిన పాపానికి తగిన ప్రతిఫలం అనుభవించి తీరతాడు; వాడికి ఏ శిక్ష వేయాలో కర్మఫలదాత అయినట్టి భగవంతుడు నిర్ణయిస్తాడు - వంటి విశ్వాసాలు ఒక రకంగా సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు, అక్రమాలకూ వ్యతిరేకంగా ప్రజలు కనీసం స్పందించకుండా, వాటికి పరిష్కారమార్గాల గురించి కూడా వారు ఆలోచించకుండా క్రమంగా వారు సామాజికార్థిక విషయాలలో నిష్క్రియాపరులుగా మారడానికి దారితీసింది. ఈ సమాజాన్ని నిర్మించడంలో, నియంత్రించడంలో తమకూ ఒక పాత్ర ఉన్నదనే విషయాన్ని వారు మరచిన కారణంగా ‘చిన్నవాడిని పెద్దవాడు కొడితే, పెద్దవాడిని పెరుమాళ్ళు కొడతాడు’ అనే తరహా నమ్మకాలతో మొత్తం కర్తృత్వ బాధ్యతనంతా కర్మఫలదాతకు అప్పగించేసే ‘కర్మ సిద్ధాంతం’ బలపడడానికి దారితీసింది.

ఇలా తన మనస్సును మెల్లమెల్లగా సంస్కరించుకుంటూ ద్విజుడు తన గురువు ఇంట్లో నియమబద్ధంగా జీవిస్తూ, వేదాధ్యయనం చేయాలి. వేదాధ్యయనమే విప్రుడు చేయదగిన గొప్ప తపస్సు. వేదములను అధ్యయనం చేయకుండా ఏ ద్విజుడు ఇతర శాస్త్రములలో పరిశ్రమిస్తాడో అతడు శూద్రత్వాన్ని పొందుతాడు.

మన ప్రాచీనులలో ‘అన్నీ వేదాలలోనే ఉన్నాయిష’ అనే భావం ఒకప్పుడు ప్రబలంగా ఉండేది. వేదాలకు వెలుపల సత్యమేమీ లేదనే భావన, జిజ్ఞాసాపూర్వకంగా కాక అంటే అర్థ విచారణతో నిమిత్తం లేకుండా వేద మంత్రాలను భట్టీయం (Learning by rote) వేయడానికి దారితీసింది. ఆ దశలో వేదపఠనం సహజంగానే జిజ్ఞాసువులను కాక వేదజడులను (Scholastics) సృష్టించింది. ఈ ప్రక్రియ కేవలం ఒక్క భారతీయ వేద సాహిత్యానికి మాత్రమే పరిమితమైనట్టిది కాదు. క్రీ.శ. 10 - 15 శతాబ్దుల నడుమ యూరప్ అంతటా ఇదే తరహా సాంప్రదాయికత విజృంభించింది. క్రైస్తవులు తమ పవిత్ర మత గ్రంథం  బైబిల్ ను తెరచిపెట్టి, దానినుంచి కొన్ని భాగాలను చదివి వినిపిస్తే రోగులకు వారి రుగ్మతలు నయమౌతాయని నమ్మేవారు. అలాగే ఈ పద్ధతిలోనే భవిష్యవాణిని కూడా కొందరు మతాధికారులు వినిపించేవారు. దీనిని బిబ్లియోమాన్సీ (Bibliomancy) అనేవారు.

ప్రాచీన భారతీయులు ప్రార్థనా గీతాలతో పాటు వందల ఏళ్ల తమ అనుభవసారాన్ని కూడా వేదాలలో నిక్షిప్తం చేసుకున్నారు. అయితే అనంతరకాలంలో వేద మంత్రాలకు పవిత్రత ఆపాదించబడిన కారణంగా వాటికి ఒక్క ముక్క కలపడం గానీ, తీసివేయడం కానీ నేరంగా భావించబడింది. మానవజాతి యొక్క వందల ఏళ్ల అనుభవసారంగా పోగుబడిన వేదాలు ఆ కారణంగా ఇక ఆ తరువాత ఎలాంటి ఎదుగుదలకూ నోచుకోలేదు. అందుకే అనంతరకాలంలో బయటి శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా వేదాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. తొలి దశలో ప్రాచీన మానవుల ప్రాయికమైన శాస్త్ర విజ్ఞానాని (Rudimentary Science ) కి  భాండాగారాలుగా పేరొందిన వేదాలు ఈ జడత్వం కారణంగానే క్రమంగా  తమ పూర్వ ప్రాభవం కోల్పోసాగాయి. అందుకే ‘పాండురంగ మాహాత్మ్యము’ కావ్యంలో (1-115) తెనాలి రామకృష్ణకవి వేదాలను నవ్యరీతుల నడకలు తెలియని ప్రాత పంచారపు గుర్రాలతో పోల్చాడు. ఆ మీదట వేదాల స్థానంలో వేదేతర విజ్ఞాన శాస్త్రాలు క్రమంగా అభివృద్ధిచెంద సాగాయి. వేదాధ్యయనానికి అర్హతలేని శూద్ర వర్ణంలోని పలువురు తాత్త్వికులు వేదేతర సాహిత్యాన్ని అభివృద్ధి చేశారు. చార్వాక, జైన, బౌద్ధ తత్త్వాలు మొత్తంగా వేద ప్రామాణ్యాన్ని నిరసిస్తూ తలెత్తిన వేదబాహ్యమైన సిద్ధాంతాలే. వేద సాహిత్యానికి ప్రత్యామ్నాయంగా పలువురు తాత్త్వికులు భౌతిక, రసాయనిక శాస్త్రాల వంటివి కూడా అభివృద్ధిచేశారు. ఒకరకంగా వేదవిద్యలను పై మూడు వర్ణాలవారికే పరిమితం చేసిన కారణంగా నాల్గవ వర్ణంలోనూ, వైదికేతర మతాల అనుయాయులలోనూ అప్పట్లో ఈ కృషి గణనీయంగా సాగింది.

ద్విజుడు తల్లి గర్భమున మొదటి జన్మను, మౌంజీ బంధనము కారణంగా అంటే ఉపనయనము కారణంగా రెండవ జన్మను, శ్రౌత యజ్ఞ నిర్వహణ వలన మూడవ జన్మను పొందుతాడు. మౌంజీ బంధనముతోనే వేద విహితమైన శ్రౌత, స్మార్త కర్మలకు ద్విజునికి అధికారం ఏర్పడుతుంది. అతడికి సావిత్రి (గాయత్రి) యే తల్లి, ఆచార్యుడే తండ్రి. ఉపనయనం అయ్యేవరకు బ్రాహ్మణుడు శూద్రునితో సమానుడే. శ్రాద్ధ కాలంలో చెప్పే మంత్రాలు తప్ప ఇక ఎలాంటి మంత్రాలూ అతడు ఉపనయనం అయ్యేవరకు చెప్పరాదు. ఉపనయనము తరువాతనే వ్రతములు చేయడం, నియమాలు పాటిస్తూ వేదాధ్యయనం చేయడం విద్యార్థి నేర్చుకుంటాడు. బ్రహ్మచారికి ఉపనయన కాలమున అతడి వర్ణాన్ని బట్టి ఏ చర్మపు యజ్ఞోపవీతము, ఏ మొలత్రాడు, ఏ దండము, ఏ వస్త్రము ధరించవలెనని నిర్ణయించబడిందో, గోదానము మొదలైన వ్రతాలు చేసేటప్పుడు అతడు వాటినే కొత్తవి ధరించాలి.

విద్యార్థి పాటించవలసిన నియమాలు

గురుకులంలో ఉంటూ, ఇంద్రియ నిగ్రహం పాటిస్తూ, విద్యార్జన చేసేటప్పుడు బ్రహ్మచారి ఈ కింది నియమాలను పాటించాలి.

ప్రతిరోజూ స్నానం చేసి, పరిశుద్ధుడై, దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణలు విడిచి, దేవతా ప్రతిమలను అర్చించి, సమిధాధానము (సమిధ + ఆధానము = సమిధలను అంటే చిదుగులను అగ్నికి సమర్పించడం) చేయాలి.

వర్జయేన్మధుమాంసం చ గంధం మాల్యం రసాన్ స్త్రియ : |
శుక్తాని యాని సర్వాణి ప్రాణినాం చైవ హింసనమ్   || ( 2 -177)

బ్రహ్మచారి తేనెను, మాంసాన్ని తినకూడదు. కర్పూరము, చందనము, కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాలను ఒంటికి రాసుకొనకూడదు. పూమాలలను ధరించరాదు. ఆహారాలకు రుచిని పెంపొందించే రసపదార్థాలను దూరం పెట్టాలి. స్త్రీలకు దూరంగా ఉండాలి. పులిసిన గంజి, ద్రాక్షరసం వంటి శుక్త (పులిసిన) పదార్థాలు (అవి మత్తును కలిగిస్తాయి కనుక) వర్జించాలి. ప్రాణిహింస చేయరాదు.

తలకు నూనె అంటుకుని చేసే అభ్యంగ స్నానం చేయరాదు. కళ్ళకు అంజనం అంటే కాటుక పెట్టుకొనరాదు. పాదాలకు చెప్పులు ధరించరాదు. ఆచ్చాదనకోసం గొడుగు ధరించరాదు. కామ సంబంధమైన కోరికలకు దూరంగా ఉండాలి. క్రోధము, లోభము వంటి వాటిని వర్జించాలి. నాట్యం చేయడం, పాట పాడడం, వాద్యం వాయించడం వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి.

ద్యూతము (జూదము) ఆడరాదు. ఇతరులతో వ్యర్థ సంభాషణలు చేయడం కారణంగా వచ్చే జనవాదములకు (పేచీలకు) దూరంగా ఉండాలి. ఇతరులను వారి పరోక్షంలో నిందించడం (పరివాదం) మానుకోవాలి. అనృతం (అబద్ధం) చెప్పరాదు. స్త్రీలను సంభోగించాలనే కోరికతోనూ, ప్రేమతోనూ చూడరాదు. వారిని కౌగిలించుకొనరాదు. ఎట్టి పరిస్థితులలో ఇతరులకు అపకారం చేయరాదు.

బ్రహ్మచారి ఎప్పుడూ ఒంటరిగానే పడుకోవాలి. అతడు ఎప్పుడూ తన రేతస్సును (ఇంద్రియాన్ని) కోరికతో స్ఖలనం చేసుకోరాదు. కామంతో రేతస్సును స్ఖలనం చేసిన వ్యక్తి బ్రహ్మచర్య వ్రతాన్ని కోల్పోతాడు. అలా కోల్పోయినవాడు తిరిగి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలంటే ప్రాయశ్చిత్తం చేసుకోవలసి ఉంటుంది.

అకామతః (తనకు తెలియకుండానే, తనకు ఎటువంటి చెడ్డ తలంపు లేకుండానే) నిద్రలో రేతస్సును స్ఖలనం చేసుకున్న బ్రహ్మచారి, ఉదయాన్నే స్నానం చేసి, సూర్యోపాసన చేసి, ఋగ్వేదంలోని ఈ మంత్రాన్ని మూడుసార్లు జపించాలి.

‘పునర్మా మైత్వింద్రియం’ ( నేను కోల్పోయిన నా ఇంద్రియము తిరిగి నన్ను చేరునుగాక).

ఉదకుంభం సుమనసో గోశకృన్మృత్తికా కుశాన్ |
ఆహారేద్యావదార్థాని భైక్షం చాహరహశ్చరేత్ ||   ( 2-182)

ప్రతిరోజూ గురువు అవసరాలకు సరిపడా కుండతో నీటిని(ఉదకుంభము), పూలనూ (సుమనః), ఆవు పేడను (గో శకృత్), అలుకుట మొదలైన వాటికి సరిపడా మట్టిని(మృత్తికా), దర్భలను (కుశా) బ్రహ్మచారి తీసుకురావాలి. ప్రతి దినము భిక్షాటనము చేసి ఆహారం తీసుకురావాలి.

బ్రహ్మచారి పరిశుద్ధుడై, నిత్యం వేదాధ్యయనం చేస్తూ, యజ్ఞాలు నిర్వహిస్తూ, స్వకర్మలయందు నేర్పరులైనట్టి గృహస్థుల ఇండ్ల నుండి మాత్రమే భిక్ష స్వీకరించాలి. బ్రహ్మచారి గురుకులం నుంచి కానీ గురువు బంధువుల ఇండ్ల నుంచి కానీ, తన తండ్రి లేక తల్లి వైపు బంధువుల ఇండ్లనుంచి కానీ భిక్షాటనము చేయరాదు. భిక్షకు ఇతరుల ఇళ్లేవీ దొరకనప్పుడు ముందుగా తన బంధువుల ఇండ్లు, అవి దొరకనప్పుడు గురువు బంధువుల ఇండ్లు, అవీ దొరకనప్పుడు గురుకులంలో భిక్ష కోసం ప్రయత్నించాలి.

నిత్య వేదాధ్యయనపరులు, సదాచార సంపన్నులు గ్రామంలో లభించనప్పుడు బ్రహ్మచారి పరిశుద్ధుడై, మౌనంగా ఆ గ్రామంలోని విప్రుల ఇళ్ళన్నిటిలో భిక్షాటన చేయాలి. అయితే అభిశస్తుల (పంచమహా పాతకములు చుట్టుకున్నవారి) ఇండ్లలో మాత్రం ఎట్టి పరిస్థితులలో భిక్ష స్వీకరించరాదు.

ఇక్కడ పంచ మహాపాతకములు అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. ఇదే గ్రంథంలోని 11 వ అధ్యాయంలోని 54 వ శ్లోకంలో మనువు పంచ మహాపాతకములు (అత్యంత ఘోరమైన నేరములు) అంటే ఏమిటో వివరించాడు. బ్రహ్మ హత్య (బ్రాహ్మణుడిని చంపడం), సురాపానం (నిషేధించబడిన సుర అనే మత్తు పానీయాన్ని తాగటం), స్తేయము (దొంగతనము - ముఖ్యంగా బ్రాహ్మణుడి బంగారాన్ని దొంగతనము చేయడం), గురువు భార్యతో అక్రమ సంబంధం కలిగి ఉండడం, పై నాలుగు నేరాలు చేసినవారితో సంబంధ బాందవ్యాలు కలిగి ఉండడం అనే  ఐదింటీనీ ‘పంచమహా పాతకములు’ అంటారు. ఇలా పంచ మహాపాతకములు చుట్టుకున్నవారిని ‘అభిశస్తులు’ అంటారు.

***సశేషం***

Posted in February 2021, సాహిత్యం

1 Comment

  1. నరేంద్ర బాబు సింగూరు

    మనుస్మృతి… బాగా విపులంగా వివరించారు. వాడుక లో ఉన్న ఆసు పదాలకు మూలం… ఎన్నో సమాజ నియమాలకు మూలం ఇదే అని అనిపిస్తుంది. చదువుతున్న కొద్దీ నాలో ఒక సందేహం కలుగుతోంది. మనిషిని సన్మార్గములో నడిపే ప్రక్రియలో… మనువు యొక్క అంతర్లీన స్వాభిమానం… స్వార్ధం.. ఉందేమో అని అనిపిస్తుంది. వర్గ విభజన ..విద్యార్థి నియమాలు….మరీ అవసరం అయితే.. వెసులుబాటు (గురువు కోసం)…ఇలా… చాలా ఆ నా ఆలోచనకి బలాన్ని చేకూరుస్తున్నాయి. నా సందేహ నివృత్తిని చేయగలిగితే చాలా సంతోషిస్తాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *