Menu Close
దక్షిణభారత సంస్కృతి తీర్థయాత్ర
పిల్లలమఱ్ఱి కృష్ణ కుమారు

తిరుమేయాచూర్

ఇక్కడి స్థలవిశేషాలు ఇంకా ఉన్నాయి. ముందు దర్శనం చేసుకుని, మళ్ళీ స్థలపురాణానికొద్దాం.

గుడి 4.30 కి తెరిచారు. ద్వారంలోపలికి అడుగుపెట్టగానే ధ్వజ స్థంభం కుడిచేతివైపు అమ్మవారి సన్నిధి, ఎదురుగా ధ్వజ స్థంభం వెనకాల ఈశ్వరుడి గుడి, ఎడమచేతివైపు ఒక ఖాళీ ఆవరణ, ఆ ఆవరణ చివర్లో ఆలయం గోడలనానుకుని ఒక స్థంబాల కట్టడం, దానిలో చాలా శివలింగాలు ప్రతిష్టించి కనబడతాయి. మామూలుగా అయ్యవారి దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకోవడం పరిపాటి. కానీ మేము లలితాంబని చూడాలన్న ఆత్రుతతో ముందర అమ్మవారి సన్నిధి ముందు దీపారాధన చేసుకుని, వెళ్లి దర్శనం చేసుకున్నాము. ఇంతకుముందు రాసినట్లు, నిలువెత్తు విగ్రహం. ఆ చిరునవ్వుతో ఉన్న మోము చూస్తే ఎంత హాయిగా, అమ్మ మనల్ని తప్పక అనుగ్రహిస్తుందన్న ధైర్యం వచ్చేస్తుంది. అసలు పట్టుమని పదిమంది లేరు గుళ్లో. అందువల్ల చాలా తీరుబడిగా చూడగలిగిన అదృష్టం కలిగింది. అమ్మవారి గర్భగుడి తలుపులు బంగారు తాపడం చేసి ఉన్నాయి. గర్భగుడి లోపల పెద్దదిగా ఉన్నదన్న విషయం అర్థమవుతుంది. అమ్మవారు పీఠం మీద కూర్చుని ఉన్న విధానం - కుడికాలు మడిచి పద్మపాదంగా, ఎడమ పాదం కింద పెట్టి పంచాశన పీఠం మీద కూర్చుని ఉన్నారు. నాలుగు చేతులు. కుడి పై చేతిలో చెఱకు విల్లు, పాశం ఎడమ పై చేతిలో, కింద చేతుల్లో అభయ ముద్ర, పుష్ప బాణం ధరించి ఉన్నారు. (ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటే కష్టంగా ఉన్నది! ఆ ముఖం తప్ప ఏమీ గుర్తుకు రావడంలేదు!  దీపాల వెలుగులో అమ్మ తేజస్సు తెలుస్తున్నది.

ఈ మనోన్మనీ రూపం ఎలా వచ్చిందనే కథ 'శివ రహస్యం' అనే గ్రంథంలో ఉన్నది. గుడిలో అర్చకులు చెప్పకపోయినా, పాఠకులకి అర్థం అవుతుందనే భావంతో క్లుప్తంగా కథ చెపుతున్నాను: శివ పార్వతుల పెళ్లయ్యాక అమ్మవారు కాపురానికి కైలాసం వెళ్ళింది. కొంతకాలానికి హిమవంతుడి భార్య, పార్వతీదేవి తల్లి అయిన మేనాదేవి హిమవంతుడితో అమ్మాయిని చూసి చాలా రోజులయిందనీ, అయినా ఆ భిక్షుకుడైన శివుడి దగ్గిర ఏం కష్టాలు పడుతోందో చూడాలనీ, అమ్మాయితో కొంత కాలం గడిపి ఆమె కాపురాన్ని చూడాలనీ కోరిక వెలిబుచ్చింది. హిమవంతుడు ఆమె చెప్పిన మాటలని సవరించి, శివుడి కంటే గొప్పవాడు లేడని, పార్వతి గొప్ప సుఖాలతో ఉండి ఉంటుందని, కానీ తనకు కూడా కూతురుని చూడాలని కోరిక ఉన్నదని చెప్పి ప్రయాణ సన్నాహాలు చేసాడు. అప్పుడు దుర్వాస మహాముని వారిదగ్గరకి వచ్చి కైలాసానికి మళ్ళీ వెళ్లాలనే తన కోరిక శివుడికి విన్నవించమని ప్రార్థిస్తాడు. వీళ్ళిద్దరూ కైలాసం చేరుకుని, అక్కడ కోట్ల యోజనాల విస్తీర్ణం కల ఆవరణలు, ప్రాకారాలు, తోటలు, నదులు, తటాకాలు, మణిమయ సౌధాలు, కొండలు, వాటిమీద శివాలయాలు చూసి ముగ్ధులై పోయారు. చాలా కాలం ఉన్నతరువాత శివుడితో  వెనక్కి వెళతామని, అమ్మవారిని  కొద్దీ కాలం కోసం తమతో తీసుకెళతామని ప్రార్థించారు. శివుడు కరుణామయుడై ఆ కోరిక మన్నించి, అమ్మవారిని తన తల్లి తండ్రులతో వెళ్ళడానికి ప్రేరేపించి, వెళ్లేముందర తన అంశాన్ని కైలాసంలో వదిలి వెళ్ళమనీ, ఆమె లేకపోతే తాను ఉండలేడని చెపుతాడు. అమ్మవారు ముగ్ధురాలై, తన భర్త మీద మనసు లగ్నం చేసి శివుడి తపస్సు, తన మనస్సు కలిసిన ఒక రూపం సృష్టించి కైలాసంలో వదిలి హిమవత్ప్రాంతాలకి వెళుతుంది. అత్యంత మనోహరమైన, మహిమాన్వితమైన ఆ రూపమే మనోన్మనీ రూపం.

అర్చన చేయించుకుని, విభూతి తీసుకుని అర్చకులవారిని అడిగాను; అమ్మవారి గొలుసు (గజ్జెలు) చూపించమని. అప్పుడు హారతి దీపం తీసుకుని వెళ్లి, అమ్మవారి చీర కొంచెం తొలిగించి, ఆమె పాదాలు చూసే భాగ్యం కలిగించారు. ఎడమ పాదానికి బంగారు గొలుసు ఉన్నది. 1991 ముందు ఆ గొలుసు వేసే కన్నం మేమెవరమూ చూడలేదని చెప్పారు.

బయటకువచ్చి, ఈశ్వరుడి గుడికి వెళ్ళాము. ఒకమాట: చాలా పెద్ద గుళ్ళకి వెళ్ళాము, కానీ, ఇంత శుభ్రంగా ఉన్న గుడిని చూడలేదు. చాలా చక్కగా గుడిని పోషిస్తున్నారు. ఈశ్వరుడిగుడికి వెళ్లాలంటే మళ్ళీ ఇంకొక గోపురంలోంచి వెళ్ళాలి. అక్కడ గుడిలో ముందు భాగం ఒక 50 మంది కూర్చునేటట్లు ఉన్నది. దానికి కుడిచేతివైపు కొందరు వెళుతుంటే ఏముందో అని వెళ్ళాము. కొన్ని మెట్లు దిగి ఒక చిన్న గదిలాంటి ప్రదేశం చూసాము. అక్కడ ఒక దీపం కూడా లేదు. మేమే లైటు వేసుకుని చూస్తే ఒక శివలింగం - పాతాళ పరమేశ్వరుడు - ఉన్నది/ఉన్నాడు. నమస్కారం చేసుకుని మళ్ళీ లోపలికి ప్రవేశించాము. ఈ ఆలయం యొక్క అంతరాలయం మూడు భాగాలలో ఉన్నది. మొదటి భాగం పైన ఒక చిన్న గోపురం ఉంటుంది. ఈ ఆలయం గోపురం కప్పు కింద సప్పోర్టుకి ఉండే రాళ్లు అన్ని శివాలయాల్లో  ఉండేటట్లు ఉన్నాయి. అంటే ఆలయం శిధిలమైనా ఈ కప్పుకి వేసిన రాళ్లు ఎలా ఉన్నాయో చూస్తే అది శివాలయం అని తెలుస్తుంది. (ఒక చిన్న మాట - మీరు తాజమహల్ గోపురం కింద చూసినా ఇలాగే రాళ్లు ఉంటాయి. తాజమహల్ మొదట్లో శివాలయం అని చెప్పడానికి ఇది గొప్ప నిదర్శనం.) ఈ మంటపం తరువాత హోమగుండం ఉన్నది. దానివెనుక శివుడి సన్నిధి. ఇక్కడ శివుడిని పుట్టమన్నుతో, పునుగు నూనెతో  పూజిస్తారు. స్వామి  చాలా గంభీరంగా అందంగా ఉన్నారు.అక్కడ మళ్ళీ అర్చన చేయించుకుని బయటకి వచ్చి ఆ ఆలయ గోడల చుట్టూ చూస్తే మొదట నాగదేవతా విగ్రహాలు 6, ఆ తరువాత నాయనార్ల విగ్రహాలు, ఆ తరువాత శివలింగాలు చాలా ఉన్నాయి. అయితే, ప్రతి శివలింగం భిన్న ప్రమాణంలో ఉన్నది. పానుమట్టాలు కూడా తేడాగా ఉన్నాయి. ఇది ఎందుకిలా ఉన్నదన్న విషయం తెలియలేదు. చాలా శివాలయాల్లో ఇలా చుట్టూ శివలింగాలు ఉన్నా, అన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. ఇక్కడ మాత్రం తేడా.

shivaalayamశివాలయం వెనకకి వెళితే ఒక ఆశ్చర్యం. మామూలుగా ఆలయాలన్నీ వెనక పక్కనించి చూస్తే నాలుగు గోడలుగా కట్టినట్లు తెలుస్తుంది. ఈ ఆలయంలో అయ్యవారి గర్భాలయం మాత్రం గుండ్రంగా ఉన్నది.  ప్రక్కన వీడియో చూడండి. ఈ ఆలయం వెనుక వల్లీ దేవసేనాసహిత సుబ్రహ్మణ్యేశ్వరుడున్నాడు. ఎంతో  సుందరమైన విగ్రహాలు. అంతకు ముందు వినాయకుడి గుడి ఎడమవైపు ఉన్నది. ఇంకో రెండు చిన్న గుళ్ళు ఉన్నాయి. అందరూ కూర్చోడానికి శుభ్రమైన ఒక స్థంబాల మంటపం ఉన్నది.

sculpture
ganesha-temple

ఈ ఈశ్వరుడి ఆలయం మీద అందమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. దాంట్లో ఒకటి చూడగానే, శ్రీ త్యాగరాజన్ చెప్పిన స్థల విశేషం కథ గుర్తుకొచ్చింది:

'సూర్యుడిని ఈశ్వరుడు శపించాడు' - అన్నారు త్యాగరాజన్. వెంటనే ఆ కథేమిటి, కమామీషేమిటని అడిగితే ఇలా అన్నారు: కశ్యప ప్రజాపతి భార్య వినత కొడుకు అరుణుడు. తల్లి తొందరపాటుతో గుడ్డుని విరగగొట్టడంతో ఊరువులు లేకుండా పుట్టాడు. అమిత ధార్మికుడు, వైనతేయుడి అన్న. సూర్యుడికి రథ సారథిగా ఉన్నాడు. ఒకనాడు అరుణుడు నేను కైలాసం వెళ్లి వస్తానని సూర్యుడితో అంటే, ఎందుకని అడిగాడు సూర్యుడు. నా ప్రారబ్ధ కర్మ ఎలా సంభవించిందో కానీ, నేను ఊరువులు లేకుండా పుట్టాను. గత జన్మలో ఏ పాపం చేసానో, అది ఎలా పోయి నేను మామూలుగా తయారవుతానో శివుణ్ణి అడిగి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను; అని అన్నాడు అరుణుడు. సూర్యుడు వెంటనే నువ్వు వెళ్ళద్దు, నందీశ్వరుడు నిన్ను రానివ్వడన్నాడు. (అరుణుణ్ణి కోల్పోతాననే భయమన్నమాట.) అరుణుడు, నా తపోబలంతో నేను వెళతానని పట్టుబట్టి, తపోబలంతో మోహిని రూపం దాల్చి కైలాసం వెళతాడు. అక్కడ నందీశ్వరుడడ్డగిస్తాడు, తాండవనృత్యం సాగుతోందని. ఈలోపల దేవేంద్రుడు వచ్చి, మోహిని రూపంలో ఉన్న అరుణున్ని చూసి మోహిస్తాడు. వారిద్దరికీ కలిగిన వాడే రామాయణంలో కనపడే వాలి. ఆ కోలాహలం వల్ల శివపార్వతుల ఏకాంతం భంగమయి తాండవం ఆగింది. తరువాత శివుడి అనుజ్ఞ అయి, దర్శనం అయింది. 'నా భక్తులని నన్ను చూడడానికి రానివ్వకుండా ఆపడానికి ప్రయత్నించావు.  నీ ప్రకాశం గొప్పగా ఉండేటట్లు నేను చేసాను కాబట్టి నీకు అహంకారం ఎక్కువయింది. అందువల్ల ఇప్పటినుంచి నీ వర్ణం కృష్ణ వర్ణంగా మారిపోతుందని, ప్రకాశం తగ్గిపోతుందని సూర్యుడికి శాపమిస్తాడు శివుడు. అమ్మవారికి కూడా సూర్యుడి మీద కోపం వచ్చింది. సూర్యుడు శివుడి కాళ్ళమీద పడి శాపావసానం ఏమిటని అడిగితే, ఏడు నెలలు నన్నూ, పార్వతిని మేఘనాథుడిగా మేఘమండలంలో అర్చించి తపస్సు చెయ్యి. అలా చేస్తే నీకు మళ్ళీ ప్రకాశం వస్తుందని అనుగ్రహించాడు. అలా సూర్యుడు తపస్సు చేసిన స్థలంకాబట్టి ఈ తిరుమేయాచూరులో పుష్కరిణి పేరు 'సూర్య పుష్కరిణి' . అప్పుడు సూర్యుడు ఉత్తరాభిముఖుడైన సమయాన్ని రథసప్తమిగా మనం గుర్తించి పూజలు చేస్తున్నాం. ఆ రోజున ఈ క్షేత్రంలో బిల్వదళాలని నెత్తిమీద పెట్టుకుని (అర్కపత్రం అనికూడా అంటారు) సంకల్ప స్నానం చేసుకుని ఇరువురి దర్శనం చేసుకుంటే సప్తజన్మల పాపం నాశమవుతుందని ప్రతీతి. తిరుపతిలో వైష్ణవులకి చంద్ర తీర్థం, ఇక్కడ శైవులకి సూర్య తీర్థం - రెండు చోటలా బ్రహ్మోత్సవం తైమాసంలో చాలా గొప్పగా జరుగుతుందన్నారు త్యాగరాజన్.

అరుణుడు మళ్ళీ సూర్యుడి వద్దకి వెళతాడు. ఏమైందని సూర్యుడడిగితే శివదర్శనం అయిందని చెపుతాడు అరుణుడు. ఎలా అంటే వివరిస్తాడు. అప్పుడు సూర్యుడు నాకుకూడా ఆ మోహినీ రూపం చూపించమని నిర్బంధం చేస్తాడు అరుణుణ్ణి. ఆఖరికి చూపిస్తే సూర్యుడు కూడా ఆమెను మోహిస్తాడు. వారిద్దరికీ కలిగినవాడే సుగ్రీవుడు.

ఇంతలో అమ్మవారు భండాసురవధ పూర్తిచేసి వచ్చి మనోన్మనీ  రూపంలో మణిద్వీపంలోని శ్రీపురంలో తపస్సు చేసుకుని ప్రసన్న భావం పొందారని చెప్పానుగా.  సూర్యుడు ప్రకాశహీనుడై ఏడు నెలలు తపస్సు పూర్తిచేశాననుకుని (లెక్క తప్పుగా వేసుకున్నాడు) ఇక్కడ ఏకాంతంలో ఉన్న శివపార్వతులనుద్దేశించి, 'నేను నువ్వు చెప్పిన ఏడూ నెలలూ నిన్ను, అమ్మవారిని మేఘనాథులగా ఆకాశమండలంలో భావనచేసి తపస్సు చేసాను. అయినా నా ప్రకాశం నాకు రాలేదేమిటని అడుగుతాడు. శాపం తీసెయ్యమని ప్రార్థిస్తాడు. ఆ సమయంలో శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు. అమ్మవారికి కోపం వచ్చింది. నేను కైలాసంలో ఉన్నప్పుడు మాకు ఏకాంత భంగం కలిగించావు. నేను భూలోకంలోకి వచ్చినా ఇక్కడకూడా మాకు ఏకాంత భంగం కలిగించావు. అని శాపమివ్వబోతుంటే, ఈశ్వరుడు కలగచేసుకుని, వీళ్ళందరూ మన పిల్లలు. వీళ్ళమీద మనమే కోపం చేసుకుంటే ఎలా? సూర్యుడులేకపోతే లోకాలు క్షోభిస్తాయి. కాబట్టి అనుగ్రహించమని అనునయిస్తాడు. అంతటితో అమ్మవారు శాంతించారు. కాబట్టి ఇక్కడి అమ్మవారిని శాంతనాయకి అని, అయ్యవారిని మేఘనాధుడనీ వ్యవహరిస్తారు. సూర్యుడు తపస్సు పూర్తిచేసి మళ్ళీ ప్రకాశం పొందుతాడు.

sculpture-02ఇదిగో - ఆ అమ్మవారిని అయ్యవారు బుజ్జగించే దృశ్యం ఎంతో  అందంగా శివాలయం గోడమీద చెక్కబడి ఉన్నది. గొప్పతనం ఏమిటంటే రాతివిగ్రహంలో కూడా అయ్యవారు గడ్డం పట్టుకుంటే అమ్మవారి ముఖంలో చిఱుసిగ్గు కనిపిస్తూ ఎంతో  ముచ్చటగా ఉంటుంది. ఈ కింద పొందుపరిచిన ఫోటో చూడండి. మీకే తెలుస్తుంది. ఆలయ గోడలమీద ఎంత అందమైన చెక్కడాలున్నాయో మిగతా ఫోటోలలో, వీడియోలలో మీరు చూడగలరు. ఆలయం ఎంత బాగుందో చూపడానికి వీడియో ద్వారా ప్రయత్నించాను; చూడవలసింది. ఇక్కడ వారాహీ లింగం, వరుణ లింగం వంటి ప్రసిద్ధ లింగాలున్నాయి.

agastya-mantapamఆ తరువాత అగస్త్యుల వారి మంటపం ఎక్కడ ఉన్నాడని విచారించి అది పట్టుకుని చూసాము. చాలా శిధిలావస్థలో ఉన్నది. నూరు స్థంబాల మంటపం - మూడునాలుగు స్థంబాలకంటే నిలిచి లేవు. పట్టించుకునే నాథుడు లేడనుకున్నా గానీ, కొన్నేళ్లలో అది బాగుచేయిస్తారని త్యాగరాజన్ చెప్పారు. ఆ ముందర భాగం అంతా కబ్జా చేశారు. మీరు ప్రక్కన పొందు పరిచిన వీడియో చూడండి. మీకే అర్థమవుతుంది. ఇక్కడే మనందరికీ - దాక్షిణాత్యులందరికీ - శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం అందింది కాబట్టి ఇది చాలా ముఖ్యమైన ప్రదేశం. తమిళనాడులో అగస్త్యులవారికి చాలా పేరుంది. అందుకైనా ఇది బాగుచెయ్యాలి. ఈ ఆలయానికి ఇంకా ప్రాచుర్యం రావాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.

ఈ విధంగా అమ్మవారి అనుగ్రహంతో తిరుమేయాచూరు దర్శనం చేసుకుని 265 కి.మీ దూరంలో ఉన్న మధురకి బయలుదేరాము.

### సశేషం ###

Posted in February 2021, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!