Menu Close
భగవద్విభూతి
-- ఆర్. శర్మ దంతుర్తి

సత్యాన్వేషణ – 4

(మొదటి, మూడు వ్యాసాలు ఇక్కడ చూడవచ్చు; భగవద్విభూతి-1, భగవద్విభూతి-2, భగవద్విభూతి-3)

ముందు వ్యాసాల్లో చూసినదాని ప్రకారం సత్యం కనుక్కోవడం ఒకటే శాంతి ఇవ్వగలది. దానిని కనుక్కోవడం అసంభవం కాదు కానీ చాలా కష్టమే. సత్యాన్వేషణలో ధ్యానానికి కావాల్సింది ఒక రూపు, ఆ రూపు మనకి నచ్చేదిగా ఉండడం వగైరాలు. ఇప్పుడీ సత్యాన్వేషణకి ఉన్న అడ్డంకులు చూద్దాం. మీరొక ఉద్యోగంలో జేరారు అనుకోండి. అక్కడ చేసే పనికి సంబంధించిన కాయితాలు అవీ మీకు “కావాల్సినవి” ఇస్తారు. అలాగని అక్కడ ఉన్న రహస్యాలన్నీ ఉన్న కాయితాలు ఇవ్వరు ఎందుకంటే మీరు కొత్తగా చేరారు. మిమ్మల్ని అప్పుడే నమ్మడం ఎలా? మీరెటువంటివారో తెలియదు కదా? మొదట్లో మిమ్మల్ని ఉద్యోగానికి ఎంపిక చేసినా, మీ మీద ఏమైనా కేసులున్నాయా, ఎవరినైనా కొట్టారా, ఊరంతా అప్పులు చేసి ఇవ్వకుండా మొహం చాటు వేస్తున్నారా అనేవాటినీ, అంతకుముందు చదువుకున్నచోట గానీ పనిచేసిన చోటగానీ ఎలా ప్రవర్తించారు, అసలు ఈ ఉద్యోగానికి మీరు అర్హులేనా అనేవి మీరు చెప్పిన, మీకు తెలిసిన కొంతమందితో మాట్లాడి గానీ మీకు ఉద్యోగం ఇవ్వరు కదా? అంటే మీరు ఎంత మంచివాళ్లైనా కొత్త ఉద్యోగం లో మిమ్మల్ని నమ్మరు వెంఠనే. ఒక ఉద్యోగంలో బాగా ఉన్నంత మాత్రాన ఈ కొత్త ఉద్యోగంలో అలాగే ఉంటారని ఎందుకు నమ్మాలి? మీరు ముందు కంపెనీకి విశ్వాసం చూపించాలి, కష్టపడి పనిచేయాలి, అలా నిజంగా కష్టపడుతున్నారనీ కంపెనీ పైకి రావడానికి కృషి చేస్తున్నారనీ అందరికీ నమ్మకంగా తెలియాలి – కాయితాల మీద కాదు, రోజువారీ పనుల్లో, ఆ పనుల వల్ల వచ్చే లాభాలలో. అప్పుడు మిమ్మల్ని నమ్మి మీకు మరింత పనీ, మరో ఉన్నత ఉద్యోగం ఇస్తారు.

అందువల్ల, మీకు “కావాల్సిన వాటిని మాత్రమే” ఇస్తారు మొదట్లో. ఆ తర్వాత మీరు బాగా పనిచేస్తే మరికొన్ని విషయాలు, ఆ పైన మరిన్ని విషయాలు, పై ఉద్యోగానికి మిమ్మల్ని జ్ఞప్తిలో ఉంచుకోవడం అవీ జరుగుతాయి. వీటికి అనేక సంవత్సరాలు పడుతుంది. ఈ లోపున మీరు ఉద్యోగం మారితే మళ్ళీ కింద నుండి మొదలు పెట్టాలి ఈ వ్యవహారం ఎందుకంటే ఏ కంపెనీ విషయాలు వాళ్ల స్వంత విషయాలు కనక. సరే, మీరు నిజంగా కష్టపడి పనిచేస్తే మీకో పదోన్నతీ, ఆ పైన మరిన్ని వ్యాపార వ్యవహారాలు కట్టబెట్టడం అవీ ఒక్కోటిగా అమరుతాయి. అలా పది, పదిహేనేళ్ళకి పైకి, ఇంకా పైపైకి పదోన్నతి పొందవచ్చు. అయితే ఒక విషయం; పైకి పదోన్నతి సంపాదించడం ఎంత కష్టమో అక్కణ్ణుంచి కిందకి జారడం అంత సులభం. మీరు కానీ ఒక్క మోసం చేస్తే అది బయటపడి మిమ్మల్ని పోలీసులకి అప్పగించడానికీ, కారాగారంలో పెట్టించడానికీ కంపెనీకి ఒక్క రోజు చాలు, కంపెనీ వెనుకాడదు కూడా ఆ విషయంలో. అలా కనక జరిగితే ఆ జారుడు మెట్లమీద అధోగతి పొందడం అతి సులభం. వార్తల్లో వచ్చే సత్యం కంపెనీ రామలింగరాజు, మోసాలు చేసే ఫలానా బేంకు వగైరా ఇటువంటివారే.

ఇప్పుడు దీన్ని సత్యాన్వేషణకి అన్వయించి చూసుకుందాం. మీరు కళ్ళు మూసుకుని ధ్యానం ఆరంభించగానే మహాసమాధి ఇవ్వడం ఎలా? అసలు ఎందుకు ఇవ్వాలి? మీరెటువంటివారో? మీకు మంచి లక్షణాలు ఉన్నాయో లేదో తెలుసుకోకుండా మహాసమాధి ఇస్తే బోలెడు శక్తి వస్తుంది, ప్రపంచంలో జరిగేవి, జరగబోయేవి తెలుస్తాయి. ఇటువంటి శక్తులని మీరెలా వాడతారో? దాన్ని మీరు ప్రపంచానికి పనికొచ్చేలా ఉపయోగిస్తారా లేకపోతే కీడు చేస్తారా? కీడు చేసే గుణం మీకు ఏ మూల అయినా ఉంటే మీకెందుకు ఆ శక్తి, ఆనందం ఇవ్వాలి? ఆ సమాధి స్థితి రాగానే చేయాల్సిన పనులూ, కావాల్సిన స్థితప్రజ్ఞతా మీకు ఉండొద్దా?అందువల్ల మీకు మరిన్ని కష్టాలు కల్పించాలి, ఆ కల్పించిన కష్టాలలో మీ మనఃస్థితీ, మీరు వాటిని ఎలా అధిగమిస్తారో తెలియాలి. అవన్నీ మీరు సరిగ్గా చేయగలిగితే మహా సమాధి పొందడానికి అర్హత సంపాదించినట్టు.  మరో విషయం చూడండి. మీరు లాటరీలో ఓ టికెట్ కొన్నారు. దాని విలువ ముప్ఫై కోట్ల రూపాయలు అనుకుందాం. మామూలు జీవితం గడిపే మనకి ఒక్కసారి ముప్ఫై కోట్ల రూపాయలు లాటరీ తగిల్తే ఏమౌతుంది? అది సరిగ్గా ఖర్చుపెట్టే, దాన్ని సరిగ్గా చూసుకునే తెలివితేటలు మనకున్నాయా? పోనీ అంత లాటరీ ఒకసారి తగిల్తే హరాయించుకునే మనస్సు, గుండెకాయ ఉన్నాయా? వార్తల్లో చూస్తూ ఉంటాం, ‘ఫలానా ఆవిడకి/ఆయనకి లాటరీ తగిలింది. హాఠాత్తుగా గుండె పోటుతో మరణించారు,’ అని. ఈ మహా సమాధి అనేది అతి పెద్ద లాటరీ వంటిది. ఒక్కసారి వస్తే హరాయించుకోలేక ఛస్తాం. మరెలా ఈ సమాధి సంపాదించడం, సత్యాన్వేషణలో? దీనికి శ్రీ శంకర భగవత్పాదులు శివానందలహరిలో చెప్పే శ్లోకం చూద్దాం.

ఆనందామృతపూరితా హరపదాంభోజాలవాలోద్యతా
స్థైర్యోపఘ్న ముపేత్య భక్తిలతికా శాఖోపశాఖాన్వితా
ఉచ్ఛైర్మానస కాయమానపటలీ మాక్రమ్య నిష్కల్మషా
నిత్యాభీష్ట ఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధితా          (శివానందలహరి 49)

దీని అర్ధం ఏమిటంటే, పరమేశ్వర సేవానురక్తి నీరుపోతగా, శివచరణకమలాలు (పాద పద్మాలు) పాదుగా, చిత్త, స్థైర్యాలు పాకుడు గంపగా బయలుదేరి, చిలువలు పలువలుగా శాఖోప శాఖలై అల్లుకుంటూ క్రమంగా ఉన్నతమైన నా మనస్సు అనే పందిరి అంతా అల్లుకుంటూ చీడ మొదలైన దోషాలతో శిధిలం కాకుండా భక్తి పెంపొందించుకుంటూ శాశ్వత ఫలం ఇచ్చుగాక.

మరో సారి గమనించండి. శాశ్వత ఫలం అయిన సత్య దర్శనం ఎలా వస్తుందని చెప్తున్నారు? కళ్ళు మూసుకోగానే రాదు. భక్తి అనేది శాఖోపశాఖలై విస్తరిస్తూ మెల్లిగా మనస్సంతా అల్లుకుంటూ ఇలా అల్లుకున్న భక్తి చెడ్డ అలవాట్లతో శిధిలం అవకుండా క్రమ క్రమంగా శాశ్వతమైన ఫలం రావాలి అంటున్నారు. అంతేకానీ నేను కళ్ళు మూసుకోగానే నాకు సమాధి వచ్చేలా చేయి భగవంతుడా అని అడగడం లేదు. ఇదే మనం ముందు చెప్పుకున్న ధ్యానం, అది ఫలించడానికి పట్టే సమయం. సరే మనం సత్యాన్వేషణకి నిర్ణయించుకున్నాం. దానికి అనేకానేక జన్మలు పట్టడం ఏమిటి? ఓ పది సంవత్సరాల్లో కుదరదా? మరీ అంత కష్టమైతే అసలు దీని కోసం ప్రయత్నించడం దేనికీ? దీనికి సమాధానం చెప్పుకునే ముందు ఓ మూడు విషయాలు చూద్దాం.

మీరో కంపెనీలో చేరాక దానిలో ఉన్న అత్యుత్తమ పదవి రావాలంటే ఎంతకాలం పడుతుంది? ఒక జీవితకాలం పట్టవచ్చు. జీవితకాలం అంతా కృషిచేసాక అది లభించకపోనూ వచ్చు. అలాగని ప్రయత్నించడం మానుకుంటామా? రెండో విషయం, స్వామి సత్యానంద సరస్వతి గారు చెప్పినది. మీరు లెక్కలు నేర్చుకునేటప్పుడు మొదట్లో ఏదో తెలియని విషయం వచ్చింది. అప్పుడు టీచర్ ఏమన్నారంటే “మొత్తం ఒకటి అనుకో, అప్పుడు సులభంగా సమాధానం వస్తుంది.” అలా మీరు మొదట టీచర్ చెప్పినది “నమ్మి మొత్తం ఒకటి” అనుకుని మొదలుపెట్టారు. సమాధానం వచ్చింది. భలే, అనుకుంటూ మిగతావాటికి కూడా అలాగే సమాధానాలు రాబట్టారు. మీకు టీచర్ సమాధానం రాసి ఇచ్చారా? లేదే? లెక్కలు ఎలా చేయాలో ఓ దారి చూపించాడు. ఆ దారి నమ్ముకుని మీరే పూర్తి చేసారు ఆ లెక్క అంతా.  అయితే ఇక్కడ సత్యాన్వేషణలో “సత్యం అనేది ఉంది, నేను చూసాను, కానీ అది అరటిపండు చేతిలో పెట్టినట్టూ ఇవ్వడం కుదరదు. నీకు నువ్వే ప్రయత్నం చేయాలి, నేను సహాయం చేస్తాను,” అని గురువు చెప్తున్నప్పుడు మనం “నమ్మాలి” కదా? చిన్న లెక్క కే మనం ఒక టీచర్ చెప్పినట్టూ “మొత్తం ఒకటి” అని నమ్ముతున్నాం కానీ, భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూసిన మహర్షులు సత్యం గురించి చెప్తుంటే ఎందుకు నమ్మడం లేదు? ఎందుకంటే ఈ సత్యాన్వేషణ అనేకానేక జన్మలు పడుతుంది కాబట్టా? లేక మనకి అరిచేతులో స్వర్గం కావాలనా? చిన్న లెక్కలో మొత్తం ఒకటి అనుకుని, అలా ప్రయత్నం చేసి నేర్చుకోవడానికీ, సమాధానం రాబట్టడానికే మనకి ఒకరోజు పడుతుంటే, ఈ భగవంతుడూ, ఈ సృష్టి, చరాచర ప్రపంచం ఏ సత్యం మీద ఆధారపడి ఉందో అది తెలుసుకోవడానికి ఎక్కువ సమయం ఎందుకు పట్టదూ?

మూడో విషయం. సత్యం తెలుసుకోవడం అంటే అఖండానందం అనుభవించడం అనుకున్నాం కదా? ఏ కష్టమూ లేకుండా అఖండానందం ఒక్కసారి మనసులోకి వస్తే ఏమౌతుంది? అది తట్టుకునే స్థైర్యం లేకపోతే గుండె ఆగి ఛస్తాం – లాటరీలో ముప్ఫై కోట్లు తగిలితే గుండె అగినట్టే. అదీగాక మనసులో ఆ చివరి అఖండానందమైన సత్యం తప్ప మరేం కోరికా ఉండకూడదు. చివరికి కోరికలన్నీ పోయాక ఒకే ఒక కోరిక ఏమిటి? సత్యాన్ని దర్శించడం. అయితే ఈ సత్యాన్ని దర్శించడం అనేది కూడా కోరికే కనక అది ఉన్నంతకాలం కూడా మనకి సత్యం/మోక్షం లభించదు. అది కూడా విసర్జించాక అప్పుడు కలిగేది అఖండానుభవం. దీనినే కృష్ణుడు భ్గవద్గీతలో “మోక్ష సన్యాస యోగం” అన్నాడు. అంటే మోక్షాన్ని “కోరుతూ” చేసిన ధ్యానంలో మోక్షాన్ని కూడా సన్యసించినట్టైతేనే మనకి మోక్షం లభిస్తుంది. ఎందుకంటే, మనం దేనికోసమైతే ధ్యానం మొదలుపెట్టామో అది కూడా ఒక కోరికే కనక దాన్ని కూడా వదిలించుకుంటే తప్ప సత్య దర్శనం లభించదు. ఇప్పుడు తెల్సింది కదా ఇదెంత కష్టమో? అందుకే ఆత్మజ్జానం లభించడానికి మనం పయనించే దాని రెండంచుల కత్తి వంటిది అంటారు. ఎంత కష్టపడినా (ఉద్యోగంలో పైవాడి కృప లేనంతకాలం పదోన్నతి లభించనట్టే) భగవంతుడి కృపలేకుండా ఎవరికీ కూడా సత్య దర్శనం కలగదు. దీనికోసం మానవ జీవితంలో ఉన్న ఆయుర్దాయం సరిపోదు కాబట్టి అనేకానేక జన్మలు ఎత్తుతూ ఎప్పటికో సత్యానికి దగ్గిరగా చేరుకుంటాం. ఇది అంత కష్టం కనకే అసలు మనం ప్రయత్నం కూడా చేయం.

అసలెప్పుడు ఈ ప్రయత్నం మొదలౌతుంది అంటే, జీవితంలో ఢక్కామొక్కీలు తిన్నాక, ఈ ప్రపంచంలో అనుభవించేవన్నీ మనకి ఎందుకూ పనికిరావనీ, వాటివల్ల వచ్చే ఆనందం క్షణికమనీ అనుభవంలోకి వచ్చాక వీటికి అతీతమైన ఆనందం ఉందని తెలుకున్నాక అప్పుడు ప్రయత్నం మొదలుపెడతామన్న మాట. దీనినే కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు చూడండి.

మనుష్యాణాం సహస్రేషు కశ్చి ద్యదతి సిద్ధయే
యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః    (జ్జాన విజ్జాన యోగం – 3)

అనేక వేలమంది మనుష్యులలో ఒకడు ఆత్మజ్జానం కోసం ప్రయత్నిస్తున్నాడు. అలా ప్రయత్నించిన ముముక్షువులలో ఒకానొకడు మాత్రమే నన్ను యదార్ధంగా తెలుసుకోగలుగుతున్నాడు. అంత కష్టం కదా అని ప్రయత్నమే మానేస్తే ఏమౌతుంది? ఎప్పటిలాగే కిందా మీదా పడుతూ జన్మ మృత్యు పరంపర కొనసాగుతుంది. కష్టపడకుండా వచ్చే ఆనందం దేనికీ పనికిరాదు కనుకనే అఖండానందానికి కారణమైన సత్యదర్శనం ఇంత కష్టం.

అయితే ఈ సత్యదర్శనాంతరం ఎలా ఉంటుంది జీవితం అనేది రామకృష్ణా మఠం స్వామి గారైన స్వామి జ్జానేశ్వరానంద గారు చెప్తున్నారు. “మీకు అత్యంత సుఖం సంతోషం కలిగించినది ఏదైనా ఉందా జీవితంలో? ఓ సారి గుర్తు తెచ్చుకోండి. అది పాయసం తినడం కావచ్చు లేదా ఎవరికో సహాయం చేయడంలోనైనా కావచ్చు, ఏదో సంపాదించినప్పుడు కావచ్చు. ఇప్పుడా సంతోషాన్ని పదివేల లక్షల కోట్లకి పెంచండి. అంతటి ఆనందం ఊహించుకోండి. అటువంటి ఆనందం సతాన్వేషణ తర్వాత మీకు కలుగుతుంది. ఆ ఆనందం ఒక్క క్షణం కలగడం కాదు, ఆ ఆనందంలో మీరు ప్రతీ క్షణం ఈదులాడగలరు. అప్పుడు మీరు ప్రపంచానికి ఇవ్వగలిగేది ఆనందం మాత్రమే. నేను ఇవ్వనూ అని కూర్చున్నా సరే భగవంతుడు మీ మెడలు వంచి మీరు ప్రపంచానికి ఇవ్వాల్సింది మనం ప్రతీ ఏడూ తప్పనిసరిగా కట్టే పన్ను లాగా మీ నుంచి వసూలు చేసుకుంటాడు.” అద్భుతం కదా?

మరో విషయం చూద్దాం. మీరు నమ్మకంగా చేసే పని మెచ్చుకున్నాక అనేకానేక సంవత్సరాలకి మీకు అత్యంత పెద్దదైన పదవి కట్టబెట్టారు కంపెనీలో. అప్పుడు మీకు ఎలా ఉంటుంది పని? ఎక్కువా, తక్కువా? బాధ్యత ఎంత ఉండొచ్చు? ఆ బాధ్యత మీరు సరిగ్గా నిర్వహించలేకపోతే అక్కడనుంచి కింద పడడానికి క్షణం పట్టదు కదా? అలాగే మీకు సత్యదర్శనం కలిగాక మీరు ప్రపంచానికి మంచి చేయాల్సిన బాధ్యత మీమీద ఉంది. అది చేయలేనప్పుడు మీకు సత్యదర్శనం ఇవ్వడం దేనికీ? అందుకే మనసులో మంచీ చెడూ, కష్టం సుఖం అనే ద్వంద్వాలన్నీ పోవాలి. ఇవన్నీ పోయాక మిగిలేది ఒకటి. ఆ ఒకటి ఏమిటి? ఏనాడూ మారని, మార్పు చెందని సత్యమే ఆ ఒకటి. అది దర్శించాక అసలు ఈ ప్రపంచం ఇలా ఎందుకు ఉంది, ఇలాగే ఎందుకు ఉంటుంది? ఈ ప్రపంచంలో, చరాచర విశ్వంలో అంతా ఉన్నదేమిటీ అనే విషయాలన్నీ తెలిసి ద్వంద్వాలన్నీ నాశనం అయ్యాక లభించేదే చిట్టచివరి సత్యం. ఇదే బుద్ధుడు స్వతహాగా దర్శించి తెలుసుకున్న బోధి, దాని సూత్రాలు. ఈ సూత్రాల వల్లే విశ్వం అంతా కూలిపోకుండా ఒక విధంగా నడుస్తూ ఉంది. ఇవి ఎవరికి వారు తెలుసుకోతగ్గవి.  ఇవి కొత్తగా ఎవరో ప్రతిపాదించినవి కాదు. అనాదిగా ఉన్నవి. వీటిని ప్రాచీన కాలంలో బుద్ధులు దర్శించారు. ప్రస్తుత కాలంలోనూ దర్శిస్తున్నారు. ముందు రాబోయే రోజుల్లో బుద్ధులు కూడా దర్శిస్తారు. అయితే ఈ బుద్ధులు ఎలాంటివారు? అనేకానేక జన్మలు ఎత్తి ధర్మం వైపు అతి ప్రయాసతో ప్రయాణం సాగించేవారు. ఎందుకింత ప్రయాస అంటే ఆ ప్రయాణం అతి కష్టం కనకా, ఎంత కష్టమైనా ఆ ప్రయాణం పూర్తి చేసాక లభించే సంతోషం దేనికీ సాటిలేదు కనకా.

ఇందులో ఒక సులువు ఉంది. నూరేళ్ళ ఒక మానవ జీవితం సత్యాన్వేషణకి సరిపోకపోవచ్చు కనక మరో జన్మ ఎత్తుతున్నాం అనుకున్నాం కదా? మనకి సత్యాన్వేషణలో తోడ్పడేది, మనం ఆ దారిలో సాధించిన ఏమాత్రం చిన్న విజయమైనా ఏ నాటికీ నాశనం కాదు. ఎందుకంటే సత్యం ఎన్నడూ నశించదు కనక. అందువల్ల ఈ జన్మలో చేసిన పనులవల్ల మరో మంచి జన్మా అక్కడ నుంచి మరో మంచి జన్మా అలా పైపైకి ఎదుగుతాం. దీన్నే భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు చూడండి.

పార్ధ నై వేహ నాముత్ర వినాశ స్తస్య విద్యతే
న హి కల్యాణకృ త్కశ్చి దుర్గతిం తాత గఛ్ఛతి.     (ధ్యాన యోగం 40)

ఆయుర్దాయం చెల్లిపోయి, యోగమార్గంలోంచి భ్రష్టుడైనవాడు ఇహపరాలలో ఎన్నటికీ వినాశనం పొందడు; పరలోకంలో నరకం కానీ మరోసారి హీనజన్మ కానీ లభించదు, ఎందుకంటే నాయనా, మంచిపనులు చేసేవారికి ఏనాడూ దుర్గతి అనేది పట్టదు.  అందుకే ఎంత కష్టమైనా సత్యాన్వేషణ వదలకూడదన్నమాట.

సత్య దర్శనం చేసిన బుద్ధులు, మహర్షులు చెప్తున్నారు కదా, ఏది చూస్తే ప్రపంచంలో అన్నీ తెలుస్తాయో, విశ్వంలో ఇంకేదీ తెలుకోనక్కరలేదో అదే బ్రహ్మం, సత్యం లేదా ధర్మం అంటున్నారు కదా, అది చూస్తే మిగతావన్నీ ఎలా తెలుస్తాయి? ఈ ధర్మం, సత్యం చూడడానికి ఎక్కడ మొదలుపెట్టాలి? ఈ విషయం ముందు వ్యాసంలో చూద్దాం.

****సశేషం****

Posted in February 2021, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *