Menu Close
సామెతలతో చక్కని కధలు
- ఆదూరి హైమావతి
చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం

వింతవ్యాధి

పురోగతి రాజ్యాన్ని పురంధరవర్మ అనే రాజు పాలించేవాడు. ఆయన ప్రజల కష్టాలను తన కష్టాల్లా భావించేవాడు. ఎవరికి అనారోగ్యం వచ్చినా, అవసరం వచ్చినా ఆఘమేఘాలమీద తన పరివారాన్నిపంపి నివారణా చర్యలు చేపట్టేవాడు.

పంట సరిగా పండలేదనీ, పన్ను కట్టలేమని కోరిన రైతులను, తమ వ్యాపారం సజావుగా సాగడంలేదని, నష్టాలు వచ్చాయనీ విన్నవించుకునే వ్యాపారులనూ కూడా పన్ను నుంచీ మినహాయించేవాడు. ఇలా నిండి ఉండాల్సిన రాజధనాగారం అసంపూర్తిగా మిగిలి పోతున్నది.

ఇలా ఉండగా ఆ నగర పరిసరాల్లో పారే పావనీ నదీ తీరాన నివసించే గ్రామాల్లో ఒక వింత వ్యాధి సోకి, ఆ నదీ జలం త్రాగే జంతు జాలాలకే కాక గ్రామప్రజలు సైతం బాధ పడసాగారు. కొందరు పెద్ద వయసు వారూ, పసి పిల్లలూ కూడా మరణం చేరువకుపోయి వెనక్కు వచ్చారు. ఈ విషయం చారుల వలన విన్న మహారాజు వెంటనే తన వైద్య పరివారాన్ని పంపి అక్కడ కొన్ని గుడారాలు వేయించి, అందరికీ వైద్యం అందేలా చర్యలు గైకొన్నాడు.

ఒక వారానికి రోగుల సంఖ్య పెరగసాగింది. మహారాజు రెక్కాడితే గానీ డొక్కనిండని పేద గ్రామప్రాంత ప్రజల కష్టాలు విని మనసు కరిగి ఒక్కో వ్యాధిపీడితునికీ, వ్యాధి శోకిన పశువుకూ కూడా వందేసి వరహాలు అందజేయమని ప్రధానమంత్రిని ఆదేశించాడు.

అలా సొమ్ము అందించిన మరునాటికే వ్యాధి పీడితుల సంఖ్య చీమల పుట్టలా పెరగసాగింది. ఎన్ని గుడారాలు వేయించినా, ఎందరు వైద్యులను నియమించినా స్థలం చాలక పోడంతో వైద్యులు రోగుల ఇళ్ళకే వెళ్ళి సేవలు అందించ సాగారు. ఇంచుమించు గ్రామమంతా వ్యాధిపీడితులతో నిండిపోయైంది.

మహామంత్రి ప్రత్యేక వైద్య సిబ్బంది ద్వారా అసలు వ్యాధికి కారణాలు శోధించసాగాడు. నదికి ఎగువన ఉండే వ్యాపారకేంద్రాలనుంచీ వచ్చే మురుగు నీరు, ఆ గ్రామ సమీపాన నదిలో కలవడం కారణంగా కాలుష్యం నదినీటిలో చేరిపోతున్నట్లు, దానివలన నీటి కాలుష్యం కలుగుతుందని తెలుసుకున్నాడు. ఆ నీరు నదిలో కలవకుండా చర్యలు చేపట్టమని సిబ్బందికి ఆదేశించాడు. ఆ నది నీటి కాలుష్యం వల్లే జబ్బులు వస్తున్నాయని ఫలితాలు వెల్లడయ్యాయి.

అంతేకాక మహా మంత్రికి మరో అనుమానంకూడా కలిగింది.

మహారాజును దర్శించి "ప్రభూ! నాకు మరో శంక కలుగుతున్నది. మీరూ నాతో వస్తే ఇరువురమూ వెళ్ళి శోధన చేద్దాము. రేపు మనం మారువేషాల్లో వెళ్ళి దర్శిద్దాము." అన్నాడు.

మహారాజు అంగీకరించాక మంత్రి తగు ఏర్పాట్లు చేశాడు. మహారాణి సైతం తమను గుర్తించే వీలులేనంత చిత్రంగా మారు వేషాలు ధరించి ఇరువురూ ఆగ్రామప్రాంతం చేరి వైద్యశిబిరాల చెంతకు వెళ్ళి, 'తాము పొరుగూరి వారమనీ, ఇక్కడ బంధువుల ఇంట అతిజరూరు కార్యం ఉండటాన వచ్చామనీ, వచ్చి నది నీరు త్రాగగానే వ్యాధిశోకిందనీ, వాంతులూ, బేదులూ అవుతున్నాయనీ, వంట్లో శక్తి సన్నగిల్లిపోయిందనీ, తమ బంధువులుసైతం ఇక్కడి శిబిరాల్లో ఎక్కడో వ్యాధి పీడితులై వైద్యం అందుకుంటున్నారనీ, తమకిప్పుడు ఉండను వసతి కూడా లేదనీ' చెప్పుకున్నారు.

వెంటనే అక్కడి ఒక ముఖ్య అధికారి వారిని ఆ గుడారం ఒకమూలకు తీసుకెళ్ళి, వారి పేర్లు, వయసూ నమోదుచేసుకుని, తమకు ఇల్లు లేనందున ఇక్కడే వసతికల్పించి వైద్యం అందించమనే వారి కోరికతో, వారిని తత్కాలికంగా ఏర్పరచిన పడకలమీద ఉంచి వైద్యం అందించసాగారు.

ఇంతలో ఒక అధికారి వచ్చి"అయ్యలారా! మా మహారాజు చాలా ఉత్తమ పాలకులు, ఉదారుడు కూడా. ప్రతి రోగికీ వంద వరహాలిమ్మని పరివారాన్ని పంపారు. ఐతే మీకు గుర్తింపు పత్రాలు లేవు. మీ వ్యాధి నిర్ధారణా పత్రమూ లేదు. మీకు ఇక్కడ చోటూ, వైద్యంతోపాటుగా సొమ్ము అందాలంటే మాకూ కొంత వాటా ఇవ్వాల్సి ఉంటుంది. మేమూ రాత్రనక పగలనకా వైద్యం అంది స్తున్నాం" అన్నారు.

దానికి మారువేషాల్లో ఉన్న ఇరువురూ అంగీకరించాక, వారికి సొమ్ము అందినట్లు చేవ్రాలు చేయించుకుని, ఒక పదేసి వరహాలు ఇచ్చి వెళ్ళిపోయారు. మారువేషాల్లో వారు మరో రెండురోజులు మెల్లిగా వ్యాధి నయమవు తున్నట్లు చెప్పి, కొద్దిగా నడవను అనుమతి పొంది, తిరుగుతూ అంతా గమనించారు.

వైద్య సిబ్బంది వచ్చి "అయ్యలారా! మీ ఆరోగ్యం మెరుగైనట్లుంది, నడుస్తున్నారు కూడానూ కనుక మీరిక ఈ శిబిరం వదలి వెళితే బాగుంటుంది. మరోకొందరికి ఇక్కడ చోటు లభిస్తుంది"అని చెప్పాక, ఇరువురూ బయటికి వచ్చారు. అలా మరొక రోజు అక్కడే బయట ఉండి అంతా గమనించి, విషయసేకరణ చేసి అంతః పురానికి వచ్చారు.

"మహారాజా! ఆ గ్రామ ప్రజలకంటే వైద్యం చేయించుకున్న వారి సంఖ్య అధికంగా ఉన్నట్లు గ్రామ లెక్కల మూలంగా తెలుస్తున్నది. పశువులు కూడా గ్రామంలో మన లెక్కప్రకారం ఉండాల్సిన వాటికంటే రెట్టింపుగా ఉన్నాయి. మహారాజా! సాధారణంగా ప్రజలకు, అవకాశం ఉన్నంత వరకూ చేయి చాచే గుణమే కానీ ఇచ్చే గుణం అంతగా ఉండదు. ఎవరికో తప్ప. పైగా ఈపాటికి నదికి పైవాలునుంచి వచ్చి కలిసే మాలిన్య జలాలను దారిమళ్ళించాము. వింత వ్యాధులైన లంచం, మోసం లాంటివి ఉచిత పంపిణీల వలన పుట్టుకొస్తాయి. అందువలన 'వ్యాధిగ్రస్తులను నగరానికి తరలించను మనమే రవాణాకల్పిస్తామని, ఇక్కడికే వచ్చి వైద్యం చేయించుకోవాలనీ' దండోరా వేయిద్దాం. అసలైన వ్యాధి గ్రస్తులను తేలిగ్గా గుర్తించగలం. వారికి సదుపాయాలు కల్గించవచ్చు" అని సూచించాక మహారాజు అంగీకరించారు. దండోరా విని, వైద్య శిబ్బంది తమ శిబిరాలను మూసేసి ఎక్కడి వారక్కడకు వెళ్ళి పోయారు.

నగరానికి వైద్యంకోసం వచ్చిన వారు ఒకరిద్దరి కంటే లేనేలేరు. కనుక అసలైన వింత వ్యాధులు లంచం, మోసం సోకిన వారు 'చచ్చిన వాని పెళ్ళికి వచ్చిందేలాభం' అనుకుని వీలున్నంత వరకూ సొమ్ము చేసుకోవడానికి  ప్రయత్నించడం సహజం అని మహారాజు అంగీకరించాడు.

Posted in February 2021, బాల్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!