Menu Close
Page Title
చాళుక్య యుగం
చాళుక్య రాజుల వైభవం-దేవాలయ శిల్పం, నాట్యం, గానం, మధుర కవితలు, సాహిత్యం

చాళుక్య రాజులలో మొదటివాడు కుబ్జ విష్ణువర్ధనుడైతే చివరి వాడు కుళోత్తంగుడు. ఇతడు రాజరాజ నరేంద్రుని కుమారుడు. ఇతనికి చాళుక్య రాజ్యానికన్నా గొప్పదైన చోళ సామ్రాజ్యం దక్కడం వల్ల దక్షిణాదిన ఉన్న తంజావూరుకు వెళ్లి పోయాడు. కుళోత్తంగుడు క్రీ.శ. 1118 లో మరణించాడు. ఇంతటితో వేంగీ చాళుక్య వంశం ముగిసిపోయింది.

అయిదువందల సంవత్సరాలు రాజ్యమేలిన వేంగీ చాళుక్యులను గూర్చి చెప్తూ, “ఇంత సుదీర్ఘ కాలం పాలించారు గనుకనే చాళుక్యులు నిజంగా తెలుగు సంస్కృతికి, సాహిత్యానికి సృష్టికర్తలయినారు” అన్నారు ఆరుద్ర (సం.ఆం.సా. పేజీ 119).

చాళుక్యుల మొదటి రాజధాని వేంగీపురం. ఇది, ఈనాటి ఏలూరు సమీపంలో ఉన్నది. తర్వాత విజయవాడ, రాజమహేంద్రవరం వరుసగా రాజధానులయ్యాయి.

వేంగీ మొదటి రాజధాని కాబట్టి వేంగీ చాళుక్యులు అని పేరు వచ్చింది. పూర్తి పేరు వేంగీ పురం. ఇప్పుడు పాడుపడిపోయివున్నప్పటికీ, ఇప్పటికీ వేంగీలో యాభై దేవాలయాలకు పైగా ఉన్నాయి. ఆరుద్ర మాటలో ఆనాడు “ప్రతి దేవాలయం ఒక చిన్న సైజు రాజధాని. P.118-119.

దేవాలయ నిర్మాణం – శిల్పం :

ఒకప్పుడు భారతీయ సంస్కృతికి దేవాలయాలు ఆటపట్టులు. దేవాలయాలతో పాటు, నృత్యం, సంగీతం, శిల్పం, వర్తకులు, పూజారులు – ఇలా డెబ్భైరెండు విభాగాలు ఆనాడు పనిచేసేవి. దేవాలయాల వల్ల ఆయా వృత్తుల వారు బ్రతికేవారు.

జైన, బౌద్ధ మతాలు ఆనాడు కొంత వ్యాప్తిలో ఉన్నప్పటికీ బౌద్ధ ఆరామాది నిర్మాణాలు ఆగిపోయాయి. చాళుక్యుల కాలంలో దేవాలయ నిర్మాణమే ప్రముఖమైనది. చాళుక్య రాజు నరేంద్ర మృగరాజు ఒక్కడే 108 శివాలయాలు నిర్మించాడు.

శిల్పం:

ఉధృతంగా సాగిన దేవాలయ నిర్మాణం వాళ్ళ ‘శిల్పకళ’ ఒక విశిష్ట స్థానాన్ని పొందింది. దీనినే “చాళుక్య శిల్పం” అంటారు. విజయవాడ లోని జమ్మిదొడ్డి చిట్టాలలో, బిక్కవోలు, భీమవరం, గండారాలలో (రాతిని తొలచి చేసిన విగ్రహాలు) వీణలు, పిల్లనగ్రోవి, కంచు తాళాలు మొదలైనవి వాయిస్తూ ఉన్న ఈనాటికీ చెక్కు చెదరకుండా సజీవ శిల్పాలై ఉన్నాయి.

మధుర కవితలు – గాన గంధర్వులు :

చాళుక్య భీముని ఆస్థానంలో గాంధర్వ విద్యా విశారద చల్లమ్మ అనే వార విలాసిని ఉండేది. ఆమె తండ్రి తుంబురుని వంటి సంగీత విద్వాంసుడు. తల్లి అతిలోక సుందరి.

సర్వ కళలకు నిలయమైన చాళుక్య రాజ్యం మధుర కవితలకు నిలయమే. కాని అవి దేశి కవితలు కాబట్టి పండితులకు పనికి రాలేదని ఆరుద్ర అభిప్రాయ పడ్డారు.

నన్నయ భారతంలో ఉలూచి అర్జునుని ప్రతిభ గూర్చి ‘నాగీ గీతాల’ వల్ల తెలుసుకొన్నానని చెప్తుంది. (మహాభారతం ఆదిపర్వం 8- పేజీ 131).

నన్నెచోడుని కుమారసంభవంలో పార్వతి ‘గౌడు గీతాలు’ విన్నాది. ఇవన్నీ మధుర కవితలే.

దేశి కవిత్వం అంటే ఆనాడే కాదు ఈనాడు కూడా ఎంత లోకువో ఆరుద్ర ఈ క్రింది సంఘటన ద్వారా చూపెట్టారు.

వావిలి కొలను సుబ్బారావు గారు వాల్మీకి రామాయణాన్ని తెనుగు చేశారు. ఆ సందర్భంగా లవకుశులు రాముని వద్ద రామాయణాన్ని గానం చేసినపుడు ముందు లవకుశులు దేశి విధానంలో పాడితే రాముడు ‘అలా వద్దు మార్గ పద్దతిలో పాడండి’ అని అడిగినట్లు వావిలి గారు వ్రాశారు. ఇది మూలంలో లేనిది. ఇప్పుడే అలా ఉంటే అప్పుడు పండితుల పెద్దరికం మరెంత తీవ్రంగా ఉండేదో తెలుస్తున్నది అని ఆరుద్ర కొంచెం ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటిదే ప్రాకృత భాషలో ‘లీలావతి’ అనే రచన బహుళ ప్రచారం పొందింది. ఇది తెలుగు వారికి కూడా సంబంధించినది. ఇందులో ఆనాటి లాక్షిణుకులు ఏవిధంగా దేశీయ భాషలను నిరసించారో నాయిక చేత చెప్పించాడు అనువాద రచయిత. దీనిని బట్టి, తెలుగు ప్రాకృతం మొ|| దేశీయ భాషలను సంస్కృత పండితులు ఎంతగా నిరసించారో తెలుస్తున్నది. ఈ విషయాలను గూర్చి వేదాల తిరువెంగళాచార్యులు గారు వేరొక సందర్భంలో ఇలా అన్నారు.

“బ్రాహ్మణులు ఆడింది ఆట పాడింది పాట అయ్యెను. అతడికి రాజ్యశాసనుడగు క్షత్రియుడు తోడయ్యెను. ఇక అతని అధికారానికి అడ్డు తగిలేదేముంది?”

నన్నయకు ముందే కవిత్వం, వచనం, పాటలు అన్నీ ఉన్నాయని నిరూపింపబడింది. మాచెర్ల, పొట్లదుర్తి, మానేపాడు లలో దొరికిన రేనాటి చోళుల తెలుగు శాసనాలలో తెలుగు వాక్య నిర్మాణం మొదలైనవి తెలుగు భాష నన్నయకు ముందే సజీవంగా ఉందని నిరూపిస్తున్నాయి. బూదరాజు రాధాకృష్ణ క్రీ.శ.200 నుండి క్రీ.శ.1100 వరకు గల 259 శిలా, తామ్ర శాసనాలను పరిశీలించి “ప్రాచీనాంధ్రం – శాసన భాషా స్వరూపం” అనే వ్యాసం పుస్తకం కూడా వ్రాశారు. అందులో తెలుగు భాష చరిత్రను మూడు దశలుగా విభజించారు.

 1. ప్రాక్సాహిత్య దశ: క్రీ.పూ. 200 నుండి క్రీ.శ.600 వరకు
 2. సాహిత్య దశ: క్రీ.శ. 7, 8 శతాబ్దుల మధ్యకాలం. ఇందులో కర్మణి ప్రయోగం, మణి ప్రవాళ శైలి మొ||నవి. అభివృద్ధి చెందాయి. (పేజీ 124)
 3. కావ్య భాషా దశ: క్రీ.శ.10, 11 శతాబ్దుల మధ్య కాలం. ఈ దశలో పదజాలం పెరిగింది. ఎరువు మాటలు సగానికి సగం వచ్చాయి.

తెలుగు భాషలో క్రీ.శ 7వ శతాబ్ది నుండే కావ్య శైలి ఏర్పడిందని కోరాడ మహాదేవ శాస్త్రి గారు నిరూపించారు. ఈ విధంగా చాళుక్య యుగంలో అన్ని కళలూ వెళ్లి విరిశాయి. అన్నింటికీ మించి ఆంధ్రులకు అమృత భాడం వంటి భారతం ప్రాప్తమయింది.

“సారమతిం గవీంద్రులు ప్రసన్న కథా కవితార్థ యుక్తి, లో
నారసి మేలు నా నితరు లక్షర రమ్యత నాదరింప, నా
నారుచిరార్థ సూక్తి నిధి నన్నయ భట్టు తెనుంగునన్ మహా
భారత సంహితారచన బంధురు డయ్యె జగద్ధితంబుగన్!"
(స.ఆం.సా. పేజీ 139) (భారతం, 1-1-26 పేజీ 19)

ప్రసన్నమైన కథ, అక్షర రమ్యత, నానారుచిరార్థ సూక్తులు – ఇవి నన్నయ రచనకు ప్రాణాలు. అందుకే నన్నయ వ్రాసిన భారత భాగం మొత్తం భారతానికే గాక, తర్వాత కావ్యాలకు మార్గదర్శకమైంది. నన్నయ ‘ఆదికవి’ అయినాడు.

**** సశేషం ****

Posted in February 2021, సమీక్షలు

2 Comments

 1. Vasundhara

  ప్రొఫెసర్ గారికి,
  మీరు నా వ్యాసం చదివి సమీక్ష వ్రాసినందుకు ధన్యవాదములు. మీవంటి వారిచ్చే ప్రోత్సాహమే మావంటి వారికి ఉత్సాహ కారక మవుతుంది.ఈ నా ప్రయత్నంలో తప్పులున్నా ఒప్పులుగా మీ వంటివారు భావించి నన్ను ముందుకు నడుపుతారని ఆశిస్తూ! – సి.వసుంధర

 2. గంగిశెట్టి లక్ష్మీనారాయణ

  సంక్షిప్తంగానైనా, సరళమైన రీతిలో చాలా సమగ్రంగా అందిస్తున్నారు… సాహిత్య సంస్కృతినిలా పరిచయం చేయాలనుకోవడం మంచి సంకల్పం. హార్దిక అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *