Menu Close
11. ప్రాణాలపైకి పాకింది

అతని ఒళ్ళంతా జ్వరం పాకింది
అతనిపై దుప్పటి పాకింది
ఆమె ముఖమంతా కన్నీరు పాకింది
గుడిసంతా నిరాశ పాకింది
గుండెంతా వేదన పాకింది
పొయ్యంతా నిశ్శబ్దం పాకింది
పొట్టంతా ఖాళీతనం పాకింది
ఆశల నిండా ఆవిరి పాకింది
పిల్లల కళ్ళల్లో చెప్పుకోలేని బాధ పాకింది
ఆ దాంపత్యం నిండా దరిద్రం పాకింది
బడి లేక మధ్యాహ్నం భోజనం తినే దారికి సెలవు పాకింది
ఏ బోగాణి చూసిన ఖాళీతనం కరాళ నృత్యమై పాకింది
మాటి మాటికి నీరే నోరంతా పాకింది
పనికి ఎవరూ పిలవని స్థితి పాకింది
పేదరికమనే అతి పెద్ద పుండుపై కారంగా కరోనా పాకింది
పేదరికాని శత్రువై పాకింది
పెద్దరికానికి మిత్రువై విశ్రాంతి విలాసంగా పాకింది
ఈ కరోనా తీగ ఎప్పుడు ఎలా పాకుతుందో
ఏ ప్రాణాన్ని కాటికి పాకిస్తుందో
ఎప్పుడూ ఎవరికీ అర్థమవని ప్రశ్నై మనిషి మనుగడకు పాకింది

12. తాపి బ్రతుకులు

సిమిటినడుగు చెబుతోంది
చెమటోడ్చే కూలోడి బాధ

పలుగునడుగు చెబుతోంది
లోతైన కూలోడి ఆకలి గాధ

ఇసుకనెంత మోసినా
ఇసుకేసినా రాలనంత కష్టాలాయే
సిమిటినెంత కలిపినా
ఎంతకీ గట్టిపడని బ్రతుకులాయే...

ఇటుకలెంత మోసిన
మా బ్రతుకుకు ఆసరా గోడలేకపోయే
మా గోడే మేం కట్టిన గోడల్లో కలిసిపోయే...
తాపే మా ఆయుధమాయే
తట్టే మమ్ము బ్రతికించు అమృతమాయే

సిమిటినడుగు..

రాడ్డులెన్ని వంచిన మా బ్రతుకే వంచనైపోయే
మా ఆశలు బీడుబారిపోయే...
మేం కట్టిన గోడలేమో గట్టివాయే
మా చేతులు మెత్తనాయే
ఎదుగుతున్న అభివృద్ధిలో మా బ్రతుకు గుడిసెకాడే ఉండిపోయే
మా నెత్తురను తాగిన దేశమేమో గొప్పదాయే
మా బ్రతుకే ఉనికికై తండ్లాడే చిన్నదాయే...

సిమిటినడుగు..

13. ఓ బ్యాంకు చేసిన నిర్వాకం

"సారు నీకు దండం పెడతా మా అమ్మ అకోంటుబుక్కులో డబ్బులున్నాయి ఇవ్వు సారు..."

"పోవమ్మా పోపోవమ్మా మీ అమ్మనే పిలుచుకురాపో..."

"మా అమ్మ ముసలిది సారు కదలడానికి రాదు సారు"
రొప్పు రోగం వచ్చి మంచాన్ని పట్టింది సారు

"సాకులు నాకు చెప్పకమ్మ పైసలు నీకు కావాలంటే
నీ తల్లినే తీసుకురాపో..."

"ఎత్తుకొచ్చే బలమునాకు లేదు సారు
నా మొగుడేమో తాగి తాగి ఎపుడో పోయే...
నాకు తోడున్నదొక్కా తల్లే సారు
రోగం మొచ్చి పడింది ఓ సారు
మీరు డబ్బులిస్తే దావకానకు వెళతాము సారు"

"చూడమ్మ విసిగించకు
మెడబట్టి బయటికేస్తా... సక్కంగా బయటికెళ్ళు"

"అయ్య సారు మీ కాళ్ళు మొకుతా
డబ్బులీయండి కంటికీ రేప్పోలే నను చూసుకున్నా
మా అమ్మను చూసుకొనుటకు అకోంటులోని డబ్బులీయండి"

"డబ్బుల్లేవు గిబ్బుల్లేవు బయటికెళ్ళమ్మా...
ముందు బయటికెళ్ళమ్మా"

ఇంటికెళ్ళిన ఆమె కంట…

14. గొర్ల కాపరి గోడు

కాలం కన్నెర్రజేసింది
నా బ్రతుకే కుక్కల చింపిన విస్తరయ్యింది
కుక్క దండుతో నా ఆశే దగాపడింది.

అమ్మ అయ్యాని వాళ్ళనీళ్ళనడిగి కూలీకెళ్ళుకుంటూ
కాస్తసోమ్ములెనకేసుకుని
పెళ్ళం మెళ్ళోని పుస్తె తాడునమ్మి
గా సొమ్ముతోటి పది గొర్లెను తెచ్చాను
ముళ్ళకంచుల పాకనేసుకుని ఏపుగా పెంచసాగాను.

సూరుడొచ్చేకాడికల్లా చిరుగుచిరుగులైన
చెప్పులేసుకుని ముళ్ళకర్రబట్టుకుని
భుజానికేమో సద్ది గొంగాడిని వేలాడేసుకుని
సత్తువంతనేమో కాళ్ళనింపుకుని
చేను చేనల్లా తిరిగాను ఆ గొర్లెను పెంచాను

కాలం కన్నెర్రజేసింది
నా బ్రతుకే కుక్కల చింపిన విస్తరయ్యింది
కుక్క దండుతో నా ఆశే దగాపడింది

యాళగాని యాళ నా గుండెయాశలను
కుక్కదండు మింగింది
బుజ్జి బుజ్జీ గొర్రెల నెత్తురును తాగింది
అరికాలళ్ళో ముండ్లు గుచ్చినా
కాళ్ళంతా జీరుకుని పుండ్లుపుట్ట…

15. యేమిచేస్తుమయ్యో..?

యంతచూసినా వాన చినుకేమో పడుటలేదు
యాడ అడిగిన పూసికపుల్లా పనేలేదు
యాడికెళ్ళిన పూటగడిచే తోవేలేదు
యేమిచేస్తుమయ్యో... పనికై యాడికెళ్దుమయ్యో...

చేన్లేమో విత్తెదానికి సిద్దమైనవి
చినుకులేమో దూరమైనవి
పశులకు గడ్డి భారమైనది
పైకి చూసే రైతు వేదనే ఘోరమైనది
యేమిచేస్తుమయ్యో పనికై యాడికెళ్దుమయ్యో...

కార్తులేమో కరిగిపోయివి
ఆర్తులేమో ఆవిరైనవి
మూర్తులేమో పూజలందుకుని మూగబోయినవి
పూటదాటుటకు దావలేదు
యేమిచేస్తుమయ్యో పనికై యాడికెళ్దుమయ్యో...

ఘొర్రులేమో సిద్ధమైనవి
అర్రులు చాసిన నెర్రలేమో ఘుర్రుగున్నవి
బర్రెలైనా మేపుకు బ్రతుకుదమంటే కనుచూపు మేరల్లో
పచ్చదనం యెపుడో తుర్రుమన్నదయ్యో...
మూగజీవుల పానం మా కంట్లోనీరై
కసాయి కత్తెంట పారుతున్నదయ్యే...

16. పేదరికాన్ని ఉరితీయాలని ఉంది

అతను అడ్డా కూలీ కాడ
నిలువెత్తు చెట్టులా నిలబడి నిలబడి కూలబడి
గుడిసెకు కదిలాడు

సద్దిగిన్నె బరువుగా ఉండడంతో ఆమె గుండె బరువెక్కింది
బడిలేకపోవడంతో నలుసులు
మధ్యాహ్నం తినే తిండికి ఆయువు తీరింది

నిజమే గరిబోడి గుడిసెకు గత్తరొచ్చింది
పేదరికమే దిష్టిబొమ్మై వేలాడింది
ఆకలే సానబెట్టిన కత్తై గుచ్చుతుంది

లేబరని లేకిగా చూస్తూ
వారి నెత్తురు తాగిన కాకి మొఖాలకేమి తెలుసు
ఆ యెదకోత...
పేదరికమంటేనే నేలపై ఏపుగా పూసిన నరకపు పూత
మారనే మారదు కూలోడి రాత
దగాకోరుతనమను చిరకాల గ్రహణంలో చిక్కుటచేత
పేదోడు అంటేనే పెద్దోడి అభివృద్ధి చేపకు ఏరైన వానపాము...

పేదరికాన్ని ఉరితీయాలని ఉంది
పెద్దోడు అడ్డుపడుతున్నాడు తన ఊపిరికి కంచె కడుతూ...
ఆ కంచెలో మాత్రం కరిగేది పేదరికమే...
మరిగేది పేదరికమే...
మరి ఎదిగేది....ష్....! ఆ ప్రశ్నే తప్పు....*

17. రాత మార్చిన ఈత

ముద్దా పెడుతా...
నీ బుగ్గామీద ముద్దుపెడుతా...
మాట్లాడరో...కొడుకా...
నాతో ఆటలాడరో...కొడుకా...
ఈతకెళ్ళకంటూ అడ్డు దినాము చెప్పినానురో...
అడ్డు పడకు అంటూ పరుగుతీసినావురో...
ఆ పరుగు గిపుడు యాడబోయేనురో...
మీ అయ్యా కంటా నీరే పారుతుంది
ఆపగైనా పరుగునా నువ్వు రారో...

యప్పట్లాగే పెందలాడినా ఎడ్లుకట్టి
చేనికెళ్ళిన మీ అయ్యకు సద్ది ఇవ్వబోయినానురో...
సక్కగా నువ్వు అడుకొమ్మని చెప్పినానురో...
చేను అంతా సత్తానేరి సక్కగా చేసి సాగానింటికి
నీ సావు వార్త చేరే నా చెవులకి
ఈతకెళ్ళకంటు మొత్తుకున్నా ఇనలేదురో...
మంది పిల్లాలెంట కలసిపోయి మన్నుగలిసినావురో
నన్ను ఇడిచి ఎట్టాబోయినావురో...

మొన్ననేమో మాపటేళా నీ కాళ్ళకు
నీ అయ్యా కొత్త చెప్పులు దెచ్చినాడురో...
వేసుకుని మురిసిచూప మళ్ళా లేవరో...
తల్లాడిల్లె నా యెదకు కుదుటనివ్వరో...
నువ్వులేక ఉండాలే…

18. నువ్వే అంతా...

అవసరం భలే మంత్రజలం
కొందరిని చెడ్డగా చేస్తది
కొందరిని మంచిగా చేస్తది

తెల్లని కొంగలు చెడ్డవి కావు
నల్లని కాకులు చెడ్డవి కావు
దేని సుగుణం దానిదే...

నీలో సుగుణం సుసంపన్నం అయినప్పుడు
ఎదుటోళ్ళు గునపాలతో పొడిచారనే బాధెందుకు...
వారు పొడిచిన కొద్ది నువ్వు గట్టిపడతావన్నది బహిరంగ రహస్యం కదా మిత్రమా....

చూడు మిత్రమా...
నీకు నువ్వే తోడు
అలాగని ఒంటరిని అనుకోకు
ప్రపంచం తిరిగే మనసు నీ పనిమనిషి
మనుగడనే శాసించే బుద్ధి నీ ఆత్మబంధువు
ఆత్మస్థైర్యం నీ ఆస్తి
అంతరాత్మే నీ దోస్తీ...
నువ్వు ఏదైనా చేయగలవు
ఎలాగైనా ఉండగలవు
నీకు నువ్వే అంతా...
ఏదో జరిగిందని ఎవరిమీదో నిందలేయకు
నిందలేనిదే బొంది పోదంటారు
ఈ రంది రాపిడిలో రంకెలుడుతున్న బొందీలపై నిందలేస్తే ఎలా...?
బుద్ధిలేని జీవులు అవసరం ఆవిరైయ్యాక అదృశ్యమయితవి
వాటిగోల నీకే…

19. ఆనంద పంట పండింది

పేదరికపు తోటలో
పరిపూర్ణమైన ఆనందపంట
సమృద్ధిగా పండింది

అదేమీ చిత్రమో
చూసే కళ్ళలో గుప్పుమంటూ
మనసులో సంతోషపు త్రేన్పులను తెప్పిస్తున్నది...

నిజమేలే ఆ ఆనందం కష్టాల కొలిమిలో శుద్ధిచేయబడ్డ మేలిమి బంగారం మరి...
అందుకే పేదింటి గుమ్మానికి వసివాడని తోరణమై
పరిమళించింది...

20. వారి జీవనపొలంలోని పంటది

తడిచిన నేలలోకి విత్తనాలొచ్చాయి
నడుముకు నొప్పులొచ్చాయి
కాళ్ళలోకి ముళ్ళొచ్చాయి
కళ్ళలోకి ఆశలొచ్చాయి
నేలపైకి మొక్కలొచ్చాయి
మరి... పంటలొస్తాయా...?

ఇవేమైనా పిల్లలేసుకునే పంటలా వస్తావని
చెప్పడానికి..,
పురుగుల్ని మిడతల్ని వానల్ని ఎండల్ని దాటి రావాలి

అపుడు పంటతోపాటు విత్తనాలకు ఎరువులకు
అప్పులిచ్చిన దళారీ గ్రద్దలొస్తాయి
ఇంకేముంది రైతన్నల ఆశలు ఆ గ్రద్దలకు మాంసపుముక్కలు

ఇదేగా తరతరాలుగా అన్నదాత జీవనపొలంలో ఏపుగా పండుతున్న పంట.

... సశేషం ....

Posted in February 2021, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!