Menu Close
గమ్యం
-- డా. వి.వి.బి.రామారావు --

గతసంచిక తరువాయి »

“మూడు నెలలైంది, బాబూ! జ్వరం విపరీతమైన దగ్గు, పట్నం పోయి వైద్యం చేయించుకోడానికి కాసులుండాలిగా? పిల్లలూ పట్నవాసం పోయారు. భార్య గుటుక్కుమంది. వీడు పడుతున్న కష్టాలు ఆ భగవంతుడే తీర్చాలి.” అంటూ వాపోయాడు.

“పద నాయుడూ, ఇప్పుడే వెళదాం” అంటూ నారాయుడు వెనకే నడిచారు ముగ్గురూ.

ముసలాయన వింతగా చూస్తున్నాడు. ఆయన్ను ఎవరూ పలుకరించలేదు. ఆయన్ను ప్రశ్న వేసి విసిగిస్తారేమో ననుకున్నాడు. ఎవరూ ఏమీ అడక్క పోవడంతో అతనికి ఎంతో ఊరట నిచ్చింది.

ముసలయ్య కుక్కి మంచం మీద ఉన్నాడు. గడియో, క్షణమో అన్నట్టు.

“కరణం గారు వచ్చారు ముసలయ్యా?”

“ఆఁ వచ్చారా, బాబూ? మీ దయ. నాకు భూమి మీద నూకలు నిండాయి.”

“అదేమిటి, ముసలయ్యా, అలా అంటావు? పట్నం పంపి వైద్యుణ్ణి తెప్పిస్తా. బాగై పోతావులే.”

“ఎంత మాట బాబూ! నాకు ఆ మాట మాత్రం అనే వారేరి? కానీ, ఇంకా నాకు వైద్యమెందుకు, బాబయ్యా.. నా సంగతి ఇంతే..బాబూ, ఒక్క మాట. ఊళ్ళో నీళ్ళు లేక పోయె..వర్షాలు లేవాయె. పెద్దింటి బాబులు. ఊరికి సాయం చెయ్యాల. ఓ చెరువు తవ్వించండి. మీ పెద్దలకు పుణ్యం. ఆ రెండు గింజలూ పండక పోతే మాలాంటి వాళ్ళం ఎలా బతకాలి?” మెల్లగా బతిమాలుకున్నాడు.

ముసలయ్య వైపే చూస్తున్నాడు ముసలాయన.

“పాపం, ఒంటరి వాడు.” అంటూ కరణం సానుభూతి చూపాడు.

“ముసలయ్యా, నేనింటికెళ్ళి బత్తెం పంపుతాను. కాస్త గంజి కాచి పోయ్యమను ఈ నారాయుడికి. డాక్టర్ కి కబురు చేస్తా” అంటూ బయటకు నడిచారు మామా, అల్లుడు.

ముసలాయన మాత్రం అలాగే నిలబడిపోయాడు. అతని మొహం ఎర్రగా జేవురించింది. కాళ్ళ వెంబడి నీళ్ళు వచ్చేటట్టున్నాయి.

రామ్మూర్తి లోపలికెళ్ళాడు మళ్ళీ. ముసలాయన ఏదో నిశ్చయించుకున్నవాడిలా బయటకు వచ్చాడు.

“ఇఫ్ యు డోంట్ మైండ్” అని ఠక్కున ఆగిపోయాడు.

రామ్మూర్తి ఆగిపోయాడు. సూర్యారావు వెనక్కి వచ్చాడు.

“మీరేమి అనుకోకపోతే నేనిక్కడే ఉండిపోతాను.”

ముసలాయన ఇంగ్లీష్ లో అన్నాడు.

రామ్మూర్తి కి ఏమనాలో తోచలేదు.

ముసలాయన మళ్ళీ గుడిసెలోకి వెళ్ళాడు.

ఇంటికెళ్ళాక సీత అడిగింది తన మనసులో మెదులుతున్న ప్రశ్న “ఆ ముసలాయన ఎవరు బావా?”

“అదే అంతుపట్టడం లేదు సీతా. ఎవరో పెద్ద మనిషిలా ఉన్నాడు. మొహంలో చాలా సంస్కారం కనబడుతోంది. ఎక్కడి నుంచో పారిపోయి వస్తున్నట్టున్నాడు.” ఏదో జ్ఞాపకం వచ్చినట్టుంది కాని మళ్ళీ ఏదో సందేహం. మాటాడక ఊరుకున్నాడు.

ఆ సాయంకాలం సీతా, రామ్మూర్తి షికారు కెళ్ళారు. పొలాల లోంచి నడుస్తున్నారు. వాళ్ళు తూర్పు పొలంలో గళ్ళు వెంబడి నడుస్తుండగా సీత సూర్యారావు చెప్పిన గొట్టపు బావి విషయం ప్రస్తావించింది.

“సీతా, ఇదేమిటి, ఈ గోయ్యేమిటి?”

“మన గ్రామానికి కరెంటు వస్తోంది.”

“ఫైన్. అయితే గొట్టపు బావి మాత్రమే కాకుండా ఒక పంప్ సెట్ కూడా అమర్చుకోవచ్చు. ఓ ఫైవ్ హార్స్ పవర్ పంప్ సెట్ సుమారు ఇరవై ఎకరాల సాగుకి సరిపోతుంది.” పొలంలోకి దిగాడు రామ్మూర్తి.

కొత్తగా తవ్విన ఆ మన్ను ఆ గోతి అడుగుది ఎండిపోయి ఉంది. గుప్పెడు మన్ను చేతి రుమాలులో కట్టాడు.

“ఇదిగో సీతా, రేపే దీన్ని మా ల్యాబ్ కి పంపి అనలైజ్ చేయిస్తాను. ఓ వారంలో మనకు తెలుస్తుంది – నీరు ఎన్ని అడుగుల లోతులో ఉన్నది. ..ఇదిగో ఇక్కడే పంప్ హౌస్ వస్తుంది. ఇక్కడ రావచ్చు అసలు ట్యూబ్ వెల్. కాలువలు ఇలా వస్తాయి. సంవత్సరానికి సుమారు మూడు పంటలు పండించవచ్చు. ట్యూబ్ వెల్ సింక్ చేయడానికి, పంప్ సెట్ కి, షెడ్ కి అంతా కలిపి ఆరువేలు అవుతుంది. దేవుడు మేలు చేస్తే ఇదంతా నా కంపెనీ పేరుతోనే జరుగుతుంది. నేను రేపే పట్నం పోయి బ్యాంకు ఏజెంట్లను కలిసి పాతిక వేలు ఋణ సహాయం చేయమని అడుగుతాను. నాకు ఉద్యోగం చేయాలని లేదు.”

రామ్మూర్తి ఏదో ఉద్రేకంతో చక చకా మాట్లాడేస్తున్నాడు. అలా చూస్తూ ఉండిపోయింది సీత.

మరుసటి రోజు ఉదయం వరకు ముసలాయన జ్ఞాపకం రాలేదు రామ్మూర్తికి. గుర్తుకు వచ్చిన వెంటనే ముసలయ్య గుడెసికి వెళ్ళాడు.

“నమస్కారం” అంటూ లోపలికి వెళ్లి ముసలాయనను పలుకరించాడు. ముసలాయనలో మార్పు వచ్చింది. చేతిలో సిరెంజ్. ముసలయ్యకు అప్పుడే ఏదో ఇంజక్షన్ ఇచ్చినట్లున్నాడు. కట్ బనియన్ వేసుకున్నాడు. ఓ మూల చాప మీద మూడు సీసాలున్నాయి.

“ష్!” అన్నాడు. గుడిసె ద్వారం వైపు చూపిస్తూ ముసలాయన. “పల్లె ప్రజలు సెల్ఫ్ లెస్ పీపుల్..నారాయుడు ఈజ్ ఎ గుడ్ మాన్.”

రామ్మూర్తి కేం బోధపడలేదు.

“యంగ్ మాన్!” నన్నీ ఊరు తెచ్చినందుకు చాలా కృతజ్ఞుణ్ణి.” ముసలాయన గడ గడా ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాడు. ముఖంలో ఏదో ఉద్రేకం, ఉత్సాహం ఉన్నాయి. "ఈ ముసలయ్య, నారాయుడు, నువ్వు మీరంతా నా జీవితానికి ఓ గమ్యాన్ని చూపారు. మనిషి చనిపోయే ముందు చెయ్యవలసింది చాలా ఉంది. వైరాగ్యం చనిపోయే ముందు రావలసింది. శరీరంలో శక్తి ఉండగా ప్రతి మనిషి శాయశక్తులా పని చెయ్యవల్సిందే. వైరాగ్యం పాపం. ముసలయ్య చూడు చనిపోతాననే అనుకొన్నాడు. కాని, అతని మనసులో చూశావా ఎల్లాంటి కోరిక, తపన ఉన్నాయో- చెరువు తవ్వించమన్నాడు. పూర్ ఫెలో...తెలివి తక్కువ వాడు. వర్షాలే లేకపోతే చెరువు వల్ల ప్రయోజనం ఏముంది? విత్ లక్ ముసలయ్య కోలుకుంటాడు. ఊళ్ళో కావలిసినన్ని గొట్టపు బావులు వస్తాయి.”

రామ్మూర్తికి ఆశ్చర్యం కాదు. కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తున్నాయి. “థాంక్ యు డాక్టర్, థాంక్యు” బయటకు నడిచాడు.

ఒక్క ఉదుటున ఇల్లు చేరి, “సీతా, సీతా” అని బిక్కరగా పిలిచాడు.

“ఏమైయింది బావా?” సీత గదిలోంచి వచ్చింది హడావిడిగా.

“ఆ పేపరేదీ? అదే, నిన్న నేను తీసుకొచ్చింది?”

వెదికి పట్టుకొచ్చింది సీత.

గబ గబా వెతికాడు. “ఇదిగో చూడు సీతా! మనింటికి వచ్చిన ముసలాయన ఎవరో కాదు...” మైసూర్ డేట్ లైన్ లో ఉన్న వార్త చదివాడు గట్టిగా.

“ఇక్కడి ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ హెగ్డే నాలుగు రోజులుగా కనపడటం లేదు. వయస్సు 64. భార్య కొద్ది రోజుల క్రితం చనిపోయింది. చాలా కాలం అస్వస్థతతో బాధపడుతున్న భార్యకు డాక్టర్ హెగ్డే స్వయంగా పరిచర్యలు చేసేవారు. పిల్లలు లేరు. వీరి జన్మస్థలం మదనపల్లి. పుట్టుకతో తెలుగువారు. వైద్యుడుగా తన వృత్తి ధర్మాన్ని అతి చాకచక్యంతో నిర్వహించేవారు. పోలీసులు ఆచూకి తియ్యడానికి ప్రయత్నిస్తున్నారు. ఆత్మహత్యేమోనని కొంత మంది...”

“చాలు ఊరుకోండి” సీత విసుక్కుంది. “పోలీసులు ఎప్పుడూ కీడే ఎంచుతారు.”

{ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక (దీపావళి ప్రత్యక సంచిక) సౌజన్యంతో 13-11-74}

**** సమాప్తం ****

Posted in February 2021, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *