Menu Close
కాలభ్రమణం
-- పద్మజ కుందుర్తి --

ఏదో చిన్న వెలుగు .....చుక్కలా తిరుగుతోంది కళ్ళముందు.

ఆ చుక్క  కాసేపటికి నెమ్మదిగా మరింత వెలుగును సంతరించుకుని కాంతి పుంజంగా మారుతోంది.

స్ స్ స్ స్ స్స్ ......పాము బుసలాంటి చప్పుడేదో చెవిలో వినపడుతోంది. ఒక్కసారిగా వెచ్చని పదార్ధమేదో ఊపిరితిత్తుల్లో నిండిపోతోంది.

మంచుగుట్టలా  చల్లగా ఉన్న దేహం లోకి, అమ్మ ఒడిలాంటి  నులివెచ్చదనమేదో ప్రవహిస్తున్న భావన!

అతనిలో జరుగుతున్న ఈ మార్పులన్నీ అతనికి తెలుస్తూనే ఉన్నాయి. కానీ,విపరీతమైన నీరసమేదో ఆవహించి,కాలూ, చెయ్యీ కూడా కదపలేని నిస్సహాయత!

కళ్ళముందరి కాంతిపుంజం వెలుగు మరింత ఎక్కువై, భరించలేక పొతున్నాడు. యుగాలనాటి ప్రాణశక్తి ఏదో ప్రవాహమై ఒక్కసారిగా గుండెల్లోకి దూసుకొచ్చిన అనుభూతి.

ధడ్ .....ధడ్ ధడ్ ....ధడ్ ధడ్ ...ధడ్ ధడ్!!

రైలు ఇంజను అప్పుడే స్టేషన్ లో నించి బయలుదేరి నెమ్మదిగా ఊపందుకున్నట్లుగా, తన గుండెచప్పుడు!! డిజే లో ఊఫర్ లోనించి వినిపిస్తున్నట్లుగా..... చెవులు బద్దలైపోతాయేమో, అనిపించేటట్లుగా వినిపిస్తోంది.

వెయ్యి విద్యుత్ తరంగాలు!! అన్నీకలిసి ఏకమై ఒక్కసారిగా దేహాన్ని తాకిన భావన!!

శరీరం, నీటి అడుగునుంచి ప్రాణవాయువుకోసం తపించిపోతున్న దశలో....ఒక్కసారిగా నీటి పైకి తేలి ఊపిరి అందుకున్నట్లుగా అధాటున పైకిలేచి కూర్చున్నాడు.

కళ్ళు పొడుచుకున్నా కానరాని చీకటి!!....తను ...తను ఏదో గుండ్రని బంతిలాంటి వస్తువులో .....ఏదో ద్రవం లో తేలుతున్నాడు!

ఎలా?...తప్పించుకోవటం ఎలా?...ఆ బంతిగోడల్ని తడుతూ, పిచ్చిగా అరుస్తున్నాడు. ఎవరూ? ఎవరైనా ఉన్నారా? రక్షించండి .....రక్షించండి ....హెల్ప్ మీ ....ప్లీజ్ ...హెల్ప్ మీ ....

ఎక్కడో నాబ్ లాంటి దానిమీద పడింది అతనిచెయ్యి. భళ్ళున కోడిగుడ్డులా విచ్చుకుంది!! ఆ షెల్!!

ఆ ద్రవం తో బాటు, అతనూ బైట పడ్డాడు.

కన్నుపొడుచుకున్నా కానరాని చీకటి ..... నెమ్మదిగా అతని కళ్ళు చీకటికి అలవాటు పడ్డాయి. తనేదో గుహలాంటి దాంట్లో ఉన్నాడని అర్ధమైంది. నెమ్మదిగా అతని కళ్ళకు నీడల్లా చుట్టుపక్కల వస్తువులు కనపడుతున్నాయ్.

ఒక బండరాయిలాంటి దానిమీద కూర్చున్నాడతను. తలవిదిలిస్తూ నెమ్మదిగా ఆలోచనల్లోకి జారిపోయాడు. "ఎన్నిరోజులైంది ....?  తనా కాప్సూల్ లో బంధించబడి. రోజులా?....నెలలా?....లేక, సంవత్సరాలా?

కాదు....కాదు ....శతాబ్దాలు!! అవును!! కొన్ని శతాబ్దాలు! అప్పుడు .....అప్పుడు ప్రొఫెసర్ ఏం చెప్పాడు తనకు!! ఇందులో కొన్ని శతాబ్దాలు... అవును! భూ కాలమానం ప్రకారం దాదాపు 900  ఏళ్ళు! అలా నిర్జీవంగా పడుండి, తరువాత ప్రాణం పోసుకుంటానని కదూ చెప్పాడు!

మరిప్పుడు తను ఎక్కడున్నట్లు! తల పగిలిపోతోంది....ఆకలి ...విపరీతమైన ఆకలి ఏదోఒకటి తినాలి ఎలా? హటాత్తుగా గుర్తొచ్చింది! తన దుస్తులూ ఆహారమూ ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఎక్కడో ...చీకట్లోనే లీలగా అక్కడ కనిపిస్తున్న వస్తువుల్లో వెదక సాగాడు. కాసేపు వెతికాక కళ్ళబడింది, అతని సూట్కేసు.

అందులోనే అతని దుస్తులూ,ఆహారమూ భద్రపరచబడి ఉన్నాయి.ఇంతకీ తను ఎక్కడున్నాడు?ఈ అనంత అంతరిక్షంలో, ఇన్ని వందల ఏళ్ళు ప్రయాణించి, ఎక్కడికొచ్చాడు? ఎక్కువసమయం ఆకలి వేయకుండా ఉండేటట్లుగా తయారుచేయబడిన బిస్కెట్ల లాంటివి ఏవో తిని, తనకోసం భద్రపరచిన స్పేస్ సూట్ లాంటిదేదో ధరించాడు. తన శరీర బరువే కాక ఆ సూటు బరువు కూడా మోస్తూ, అక్కడినుండి బైటపడే దారికోసం వెతకసాగాడు.

ఎక్కడో దురంగా వెలుతురూ నీళ్ళు కిందకు పడుతున్న ధ్వనీ వినిపించసాగింది. నెమ్మదిగా ఆ వెలుగు వైపుగా నడిచాడతను. గుహ బైటికి దారీ, దానిపక్కనే కొండవాగూ కనిపించాయతనికి! కొండమీదుగా క్రిందకు చూస్తే దిగువగా చిక్కని అడవి! తలపైకెత్తి చుట్టూ చూస్తుంటే ....పైన నీలాకాశమూ. అందులో దోబూచులాడుతున్న తెల్ల తెల్లని తెలిమబ్బులూ కనిపించాయతనికి! అతని ఆశ్చర్యానికి అంతులేదు.

తను ఎక్కడ ఉన్నాడు భూమ్మీదనేనా! అంటే తను ఇన్నిసంవత్సరాలూ ప్రయాణించి తిరిగి భూలోకానికే చేరాడా? తను అంతరిక్షంలోకి ప్రయాణం మొదలెట్టే సరికే తొంభై శాతం కాలుష్యమైపోయిన భూమాత ఇంత పచ్చగా ఎలాఉంది? తను తనేమైనా కలకంటున్నాడా? ఎటూతేల్చుకోలేని అయోమయావస్తలో ఉన్నాడతను.

పచ్చని చెట్లూ, వాతావరణం ఉందంటే ఇక తనకు ఆక్సిజన్ మాస్క్ అవసరం లేదన్నమాట! అతను నెమ్మదిగా తన మాస్క్ తొలగించాడు. కొన్నిసెకెన్లు కాగానే తిరిగి మాస్క్ పెట్టేసుకున్నాడు. మళ్ళీ ఇంకోసారి ప్రయత్నించాడు. ఇలా నాలుగైదుసార్లు చేసాక, అక్సిజన్ వాయువు ఈ వాతావరణంలో కూడా ఉన్నదనీ, తనకు ఎలాంటి ప్రాణాపాయం లేదనీ నిర్ధారించుకున్నాడు. మాస్క్ పూర్తిగా తీసేసి నెమ్మదిగా కొండవాలులో కొండ దిగువకు నడవసాగాడు.

దూరంగా విశాలంగా పచ్చని తివాచీలా పరచుకున్న పంటపొలాలూ, వాటి మధ్యలో మంచినీలం లా మెరిసిపోతున్న గుండ్రని చెరువూ, ఆ చెరువు ప్రక్కన ఊరులాంటిదేదో కనిపించింది అతనికి. ఆ వుళ్ళోని ఇళ్ళన్నీ తాటాకులతో కప్పబడి పూరిళ్ళలా కనబడుతున్నాయి! తను ఆత్రుతలో గమనించలేదు గానీ, చెట్ల మధ్యనుంచి పక్షుల కిలలారావాలు కూడ వినిపిస్తున్నాయి.

నెమ్మదిగా అడవిలాంటి ప్రదేశం లోకి ప్రవేశించాడు. అక్కడి చెట్టూ చేమా అంతా మామూలుగానే అనిపిస్తున్నాయి. తను కొత్తగా చూస్తున్నట్లు అనిపించలేదు. తను స్వయం గానో లేక పుస్తకాలల్లోనో చూచిన వృక్ష జాతుల్లా అనిపిస్తున్నాయి. అక్కడినుంచి నెమ్మదిగా మైదానం లోకి ప్రవేశించాడు. ఒంటిమీది సూటు చాలా బరువుగా భారం గా అనిపించింది అతనికి.

మొదటగా చేతికున్న గ్లోవ్స్ విప్పేసి చెయ్యి బయట పెట్టాడు. అక్కడి వాతావరణానికి చర్మం దెబ్బతింటుందేమో అనే అనుమానంతో ఒక్క క్షణం ఎండకు తగిలేలా చెయ్యిజాపి మళ్ళీ వెనక్కు తీసుకున్నాడు. అలా కొన్నిసార్లు ప్రయత్నించి అక్కడ రేడియేషన్ ఎక్కువగా లేదని నిర్ణయించుకుని నెమ్మదిగా సూట్ తొలగించాడు. పలుచగా లోపల వేసుకున్న మామూలు వస్త్రాలు హాయిగా అనిపించాయి అతనికి.

ఇంతకీ ఇది భూమేనా భూమి అయితే ఇంత స్వచ్చమైన గాలీ, పచ్చని చెట్టూ చేమా ఉండే అవకాశమే లేదు. కాకపోతే మరేమిటి? ...ఆలోచిస్తూ కనిపిస్తున్న పూరిళ్ళవైపుగా నడుస్తున్న అతనికి ఎదురై ఆపేసిందో చిన్ని ఆకారం. చిన్ని పంచే కండువా కట్టుకుని ముఖాన గంధం బొట్టుతో ఏడెనిమిదేళ్ళ పిల్లవాడు అతనివైపు ఆశ్చర్యంగా చూస్తూ నడుమ్మీద చేతులు పెట్టుకుని నిలబడి ఉన్నాడు!

ఆపిల్లవాడు ఆశ్చర్యంగా చూస్తూ ......

"భవాన్  కోసంతిభో ?..." అన్నాడు. అతనికి చాలా ఆశ్చర్యం అనిపించింది.  ఇదేదో తనకు తెలిసిన భాషలానే ఉంది, కానీ అర్ధం కావటం లేదు. తిరిగి జవాబు చెప్పటానికి తనకా భాషరాదు. ఎప్పుడో తన తాతయ్య చెప్పిన గుర్తు. ఒకప్పుడు పురాణాలన్నీ సంస్కృతం అనే భాషలో ఉండేవనీ, దాన్ని దేవభాష అంటారనీ చెప్పాడు.

ఇది అదేనా ...అంటే తను దేవలోకం లో ఉన్నాడా? అతనికి ఏమీ అర్ధంకాక ఆ కుర్రాడిని అలాగే చూస్తూ నిలబడ్డాడు. ఆ పిల్లాడు మళ్ళీ గద్దిస్తూ ..."భవాన్ కుతః ఆగఛ్చతి?" అన్నాడు. అయోమయం గా చూస్తుంటే ...."భవత్యా కా నామ దేశః?" అన్నాడు సమాధానం చెప్పని అతనిని వింతగాచూస్తూ.

మరలా అతని వైపు ఎగాదిగా చూసి "భవంత్యాః వస్త్రధారణం అద్భుతం" అన్నాడా పిల్లాడు అతని వైపు వింతగా చూస్తూ ...ఇంతలో కిలకిలా నవ్వులు వినిపించాయి. యవ్వనంలో ఉన్న ఒక కుర్రజంట ఆ వైపు రావటం కనిపించింది. చక్కని పంచెకట్టుతో ఆ యువకుడూ తీరైన చీరె గోచీకట్టుతో నడుముకు కొంగు బిగించిన ఆస్త్రీ ఇద్దరూ వ్యవసాయపు పనులు చేసుకునే దంపతుల్లా కనిపిస్తున్నారు.

వారిద్దరినీ "మమ మాతాపితరహః" అని పరిచయం చేశాడు ఆ పిల్లవాడు. ఇద్దరూ నమస్కరించి, "వయం కృషీవలాః.  ఇదంకాలః సస్య కాలః. మమగృహం ఇతః సమీపగ్రామే అస్తి. ఆగఛ్చంతు అతిధిరూపేణా అస్మాకం గృహం." అన్నారు నవ్వుతూ. అతనికి వాళ్ళు చెప్పేది పూర్తిగా బోధపడక పోయినా తనని వారింటికి అతిధిగా ఆహ్వానిస్తున్నారని మాత్రం అర్ధమైంది అతనికి.

మారు మాటాడకుండా వారి వెంట నడిచాడు. కొంతదూరం నడవగానే చక్కని స్పురద్రూపి అయిన వృద్ధుడు వాళ్ళకు ఎదురైయ్యాడు  వాళ్ళు అతనికి నమస్కరిస్తూ ..."ఇమే అస్మాకం గ్రామాధిపో భవతి" అని పరిచయం చేశారు. అతనూ సంస్కారయుతంగా ఆ గ్రామపెద్దకి నమస్కరించాడు.

అతన్ని చూసి  నమస్కరిస్తూనే ...."మీరు భూగ్రహ వాసులా?" అని అడిగాడతను అచ్చమైన తెలుగులో!! ఆ వ్యక్తికి ప్రాణం లేచొచ్చింది. "అవునండీ నేను భూమినుంచే వస్తున్నాను ఇది ఏ గ్రహం ఇది కూడా భూమేనా?? కాకపోతే ఏగ్రహం? అచ్చు భూమిలానే ఎలాఉంది? మీరుకూడా మనుషుల్లానే ఉన్నారే? " ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించాడతను.

ఆ వృద్ధుడు అతన్ని నిలువరిస్తున్నట్టుగా చెయ్యి ఊపి "పదండి ముందు భోజనం చెయ్యండి. శతాబ్దాల ప్రయాణం కదా శరీరాన్ని సేదతీరనివ్వండి. మీసందేహాలన్నీ తప్పక నివృత్తి చేస్తాను" అన్నాడు. పచ్చని చెట్లక్రిందుగా విస్తరించిఉన్న ఆ చిన్న పల్లె చాలా అందంగాఉంది. అరటి అకులో వడ్డించిన భోజన పదార్ధాలన్నీ రుచికరంగా ఉన్నాయి. కడుపునిండుగా తిని ఆ చెట్లక్రిందనే ఉన్న చిన్న మంచెలాంటి దానిమీద హాయిగా నిద్రపోయాడతను.

సందెవేళకు లేచిన అతనికి వెదురు పళ్ళెరంలో చక్కని ఫలాలూ, కమ్మని గుమ్మపాలూ అహారంగా అందించాడు ఆ గృహస్తు. అవి తినేసి లేచి ఆ పల్లెలో చిన్నగా అటూఇటూ తిరగటం మొదలెట్టాడు అతను. ఒక చెట్టుకింద ఆశీనుడై కనిపించాడు ఆ గ్రామపెద్ద. చూట్టూ ఉన్న జనాన్ని వెళ్ళమన్నట్లు సైగచేసి అతనిని దగ్గరగా వచ్చి కూర్చోమన్నట్లు సైగచేసాడతను.

"స్వామీ ఇది ఏ గ్రహమో, మీ పేరేమిటో చెప్పనేలేదు" అన్నాడతను. "అచ్చు కొంతకాలం క్రితం, మా పెద్దలు చెప్పుకునే భూమిలా, సంస్కృతభాష మాట్లాడుతూ ....ఇదెలా సాధ్యం" ఆశ్చర్యంగా అడిగాడతను.

"నాపేరు 'మనుసావర్ణి' ఇది కూడా భూమే. ఈ బ్రహ్మాండమంతా ఒకే బ్రహ్మ పదార్ధం తో తయారైంది. అందులో ప్రాణులకు నివాసయోగ్యంగా ఉన్న ప్రతిదీ భూమే!! కాకపోతే మీది సౌరమండలం ఇది మీన తారామండలం మా సూర్యుడు రేవతి" అన్నాడతను.

"ఏమిటీ నేను మీనరాశి వరకూ  ప్రయాణించానా!" అని అతను ఆశ్చర్యపోయాడు.

"అంటే మీరు మాకంటే కొన్నివేల సంవత్సరాలు వెనుక ఉన్నారా? మా భూమి ఈ దశలన్నీదాటి గొప్ప నాగరికతను సంతరించుకొంది కదా” అన్నాడతను గర్వంగా.

ఆ వృద్ధుడు నవ్వి, “తల్లిలాంటి భూమాతను  విధ్వంసం చేసుకోవటమేగా మీకు తెలిసిన నాగరికత. ప్రతిదాన్నీ విజ్ఞాన శాస్త్రానికి జోడించి నిరూపించటానికి పాటుపడటమేగా మీరు చేసింది."

"మేము మీకన్నా ఎన్నో వేల సంవత్సరాలు ముందరివాళ్ళం అయినా మేము ప్రకృతికి లోబడి మా భూమిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం. అయినా, మీరు మీ అంతర్గత శక్తులను మరిచిపోయి ప్రతిదానికీ రూపమిచ్చే పనిలో మీశక్తిని మరిచిపోయారు. ఒకప్పుడు మా గ్రహాలన్నీ తలచిన మాత్రం తోడనే చుట్టివచ్చిన విజ్ఞానఖనులైన మీ మహర్షులను మర్చిపోయారు."

"ప్రపంచమంతా దేశాలుగా, ఖండాలుగా, ఇంకా వర్ణ భేదాలూ, భాషాభేదాలూ, ప్రాంతీయ భేదాలూ, కులమత భేదాలూ, ధనిక భేదాలతో విడిపోయారు. పచ్చని భూమాతను కాలుష్య కాసారం చేశారు. ప్రతిదీ నిరూపించాలన్న ఉద్దేశ్యంతో మంత్రాన్ని మరచి యంత్రాన్ని నమ్మారు. అప్పటినించీ కాలుష్యం మొదలైంది. నీకు నీ భూమిని చూడాలని ఉందా ...చూపించనా?" అడిగాడు గ్రామపెద్ద.

"అమ్మో!! శతాబ్దాల  ప్రయాణం చెయ్యలేను" అన్నాడు అతిధి.

"అది యంత్రానికి మాకుకాదు" అని అతని చెయ్యి పట్టుకున్నాడు అతను. క్షణంలో దూదిపింజల్లా తేలుతూ భూమి పైకి చేరారు వాళ్ళు. భూమాత అప్పటికే ప్రళయ సాగరంలో మునిగి నెమ్మదిగా ఒకే ఖండంగా పైకి తేలుతోంది. అతను భూమిపై తిరిగికాలు మోపి ఆప్యాయంగా తడుముకున్నాడు. "ఈ భూమిపై మళ్ళీ నివసించటానికి నీకో అవకాశం కల్పిస్తాను. ఉంటావా" అడిగాడు ఆయన.

"అతను నమస్కరించి తప్పకుండా ఉంటాను. భూమాతకు మరోసారిలా జరగనివ్వను" అన్నాడు. ఆయన "సరే ...."అని అతన్ని తిరిగి తమ భూమి పైకి తీసుకువెళ్ళాడు. ఒక కన్యతో వివాహం జరిపించాడు. భూమి పైకి కావలసిన సకల వృక్ష జంతు సంబంధ బీజాలను అతనికి అప్పగించి భూమిపై తిరిగి దించి ఆశీర్వదించాడు.

అతను శ్రద్ధగా భూమిని మళ్ళీ చిగురింపజేశాడు. వృక్ష, జంతుజాలాలతో భూమి కళకళ లాడుతోంది. అతని పూజామందిరంలోఆ వృద్ధుని రూపం చెక్కిఉంది. అతను పూజచేస్తూ ఇలా చెబుతున్నాడు... ఆద్య బ్రమ్హణః ద్వితీయ పరార్ధేః శ్వేత వరాహ కల్పే సావర్ణికా మన్వంతరే..కృతయుగే... ప్రధమ పాదే...జంబూద్వీపే...

సర్వేజనాః సుఖినోభవంతు!!!!

Posted in February 2021, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *