Menu Close
SirikonaKavithalu_pagetitle
ప్లవనసూత్రం ... జీవన సూత్రం -- ఆచార్య రాణి సదాశివ మూర్తి

వస్తు సాంద్రత ద్రవసాంద్రత కన్న
ఎక్కువైతే ఆవస్తువు ఆద్రవంలో మునుగుతుంది.
వస్తు సాంద్రత ద్రవసాంద్రత కన్న
తక్కువైతే ఆవస్తువు ఆద్రవంలో తేలుతుంది.
వస్తు సాంద్రత ద్రవసాంద్రత తో
సమానమైతే ఆవస్తువు ఆద్రవంలో
మునగక తేలక వ్రేలాడుతుంది.
ఇది ప్లవనసూత్రం.

వ్యక్తి సామర్థ్యం జనసామర్థ్యం కన్న
ఎక్కువైతే సామాజిక గౌరవం పెరుగుతుంది.
కాని ఆవ్యక్తి ఆనందసముద్రంలో తేలియాడుతాడు.

వ్యక్తి సామర్థ్యం జనసామర్థ్యం కన్న
తక్కువైన కొద్దీ సామాజిక లఘుత్వం పెరుగుతుంది.
కాని ఆవ్యక్తి శోక సముద్రంలో మునిగి పోతాడు.

వ్యక్తి సామర్థ్యం జనసామర్థ్యం తో
ఎప్పటికీ సమతౌల్యాన్ని సాధిస్తే
ఆ వ్యక్తి సంసారసాగరంలో మునగకుండా
తేలకుండా చక్కగా తరించి విజయుడౌతాడు.
ఇది జీవనసూత్రం.

త్రయి -- గంగిశెట్టి ల.నా.
ఒకే ప్రకృతి
  మూడు కృతులు
ఒకే మూలం
  మూడు ఆవృతులు
ఒకే లోకం
  మూడుఆవరణలు
ఒకే మనిషి
  మూడుఅంతరాలు
ఒకే అమ్మ మూడురూపాంతరాలు
ఒకే అయ్య
  మూడు భావాంతరాలు
ఒకే మాట
  మూడు అర్థాoతరాలు
ప్రపంచమంతా మూడు మూడుగా నిష్పన్నాలు
కూడి మారి మూడే విస్ఫోటనాలు
విశ్వలయ త్రయీ సూత్రాలు...
అటంచున – మారనిది
ఇటంచున – మారుతున్నది
నడుమ-మార్పును సూత్రీకరిస్తున్నది
అటంచున జ్ఞేయం, నీవు
ఇటంచున జ్ఞాత, నేను
నడుమ మనల్ని కలిపి నిలిపే సూత్రం , నువ్వే నేనన్నజ్ఞానం ...
నేస్తమా! నువ్వు అటా? ఇటా?
ఎటైనా నడుమ నెయ్యం మారకుంటే చాలుగా!!
అగ్ని సంస్కారం - విశ్వర్షి వాసిలి -- డా. వాసిలి వసంతకుమార్

నేను

మరణంతో
  ఒక జీవితం కథ ముగుస్తుంది.
కాదు కాదు
  ఒక జననం కథ ముగింపు కొస్తుంది.
జీవనకథనం
  సశేషాలనుండి విముక్తమవుతుంది.
ప్రాణం దేహం నుండి తప్పుకుంటుంది
  అంత్యక్రియలకు అవతారిక అవుతూ.
జీవం నిష్క్రమిస్తుంది 
 నిర్యాణాన్ని ధృవీకరిస్తున్నట్టు.
రూపం కనుమరుగయిపోతుంది
 ఇహంలో తన చిరునామాను తొలగిస్తూ
•
నా భౌతికతకు
   అగ్ని సంస్కారం జరుగుతోంది.
అగ్ని తన సంస్కారాన్ని చూపుతోంది
   దేహాన్ని స్వాహా చేస్తూ
   ఎముకల గూడును బూడిద చేస్తూ
   కోట్ల మృత కణాలను దగ్ధం చేస్తూ.
కళ్లింతలు చేసుకుని గాలిస్తూనే వుంది
   ఆ శోధన 
   మృతంకాని మూలకణం కోసం
అవును,
    అగ్నిసాధన మనిషి ఆదికణం కోసం
    అగ్నిశోధన ఆదిమ ఆత్మకణం కోసం
ఆదికణం దొరికింది ... 
     అగ్నిసంస్కారం ముగిసింది.
అవునవును, 
     ఆ ఆదికణానికి
       నేను తొలి చిరునామా
     ఆ ఆదిమకణానికి 
        అగ్ని మలి చిరునామా
     ఆ అగ్నికణానికి 
       అనంతమే తుది చిరునామా.
శివాయోన్నమః! -- పాలడుగు శ్రీచరణ్
అను|| యేమిరే పార్వతీ నాథ!
    త్వయా కామాంతకాదయః
    త్వదభిన్న స్థితేః కుత్ర
    శివావకాశమస్తి హ! ||
శా|| సంగప్రశ్నకు తావులేనిదగు నిస్సంసార కైలాసమున్
   సాంగంబౌ పరివార మొప్పెడి శ్రుతి ప్రాకార సామ్రాజ్యమున్
   శృంగారార్ధ తనూ లతా కుసుమ సందృగ్రరశ్మి నేలేటి చి
   ల్లింగా! నీవగు నింగి ముంగురుల త్రుళ్లే బుల్లి రేడయ్యెదన్! ||
గంగమ్మ ఒడిలోన -- బులుసు వెంకటేశ్వరరావు
గంగమ్మ ఒడిలోన గంతులేయుచునున్న
  చిరు చేపపిల్లల మెరుపు లరసి
విరియబూసిన బండి గురివింద పొదలపై
  రొదసేయు కొదమతుమ్మెదల గాంచి
గుంపులై అందాలముంపులై-విహరించు
  నెరి కురంగముల వన్నెలను జూచి
కులుకునెత్తావితో పులకరింపగజేయు
  అడవిగాలులలోని హాయి మెచ్చి
నగరిలో కానరాని అందాలు కనుక
  నడకసాగదు ముందున కడుగుపడక
సీత-వనసీమ రాముని చేయివిడక
  వేడ్కతో సాగుచున్నది""పెళ్లి నడక""
ప్రభాకరుని స్పర్శతో -- డా.కోడూరు ప్రభాకరరెడ్డి

*సత్యం*

ప్రభాకరుని స్పర్శతో
కఠిన శిలాసదృశ్యమైన
హిమగిరిశృంగం సైతం
చలిస్తుంటే
మానవునిలో స్పందన
కలుగకుండా ఉంటుందా?

*శివం*

నీ దేశం కోసం
నీ ప్రజల కోసం
నీకున్నదంతా త్యాగంచెయ్!
అగోచరమైన విధి మీద
భారం మోపకుండా కృషిచెయ్
మహోన్నతంగా ఎదుగుతావ్!

*సుందరం*

విశాల వియత్తలంలో
విహంగంలా విహరించి
నె కనుగొన్న సత్యం -
మాతృమూర్తి,మాతృభూమికంటే
సుందరమైనదేదీ లేదీ జగత్తులో

(రచనాకాలం - 1976)

శ్రీరత్నాచలసత్యనాథ -- పాలపర్తి

శ్రీరత్నాచలసత్యనాథశిఖరోద్భూతప్రభాకర్షకమ్
తత్తేజఃపపరిపూర్ణపశ్చిమదిశాసౌభాగ్యసంవర్థకమ్
విశ్వవ్యాప్తతదంతరిక్షమహిమావిర్భావచిహ్నాకరమ్
మేల్పీఠాలయదివ్యధామశిఖరం వందే సదా ముక్తిదమ్. 1

వైకుంఠాద్ధరణీవినిస్సృతిమహస్సాకారచక్రాకృతిమ్
తద్గర్భాలయసత్యనాయకరమాశీర్షప్రసారప్రభా
కుంభాకార మనూనభవ్యకరుణాసమ్మేళనావాహకం
మేల్పీఠాలయదివ్యధామశిఖరం వందే సదా ముక్తిదమ్. 2

మంత్రైర్హోమశుభాధివాసచరణైః శాస్త్రాగమాద్యైర్యుతమ్
సౌవర్ణాంచితయంత్రతంత్రసహితం గుప్తం హిరణ్యాదికం
దిక్పాలాదిసమస్తదేవవిహితం దేదీప్యమానాద్భుతం
మేల్పీఠాలయదివ్యధామశిఖరం వందే సదా ముక్తిదమ్ 3

Posted in February 2021, సాహిత్యం

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *