Menu Close
జంతుసంపద
ఆదూరి హైమావతి
పులి
Tiger-01

వ్యాఘ్ర వాహ్యాళే అడవికి కళ. పులికి మరోపేరు శార్దూలము. శార్దూలము అనేది తెలుగు పద్యాల్లో ఒక వృత్త విధానము. పంచనఖము, పెద్దపులి, బెబ్బులి, భయానకము, భేలకము, మువ్వన్నెమెకము, మృగశ్రేష్ఠము, వ్యాఘ్రము, శార్దూలము అనే చాలాపేర్లే ఉన్నాయి. పులి అనగానే మనకు గుర్తువచ్చేది ‘అదిగోపులీ అంటే ఇదిగో తోక’ అనేసామెత. ఇంకా అనేక పులిని గురించిన సామెతలున్నాయి.

పులి కడుపున పిల్లులు పుడతాయా? అంటే పౌరుషవంతుల ఇంట్లో పిరికివారు పుట్టరనే అర్ధం కావచ్చు.

పులిమీద పుట్రలాగా - ఒకభయానికి మరోభయం జోడింపన్నమాట.

పులిమీద స్వారి -ఏదైనా ఒక పెద్ద కష్టతరమైన, ప్రమాదకరమైన పని చేయను అంగీకరించడం.

పులి నోట్లో తల దూర్చడం -ఇదీ అంతే భయంకర మైన ప్రమాదకరమైన పనిచేయను మొదలెట్టడం.

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు - వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులి కాదు. గొప్పవారిని అనుసరించడం వల్ల సామాన్యులు గొప్ప వారు కాలేరని చెప్పను ఈ సామెతను వాడుతారు.

ఇలా పులి గురించి అనేక నానుడులు ఉండనే ఉన్నాయి. పులి అనగానే చారలు మనకు గుర్తువస్తాయి. పులి మనదేశంతో పాటుగా బంగ్లాదేశ్, మలేషియా, దక్షిణ కొరియా దేశాలకు జాతీయ జంతువు.

Tiger-02పులి ఫెలిడే కుటుంబంలో అతిపెద్ద జాతికి చెందినది. ఇది పాంథెరా ప్రజాతిలో భాగం. దీని అందమూ, గాంభీర్యమూ దీని చర్మం బట్టే వచ్చాయనవచ్చు. నారింజ బ్రౌన్ చర్మంపై చిక్కటి నిలువు చారలు దీని ప్రత్యేకత. ఈ నిలువుచారలతో చూడాగానే భయంకలిగిస్తుంది.

ఇది పూర్తిగా మాంసాహార జంతువు. సింహంలా కాక ఆహార జంతువు కనిపించగానే దూకి చంపి ఉంచుకుంటుంది. బాగా కుళ్ళినాక తింటుంది. ప్రధానంగా జింక, అడవి పందులనూ వేటాడి తింటుంది. ఇది ఒంటరిగా, ఒక ప్రదేశానికి పరిమితమై ఉంటుంది. చారలున్న పులిని 'పులిరాజు' అని పిలవడం ఉంది. ఇది యదార్ధంగా పిల్లి కుటుంబానికి చెందినది. టైగర్ అనగానే అందరిమనస్సుల్లో టెర్రర్ పుడుతుంది. అందుకే ఇదిగో పులి అంటే అదుగో తోక అని భయపడ తారన్నమాట.

ఇది మాంసాహార జంతువులైన క్రూరమృగాలన్నింటిలోకీ చాలా భయంకరమైందని చెప్పుకోవాలి. దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు, ఎందుకంటే చాటున మాటేసి ఒక్క సారిగా వేట జంతువుమీద వాలిపోయి, మెడ కొరికేసి చంపుతుంది. ఇది 20 కి.మీ. దూరం నుంచే తన వేట జంతువును కనిపెట్టి నిశ్శబ్దంగా దూకి చంపేస్తుంది. దీని కంటి చూపు, వినికిడి శక్తీ అద్భుతమైనవి.

Puli-Veshalu

పండుగల సమయాల్లో పులి వేషాలు వేయడం మన దేశంలో ఉంది. చీమచిటుక్కుమన్నా పులి కనిపెట్టగలదు. ఇది తాను వేటాడిన జంతువును పొదల మధ్యలోకి లాక్కువెళ్ళి, తిన్నంత తిని, మిగతా భాగాన్ని ఆకులతో కప్పి ఉంచుకుంటుంది. ఆ తర్వాత ఆకలైనపుడు మిగతా భాగం తింటుంది. అలా పొదుపు, ఆహారం వృధాచేయక దాచుకోవడం  మనం పులినుంచీ నేర్చుకోవాలేమోకదా!

ఇది ఇందాక మనం చెప్పుకున్నట్లు నారింజ, కొద్దిగా బూడిద లేక నలుపు రంగులో ఉండే చారలతో ఎంతో అందంగా ఉంటుంది, ఐతే అంతే భయంకరమైనది కూడా. ఇది తన ఆహారం కోసం వేటకు తన స్వంత తెలివి, బలం మాత్రమే ఉపయోగిస్తుంది.

Tiger-03Tiger-Footprintsఎంతో ఆశ్చర్యకరమైన యదార్ధం ఏమంటే ఒక మగపులి ఒకపూట భోజనం సుమారుగా 45 కేజీల మాంసం. తన వంటిమీది చారలు అది తుప్పల్లో, గడ్డిలో దాక్కుని మాటేయను, పొంచి ఉండి వేట జంతువుపై దూకనూ సహకరిస్తుంది. కనుకనే పులి తుప్పల్లో కలసిపోయి కనిపించదు. ఇవి పగలు విశ్రాంతి తీసుకుని రాత్రులు వేటాడతాయి. చక్కగా చల్లని నీటిలో చాలాసేపు స్నానమాడటం వీటికెంతో ఇష్టం. మగ పులి కొన్ని కిలోమీటర్ల  ప్రాంతాన్ని తన ఏరియాగా తన కాలి గుర్తులతో వలయంగా గీచి గుర్తు పెడుతుంది. మరొక మగపులి ఆ ప్రాంతానికి  రాదు. ఇది ఆ జాతికి ఒక నియమం.

ఆడపులి 95 నుండి 115 రోజులు గర్భం దాల్చాక రెండు నుండి నాలుగువరకూ పిల్లలను కంటుంది. పులి పిల్లలు 14 రోజులవరకూ కళ్ళుతెరచి చూడలేవు. ఆడపులి తల్లి ప్రేమ కూడా చాలా ఎక్కువే! ఆరు నెలల వరకూ తన పిల్లలకు పాలిస్తుంది. మాంసంతినడం నేర్పుతుంది, మనలాగే అమ్మ బాధ్యత నేరవేరుస్తుంది. పిల్లలు తల్లి నేర్పుతుండగా 8 వారాలనుంచీ మాంసం తినడం మొదలు పెట్టి, సంవత్సరం నిండే వరకూ తల్లితోనే ఉండి, వేటాడటం నేర్చుకుని రెండేళ్ల వయస్సు వచ్చాక తల్లినుండి విడిపోతాయి. మగపులులు మాత్రం ఒంటరిగానే జీవించను ఇష్టపడతాయి.

మనదేశ అడవుల్లో బెంగాల్ టైగర్ జాతి పులులు ఉన్నాయి. బంగళాదేశ్, నేపాల్, భూటాన్, బర్మా దేశాల్లోనూ ఈ జాతి పులులున్నాయి. పులిజాతులన్నింటిలోకీ  బెంగాల్ టైగర్ శక్తివంతమైనదిగా చెప్తారు.

Tiger-04

ఇకపులి శరీర నిర్మాణం గురించి చూస్తే- ఇవి 1.4 నుండి 2.8 మీటర్ల పొడవు ఉంటాయి. తోక 60 సెంటీ మీటర్లనుండీ ఒక మీటర్ వరకూ పొడవు ఉంటుంది. సుమారుగా 220 కేజీల  బరువు ఉంటుంది. ఆడపులి 3 నుండి 4 సం. వయస్సు నుండీ పిల్లలను కనను శారీరకంగా తయారవుతుంది. పులుల జీవనపరిమాణం 20 నుండి 26 సంవత్సరాలు.

పులి మన దుర్గామాతకే కాక, అయ్యప్పస్వామి వాహనంగా కూడా ఉండి గౌరవం అందుకుంటోంది. శివుడుసైతం పులి చర్మమ్మీద కూర్చుని ధ్యానంలో ఉండటం మనం అనేక  చిత్రాల్లో చూస్తాం.

Gods-on-Tigers

మానవులకు పనికి రానిదేలేదుకదా! వ్యాపారనిమిత్తం, ధన సంపాదన కోసం పులులను వాటి చర్మాన్నీ అమ్మి సొమ్ముచేసుకోను చంపుతున్నారు. పులి చర్మానికి ఉన్న అధిక ధర అవి లేకుండా పోయే స్థితికి దారి తీస్తున్నది. ధనికులు పులితోలు అలంకారంగా తమ గృహాల్లో ఉంచుకోడం మనం చూస్తాం కదా! పులి చర్మంపై కూర్చుని ధ్యానాలు సైతం చేస్తారు.

అడవులకు అలంకారప్రాయాలైన పులులనూ, సింహాలనూ చంపి వేయకుండా ప్రభుత్వం అభయారణ్యాలను ఏర్పాటుచేసి వాటికి రక్షణకల్పిస్తున్నా మానవులు మాత్రం వేటాడుతూనే ఉన్నారు.

అంత గంభీరమైన, క్రూరమైన పులి సైతం 'ఆవు పులికథ' లో నిజాయితీకీ, సత్యానికీ నిలిచిన ఆవును చంపకుండా వదిలేయడం మానవ జాతి నేర్చుకుంటే ఎంత బావుంటుందోకదా! పులి క్రూరత్వాన్ని కాక దాని కంటిచూపునూ, వినికిడి శక్తినీ, వేగాన్నీ ధైర్యాన్నీ మనం నేర్చుకుని మన జీవన సరళిని మార్చుకుని సాధు జీవనం చేయడం ఉత్తమంకదూ!

Posted in February 2021, వ్యాసాలు

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *