సీ. తొలిసూర్యకిరణాలు గిలిగింతలనుఁ బెట్ట
మేల్కొని వికసించు మేలుతమ్మి(1)
వివిధవర్ణమ్ముల వింతైన చిత్రాలు
రచియించు గగనమ్ము రమ్యముగను
కిలకిలధ్వనులతోఁ బలుకరించుచు నెదల్
తట్టి మేల్కొల్పెడు పిట్టకొలువు
వినువీధి విహగాళి కనువిందు సేయుచు
బారులై వెడలు నాహారమునకు
తే.గీ. ఇళ్ళ ముంగిళ్ళఁ గళ్ళాపిఁ జల్లి రంగ
వల్లులనుఁ దీర్చు పడుచుల వ్రేళ్ళగరిమ(2)
చల్ల చిలికెడు భామల సౌరు, కంక
ణాల రవళులు ప్రకృతివరాలు గావె?
(1) పద్మము (2) గొప్పతనము
మ.కో. నిన్న, నేఁడును, రేపుఁ నుండెడు నిష్కళంకవినోదముల్
కన్న, విన్నను గల్గు మోదము కన్న మిన్న నెఱుంగలే
మన్నదే ప్రకృతిప్రసాదము ధ్యాస నిల్పినఁ జాలుఁగా
క్రొన్ననల్(1) సుచరాచరంబులు కోటిశోభలు నింపుఁగా
(1) క్రొత్తపువ్వులు