Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర

నిశ్శంక కొమ్మన, దగ్గుపల్లి దుగ్గన

నిశ్శంక కొమ్మన

వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు చేసిన కృషి ద్వారా దొరికినది నిశ్శంక కొమ్మన రచించిన శివలీలావిలాసం. అయితే ఆ దొరికింది అసంపూర్ణమైంది. అవతారిక అసంపూర్ణంగా ఉంది. వేటూరి వారు సంపాదించింది, తనది కలిపి మల్లంపల్ల్లి వారు ప్రచురించారు. ఇందులో కొమ్మన వంశాన్ని గూర్చి ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. అందులో ముఖ్యాంశాలు.

కొమ్మన ముత్తాత పేరు గంగయ సింగనార్యుడు. ఇతడు ఊరయ అనే కవి వ్రాసిన సుభద్రా కల్యాణం అనే గ్రంథాన్ని అంకితం పుచ్చుకొన్నాడు. తూర్కరాజు అనే అతను చూస్తుండగా ఈ అంకిత కార్యక్రమం జరిగింది. “ఆకల్పంబుగ దూర్కరాజు కన ...” అనే పద్యం (శివ-అవతారిక 14) ఈ విషయాన్ని తెలుపుతున్నది. శ్రీనాథుడు కూడా శివలీలా రచనా వైభవాన్ని విపులంగా తన శృంగార నైషధం (1-20) లో తెల్పాడు.

నిశ్శంక కొమ్మన తన కాలంనాటి సమాజంలో ఉన్న సాహిత్య వ్యవస్థను చక్కగా తన పద్యాలలో చక్కగా వివరించాడు.

“తెలుగని చెప్ప సంస్కృత విధిజ్ఞత లేదని సంస్కృతంబునన్
బలుక దెనుంగు నేరనని ప్రాక్తసమార్గము నంద వచ్చినం
గలవది మున్నునంచు నొకకైవడి గ్రొత్తగ గూర్చి రేనిపె
ద్దలుప (?ప) నిగోరటం (రం?)చు మహిదజ్ఞులు నాడుదు రాల్పధీయుతుల్ (స.ఆం.సా.1 పేజీ 759)

...ఇది అంతకు ముందే ఉంది అంటూ మాట్లాడుతారని పండితులను గూర్చి, ప్రజల మనస్తత్వాలను గూర్చి వివరించాడు కొమ్మన. ఇటువంటి వాతావరణ లో కొమ్మన ఒక సత్కృతి రచించాలని తలంచాడు.

అప్పుడే దొడ్డారెడ్డి కూడా ఒక కృతిని అంకితం పుచ్చుకోవాలనిపించింది. అప్పుడు కొమ్మనను పిలిపించి ‘శ్రీవత్సాన్వయ శేఖరుండవు సదా శ్రీరామచంద్రాను కంపావర్ధిష్ణు శుభాన్వితుండవు ...” అంటూ పలికి తన అభీష్టాన్ని తెలిపాడు. కృతిత్వం కావాలని కోరుకొన్నాడు.

శివలీలావిలాస కావ్యరచన

దొడ్డా రెడ్డి తనతో అన్న మాటలనే స్మరించి కొమ్మన కథను శౌనకాది మహామునులకు సూతుడు చెప్పినట్లుగా ప్రారంభించాడు. దీనిని గూర్చి చెబుతూ ఆరుద్ర ఇలా అన్నారు. “..నిశ్శంక కొమ్మన నిజంగా నూతన సూతుడు. రాజమండ్రి నైమిశారణ్యం, అల్లాడ దొడ్డా రెడ్డి కోరికలే శౌనకాది మునులు” అని అన్నారు.

ఈ దొడ్డా రెడ్డి గొప్ప దండనాయకుడు. ఇతన్ని గూర్చి కొమ్మన అంత వివరంగా తెల్పలేదు. కానీ శ్రీనాథుడు తన కాశీఖండం లో దొడ్డా రెడ్డి యొక్క యుద్ధ విజయాలను తెల్పాడు. తోపుగడ్డ, శృంగారపు కోట దొడ్డా రెడ్డి జయించాడని శ్రీనాథుడు తెల్పాడు.

కొమ్మన శ్రీనాథుని కాశీఖండానికి ముందే శివలీలావిలాస కావ్యాన్ని రచించి ఉండవచ్చని ఆరుద్ర మాట. ఈ ఇద్దరూ కవులు దొడ్డా రెడ్డిని గూర్చి ఇలా అతని గొప్పతనాన్ని తెల్పారు. దొడ్డా రెడ్డి గొప్ప గుర్రపు రౌతు. ఇరవైనాలుగు మూరల మేర (స్థలాన్ని) గుర్రాన్ని దాటించాడు. అని తెల్పారు.

కొమ్మన శివలీలావిలాసానికి శ్రీనాథుని హరవిలాసమే మార్గదర్శి అన్నారు ఆరుద్ర. హర విలాసంలో కొన్ని శివలీలలే ఉన్నాయని, శివలీలావిలాసంలో అన్నీ ఉన్నాయని తెల్పిన ఆరుద్ర వాటిని గూర్చి పద్యాలతో సహా వివరించారు.

శివలీలావిలాస రచనా విధానం

కొమ్మన కొత్తలీల మొదలు పెడుతున్నప్పుడు ఆటవెలదే వ్రాస్తాడు. ఆ ఆటవెలది మొదటి రెండు పాదాలు –

వినుడు సముచితముగ వినుపింతు నిటమీద
నభవు డవధరించినట్టి లీల

అని వ్రాసి తరువాత రెండు పాదాలలో ఆ లీల పేరేమిటో తెల్పుతాడు. ఈ పేర్లను ఆరుద్ర ఒక పట్టికగా ఇచ్చారు.(స.ఆం.సా ౧-పేజీ 762).

కొమ్మన తను వ్రాసిన లీలలు 38 అని తెల్పాడు. 630 గద్యపద్యాలు ఈ కావ్యంలో ఉన్నాయి. 38 లీలలలో కేవలం 13 మాత్రమె దొరికాయి.

ఈ శివలీలావిలాసమునకే వీరమహేశ్వర మనే పేరు కూడా ఉన్నదో లేక అది వేరే గ్రంథమో తెలియదు అన్నారు ఆరుద్ర. అయితే పై రెండు గ్రంథాలలోని పద్యాలను పోల్చి చూపించారు ఆరుద్ర.

కొమ్మన కవిత్రయాన్ని త్రిమూర్తులన్నాడని, నన్నెచోడుని కుమారసంభవాన్ని స్తుతించాడని, 3వ లీల, సతీవివాహంలో’ పార్వతిని నఖశిఖ పర్యంతం 24 పద్యాలలో వర్ణించాడని ఆరుద్ర తెల్పారు. ఇందులో పార్వతి యొక్క మీగాళ్ళ వర్ణన

సర్వమంగళ మీగాళ్ళ చక్కదనము
తమకు బడయంగరాకపో కమఠము..
మెనయజాలక తల యెత్తుకొనగలేక
బయలు మెరసి చలింపవు భయముకతన (శివలీలా 1-137)
ఇది నన్నెచోడుని పద్యానికి అనుకరణేమో అని అన్నారు ఆరుద్ర.

గంగావతరణం లో కొమ్మన శివుని వర్ణిస్తూ శివుడు మేను పెంచినపుడు చుక్కలు మొదట తలపువ్వులుగా ఉన్నాయి. అతడు పెరుగుతున్న కొద్దీ అవి ఇతర ఆభరణాలతో సరిపోలి చివరకు శివుని కాలి మువ్వలుగా ఉన్నాయి అని కవి చెప్పిన దానిని గూర్చి చెబుతూ ఆరుద్ర ఇలా అన్నారు.

‘పోతన పద్యాన్ని పోలి వుంది ఈ పద్యం. అటువంటి కవిత్వం పాత్రనే కాదు కవిని గూడా ఆకాశమంత ఎత్తుకు పెంచుతుంది. కొమ్మన తెనుగు కవిత్వంలో ఆజానుబాహుడు అని చెప్పక తప్పదు.’

దగ్గుపల్లి దుగ్గన

శ్రీనాథుడు, బమ్మెర పోతన బావ, బావమరుదులని ఒక ప్రచారం ఉంది. కానీ శ్రీనాథుని జీవితాన్ని పరిశీలిస్తే శ్రీనాథునికి బావమరిది దగ్గుపల్లి దుగ్గన అనేవాడని తేటతెల్లమైంది.

దుగ్గన చిన్నతనం నుంచి శ్రీనాథుని సాన్నిధ్యంలో ఉండి ఆయన వెంటే తిరుగుతూ మంచి కవిగా పేరుగాంచాడు. దగ్గుపల్లి దుగ్గన ‘నాసికేతోపాఖ్యానం’ అనే గ్రంథం వ్రాశాడు. అందులో ఆయన ఇలా చెప్పుకొన్నాడు.

“ఇది శ్రీమత్కమలనాభపౌత్ర మారయామాత్యపుత్ర కవిసార్వభౌమ సకల విద్యానాథ శ్రీనాథమహాకవీంద్ర ప్రసాదలబ్ద కవితావిశేష దగ్గుపల్లి తిప్పనార్య ప్రియతనూజ దుగ్గన నామధేయ ప్రణీతంబైన నాసికేతోపాఖ్యానంబను మహాప్రబంధంబు...’ అని చెప్పుకొన్నాడు.

దీనికి ముందు దుగ్గన ‘కాంచీ మహత్యం’ అనే కథ, చిత్రతరంగా విస్తరించి వ్రాసి ఉదయగిరి రాజు పూసపాటి బసవరాజు యొక్క మంత్రి అయిన చందలూరి దేవయ్యకు అంకితమిచ్చాడు. అయితే ఈ రచన దొరకలేదు. రెండు సీస పద్యాలు మాత్రం దొరికాయి. ఇందులో వర్షాకాలపు వర్ణన ఉంది. స్కాంద పురాణాంతర్గతమైన కథలు, ఏకామ్రనాథుని (మామిడి చెట్టుగా శివుడు జన్మించడం) కథ మొదలైనవి ఉన్నవి.

**** సశేషం ****

Posted in February 2024, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!